ఆదరణ కరువైతే.... – మొదటిభాగం (గానకళ - అక్టోబరు 2018 )
"ఏరా అప్పల్రాజూ, ఈ ఉత్సవాలలో నీకేం కచేరీలు లేవా?"
"ఇన్విటేషన్ చూసి కూడా అడుగుతావేం? నీకు మాత్రం ఉన్నాయా ఏవిఁటి? అందరూ చెన్నై కళాకారులేగా?"
"ఒరేయ్ ప్రతీదానికి చెన్నై మీద పడి ఏడవడం నీకు అలవాటయింది. ఇప్పుడు కచేరీ చేస్తున్న సీతారాణిది చెన్నైయేనా ఏవిఁటి?"
"సహకారాలు చెన్నైవేగా" అడ్డు తగిలాడు అప్పల్రాజు.
"ఒరేయ్ వయోలిన్, మృదంగం, ఘటం ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడు. నువ్వూ అలా వాయించు. ఉత్తినే ఏడవకు"
"సరే, సీతారాణి ఇంత బాగా పాడుతోంది కదా, మరి ఈ సభలో పదేళ్ల తర్వాత పాడుతోంది. ఇన్నాళ్లపాటు ఎందుకు పెట్టలేదు? ఈ మధ్యలో అరవ వాళ్ళు ఒక్కొక్కరూ రెండు మూడు సార్లు పాడేరు. ఈ సిరీస్‌లో కూడా ఇదొక్కటే తెలుగు వాళ్లది".
"ఒరేయ్ నువ్వు ఎన్నైనా చెప్పు. సంగీతానికి ప్రాంతీయ భేదాలంటగట్టకు. మిగిలిన వాళ్ళు బాగా పాడుతున్నారని పెట్టారు కానీ తమిళ వ్యామోహంతో కాదు కదా? సంకుచిత బుద్ధితో ఆలోచించకు. మన వాళ్ళని చెప్పి సరిగా పాడని వాళ్ళందరి కచేరీలు పెడుతూ కూర్చుంటే జనాలు ఎందుకు వస్తారు? సభలెలా నడుస్తాయి? జనాలకు రక్తి కావాలి కానీ ఎవరైతే వాళ్లకేం? వాళ్ళలా సాధకం చెయ్యి"
"ఏం జెప్పినా బాగా సాధన చెయ్యి, బాగా పాడు, బాగా వాయించు, కచేరీలవే వస్తాయంటావు. బాగా పాడాలంటే సాధన మాత్రమే చాలా? అనుభవం అక్కర్లేదా? అనుభవం రావాలంటే కచేరీలు చెయ్యాలి కదా. సాధన చెయ్యగలను కానీ కచేరీలు నేను పెట్టుకోలేను కదా. చెట్టు ముందా? విత్తు ముందా? అన్నట్లుంది ఆంధ్రదేశంలో పరిస్థితి. కచేరీలు చేస్తేనే కానీ అనుభవం, పాటలో రక్తి రావు, రక్తిగా పాడితేనే కానీ కచేరీలు రావు. ఇంట్లో గాత్రం, వయోలిన్, మృదంగం విద్యార్థులు కలసి ఎంత సాధన చేసినా కూడా స్టేజి మీద ప్రజల ముందు కచేరి చేసిన అనుభవం రాదు. ప్రదర్శనాభీతి పోవాలన్నా, మనోధర్మం అభివృద్ధి చెందాలన్నా, సమయస్ఫూర్తి అలవడాలన్నా, గాయకదోషాలు పోవాలన్నా విరివిగా కచేరీలు చెయ్యకతప్పదు. నువ్వే చెప్పు ఏం చెయ్యాలో?"
వీర్రాజు కొంచెం సంశయంలో పడ్డాడు. అప్పల్రాజు చెప్పుకుపోతున్నాడు. "అరవ దేశంలో పరిస్థితి వేరు. అక్కడ వందలకొద్దీ సభలు ఉన్నాయి. ప్రజల, ప్రభుత్వాల ఆదరణ ఉంది. చిన్న, పెద్ద అందరికీ ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట కచేరీి ఉంటుంది. అనుభవం వద్దన్నా వస్తుంది. సరే, అదలా ఉంచు. ఇక, బాగా పాడితే కచేరీలవే వస్తాయనే విషయానికొద్దాం. మరి, మన సీతారాణి ఇంత అద్భుతంగా పాడుతోంది కదా, మ్యూజిక్ అకాడమీలో అవార్డు కూడా వచ్చింది కదా, మరి ఆవిడ చెన్నైలో నెలకి ఎన్ని కచేరీలు చేస్తోంది? మనం వాళ్లని పిలిచినట్టు ఒక్కొక్క సభ వారూ కనీసం ఐదేళ్లకోసారి పిలిచినా నెలకో రెండు మూడు కచేరీలైనా చెయ్యాలి కదా. ఏం? ఎందుకు చెయ్యట్లేదు? నువ్వెన్నైనా చెప్పు. అరవ వాళ్లకి ఉన్న స్వాభిమానం మనకు లేదురా, మనకెప్పుడూ పక్కింటి పుల్ల కూరే రుచి"
వీర్రాజుకి చిఱ్ఱెత్తుకొచ్చింది. "ఏదో వింటున్నాను కదా అని గొప్పగా మాట్లాడుతున్నావనుకోకు. నువ్వు చెప్పిందే నిజమైతే ఆరుగురు తెలుగు విద్వాంసులకు మద్రాసు మ్యూజిక్ అకాడమీ వారు సంగీత కళానిధి బిరుదులెందుకు ఇచ్చేరు? మన దురదృష్టం కానీ ఇంకొన్నేళ్ళు బ్రతికుంటే మాండలిన్ శ్రీనివాస్‌కి కూడా ఇచ్చుండేవారు. వాళ్ళు సంగీతాన్ని గౌరవించేరు. తెలుగు, తమిళం అనే భేదం చూపించలేదు. నువ్వు నీ చేతకానితనానికి సాకులు వెతుక్కుంటున్నావు"
"ఒరేయ్ ఎక్సెప్షనల్ కేటగిరీకి చెందిన వారికి ప్రాంతాలు, దేశాలు, సముద్రాలు అడ్డం రావు. అందరూ బాలమేధావులవలేరు. నేను మాట్లాడుతున్నది వారి తర్వాతి స్థాయిలో ఉన్నవారి గురించి. ఇంకో ముఖ్యమైన విషయం. వారందరికీ చెన్నైలో పేరు సంపాదించిన తర్వాతే కళానిధి బిరుదులు వచ్చాయి. ఒక్క విషయం గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు. ఇప్పుడు చెన్నైలో మంచి ప్రచారంలో ఉన్న యువ విద్వాంసులతో సమానమైన టాలెంట్ గలవారు తెలుగు వారిలో లేరా? ఎన్ని జాతీయస్థాయి పోటీలలో వాళ్ల మీద మన వాళ్ళు ప్రైజులు గెలుచుకోలేదు? మరి అక్కడున్న వారికే పేరెందుకు వస్తోంది? అనుభవం రా అనుభవం. చెన్నైలో డిసెంబరు సీజన్లో వందకి పైగా సభలు ఒకేసారి కచేరీలనేర్పాటు చేస్తాయి. ప్రతి సభలో రోజంతా, అధమం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కచేరీలు జరుగుతాయి. ఆ నెల్లాళ్ళల్లో అందరు కళాకారులు, అన్ని సభలలో ఏదో ఒక సమయంలో కచేరీ చేస్తారు. ఒకే ఊళ్లో అన్ని కచేరీలలో అవే కృతులు, స్వరాలు, ముక్తాయిలు పాడితే జనాలొప్పుకోరు. కచేరీలో వెరైటీ చూపించడానికి సంవత్సరం పొడవునా సాధన చేస్తారు. మన సభలు సంవత్సరానికి ఒకసారి కూడా పిలవకపోతే ఇక సాధన ఎందుకు చెయ్యాలనిపిస్తుంది?"
"నీ ఆలోచనలో లోపం ఇప్పుడర్థం అయ్యిందిరా. కచేరీల కోసం సాధన చేసేవాడు ఎప్పటికీ నిజమైన కళాకారుడు కాలేడు. కచేరీ ఉన్నా, లేకపోయినా సంగీతాన్ని సంగీతం కోసమే సాధన చేసిననాడే నీకు పరిపక్వత వచ్చినట్లు. పేరు కోసం, డబ్బు కోసం సాధన చేస్తే అసలు నీ కచేరీలో భావం ఎక్కడినుంచి వస్తుంది? భావం, భక్తి లేని పాటలో రసం ఎక్కడుంటుంది? చెన్నై నుంచి వచ్చిన కళాకారులందరికీ ఇక్కడ వేలకి వేలు ఇవ్వట్లేదు. వారు కేవలం భక్తితో వచ్చి పాడి వెళ్తున్నారు. చాలా కొద్దిమంది గొప్ప విద్వాంసులు మాత్రమే ఎక్కువ డిమాండ్ చెయ్యగలుస్తున్నారు. ముందు నీ దృక్పథం మార్చుకో. పేరు, డబ్బు నిన్ను వెతుక్కుంటూ అవే వస్తాయి"
"ఒరేయ్ నువ్వేదో ఊహా జగత్తులో ఉన్నావు. కాస్త ప్రాక్టికల్‌గా ఆలోచించు. నీకీ రోజున తిండికి డబ్బు లేనప్పుడు 'నిధి చాల సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా' అని భావయుక్తంగా పాడగలవా? అందరూ త్యాగరాజస్వామిలా ఉండలేరు. ఉండుంటే ఇన్ని సభలూ, అవార్డులూ, వెబ్ సైట్లు, సీడీలూ వచ్చుండేవి కావు. కాలేజీ చదువు చదివిన వాళ్లకి ఏమీ తీసిపోకుండా మనం కూడా చదువును పక్కనబెట్టి దాదాపు పదిహేనేళ్ల పాటు గురుకుల పద్ధతిలో సంగీతం నేర్చుకున్నాం. పాఠం నేర్చుకోవడం, సాధన చెయ్యడం, కచేరీలు చెయ్యడం, వినడం, పాఠాలు చెప్పడం ఇలా మొత్తం కలిపి దాదాపు రోజుకు 10 గంటలు సంగీతంలోనే ఖర్చు పెడుతున్నాం. ఇంతే కష్టపడిన ఓ ఇంజనీర్ ఏసి రూమ్‌లో కంప్యూటర్ ముందు కూర్చుని నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు. మనకి కూడా ఆ పాటి సంపాదన ఉండాలనుకోవడం తప్పా? అసలు అందులో సగమైనా సంపాదించగలుగుతున్నావా? మన కళ్ళముందే సినిమాల్లో వాయించడానికి వెళ్లిపోయిన వాళ్ళు బంగాళాల్లో ఉంటూ, కార్లలో తిరుగుతున్నారు. నీ ఉద్దేశ్యం ప్రకారం శాస్త్రీయ సంగీతాన్ని నమ్ముకుని ఉండిపోయిన వాళ్లంతా ఐహిక సుఖాలని త్యాగం చెయ్యాలా?"
"ఒరేయ్, ఇంకా బాగా నేర్చుకుని, సాధన చేసే వయస్సులోనే నీకు సంపాదన, సుఖాల మీద ధ్యాస వెళ్లిపోయింది. తెలుగు విద్వాంసులెవరికీ సంపాదన, ఆస్తులు, కార్లు లేవా? చదువుకున్న ప్రతి వాడికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావట్లేదు. చాలామంది గుమాస్తా, బంట్రోతు ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్నారు. పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి బాగా సాధన చెయ్యి. రేడియోలో మంచి గ్రేడ్ సంపాదించి నాలుగు స్కైప్ పాఠాలు చెప్పావంటే డబ్బులు బాగానే సంపాదించొచ్చు"
"రేడియోలోనూ, సంగీత కళాశాలల్లోనూ, పాఠశాలల్లో పెర్మనెంట్ ఉద్యోగాలు లేనివాళ్లలో ఎంతమందికి ఇళ్లు, కార్లు ఉన్నాయో లెక్క పెట్టు. పిత్రార్జితమైన ఆస్తి ఉన్న వాళ్ళనీ, ఆస్తిపరులైన అత్తమామలు ఉన్న వాళ్ళని లెక్క పెట్టకు. మన ముందు తరం వరకు మంచి పేరు తెచ్చుకుని, రేడియోలో మంచి గ్రేడ్ సంపాదిస్తే ఎక్కడో ఒక చోట పర్మనెంట్ ఉద్యోగం వస్తుందనే ఆశ ఉండేది. ఇప్పుడు రేడియోలో ఉద్యోగాల్లేవు. సంగీత కళాశాలల్లో అరకొర జీతాలతో ఎన్నాళ్ళు ఉంటాయో తెలియని కాంట్రాక్ట్ ఉద్యోగాలే. ఇక కేంద్రీయ, నవోదయ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలంటావా, అక్కడ దేశభక్తి గీతాలు, లలిత సంగీతం చెప్పుకుంటూ మనకొచ్చిన శాస్త్రీయ సంగీతానికి నీళ్లొదిలేయాల్సిందే. ఈ విద్యతో జీవితంలో నిలదొక్కుకోగలవనే ధీమాని కలిగించలేకపోతే తర్వాతి తరంలో సంగీతం ఎవరు నేర్చుకుంటారు? తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎందుకు చెప్పిస్తారు? ఎంత విద్వత్తు ఉన్నా సరైన, నిలకడైన సంపాదన లేనివాడికి పిల్లనివ్వడానికి ఎవరు ముందుకొస్తారు? ఉద్యోగం లేనివాడికి పెన్షన్ ఉండదు. నీకు చెయ్యాడినంత కాలమే సంపాదన. ముసలితనంలో బతకడానికి కావలసిన డబ్బును కూడా వయస్సులో ఉండగానే సంపాదించుకోవాలి. గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు. ఏ పిల్లాడికైనా సంపాదన మీద భరోసా ఇచ్చి, ఈ వృత్తిలోకి రమ్మని నువ్వు చెప్పగలవా?
"ఇక నువ్వన్న రెండవ పాయింట్‌కొద్దాం. స్కైప్ లో పాఠాలు చెప్తే డబ్బులు బాగానే వస్తాయి, నిజమే. మంచి గురువుగా పేరు వస్తుంది కానీ అదొక్కటే సరిపోతుందా? నాలుగు చోట్ల కచేరీలు చెయ్యాలి, నలుగురు మెచ్చుకోవాలి అన్న నీ అభిలాష తీరుతుందా? నీ మెదడుకి పని పెట్టే శిష్యుడు దొరకాలంటే ముందు నీకు ఒక స్టేచర్ ఉండాలి. రోజంతా పాఠాలు చెప్తే నీకు సాధకానికి టైముంటుందా? ప్రతి తరానికి ఐక్యూ పెరిగిపోతోంది. కొత్త కొత్త టెక్నిక్స్ వచ్చేస్తున్నాయి. నువ్వు ఎంత గొప్ప కళాకారుడివైనా అప్ టు డేట్‌గా ఉండకపోతే రాణించలేవు. నిన్నెవరూ పిలవరు".
"మర్చిపోయాను. ఇందాక ఒక మాట అన్నావు చూడు. ఇక్కడకొచ్చి పాడిన అరవ వాళ్ళందరికీ విపరీతంగా డబ్బులు ఇవ్వట్లేదని. దాని గురించి కూడా చెప్తాను విను. చెన్నై నుంచి ఇక్కడ కచేరీ చెయ్యడానికి ఒక కళాకారుడు వస్తున్నాడనగానే ఖర్చులు కలిసొస్తాయని మనమే నాలుగు చోట్ల కచేరీలు పెట్టిస్తున్నాం. సహకారాలు మనమే వాయిస్తున్నాం. చిన్న వయస్సులో డబ్బు కంటే ఎంతో విలువైన అనుభవాన్ని మనం వాళ్లకిస్తున్నాం. నేను సహకారం వాయించిన వాళ్లందరూ నన్ను చాలా మెచ్చుకున్నారు. చెన్నై వెళ్ళగానే తప్పకుండా పిలుస్తామన్నారు. ఒక్కరు కూడా పిలవలేదు.అది వాళ్ళ తప్పని నేను అనట్లేదు. అనే ఉద్దేశ్యం, అధికారం రెండూ నాకు లేవు. అక్కడి కళాకారుల బాగోగులు చూసుకున్న తర్వాతే మనవాళ్ళకి అవకాశం ఇస్తారు. దాన్ని తప్పని అనలేం. మరి మనమో? చెన్నైలాంటి ఊళ్లో నాకూ ఓ నాలుగు కచేరీలు వస్తే నేను కూడా డబ్బులు అడగను. ఎందుకంటే అక్కడొచ్చే అనుభవం ముందు డబ్బేం గొప్పది కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు నా స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా రెండు మూడేళ్లలో చాకుల్లాగా తయారవుతున్నారు. నేనిలాగే ఉన్నాను. కారణం? అనుభవం రా అనుభవం"
"పోనీ ఓ పని చెయ్యి. డబ్బు కోసం సినిమాల్లో నెలకి ఒకట్రెండు కాల్షీట్లు ఒప్పుకో. అదేం నేరం కాదు. ఒకట్రెండు డాన్స్ ప్రోగ్రామ్లు వాయించు. అప్పుడప్పుడు విదేశాలకు వెళ్లొచ్చు. మిగిలిన సమయమంతా సాధన, కచేరీల కోసం ఖర్చు పెట్టు. డబ్బు, తృప్తి రెండూ వస్తాయి. సంగీతాన్ని మనస్ఫూర్తిగా నమ్ముకోవాలే గాని సుఖంగా బతకడానికి చాలా మార్గాలున్నాయి. నీకు విద్య పట్ల సరైన కమిట్మెంట్ లేదనిపిస్తోంది. పేరు, డబ్బు సంపాదించుకోవడానికి ఒక మార్గంగా మాత్రమే సంగీతాన్ని నువ్వు ఎంచుకున్నట్లనిపిస్తోంది. "
"ఒరేయ్ రెండు మాటలూ నువ్వే మాట్లాడుతున్నావ్. ఓ పక్క సంగీతం మీద కమిట్మెంట్ ఉండాలంటూనే మరోపక్క సినిమాల్లో, డాన్స్‌లకూ వాయించ మంటావు. నువ్వన్నట్లు అవేం నేరాలు కావు. అవి వాయించేవాళ్ళు తక్కువా కాదు. నిజానికి సినిమాల్లో వాయించే వాళ్లకి చాలా సుస్వరం, లయ జ్ఞానం ఉండాలి. కానీ నా కమిట్మెంట్ శాస్త్రీయ సంగీతంపట్లనే కానీ వేరే వాటి పట్ల కాదు. ఒకసారి రుచి మరిగితే ఇక ఒకట్రెండు కాల్ షీట్లతో ఆగలేవు. కొన్నాళ్ళకి అదే జీవితం అయిపోతుంది. శాస్త్రీయ సంగీతంలోనూ, సినిమాల్లోనూ రెండింటిలో సమానంగా నెగ్గుకొచ్చిన వాళ్లను వేళ్ళ మీద లెక్కెట్టొచ్చు"
"సరే ఈ వాదన తెగేటట్టు లేదు. నా అభిప్రాయాన్ని నువ్వు ఒప్పుకోవు. నీ వాదనని నేనొప్పుకోను. ఈ చర్చ తెగేలా లేదు. చివరగా ఒక విషయం చెప్పు. తెలుగు రాష్ట్రాలలో నువ్వు చెప్పిన పరిస్థితులను ఇప్పటికిప్పుడు మార్చలేం. నువ్వేమో సంగీతమే జీవితం అంటున్నావు. ఇలా పరిస్థితులను తిట్టుకుంటూ కాలం గడిపెయ్యడమేనా? దీంట్లోంచి బయట పడడానికి ఏమైనా పరిష్కారం ఆలోచించావా?"
"నేనే ఓ రెండు రోజులు ఆగి చెబుదామనుకున్నాను. ఈలోగా ఈ సంవాదం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఇక ఇక్కడుండి నా సంగీతాన్ని అభివృద్ధి చేసుకోలేననిపిస్తోంది. చెన్నై వెళిపోదాం అనుకుంటున్నాను. జన్మనిచ్చి, విద్యనేర్పి, ఈ స్థాయికి తీసుకొచ్చిన నేలను వదిలి వెళ్లడానికి చాలా కష్టంగా ఉంది కానీ నా జీవిత లక్ష్యం నెరవేరాలంటే తప్పదురా" బాధగా అన్నాడు అప్పలరాజు.
వీర్రాజు హతాశుడయ్యాడు. రెండు నిమిషాలు నిశ్శబ్దం రాజ్యమేలింది. అత్యంత ఆప్తమిత్రుడు తనని వదలి వెళ్తున్నాడనే బాధ కన్నా ఆంధ్ర దేశం నుండి మరొక తెలివైన కళాకారుడు చెన్నైకి వలస వెళ్ళిపోతున్నాడనే - కాదు - వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చిందనే బాధ ఎక్కువ కలిగింది వీర్రాజుకి. కాసేపటికి గొంతు పెగుల్చుకుని అడిగాడు. "అక్కడికి వెళ్ళాక నీకు మంచి కచేరీలు, పేరు వస్తాయనే గ్యారంటీ ఏమిటి? ఇక్కడ ఉన్న కచేరీలను వదులుకొని, అక్కడ నిలదొక్కుకోలేక రెంటికి చెడతావేమో అని భయంగా ఉంది" అని కొంచెం వెనక్కి లాగే ప్రయత్నం చేశాడు.
"ఆ పాటి ఆలోచించకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటానని ఎలా అనుకున్నావు? చాలాకాలం మధనపడి ఈ నిర్ణయానికొచ్చాను. నేనో పెద్ద మేధావినని, అద్భుతంగా వాయిస్తానని అనుకోవట్లేదు. కానీ బాగానే వాయిస్తానని, కొంచెం కష్టపడితే గొప్పవాడిని అవగలననే నమ్మకం ఉంది. ఇంతవరకు తెలుగు విద్వాంసులుగానీ, దక్షిణాదికి చెందినవారుగానీ నన్ను సహకారంగా వద్దని ఎప్పుడూ అనలేదు. రెండో విషయం. చెన్నై ఒక పుష్పకవిమానం లాంటిది. ఎంతమంది వెళ్ళినా ఇంకొకరికి చోటుంటుంది. వెళ్ళీ వెళ్ళగానే మంచి కచేరీలు వస్తాయన్న గ్యారెంటీ ఏమీ లేదు. నన్ను అక్కడికి వచ్చెయ్యమని ప్రోత్సహించిన తమిళ విద్వాంసులలో ఒక్కరైనా ఆదరించకపోరు. నలుగురినీ పరిచయం చేసుకుంటే ఏవో చిన్న చిన్న కచేరీలు రాకమానవు. క్రమంగా నిలదొక్కు పోవాలంటే అక్కడి వారి కన్నా బాగా వాయించాలి. కాబట్టి సాధన చేయాల్సిన అవసరం పడుతుంది. ప్రజలకి నీమీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. డిమాండ్, మార్కెట్ ఉన్న చోట సప్లై పెరుగుతుంది. ఇక బధ్ధకించే అవకాశం ఉండదు. బాగా వాయించిన కొద్దీ నీలో ఉత్సాహం పెరుగుతుంది. చెరువులో పడితే ఈత అదే వస్తుంది. అక్కడ నుంచి ఆంధ్రా వచ్చే యువ కళాకారులు ఓ పది కృతులను సహకారాలతో సహా బాగా సాధన చేసి తడ నుంచి ఇచ్చాపురం దాకా అవే కృతులతో అద్భుతమైన ప్రదర్శనలిస్తారు. కానీ చెన్నైలో అలా కుదరదు. ప్రతి కచేరీకి వెరైటీ, కొత్తదనం చూపించాలి. అక్కడే ఉంటే వాళ్ల పోకడలు, శైలి బాగా అర్థం అవుతాయి. అందుకనే ఇక్కడే ఉండిన దాని కన్నా అక్కడ ఉంటే బాగా వాయించగలం. ఆంధ్రా వచ్చి మనని పిలుస్తాం అనేవాళ్లకి మనం దగ్గరగా ఉంటాం. డబ్బుపరంగా కూడా అందుబాటులో ఉంటాం".
"తమిళ కళాకారులు తక్కువ పారితోషికానికే కచేరీలు చేస్తారన్నావు కదా. నిజమే, కానీ అక్కడ అందరికీ దాదాపు ప్రతీరోజూ కచేరీ ఉంటుంది. ప్రతీ కళాకారునికీ వారి స్థాయిని బట్టి కచేరీలు వుంటాయి. డబ్బుపరంగా నేను పెద్దగా నష్టపోయేది ఏమీ ఉండదు. తమిళులు సంగీతాన్ని కళగా మాత్రమే కాకుండా ఒక వృత్తిగా, జీవనోపాధికి ఒక మార్గంగా కూడా అభివృద్ధి చేశారు. సంగీతానికి మార్కెట్‌ను సృష్టించారు. మనం నేటికీ కళగానే చూస్తున్నాం. ఇక మూడవది, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే జీవితంలో పైకి రావాలన్నా, మన లక్ష్యాన్ని సాధించాలన్నా ఎంతో కొంత రిస్క్ తీసుకోక తప్పదు. దానికి సిద్ధపడే, భగవంతుని మీద నమ్మకం ఉంచి వెళ్తున్నాను"
అప్పల్రాజు స్థిరమైన నిర్ణయానికి వచ్చేసేడనీ, ఇక తనేం చెప్పినా వినడనీ అర్థమైంది వీర్రాజుకి. "ఆంధ్రాకి మంచి పేరు తెస్తారనుకునే నీలాంటి యువ కళాకారులందరూ చెన్నై వెళ్లిపోతే ఎప్పటికీ ఆంధ్రదేశం ఇలాగే ఉండిపోవాల్సిందేనా? దీనికి పరిష్కారం లేదా?" ఒకింత బాధగా అడిగాడు వీర్రాజు.
"ఇక్కడ సంగీతం అభివృద్ధి చెంది, సంగీతాన్ని వృత్తిగా చేసుకోగలమనే ధీమా విద్యార్థులలో కలగాలంటే ఏం చేయాలో నాకు కొన్ని ఆలోచనలున్నాయి. కానీ నా ఆలోచనలు అందరికీ నచ్చుతాయని చెప్పలేను. అందరినీ ఒప్పించడానికి నా వయస్సు, అనుభవం సరిపోవు. మార్పు ఒక్కసారిగా రాదు కానీ ప్రయత్నం మొదలు పెట్టాలి కదా"
ఇంతలో స్పీకర్ లోంచి 'తానం తానం' అని వినిపించింది. కబుర్లు చెప్తున్నారే కానీ ఇద్దరి సబ్‌కాన్షస్ మైండ్ సంగీతం వైపే ఉంది. "ఒరేయ్ నా ఆలోచనలు రేపు చెప్తాను కానీ సీతారాణి పల్లవులు బాగా పాడుతుంది. చెన్నై కళాకారులు దీనికెలా వాయిస్తారో, వాళ్ల మనో ధర్మం, లెక్కలు, ముక్తాయిలు ఎలా ఉంటాయో విందాం రా" మిత్రులిద్దరూ చేయి చేయి కలుపుకుని ఆడిటోరియంలో ప్రవేశించారు.
రచన: కొమ్మాజోశ్యుల సద్గురు చరణ్,
నిలయ మృదంగ విద్వాంసులు,
Comments
Post a Comment