మృదంగ మాధురి - సైన్స్ ఫిక్షన్
ఉదయాన్నే రేడియోలో కచేరీ వింటూ, ఓ చేత్తో కాఫీ తాగుతూ, మరో చేత్తో సెల్‌లో మెసేజ్‌లు చూస్తూ, మధ్యమధ్యలో బలే, శభాష్ అంటూ అవధానం చేస్తున్నాడు ఆనంద్. యధాలాపంగా ఫేస్‌బుక్‌లోని పోస్టులను పైకి తోస్తున్నాడు. విజయవాడ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళ పోస్ట్ కనిపించి ఆగాడు.
రజతోత్సవ కచేరీలలో చివరి రోజైన నేడు 'సంగీత కళారత్న ' శ్రీ టి.కె.వైద్యనాధన్ బృందం వారి గాత్రకచేరీ.
సమయం: సాయంత్రం గం.6:30ని.
వేదిక: ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాల ఆడిటోరియం, విజయవాడ.
టిక్కెట్టు: ఫస్ట్ క్లాస్-500/- బాల్కనీ-300/-
బృందం అని కాకుండా సహకారాల పేర్లు కూడా వెయ్యాలన్న జ్ఞానం వీళ్ళకి ఎప్పటికి కలుగుతుందో అని సణుక్కుంటూ, సరే ఇవాళ ఎలాగైనా వెళ్ళాలని వెంటనే ఆన్లైన్లో మూడు ఫస్ట్ క్లాస్ టికెట్లు కొనేశాడు.
సాయంత్రం ఆరింటికల్లా ఆడిటోరియంకి వెళ్లి మొదటి వరుసలో రిజర్వడ్ సీట్లకి కొంచెం దూరంగా కూర్చున్నారు ఆనంద్, అతని భార్య, కూతురు. మెల్లిగా హాల్ నిండుతోంది. ఆరుంపావుకల్లా సెక్రటరీ కమలాకర్ గారు ఫార్మల్ డ్రెస్‌లో ఉన్న ఓ నలుగురు పెద్దమనుష్యులను తీసుకొచ్చి రిజర్వ్‌డ్ సీట్లలో కూర్చోబెట్టారు. పాత్రికేయులకు విడిగా కొన్ని సీట్లను కేటాయించారు. మరికాసేపట్లో వైద్యనాథన్ గారు, వయోలిన్ విద్వాంసులు రామనాథం గారు కూడా విచ్చేశారు. శ్రోతలందరూ గౌరవసూచకంగా లేచి నిల్చున్నారు. వారిద్దరినీ కూడా పెద్దమనుష్యుల పక్కనే కూర్చోబెట్టారు. మృదంగం ఎవరు వాయిస్తారా అని చూస్తున్నారంతా. కానీ ఎవరూ రాలేదు.
6:25కి తెర లేచింది. ఏర్పాట్లన్నీ మామూలుగానే ఉన్నాయి కానీ అందరి దృష్టి వెనకాతల ఉన్న బ్యానర్ మీద పడింది. 'స్పాన్సర్డ్ బై భారత్ సాఫ్టెక్' అని కనిపించింది. గూగుల్, మైక్రోసాఫ్ట్‌కి పోటీగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చెందినదే భారత్ సాఫ్టెక్. వీళ్ళు కచేరీ స్పాన్సర్ చేస్తున్నారా? ఏమిటీ విచిత్రం? అని ఆశ్చర్యంగా చూశారందరూ. 'ఈ మధ్యనే ఓ అరవాయన సీఈఓ అయ్యాడట కదా' అని ఒకరు, 'వైద్యనాథన్ గారి చరిష్మా అలాంటిది. అడిగితే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ కూడా స్పాన్సర్ చేస్తాయి' అని మరొకరూ ఎవరికి తోచినట్లు వారు అనుకుంటున్నారు.
సరిగ్గా ఆరున్నరకి కమలాకర్ గారు పోడియం వద్దకు వచ్చి గొంతు సర్దుకున్నారు. "సభకు నమస్కారం. విజయవాడ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ రజతోత్సవ వేడుకలలో చివరి రోజైన నేడు 'పద్మ విభూషణ్', 'సంగీత కళారత్న' శ్రీ టి.కె.వైద్యనాధన్ గారి గాత్ర కచేరీ ఏర్పాటు చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతం" అంటూ నాలుగు పరిచయ వాక్యాలు చెప్పి, “మన తెలుగు వారందరికీ గర్వకారణమైన శ్రీ రామనాధం గారు వయొలిన్‌పై సహకరించడానికి విచ్చేసినందుకు వారికి కూడా అనేకానేక ధన్యవాదాలు. వారిద్దరినీ వేదికపైకి తోడ్కొని రావలసిందిగా మన అధ్యక్షులు రమణమూర్తి గారిని కోరుతున్నాను". 'మరి మృదంగమో' అని అందరూ నుదుళ్ళు చిట్లించి చూస్తున్నారు. కళాకారులిద్దరూ వేదికపై కూర్చున్నారు.
కమలాకర్ గారు మళ్ళీ గొంతు సర్దుకున్నారు. "అందరికీ గుర్తుండే ఉంటుంది. గత సంవత్సరం లాక్‌డౌన్ తర్వాత 'Multicity virtual live concert' అనే అద్భుతమైన ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించేం. రెండు వేర్వేరు ఊళ్ళలోని కళాకారులను వర్చువల్ ప్రొజెక్షన్ చేసి లైవ్ కచేరి చేశాం" అంటూ ఆగారు.
(2020 మే నెలలో నేను రాసిన ’లాక్‌డౌన్ తర్వాత కచేరీలు’ – సైన్స్ ఫిక్షన్ కథను చదవగలరు)
https://m.facebook.com/story.php?story_fbid=10215771992163799&id=1563789331
ఇప్పుడు మృదంగ విద్వాంసుణ్ణి వేరే ఊర్నించి ప్రొజెక్ట్ చేస్తారో ఏవిఁటో? కిందటి సంవత్సరం చేశారు కదా, అంత పెద్దాయన కచేరీకి మళ్లీ ప్రయోగాలు ఎందుకో? అనుకుంటూ అసహనంగా మొహాలు పెట్టారు జనాలు.
"కానీ ఈసారి అంతకు మించిన అద్భుతం జరగబోతుంది. భారత్ సాఫ్టెక్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టీం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారు చేసిన హ్యూమనాయిడ్ రోబో 'మాధురి' మొదటిసారిగా ఒక సంగీత కచేరీకి మృదంగ సహకారం అందించబోతోంది" అని ఆగారు. హాలంతా నిశ్శబ్దం. వైద్యనాథన్ గారు చిరునవ్వుతో చూస్తున్నారు. ఎంతసేపైనా ప్రేక్షకులు నిశ్శబ్దంగానే ఉన్నారు. హాలంతా దద్దరిల్లిపోయేటట్టు చప్పట్లు వినిపిస్తాయని ఆశించిన భారత్ సాఫ్టెక్ టీం, కమలాకర్ గారు నిరాశగా చూశారు.
ఒక రోబో మృదంగం ఎలా వాయిస్తుంది? దానికి మనోధర్మం ఎలా వస్తుంది? అవతలి వాడి మనోధర్మాన్ని ఎలా గ్రహిస్తుంది? అసలు మెదడు తప్ప మనస్సు, ప్రాణం లేని ఒక యంత్రాన్ని పక్కన పెట్టుకుంటే మూడ్ ఎలా వస్తుంది? సవాలక్ష ప్రశ్నలు తిరుగుతున్నాయి ఆనంద్ బుర్రలో. ప్రేక్షకులంతా అయోమయంగా చూస్తున్నారు. కాసేపాగి కమలాకర్ గారు "కుమారి మాధురిని వేదికపైకి రావలసిందిగా కోరుతున్నాం" అన్నారు. 'కుమారి కాకపోతే శ్రీమతి అవుతుందా యేవిఁటి?' అనుకుంటూ బుర్ర గోక్కున్నాడు ఆనంద్.
గ్రీన్‌రూంలోంచి ఓ చేత్తో మృదంగం పట్టుకుని వయ్యారంగా నడుస్తూ వేదికపైకి వచ్చి, మృదంగం కింద పెట్టి, అందరికీ వినయంగా నమస్కారం చేసింది మాధురి. ప్రేక్షకులంతా అవాక్కయ్యారు. అచ్చమైన తెలుగు సాంప్రదాయ చీరకట్టూ, నుదుట అందమైన బొట్టూ, మూడడుగుల పొడవు జడ, చెవులకు రింగులు, మెడలో చంద్రహారం, లాకెట్, చేతులకు గాజులు, కాళ్ళకి పట్టీలు - ఆడాళ్లంతా వెర్రి మొహాలేసుకుని చూస్తున్నారు. 'మొత్తం ఎన్ని తులాల బంగారం ఉంటుందో' అని కొందరూ, 'దాని మొహం రోల్డ్ గోల్డ్ అయ్యుంటుంద'ని మరికొందరూ, 'దీనికి మేకప్ చేసిన వాడెవడో దేవాంతకుడు' అని ఇంకొందరూ ఎవరి మనోధర్మం ప్రకారం వాళ్లు ప్రస్తారం చేస్తున్నారు.
"ఈ రోబోను ఫ్యాబ్రికేషన్ చేసిన ఇంజనీర్లకు, అది పని చేయడానికి కావలసిన హార్డ్‌వేర్, మృదంగంపై గాత్రానికి సహకారం అందించడానికి కావలసిన సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసిన భారత్ సాఫ్టెక్ రీసెర్చ్ టీంకి, వారికి కావాల్సిన సంగీత సంబంధమైన ఇన్‌పుట్స్ ఇచ్చిన కళాకారులకు నా అభినందనలు. ఇక్కడికి విచ్చేసిన భారత్ సాఫ్టెక్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, బగ్ ఫిక్సింగ్ టీంకి మా సాదర స్వాగతం. ఈ కచేరీ విజయవాడ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆఫీషియల్ యూట్యూబ్ పేజీలో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి ఎవరైనా దీనిని వీక్షించవచ్చు. ఒక్క రెండు అంశాలయ్యాకా భారత్ సాఫ్టెక్ ప్రెసిడెంట్ కిరణ్ గారు ఈ ప్రాజెక్ట్ గురించి మనకు వివరిస్తారు. విప్లవాత్మకమైన ఈ ప్రయోగానికి మనస్ఫూర్తిగా మాకు సహకరిస్తున్న శ్రీ వైద్యనాథన్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ కచేరీ ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను" అని ముగించారు కమలాకర్ గారు. ఎవరూ చప్పట్లు కొట్టలేదు. ఏదో అయోమయంలో ఉన్నారంతా.
(హ్యూమనాయిడ్ రోబో గురించి పూర్తి వివరాల కోసం ఈ దిగువ లింక్ క్లిక్ చెయ్యండి.)
https://youtu.be/JRHdnkUjcZg
వైద్యనాథన్ గారు అందరివైపు చూసి మందహాసం చేసి, 'ఏవఁమ్మాయ్ కచేరి మొదలు పెడదామా? మైక్ పెట్టుకోలేదు, పికప్ ఉందా?' అన్నారు.
"నమస్తే నేను రెడీ" అంది మాధురి. మృదువైన స్వరం స్పీకర్‌లోంచి అందరికీ వినిపించింది. "మృదంగం, నా వాయిస్ రెండూ బ్లూటూత్‌లో స్పీకర్‌కి కనెక్ట్ అయ్యాయి. మైక్ అక్కర్లేదు"
"సరే శృతి చూసుకో అమ్మాయ్"
"ఇది డిజిటల్ మృదంగం. మీరు పెట్టిన తంబురా శృతికి ఆటో ట్యూన్ అయిపోయింది"
గతుక్కుమని వెంటనే సరుకున్నారు వైద్యనాధన్‌గారు.
“సరే, బైరవి అటతాళ వర్ణంతో కచేరీ మొదలుపెడదాం. త్రికాలం, త్రిశ్రం పాడతాను. పరవాలేదు కదా”
"నా మెమొరీలో వర్ణాలు, కృతులు, భక్తి గీతాలు పదివేల వరకు ఫీడ్ అయిపోయాయి. Built-in metronome సహాయంతో అన్ని తాళాలలో, గతులలో వాయించగలను. కుడి, ఎడమ చేతి వేళ్ళు 1200 strokes/ minute స్పీడ్ వరకు వాయించడానికి డిజైన్ చెయ్యబడ్డాయి. మీరు నిశ్చింతగా పాడండి' అంటూ అందంగా ఓ నవ్వు నవ్వింది. వైద్యనాథన్ గారు కాంచెం కంగారుపడినా బయటకు రానివ్వలేదు. ఎంతైనా అనుభవజ్ఞులు కదా!
కుడి ఎడమలను సంధానం చేస్తూ సుతారంగా మృదంగం మీటింది మాధురి. స్వచ్ఛమైన, శృతి శుద్ధమైన నాదం ఝమ్మని ఆడిటోరియాన్ని కమ్మేసింది. అప్పుడు కొట్టారు చప్పట్లు జనాలంతా. 'అబ్బా చీపురు పుల్లలతో సెట్ చేసిన కోలంక వెంకట్రాజు గారి బ్రాండ్ మృదంగనాదం. అద్భుతం' అనుకున్నాడు ఆనంద్.
నవ్వుతూ అందరికీ అభివాదం చేసి "ఇది పుల్లలతో సెట్ చేసిన మృదంగం నాదం. మీకు కావాలంటే రజనుతో సెట్ చేసిన నాదంతో వాయిస్తాను" అంది మాధురి.
"నాకు రజనుతో సెట్ చేసిన నాదం అంటేనే ఇష్టమమ్మాయ్" అన్నారు వైద్యనాధన్ గారు.
'సరే' అని మృదంగం మీటింది మాధురి. అచ్చమైన రజను నాదం గంటకొట్టినట్టు వినిపించింది. జనాలు నోరెళ్ళబెట్టి చూస్తున్నారు.
"నాదగ్గర ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు తంజావూరు బాణీయంటే ఇష్టమా లేక పుదుక్కొట్టై బాణీయా లేదా విజయనగరం బాణీయా?"
"భైరవి అటతాళవర్ణానికి మణి అయ్యర్ గారు చాలా బాగా వాయించేవారు. తంజావూరు బాణీలో వాయించ"న్నారు వైద్యనాధన్ గారు. 'ఓ అలాగేనండీ' వినయంగా నవ్వింది మాధురి.
భైరవి అటతాళ వర్ణంతో కచేరీ మొదలైంది. మధ్యమకాలం, త్రిశ్రం, త్రిశ్ర పైకాలం - ఏ గతి పాడినా వర్ణం మొత్తం ఉన్నదున్నట్లుగా స్వరాల మధ్య విశ్రాంతిలో పైకాలం జతులతో వాయిస్తూ ఉంటే అచ్చం మణి అయ్యర్ గారు వాయించినట్లే అనిపించింది. వర్ణం పూర్తయింది. వైద్యనాథన్ గారు, రామనాథం గారు శభాష్ అన్నారు. శ్రోతలంతా ఆనందాశ్చర్యచకితులయ్యారు. గట్టిగా చప్పట్లు కొట్టారు. అందరికీ అభివాదం చేసింది మాధురి.
"తర్వాత వాతాపి గణపతిం భజేహం పాడతాను. కొంచెం విజయనగరం కోలంక వెంకట్రాజు గారి బాణీలో సర్వలఘువు వాయించు" అన్నారు వైద్యనాథన్ గారు. 'అలాగే' అని తల ఊపి మృదంగం మీటింది. మళ్లీ ఝమ్మని విజయనగరం సోములు తయారుచేసిన వెంకట్రాజు గారి బ్రాండ్ నాదం వచ్చేసింది. భారత్ సాఫ్టెక్ ప్రెసిడెంట్ కిరణ్ గారి ముఖం కొద్దిగా వికసించింది. నవ్వుతూ వెనక్కి తిరిగి శ్రోతలకు చెయ్యి ఊపారు.
హంసధ్వనిలో కొద్దిగా ఆలాపన చేసి, ‘వాతాపి గణపతిం భజే' పాడి మధ్యమకాలం స్వరకల్పన మొదలుపెట్టారు. చక్కటి కుడి ఎడమల సంధానంతో, గమకంతో సర్వలఘువు వాయిస్తోంది మాధురి. ఆ రక్తిలో వైద్యనాధన్ గారికి అసంకల్పితంగా కొద్దిగా కాలప్రమాణం పెరగడం మొదలైంది. బిల్ట్‌ఇన్ మెట్రోనామ్ వైద్యనాధన్ గారు కృతి ఎత్తుకున్న కాలానికి ఫిక్స్ అయిపోయింది. దాంతో మాధురి కాలం పెరగనీయకుండా వెనక్కి లాగుతోంది.
"అమ్మాయ్ నీ మెట్రోనామ్ తీసేయ్. నా తాళానికి వాయించు" కొంచెం చిరాగ్గా అన్నారు వైద్యనాధన్ గారు.
వెంటనే సాఫ్ట్‌వేర్‌లో రిధం సెట్టింగ్ మ్యాన్యువల్‌కి మారిపోయింది. ఇక ముగ్గురూ కలసి స్వరకల్పన, తగ్గింపులు అదరగొట్టేశారు. మెల్లిగా ప్రజల దృష్టి మాధురి వైపు తిరిగిపోవడం గమనించారు వైద్యనాధన్ గారు. 'కీర్తనలంటే బట్టీ కొట్టింది, దీనికి నేను వెయ్యబోయే ముక్తాయినెవడూ ఫీడ్ చెయ్యలేడు కదా' అనుకుంటూ ఓ పెద్ద ముక్తాయి మొదలుపెట్టారు. సంగీత విద్వాంసులంతా దీనికి తిక్క కుదిరింది అనుకున్నారు. వైద్యనాథన్ గారిది అసాధారణమైన మేధస్సు. ఆయన వేసే ముక్తాయిలు మూడవసారికి గానీ ఎవరికీ అర్థం కావు. కానీ అందరి ఆలోచనలను తలక్రిందులు చేస్తూ ముక్తాయి మొత్తం అక్షరం పొల్లుపోకుండా ఉన్నదున్నట్లు మాడ్యులేషన్‌తో సహా వాయించేసింది మాధురి. ముక్తాయి పూర్తై 'ప్రణవ స్వరూప వక్రతుండం' అని ఎత్తుకోగానే హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. వైద్యనాథన్ గారు, రామనాథం గారు కూడా అప్రయత్నంగా చప్పట్లు కొట్టారు.
ఇంతలో కమలాకర్ గారు పోడియం వద్దకు వచ్చారు. "అంతరాయానికి మన్నించాలి. ఇప్పుడు భారత్ సాఫ్టెక్ ప్రెసిడెంట్ కిరణ్ గారు ఈ ప్రాజెక్ట్ గురించి రెండు మాటలు మాట్లాడతారు. చాలా మందికి తెలియని విషయమేంటంటే వారు మంచి మృదంగ కళాకారులు కూడా” అని వారిని వేదికపైకి ఆహ్వానించారు. కిరణ్ గారు మైక్ దగ్గరకు వచ్చి గొంతు సర్దుకుని మాట్లాడడం మొదలుపెట్టారు.
"సభకు నమస్కారం. భారత్ సాఫ్టెక్ తయారుచేసిన హ్యూమనాయిడ్ రోబో మాధురి, ఒక సంగీత కచేరీకి మృదంగ సహకారం అందించడానికి అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ విజయవంతంగా పని చేస్తున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది. భవిష్యత్తులో చాలా కచేరీలు ఇలాగే జరగవచ్చు". హాల్లో ఉన్న మృదంగ కళాకారులంతా అయోమయంగా చూశారు.
"వయొలిన్ సహకారం అందించే సాఫ్ట్‌వేర్‌ని కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నాం. కేవలం బగ్ టెస్టింగ్ మాత్రమే మిగిలి ఉంది". అంతవరకు ధీమాగా ఉన్న వయొలిన్ కళాకారులు కూడా గతుక్కుమన్నారు.
"పాడే సాఫ్ట్‌వేర్ కూడా ప్రాసెసింగ్ దశలో ఉంది". అంతే! మొత్తం కళాకారులందరూ ఆలోచనలో పడ్డారు. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అర్థం కావట్లేదు.
"2016లో హాంగ్‌కాంగ్‌లోని Hanson Robotics అభివృద్ధి చేసిన హ్యూమనాయిడ్ రోబో సోఫియా కంటే ఇది వంద రెట్లు శక్తివంతమైనది. సోఫియాకి 74 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటే మేము దానిని వందకి పెంచాము. దానివలన మృదంగం, వయోలిన్ వాద్యాలను నేలపై కూర్చొని వాయించడానికి కావలసిన పొజిషన్, సూక్ష్మమైన కదలికలు కూడా సాధ్యపడతాయి. తల రొటేషన్ కూడా 180 డిగ్రీలు ఉంటుంది. సోఫియా ఆరు వందల గ్రాములు బరువు మాత్రమే మోయగలదు కానీ మాధురి ఐదు కేజీల బరువు మోయగలదు. డిజిటల్ ఫైబర్ మృదంగం బరువు రెండు కేజీలు మాత్రమే ఉంటుంది. కర్ణాటక సంగీతం లోని కొన్ని వేల కృతులను మేము మాధురి మెమరీకి ఫీడ్ చేసాం. ఇది ఎప్పుడూ ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయి ఉంటుంది. ఏదైనా ఒక కొత్త కీర్తన యూట్యూబ్‌లో లేదా ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ అయితే వెంటనే దాని నోటేషన్‌ని మెమొరీలోకి లాగేస్తుంది. బాగా ప్రచారంలో ఉన్న బాణీలను అనుకరించడమే కాకుండా మాధురికి మనోధర్మం కూడా ఉంది. మాధురి అన్ని భారతీయ భాషలను, ఇంకా చాలా ప్రపంచ భాషలను అర్థం చేసుకోగలదు, మాట్లాడగలదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన అద్భుతం. మా భారత్ సాఫ్టెక్ రీసెర్చ్ టీం అంతటికీ నా హృదయపూర్వక అభినందనలు”.
"ఇక, మాధురిలో ఇంకొక విశేషమేంటంటే అందులో మేము వాడిన ప్రాసెసర్‌కి లేటెన్సీ ఒక మిల్లీ సెకండ్ మాత్రమే. అంటే విన్న స్వరం ఒక మిల్లీసెకండ్‌లో, అంటే సెకండ్‌లో వెయ్యోవంతు కాలంలో ప్రోసెస్ అయిపోయి జతి తయారైపోతుంది. ఇందాక వైద్యనాథన్ గారు పాడిన ముక్తాయిని అప్పటికప్పుడు వాయించగలగడానికి ఈ అతి తక్కువ లేటెన్సీయే కారణం. వైద్యనాథన్ గారి దగ్గర నుండి శబ్దం మాధురి దగ్గరకి చేరడానికి రెండు మిల్లీ సెకండ్లు, ప్రాసెసింగ్ టైం ఒక మిల్లీసెకండ్, తిరిగి మోటార్ యాక్షన్ అండ్ సౌండ్ ప్రోసెసింగ్ టైం రెండు మిల్లీ సెకండ్లు - మొత్తం 5 మిల్లీసెకండ్లలో, అంటే సెకండ్‌లో రెండు వందలవ వంతు కాలంలో స్పీకర్‌లోంచి నాదం వచ్చేస్తుంది. అంత తక్కువ వ్యవధిని మన చెవి గుర్తించలేదు. అందుకని వినేవారికి గాత్రంతో పాటు వాయిస్తున్నట్లే అనిపిస్తుంది. మొదటిసారి ముక్తాయి స్ట్రక్చర్‌ని గ్రహించాక రెండవసారి వేర్వేరు జతులతో, మూడవ సారి పై కాలం నడకలతో పాటు వాయిస్తుంది. బలే, శభాష్ వంటి పొగడ్తలకు కూడా రెస్పాన్స్ ఇస్తుంది. కొన్ని ఎక్స్ప్రెషన్స్ అంటే ముఖకవళికలను, భావాలను 2016లోనే సోఫియాలో పెట్టారు. మేము వాటిని ఇంకా అభివృద్ధి చేశాం”.
“ఇక మీరు మాధురి చేతుల్లో చూస్తున్నది చెక్కతో, చర్మాలతో చేసిన మృదంగం కాదు. ఇది ఫైబర్‌తో చేసిన డిజిటల్ మృదంగం. మీరిచ్చే కమాండ్ బట్టి లేదా దగ్గరలో ఉన్న తంబురాకి ఆటోట్యూన్ అయిపోతుంది. శృతి కలవకపోవడం, నాటు, మీటు తేడా రావడం అన్న సమస్యలే ఉండవు. వేలు పడిన స్థానం బట్టి నాదం వచ్చేస్తుంది. కొన్ని ప్రీ ఫిక్స్‌డ్ వెరైటీ నాదాలు ఇందులో ఫీడ్ అయి ఉన్నాయి లేదా ఈక్వలైజర్స్ ద్వారా, ఆక్టేవ్ ఆంప్లిట్యూడ్ ఎడ్జస్ట్‌మెంట్ ద్వారా మీకు కావలసిన కస్టమ్ నాదాన్ని జనరేట్ చేయొచ్చు".
“ఈ పరిశోధన బృందంలో ఉన్నవారందరూ చిన్నతనం నుంచి సంగీతంలో అభిరుచి, కనీస పరిజ్ఞానం ఉన్నవారే. వీరే కాక పరిశోధనపై ఆసక్తి ఉన్న ఎంతోమంది గొప్ప గాత్ర, మృదంగ కళాకారులు కూడా మాకు ఎన్నో విలువైన సలహాలను, బగ్ టెస్టింగ్‌లో సూచనలను అందించేరు. వారందరికీ కూడా భారత్ సాఫ్టెక్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయవాడ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారికి నా కృతజ్ఞతలు" అంటూ నమస్కారం చేశారు. శ్రోతల హర్షధ్వానాల మధ్య వారు కిందకి దిగి తన సీట్లో కూర్చున్నారు.
కచేరీ తిరిగి మొదలైంది. వైద్యనాథన్ గారి కోరిక మేరకు తర్వాతి కృతికి ముళ్ళపూడి వారి బాణీలో, తర్వాత పళని సుబ్రహ్మణ్యం గారి బాణీలో సహకారం అందించింది మాధురి. తర్వాత కృతి మొదలు పెడుతూ "ఇదిగో అమ్మాయ్ ఇక నీ మనోధర్మంతో వాయించు" అన్నారు. సరే అంది మాధురి. 'నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా' అంటూ అభేరి రాగంలోని త్యాగరాజ కృతిని ఎంతో ఆర్తిగా పాడారు వైద్యనాథన్ గారు. ఆయన గొంతులో మాడ్యులేషన్ బట్టి వాల్యూం పెంచుతూ తగ్గిస్తూ వాయిస్తోంది మాధురి. కానీ నడకలు యాంత్రికంగా, ఏదో సూత్రం ప్రకారం వాయిస్తున్నట్లు అనిపించాయి ఆనంద్‌కి, ఇతర కళాకారులకు. ఇంతవరకు వేరే వారి బాణీలు వాయించబట్టి తేడా తెలియలేదు. 'జగమేలే పరమాత్మ' అనే చోట అద్భుతంగా నెరవల్, స్వరకల్పన చేసి సాహిత్య విరుపులతో ఒక చక్కని ముక్తాయి వేసి ముగించారు వైద్యనాధన్ గారు. మాధురి వైపు తిరిగి ఇక నువ్వు వాయించన్నట్లు సైగ చేశారు.
"ఎంతసేపు" అని అడిగింది మాధురి.
"ఓ పది నిమిషాలు" అన్నారు వైద్యనాథన్ గారు.
ఇచ్చిన సమయం బట్టి లయవిన్యాసం ఎలా వాయించాలో, ఎన్ని గతుల్లో వాయించాలో, ఏ ఏ ముక్తాయిలు వాయించాలో నిర్ణయించుకునేటట్లు సాఫ్ట్‌వేర్‌లో ప్రోగ్రాం చేశారు. చతురశ్ర, ఖండ గతులలో ప్రస్తారం, వాటిల్లో ముక్తాయిలు, తగ్గింపులు, పైకాలం నడకలు, మొహరా, ముక్తాయి - మొత్తం పూర్తై సరిగ్గా సమానికి 'జగమేలే పరమాత్మా' అని వైద్యనాథన్ గారు ఎత్తుకోగానే ప్రేక్షకులంతా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అందరితోపాటు ఆనంద్ కూడా లేచి నిల్చున్నాడు.
కమలాకర్ గారు పోడియం వద్దకు వచ్చి వందన సమర్పణ చేశారు. విద్వాంసులకు, భారత్ సాఫ్‌టెక్ బృందానికి, ప్రేక్షకులకు, పాత్రికేయులకు ధన్యవాదాలు తెలియజేశారు. "ఎవరైనా మృదంగ విద్వాంసులు వేదికపైకి వచ్చి ఈ ప్రయోగంపై వారి అభిప్రాయాలను, సూచనలను తెలియజేయవలసిందిగా నా కోరిక. కిరణ్ గారికేమీ అభ్యంతరం లేదనుకుంటాను" అన్నారు. చిరునవ్వుతో తన అంగీకారాన్ని తెలియజేశారు కిరణ్ గారు. మృదంగ కళాకారులందరూ షాక్‌లో ఉన్నారు. వారికి తమ భవిష్యత్తు గురించి బెంగగా ఉంది. ఎవరూ ముందుకు రాలేదు. చివరకు కమలాకర్ గారే "రావోయ్ ఆనంద్" అన్నారు. తల అడ్డంగా ఊపి కుర్చీకి మరింత బిగుసుకుని కూర్చున్నాడు ఆనంద్. "రానంటే ఎలాగోయ్? మంచి విద్వాంసుడివి, ఇంజనీర్‌వి, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాడివి. రా" అంటూ కొంచెం దబాయించేరు. ఇక తప్పదనుకుని బలవంతంగా వేదిక పైకి వచ్చాడు.
"సభకు నమస్కారం. ఇది శాస్త్ర సాంకేతిక రంగంలో ఒక అద్భుతమైన ప్రయోగం. దీనిని రూపొందించిన శాస్త్రవేత్తలకు, కళాకారులకు నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు. సైన్స్‌ని కళకు అనుసంధానం చెయ్యడానికి ఉద్దేశించిన ఒక చక్కని ప్రయత్నమే ఈ ప్రయోగం. "డిజిటల్ మృదంగం ఒక అద్భుతమైన ఆవిష్కరణ. ఇందులో ఫీడ్ చేసిన నాదాలు ఒరిజినల్ నాదాలకి చాలా దగ్గరగా ఉన్నాయి. ఇవి త్వరలో విరివిగా వాడుకలోకి వస్తాయని నా నమ్మకం". అందరూ చప్పట్లు కొట్టారు.
"ఇక, మాధురి సహకారం కూడా మొత్తమ్మీద చాలా బాగుంది. కానీ ఒక మృదంగ కళాకారుడిగా కొన్ని సూక్ష్మమైన విషయాలలో నా అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేయదలుచుకున్నాను. నాకెందుకులే అని ఊరుకోవడం నాకు నచ్చదు". అందరూ నుదుళ్ళు చిట్లించి చూశారు.
"సైన్స్‌కి సూత్రమే ఆధారం కానీ కళ విషయంలో సూత్రానికి మనసును కూడా జోడించాలి. ఇంటెలిజెన్స్‌కీ, ఎమోషన్‌కీ చాలా భేదం ఉంది. ఈ రోజు మనం చూస్తున్న యంత్రం కన్వెన్షనల్ ప్రోగ్రాంమ్‌కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని జోడించి మృదంగ సహకారం అందించింది. లయ విన్యాసం కూడా వాయించింది. కానీ జాగ్రత్తగా గమనిస్తే మనోధర్మంలో, ముక్తాయిల్లో ఒరిజినాలిటీ తక్కువగా ఉంది. చతురశ్రంలో మణి అయ్యర్ గారి ప్రస్తారం, ముక్తాయి, ఖండంలో పళని సుబ్రహ్మణ్యం గారి ప్రస్తారం, ముక్తాయి, ముళ్ళపూడి వారి బాణీ తగ్గింపులు, కారైకుడి మణి గారి పైకాలం నడకలు, కమలాకరరావు గారి మొహరా, వంకాయల నరసింహం గారి ముక్తాయి - ఇలా కలగూరగంపలా అనిపించింది. కళాకారుల, ప్రేక్షకుల మనోభావాలను బట్టి స్వంత మనోధర్మంతో అప్పటికప్పుడు ప్రణాళిక మార్చడం, కొత్త ముక్తాయిలతో, నడకలతో వాయించడం మనసుతోనే సాధ్యం. మెంటల్ ప్లేన్‌లోని వైబ్రేషన్స్‌ని గ్రహించే శక్తి యంత్రానికి ఉండదు. అసాధ్యం అని చెప్పను కానీ సృజనాత్మకత, భావుకత అనేవి కృత్రిమ మేధస్సుకు అతీతమైన విషయాలని నా అభిప్రాయం. ఈరోజు జరిగినది చాలా గొప్ప అభినందనీయమైన ప్రయోగం. దీనిని ఖచ్చితంగా స్వాగతించాలి. దీనికున్న పరిమితులను తెలియజేశానే తప్ప తక్కువ చేసి చెప్పట్లేదు. ఈ పరిమితులను అధిగమించడానికి మరిన్ని ప్రయోగాలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైతే నా సహకారం అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నా మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షంతవ్యుణ్ణి".
కమలాకర్ గారు ఇబ్బందిగా చూశారు. భారత్ సాఫ్టెక్ ప్రెసిడెంట్ కిరణ్ గారు లేచి మైక్ దగ్గరకు వచ్చారు. ఏం జరుగుతుందో అని అంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. వైద్యనాథన్ గారు చిద్విలాసంతో గమనిస్తున్నారు.
"ఆనంద్ గారు చెప్పినది అక్షర సత్యం".
అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
"భారత్ సాఫ్టెక్ ఈ ప్రయోగాన్ని ఒక టెక్నాలజికల్ ఛాలెంజ్‌గా తీసుకుని చేస్తున్నదే తప్ప ఏ రకమైన వాణిజ్యపరమైన లాభాలను ఆశించి కాదు. ఆనంద్ గారు చెప్పినట్లు భావుకత అనేది మానవునికి మాత్రమే సొంతం. ప్రపంచంలోని ఏ ఇతర సంగీత బాణీలోనూ లేని మనోధర్మం అనే అంశం అత్యంత పరిపక్వ స్థాయిలో భారతీయ సంగీతంలో - ముఖ్యంగా కర్ణాటక సంగీతంలో మాత్రమే ఉంది. మనోధర్మ సంగీతానికి ఎంత చేరువగా వెళ్ళగలమా అనే పరిశోధనా ఫలితం మాత్రమే ఇది. ఇది ఒక ప్యూర్ సైన్స్ రీసెర్చ్. అప్లైడ్ అండ్ కమర్షియల్ రీసెర్చ్ కానేకాదు. నిజానికి ఇది వాణిజ్యపరంగా లాభించే పరిశోధన ఎంత మాత్రం కాదు. ఈ పరిశోధనకై భారత్ సాఫ్టెక్ ఇప్పటివరకు 10 కోట్లు ఖర్చు చేసింది. కేవలం మాధురి తయారీకే 5 కోట్ల రూపాయలు ఖర్చయింది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెంది ఈ రోబోని మాస్ ప్రొడక్షన్ చేసినా ఒక్కొక్క పీస్ ఖరీదు సాఫ్ట్‌వేర్‌తో పాటు కనీసం పాతిక లక్షలు అవుతుంది".
కళాకారులంతా 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకున్నారు.
"మనోధర్మం అవసరం లేని సినిమా రియాలిటీ షోలలో వీటిని విజయవంతంగా వాడొచ్చు. ఆడియో రికార్డింగ్‌లలో అయితే అసలు మృదంగం, రోబో రెండూ లేకుండానే కేవలం సాఫ్ట్‌వేర్‌తో ట్రాక్ రికార్డ్ చేసెయ్యొచ్చు. ఇందాక చెప్పినట్టు డిజిటల్ వైలెన్, రోబో వయొలనిస్ట్ పరిశోధన బగ్ టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో దానిని కూడా విడుదల చేయబోతున్నాం. మొత్తం రోబోలతోనే కచేరీ చేయించే రోజు కూడా త్వరలోనే వస్తుంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన విజయవాడ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ కార్యవర్గానికి, మాధురి సహకారానికి ఒప్పుకున్న వైద్యనాథన్ గారికి, భారత్ సాఫ్టెక్ తరుపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను”.
మరొక రెండు అంశాలతో కచేరీ ముగిసింది. చాలామంది ప్రేక్షకులు వేదికపైకి వెళ్లి వైద్యనాథన్ గారితో ఫోటోలు, సెల్ఫీలు, ఒకరిద్దరు పిల్లలు ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. కాసేపయ్యాకా కమలాకర్ గారు వైద్యనాథన్ గారి దగ్గరకు వచ్చారు. ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ వేదిక కిందకు వచ్చారు. అక్కడే మెట్ల దగ్గర ఉన్న ఆనంద్‌ని చూసి భుజం తడుతూ "చాలా బాగా, ధైర్యంగా చెప్పావోయ్. మంచి పరిశీలన, విమర్శనా శక్తి, వాగ్ధాటి ఉన్నాయి. మృదంగ వాద్యంలోని అనేక బాణీలను బాగా ఆకళింపు చేసుకున్నావు. ఇప్పుడే కమలాకర్ గారు నీ గురించి, నీ వాద్యం గురించి బాగా చెప్పారు. రేపు సాయంత్రం ఎవరో హైకోర్టు జడ్జి గారింట్లో పాడమని ఇందాకే అడిగారు. నువ్వు వాయిస్తావేంటోయ్" అన్నారు. ఆనంద్ ఆనందానికి అవధులు లేవు. 'తప్పకుండానండీ' అని కాళ్ళకి నమస్కారం చేసి గాల్లో తేలుతూ కుటుంబ సమేతంగా ఇంటికి బయల్దేరాడు.
***********
రచన: కె.సద్గురుచరణ్,
‘టాప్‌గ్రేడ్’ నిలయ మృదంగ విద్వాంసులు,
ఆకాశవాణి, విజయవాడ. ఫోన్:9440709994.
Comments
Post a Comment