లాక్ డౌన్ తర్వాత కచేరీలు - సైన్స్ ఫిక్షన్
COVID-19 లాక్ డౌన్ వలన కచేరీలన్నీ ఆగిపోయాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో తెలియట్లేదు. బస్సులు, రైళ్లు తిరగడం మొదలుపెట్టినా జనాలు భయం భయంగానే వెళ్తారు. ఈ పరిస్థితిలో కచేరీలు ఎలా జరుగుతాయో అని నేను కల్పించి రాసిన ఒక కథ.
Please like, comment and share.
లాక్ డౌన్ తర్వాత కచేరీలు
రచన: కె.సద్గురుచరణ్,
‘టాప్‌గ్రేడ్’ నిలయ మృదంగ విద్వాంసులు,
ఆకాశవాణి, విజయవాడ.
ఫోన్:9440709994.
సాయంత్రం ఐదైంది. ఆనంద్ చాలా కంగారుగా ఉన్నాడు. ఇంకో గంటన్నరలో కచేరీ. పదినిమిషాలకొకసారి మృదంగం శృతి చూస్తున్నాడు. అప్పటికి తయారై పావుగంట అయింది. మాటిమాటికీ పౌడరద్దిన రుమాలుతో చెమట ఒత్తుకుంటున్నాడు. ఏవేవో ముక్తాయిలు లెక్కెట్టుకుంటున్నాడు. రెండిళ్ళ అవతల ప్రకాష్ పరిస్థితీ అలాగే ఉంది. ఐదు శృతి ఘటాలు మూడింటిని ముందేసుకుని నాదం, శృతి చూసుకుంటున్నాడు. చివరికి ఏమీ తేల్చుకోలేక రెండు ఘటాలను ఒక బ్యాగ్‌లో సర్ది రెడీ అయ్యాడు. ఆరోజు కచేరీ అలాంటిది మరి. ఐదున్నరకల్లా ఓలా క్యాబ్‌లో ఇద్దరూ కలసి సంగీత కళాశాల ఆడిటోరియంకి బయలుదేరారు. తెలుగు రాష్ట్రాలలో వాళ్ళిద్దరూ ఇప్పుడిప్పుడే బాగా పేరు తెచ్చుకుంటున్న యువ మృదంగ, ఘట కళాకారులు. ఇద్దరిలో ఎవరికి కచేరీ వచ్చినా రెండవ వాడిని కూడా లాగేస్తాడు. అంత అండర్‌స్టాండింగ్ ఇద్దరి మధ్యా. ఇద్దరూ సంగీత కళాశాల ముందు క్యాబ్ దిగారు బయట పెద్ద బ్యానర్ కనిపించింది.
'VIJAYAWADA FINE ARTS ACADEMY'
FIRST MULTI CITY VIRTUAL 3D LIVE MUSIC CONCERT
A BHASKAR DIGITAL INITIATIVE
SPON. BY MINISTRIES OF SCIENCE AND TECH, TELECOMMUNICATION AND CULTURE
అంత గొప్ప మెగా టెక్నికల్ ఈవెంట్‌లో మొదటి అవకాశం తమకే వచ్చినందుకు ఇద్దరికీ చాలా ఆనందంగా, థ్రిల్లింగ్‌గా ఉంది. మరోపక్క భయంగానూ ఉంది. ఇద్దరూ కలసి ఆడిటోరియం దగ్గరికి వెళ్ళారు.
స్టేజి మీద మృదంగానికి, ఘటానికి మాత్రమే ఒక బల్ల వేసి దానిపైన మైకులు పెట్టి ఉన్నాయి. గాత్రం, వయొలిన్ ఉండాల్సిన చోట ఖాళీగా ఉంది. హాల్‌కి మధ్యలో పొడవునా ఒక తెల్లటి గీత గీసి ఉంది. దానికి ఒక పక్కన మృదంగానికి ఎదురుగా ఉన్నవైపు మాత్రమే కుర్చీలున్నాయి. సోషల్ డిస్టెన్సింగ్ పుణ్యమా అని కుర్చీల మధ్య మూడేసి అడుగుల జాగా ఉంచారు. స్టేజి మీద వేర్వేరు డైరెక్షన్స్‌లో మూడు కెమెరాలు, మూడు ప్రొజెక్టర్లు ఉన్నాయి. కింద హాల్లో కూడా కుర్చీలు ఉన్నవైపు 3 వైపుల నుంచి కెమెరాలు, కుర్చీలు లేనివైపు 3 ప్రొజెక్టర్లు ఉన్నాయి. వాటి ఎలివేషన్స్ కూడా వేరువేరుగా ఉన్నాయి. చాలామంది టెక్నీషియన్స్ కెమెరాలను, ప్రొజెక్టర్‌లను చెక్ చేసుకుంటున్నారు. వాటిని రిమోట్‌తో ఆపరేట్ చేస్తున్నారు.
వీటన్నింటిని ఆశ్చర్యంగా చూస్తూ ఇద్దరూ గ్రీన్ రూమ్‌లోకి అడుగు పెట్టారు. ఎదురుగా మిక్సింగ్ కన్సోల్, చుట్టూ మానిటర్లు, తలకి హెడ్‌ఫోన్స్ పెట్టుకుని భాస్కర్ ఎవరితోనో హడావిడిగా మాట్లాడుతున్నాడు. అసలీ ప్రపంచంలోనే లేడు. కొంతమంది టెక్నీషియన్స్ స్టేజి మీద మైకులు చెక్ చేస్తున్నారు. ఇంతలో విజయవాడ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ సెక్రటరీ కమలాకర్ గారు వచ్చి "బాగున్నారా, ఇద్దరూ వెళ్లి శృతులు, మైకులు చెక్ చేసుకోండి" అన్నారు. మిత్రులిద్దరూ స్టేజి మీద కూర్చుని తమ పనిలో పడ్డారు.
ఈవెంట్‌కి మీడియాలో విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చారు. పాసులు ఉన్న వారినే లోపలికి రానిస్తున్నారు. ఎంట్రన్స్ దగ్గర చేతుల మీద శానిటైజర్ స్ప్రే చేస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ప్రింట్, విజువల్ మీడియా ప్రతినిధులు కూడా బాగానే వచ్చారు. స్పాన్సర్ చేస్తున్న మంత్రిత్వ శాఖల మంత్రులు కూడా విచ్చేశారు. ఐదు నిమిషాలలోపే కుర్చీలన్నీ నిండిపోయాయి. టెక్నీషియన్స్ అందరూ ఓకే అన్నారు. అందరి ధ్యాస కచేరీ కంటే అక్కడ జరగబోయే సాంకేతిక అద్భుతం మీదే ఉంది.
ఇంతలో కమలాకర్ గారు వేదికపైకి వచ్చారు. పోడియం దగ్గరకు వచ్చి మైక్ సర్దుకుని మాట్లాడడం మొదలుపెట్టారు "సభకు నమస్కారం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జరగబోతున్న ఒక అద్భుతాన్ని చూడడానికి విచ్చేసిన మీ అందరికీ సుస్వాగతం. 'Multi city virtual 3D live concert' అనే వినూత్న ప్రయోగాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. విశాఖపట్నానికి చెందిన వర్ధిష్ణు గాయని కుమారి మానస, వయోలిన్‌పై సహకరించడానికి మాస్టర్ ప్రేమ్‌సాగర్ విశాఖపట్నంలోని శంకర మఠం హాల్లో ఇదే విధమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నారు. స్టేజి మీద ఒక పక్కగా నిలుచున్న భాస్కర్ "లైట్స్ ఆఫ్" అన్నాడు. బోర్డ్ దగ్గర రెడీగా ఉన్న కుర్రాడు స్టేజి మీద, కింద కెమెరాలకు అవసరమైనంత వరకే లైట్లుంచి మిగిలినవి ఆర్పేశాడు. గ్రీన్‌రూమ్‌లోకి తొంగిచూసి "లైవ్ స్ట్రీమింగ్ ఆన్" అన్నాడు. గ్రీన్‌రూమ్‌లో కన్సోల్ ముందున్న టెక్నీషియన్ మౌస్ క్లిక్ చేశాడు. అంతే! రెప్పపాటు కాలంలో మానస, సాగర్ స్టేజి మీద ప్రత్యక్షమయ్యారు. పక్కనే ఉన్న ఆనంద్, ప్రకాష్ తుళ్ళిపడ్డారు. అసంకల్పితంగా వెనక్కి జరిగారు. ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలనుంచీ తేరుకునేలోపే హాల్లో ఖాళీగా ఉన్నవైపు వైజాగ్ శ్రోతలు ప్రత్యక్షమయ్యారు. అంతే! అదిరిపడ్డారు జనం. ఒకరిద్దరు ఆడాళ్ళు కెవ్వుమని అరిచారు. ఒకావిడ ఒళ్లోని చంటి పిల్లాడు గుక్కపట్టేశాడు. ప్రజలు తమ కళ్ళను తామే నమ్మలేక పోయారు. త్రీడీ ప్రొజెక్షన్ క్వాలిటీ ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగానే అక్కడ మనుష్యులు ఉన్నట్లుగానే ఉంది. ఒక్క పది సెకండ్లలో అందరూ తేరుకున్నారు. అసంకల్పితంగా లేచి నిల్చున్నారు. విజయవాడ ఒరిజినల్ ఆడియన్స్, వైజాగ్ వర్చువల్ ఆడియన్స్ ఆపకుండా ఒక నిమిషం పాటు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. భాస్కర్ వంగి అందరికీ వినయంగా నమస్కారం చేసాడు. కాసేపటికి జనం సర్దుకున్నారు.
కమలాకర్ గారు మెల్లిగా గొంతు సర్దుకున్నారు. "అందరికీ ధన్యవాదాలు. ఈ క్రెడిట్ అంతా బీటెక్ ఎలక్ట్రానిక్స్, ఎమ్‌టెక్ సౌండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన మన యువకిశోరం భాస్కర్‌కే చెందుతుంది. ఇతను మంచి కర్ణాటక సంగీత విద్వాంసుడు కూడా. ఈ అద్భుతానికి సంబంధించిన సాంకేతిక అంశాలను ఇప్పుడు అతనే వివరిస్తాడు”. శ్రోతల కరతాళధ్వనుల మధ్య భాస్కర్ చెప్పడం మొదలు పెట్టాడు.
"సభకు నమస్కారం. విచ్చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. నా మీద నమ్మకం ఉంచి ఈ ఈవెంట్‌ని స్పాన్సర్ చేసిన శాస్త్ర సాంకేతిక, టెలికమ్యూనికేషన్, సాంస్కృతిక శాఖల మంత్రులకు, అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతవరకు ప్రయోగంలోని మొదటి ఘట్టం మాత్రమే పూర్తయింది. ఇంకా ముందు చాలా సవాళ్ళున్నాయి. మనం సాధారణంగా వీడియో కాల్స్ చేసేటప్పుడు రెండు వైపులా కంప్యూటర్లలో లేదా మొబైల్స్‌లో ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్ సరిపోకపోవడం వలన, ప్రాసెసింగ్ డిలే వలన కొంచెం టైం లేగ్ ఉంటుంది. అంటే ఒకరు మాట్లాడిన మాటలు, వీడియో అవతలి వారికి చేరడానికి కొంత సమయం పడుతుంది. దీన్నే latency అంటారు. అందువలన Skype, Hangouts, Zoom మొదలైన యాప్స్‌లో సంగీత పాఠాలు చెప్పేటప్పుడు గురువుగారు, శిష్యుడు కలసి పాడటం కుదరదు. ఈమధ్య దాదాపు నాలుగు నెలలపాటు సాగిన COVID-19 Lockdown, తదనంతర ఆంక్షల వలన ఎంతోమంది ఔత్సాహిక కళాకారులు వారి వారి ఇళ్లలోనే ఉండి, ఒక్కొక్కరు విడివిడిగా పాడి, వాయించి రికార్డ్ చేసి, వాటన్నింటినీ మిక్సింగ్ చేసి వీడియోలు తయారు చేశారు. లైవ్ కచేరీలు పాడడంలో, వినడంలో ఉండే ఉత్సాహం, ఏకాగ్రత రికార్డెడ్ వీడియోలో ఉండవు. ఆంక్షలు కొంతవరకు సడలించినా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ విరివిగా వాడడానికి ప్రజలింకా సిద్ధంగా లేరు. అన్నాళ్ళపాటు లైవ్ కన్సర్ట్‌లు ఎందుకు మానుకోవాలి? పైగా ఈ పద్ధతిలో రెండు మూడు ఊళ్ళలో శ్రోతలు ఒకేసారి కచేరీ వినేయొచ్చు. లాక్ డౌన్ సృష్టించిన సవాళ్లను ఎదుర్కోడానికి ఈ మధ్య కాలంలో శాస్త్రజ్ఞులు Quantum computing, quantum teleportation, real time data transfer వంటి ఎన్నో అంశాలపై తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నారు. మనం కమ్యూనికేషన్‌కి ఉపయోగించే జియో స్టేషనరీ శాటిలైట్స్ భూమికి 36,500 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. అందుకని ఒకవైపు సిగ్నల్ శాటిలైట్‌కి వెళ్లి రావడానికి 73 వేల కిలోమీటర్లు ప్రయాణించాలి. అంటే లైట్ స్పీడ్‌తో ప్రయాణించినా సెకండ్‌లో నాలుగో వంతు సమయం పడుతుంది. దానికి ప్రాసెసింగ్ డిలే కలుపుకుని ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఇదే సిగ్నల్‌ని Optical fibre ద్వారా లేదా Low earth orbit satellite constellation ద్వారా పంపితే latency మిల్లీ సెకండ్లలోకి వచ్చేస్తుంది. ఇంచుమించు కాంతివేగంతో డేటాని పంపే ఆప్టికల్ ఫైబర్స్ కూడా నేడు అందుబాటులోకి వచ్చేసాయి. Low earth orbit satellites భూమికి ఇంచుమించు 500 కిలోమీటర్లు ఎత్తులో ఉంటాయి. విశాఖపట్నం నుంచి విజయవాడకి సిగ్నల్ ట్రాన్స్‌మిట్ అవడానికి వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించాలి. కాంతి వేగం సెకండ్‌కి దాదాపు మూడు లక్షల కిలోమీటర్లు. అంటే ఇంచుమించు 4 మిల్లీ సెకండ్లలో సిగ్నల్ ఒకవైపు నుంచి రెండవ వైపుకి వచ్చేస్తుంది. రెండు ఊళ్ళలోను 10 GBPS స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, హై కెపాసిటీ రౌటర్, 64 core ప్రోసెసర్ కంప్యూటర్, దానికి 1TB RAM ఉపయోగిస్తే ఇంచుమించు రియల్‌టైంలో డేటా ప్రాసెసింగ్ జరిగిపోతుంది. సాధారణంగా మన చెవులు 50 మిల్లీ సెకన్ల కంటే తక్కువ వ్యవధిలో వినిపించే రెండు శబ్దాలను వేరువేరుగా గుర్తు పట్టలేవు. అంటే సెకండ్‌కి ఇరవై అక్షరాలు నడిచే కాలంలో ఒక్క అక్షరం తేడా లేదా 1200 bpm స్పీడ్‌లో ఒక బీట్ ఎర్రర్‌ని గుర్తించలేము. అందుకని అక్కడ పాడేవారికి ఏ మాత్రం తేడా తెలియకుండా ఇక్కడ సహకారం వాయించవచ్చు. ఆన్‌లైన్ పాఠాలలో గురు శిష్యులిద్దరూ కలిపి పాడొచ్చు. టెక్నాలజీ పెరిగినకొద్దీ, ప్రజలు వీటికలవాటు పడినకొద్దీ ధరలు అందుబాటులోకి వస్తాయి. కెమెరా, ప్రొజెక్టర్ల పరిమాణాలూ తగ్గుతాయి. నమ్మశక్యంగా లేదా? కానీ నమ్మి తీరాలి. సాంకేతిక పరిజ్ఞానం చేస్తున్న ఈ అద్భుతాన్ని మీరిప్పుడు ప్రత్యక్షంగా వీక్షించబోతున్నారు. ఇక 3D projection అనేది మూడు దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది. దీన్నే Holographic 3D projection అంటారు. మూడు కెమెరాలతో, మూడు డైమెన్షన్స్‌లో తీసిన ఇమేజ్‌ని మూడు ప్రొజెక్టర్‌లతో లేజర్ ప్రొజెక్షన్ చేయడం వలన అసలు ఇది మిధ్య అన్న ఆలోచనే రాదు. ఈ ప్రయోగం విజయవంతమైతే ట్రావెల్, హాస్పిటాలిటీ ఖర్చులు మిగుల్చుకోవడానికి భవిష్యత్తులో ఇలాంటి కచేరీలు చాలా జరుగుతాయి. UN general assembly సమావేశాలు కూడా దేశాధినేతలందరూ ఎవరి దేశాలలో వాళ్ళుండి జరిపించవచ్చు. ఈ ప్రయోగానికి నాతోపాటు పనిచేస్తున్న టెక్నీషియన్స్‌కీ, కెమెరామెన్‌కీ, ఇతర సిబ్బందికి కూడా నా ధన్యవాదాలు. ఇదే సమయంలో వైజాగ్‌లో పని చేస్తున్న వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈ కచేరీ Vijayawada fine arts academy official Facebook pageలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి ఎవరైనా దీనిని వీక్షించవచ్చు. ఇది ప్రథమ ప్రయత్నం అవ్వడం వలన సీనియర్ విద్వాంసులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వర్ధిష్ణు కళాకారులతో నిర్వహిస్తున్నాం. ఏమైనా పొరపాట్లు జరిగితే మన్నించవలసిందిగా ప్రార్థన. ఇక కొంచెం సేపట్లో కచేరి మొదలవుతుంది. నమస్తే"
కళాకారులందరూ ఒకరినొకరు చిరునవ్వుతో పలకరించుకున్నారు. ఆనంద్ అత్యుత్సాహానికి పోయి మానసకి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. ముసిముసిగా నవ్వుతూ మానస అందుకో బోయింది. అంతే! ఇద్దరూ తూలి పడ్డారు. ప్రకాష్ ఓ వెటకారపు నవ్వు నవ్వాడు. జనాలు గొల్లుమన్నారు. ఏడవలేక నవ్వేరు మానస, ఆనంద్. అవును మరి, ప్రొజెక్షన్స్ అంత అద్భుతంగా ఉన్నాయి. కచేరీ మొదలైంది. పాటకి సహకారం రియల్ టైంలో జరిగిపోతోంది. రెండు ఉళ్ళలోని ప్రజలు ఏదో ఊహ జగత్తులో ఉన్నారు. కొందరు వాస్తవ, మిధ్యా శ్రోతలు పక్కకు తిరిగి పలకరించుకుంటున్నారు. కొంతమంది కుతూహలం ఆపుకోలేక వైజాగ్ ప్రేక్షకుల వెనకవైపుకి వెళ్లి చూస్తున్నారు. హాల్ మధ్యలో తెల్లగీత దాటి కెమెరా రేంజ్‌లోంచి అవతలకు వెళ్ళగానే అవతలి ఊళ్లోని ప్రొజెక్షన్ లోంచి చటుక్కున మాయమైపోతున్నారు. ఇంతలో ఓ కుర్రాడొచ్చి స్టేజి మీద నాలుగు వాటర్ బాటిల్స్ పెట్టి వెళ్ళిపోయాడు. వాడు ఉపోద్ఘాతం అంతా వినలేదు. ఇద్దరు కళాకారులు మిధ్య అని వాడికి తెలీదు పాపం.
వర్ణం పూర్తయింది. కమలాకర్ గారు పోడియం వద్దకు వచ్చి శ్రోతలందరూ ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని, అటూ ఇటూ తిరగొద్దని విజ్ఞప్తి చేశారు. మంత్రులు ముగ్గురూ లేచి తమకు ముఖ్యమంత్రి గారితో అత్యవసర సమావేశం ఉందని చెప్పి, అందరికీ నమస్కారం చేసి వెళ్ళిపోయారు. మరో రెండు అంశాలు బాగానే జరిగాయి. కమలాకర్ గారు వేదికపైకి వచ్చి, కళాకారులను ఆగమని చెప్పి ఇప్పుడు పదిహేను నిమిషాలు బ్రేక్ అని అనౌన్స్ చేశారు. అంతే విజయవాడలో గాత్రం, వయోలిన్, వైజాగ్‌లో మృదంగం, ఘటం కళాకారులు ఠక్కున మాయమైపోయారు. అంతా ఉలిక్కి పడ్డారు. బయట క్యాంటీన్లో చిరుతిళ్ళు అమ్ముడవ్వాలి కదా. అందుకే సభవారు ఈ బ్రేక్ ఏర్పాటు చేశారు. ఆ పాటి బిజినెస్ మైండ్ లేకపోతే సభలెలా నడుస్తాయి? ఇంతలో పవర్ బోర్డ్ దగ్గర కాపలా ఉన్న ఓ పదేళ్ల కుర్రాడు కచేరి అయిపోయిందనుకుని ఓ స్విచ్ ఆపేశాడు. ప్రొజెక్టర్లకు పవర్ పోయింది. పక్కనే ఉన్న టెక్నీషియన్ గద్దించాడు. బిక్కమొగం వేసుకుని వెంటనే మళ్ళీ స్విచ్ ఆన్ చేశాడు. చిరుతిళ్ళేమైనా దొరుకుతాయేమోనని బయటకెళ్ళాడు. మన మిత్రద్వయం కూడా స్టేజి దిగి క్యాంటీన్‌కి వెళ్లారు. మీడియా యాంకర్స్ బయటకొచ్చిన పెద్ద విద్వాంసులను, కళాకారులను కార్యక్రమంపై వాళ్ళ అభిప్రాయాలను, అనుభవాలను అడిగి లైవ్‌లో ప్రసారం చేశారు. ఎటు చూసినా ఇవే కబుర్లు. ఓ పది నిమిషాల్లో జనం మళ్ళీ లోపలికి చేరుకున్నారు. మిత్రులిద్దరూ మళ్ళీ స్టేజి మీద కూర్చున్నారు. కాసేపట్లో కచేరీ మొదలవుతుందని అనౌన్స్ చేశారు. ఈసారి ఎవరికీ పెద్దగా టెన్షన్ కలగలేదు. ఏం జరగబోతోందో వారికి తెలిసిపోయింది మరి.
"స్ట్రీమింగ్ ఆన్" అని అరిచాడు భాస్కర్. టెక్నీషియన్ మౌస్ క్లిక్ చేశాడు. అంతే! ఆనంద్ వెనక్కి తుళ్ళి పడ్డాడు. ప్రకాష్ చిన్నగా కేక పెట్టాడు. జనం అదిరి పడ్డారు. గాత్రం, వయోలిన్ ప్రొజెక్షన్స్ స్టేజికి మూడడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇంతలో పక్కనే వైజాగ్ ప్రేక్షకులు కూడా మూడడుగుల ఎత్తులో ప్రత్యక్షమయ్యారు. ప్రేక్షకులు అసంకల్పితంగా పక్కకి వంగారు. అంతా గందరగోళంగా ఉంది. భాస్కర్ ఒక్క అంగలో గ్రీన్ రూమ్‌లోకి దూకి 'కాట్' అని అరిచాడు. స్ట్రీమింగ్ ఆగిపోయింది. ఇదేదో జీన్స్ సినిమాలోలా ఉందనుకున్నారు జనం. ఓ ఐదు నిమిషాల తర్వాత భాస్కర్ పొడియం దగ్గరకు వచ్చి "సాంకేతిక లోపం వలన కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం" అని రేడియో స్టైల్లో క్షమాపణలు చెప్పాడు. ఈసారి ప్రొజెక్షన్ బాగానే జరిగింది. కచేరి టెంపో పెంచడానికి ఓ మధ్యమకాల కీర్తన మొదలు పెట్టింది మానస. రెండావృత్తాలు అయ్యాయి కానీ ఆనంద్‌కి మృదంగం మీద చెయ్యి పడట్లేదు. వెనక్కి తిరిగి భాస్కర్‌తో వీడియోలో టైం లేగ్ ఉందన్నాడు. మళ్లీ కచేరీ ఆగింది. జనాల్లో సంగీతం వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ తేడా అర్థమైంది. మిగిలిన వాళ్లకి కచేరీ ఎందుకు ఆగిపోయిందో అర్థం కాక దిక్కులు చూస్తున్నారు. ఈ టైం లాగ్ నాదనీరాజనంలో, ఒకప్పుడు దూరదర్శన్‌లో వచ్చేది. సంగీతం తెలిసినవాడు కాబట్టి భాస్కర్ వెంటనే సరి చేశాడు. ఒక్క నిమిషంలో కచేరీ మళ్లీ మొదలైంది. ఈసారి ఏ ఇబ్బందీ రాలేదు. ఇన్ని తేడాలు ఎందుకు వచ్చాయో అర్థం కాక కన్సోల్‌లు, మానిటర్లు చెక్ చేసాడు భాస్కర్. ఇందాక కుర్రాడు పవర్ ఆఫ్ చేసినప్పుడు సెట్టింగ్స్ మారిపోయాయని అర్థమైంది "ఎవడైనా పదేళ్ల కుర్రాడిని పవర్ బోర్డ్ దగ్గర పెడతాడా? చేసే పనిలో ప్రొఫెషనలిజం ఉండక్కర్లేదా" అని టెక్నీషియన్ల మీద విరుచుకుపడ్డాడు.
ఇక్కడ మన నలుగురు కళాకారులు కలిసి కీర్తన, స్వరకల్పన అదరగొట్టేసారు. కచేరీకి మళ్లీ మంచి ఊపొచ్చింది. తర్వాత శంకరాభరణంలో రాగం, తానం, ఖండజాతి త్రిపుట తాళం ఖండగతిలో పల్లవి. నలుగురూ కలిసి ఉతికి ఆరేశారు. తని ఆవర్తనం అద్భుతంగా సాగింది. ఇంట్లో లెక్క పెట్టుకున్న ముక్తాయిలన్నింటినీ ఒంపేశాడు ఆనంద్. మిత్రులిద్దరికీ మంచి అండర్‌స్టాండింగ్. ఇద్దరూ కలసి తగ్గింపులు, మొహరా, ముక్తాయి కుమ్మేశారు. హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది మానస, సాగర్ కూడా చప్పట్లు కొట్టి మెచ్చుకోలుగా చూశారు. షేక్ హ్యాండ్ ఇవ్వవోయ్ అన్నట్లు వెటకారంగా సౌంజ్జ చేశాడు ప్రకాష్. కొరికేసేటట్లు చూశాడు ఆనంద్. ఇంతలో కమలాకర్ గారు దూరం నుంచి ఒక వేలు చూపించారు. ఆయన ప్రొజెక్షన్‌లోకి రాడనీ, ఆ అమ్మాయికి తను కనబడననీ తట్టలేదాయనకి. అప్పుడు ఆనంద్ ఇంకొక్క అంశం మాత్రమే అన్నట్లు మానసకి సౌంజ్ఞ చేశాడు. నాజూగ్గా తల ఊపి తిల్లానా ఎత్తుకుంది. చివరగా మంగళంతో కచేరీ ముగిసింది. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు.
కమలాకర్ గారు పోడియం దగ్గరికి వచ్చి వందన సమర్పణ చేశారు. ఇది శాస్త్ర, సాంకేతిక, సంగీత చరిత్రలో ఒక మైలురాయి వంటిదనీ, భవిష్యత్తులో చాలా కచేరీలు ఇలాగే జరుగుతాయనీ అన్నారు. కొన్నాళ్ళకి ఇలాంటి త్రీడీ లైవ్ ప్రొజెక్షన్‌తో దేశంలోని అనేక ప్రాంతాలలోని కళాకారులతో, అనేక ఆడిటోరియంలలో ఒకేసారి కచేరీలు జరుగుతాయని కూడా అన్నారు. ఇప్పటికే మద్రాసు మ్యూజిక్ అకాడమీ మెయిన్ హాల్‌లో టికెట్లు అయిపోతే మినీ హాల్‌లో ఎల్ఈడి స్క్రీన్ మీద ప్రాజెక్ట్ చేస్తారనీ, అక్కడ కూడా టికెట్లు కొనుక్కుని చూస్తారని చెప్పారు. అద్భుతంగా కచేరీ చేసిన యువ కళాకారులనందరినీ పేరుపేరునా అభినందించారు. ఈ మెగా ఈవెంట్‌ని ఇంత విజయవంతంగా నిర్వహించిన భాస్కర్ కేవలం విజయవాడకే కాక రాష్ట్రానికి, దేశానికి కూడా గర్వకారణమన్నారు. ప్రత్యేకంగా స్టేజి మధ్యకు పిలిచి సన్మానం చేశారు. ఇవన్నీ వైజాగ్‌కి కూడా టెలికాస్ట్ అయ్యాయి. తర్వాత వైజాగ్‌లో వందన సమర్పణ ప్రసారమైంది. రెండు ఊళ్లల్లో ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య సభ ముగిసింది. రెండు ఊళ్లల్లో వర్చువల్ కళాకారులు, వర్చువల్ శ్రోతలు మాయమైపోయారు. అంతా భాస్కర్‌ని, కళాకారులను, కమలాకర్ గారిని చుట్టుముట్టి అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇంతలో ఓ పెద్దాయన వచ్చి “ఏమైనా సరే, ఎదురుగా ఉన్నది మనిషి కాదనీ, ప్రొజెక్షన్ మాత్రమే అని తెలిస్తే వాయించడానికీ, వినడానికీ మూడ్ రాదండీ. ఏదో టెక్నికల్ ఫీట్ అంతే. ఒకసారి చూడ్డానికి బాగుంది కానీ" అంటూ నసిగాడు. అంతే, భాస్కర్ అంతెత్తున లేచాడు. "చూడండి. మార్పుని స్వాగతించని వాడు, హర్షించని వాడు అభివృద్ధి నిరోధకుడు. ఒకప్పుడు మైక్ పెడితే నాదం కృతిమంగా ఉందని కొంతమంది ఒప్పుకోలేదు. ఇప్పుడు మైక్ లేని కచేరీని ఊహించలేము. రేడియోలో వచ్చేది ఒరిజినల్ వాయిస్ కాదు కదా కానీ సంగీతాన్ని రేడియో ప్రతి గడపకు తీసుకెళ్ళింది. టీవీ కూడా అంతే. ఎలక్ట్రానిక్ తంబురాలు వచ్చినప్పుడు కూడా కొందరు ఇలాగే పెదవి విరిచారు. ఈరోజు మాన్యువల్ తంబురా కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. స్ట్రింగ్ ఇన్స్‌ట్రుమెంట్స్‌కి పిక్ అప్ పెట్టినప్పుడు కూడా సౌండ్ మెటాలిక్‌గా ఉందన్నారు. మరి ఈరోజు పరిస్థితి చూడండి. మార్పుని ఒప్పుకోలేని వాడు వెనకబడి పోతాడు. ఒక వందేళ్ళ క్రితం మృదంగం అనుసరణ ఎలా ఉండేది? కేవలం సర్వలఘువు మాత్రమే వాయించేవారు. మరి ఈరోజు? ఒకప్పుడు ఆడవారికి మృదంగం సహకారం అందించే వారు కారు. మరి ఇప్పుడో? ఈరోజు కచేరీ చేసిన మన నలుగురు కళాకారుల పేర్లు ప్రపంచం అంతా మార్మోగి పోయాయి. వారి కచేరీకి ఎంత ప్రచారం వచ్చింది? సృష్టి నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది. మార్పుని ఒప్పుకోలేని వారికి, నిరాశావాదులకి ప్రపంచంలో అస్థిత్వం ఉండదు". “ఊరుకోవోయ్” అంటూ భుజం తట్టి భాస్కర్‌ని శాంతపరిచారు కమలాకర్ గారు. పెద్దాయన మొహం సత్తుకానీలాగా అయింది. చుట్టూ ఉన్న జనానికి కూడా మాట రాలేదు.
ఇంతలో మద్రాసు మ్యూజిక్ అకాడమీ సెక్రెటరీ గారి నుంచి కమలాకర్ గారికి ఫోన్ వచ్చింది. స్పీకర్ ఆన్ చేశారు కమలాకర్ గారు. ఈ ప్రయోగం చాలా అద్భుతంగా ఉందననీ, టెక్నికల్ టీమ్‌కి, కళాకారులకి తన అభినందనలు తెలియజేయమని చెప్పారు. ఈరోజు కచేరీ చేసిన కళాకారులందరికీ ఈ సంవత్సరం అకాడమీ సీజన్లో అవకాశం ఇస్తామని చెప్పారు. ఈ సంవత్సరం డిసెంబరులో జరిగే ఉత్సవాలలో భాస్కర్ గారి పర్యవేక్షణలో తాము కూడా మినీ హాల్‌లో త్రీడీ ప్రొజెక్షన్ చేస్తామనీ చెప్పారు. అక్కడున్న వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. పెద్దాయన మెల్లిగా చీకట్లోకి జారుకున్నాడు.
మెల్లిగా ఎక్కడి వాళ్ళక్కడ సర్దుకున్నారు. మన మిత్రులిద్దరూ కూడా బయటకు వచ్చి క్యాబ్ ఎక్కారు. ఇద్దరూ మొబైల్స్ ఆన్ చేశారు. ఒక్కొక్కరికీ దాదాపు రెండువందల దాకా వాట్సాప్ సందేశాలున్నాయి. ఇద్దరూ ఏవో లోకాల్లో ఉన్నారు. "ఇందాక టీవీలో ప్రోగ్రాం వాయించింది మీరిద్దరే కదా సార్. అదరగొట్టేసారండీ" అన్నాడు క్యాబ్ డ్రైవర్ ఉత్సాహంగా. ఈవెంట్‌కీ, తమకూ ఏ స్థాయిలో ప్రచారం వచ్చిందో అర్ధమైంది ఇద్దరికీ. “థ్యాంక్స్” అన్నారు. కాసేపయ్యాక "ఒరేయ్ రేప్పొద్దున్న మానసకి ఫోన్ చేసి మ్యూజిక్ అకాడమీలో ఏదైనా పల్లవి పాడుతుందేమో కనుక్కోరా" అన్నాడు ప్రకాష్. "ఒరేయ్ రేపు ఏ సినిమాకెళ్దామా అని నేనాలోచిస్తూ ఉంటే నీ పల్లవుల గోలేంట్రా?". అంటూ విసుక్కున్నాడు. ఆనంద్. మెల్లిగా క్యాబ్ ఇల్లు చేరింది.
Comments
Post a Comment