గురువుగారితో నా అనుభవాలూ జ్ఞాపకాలు


ముందుమాట : ఒకటిన్నర సంవత్సరాల క్రితం 'సద్గురువులతో నా అనుభవాలు' అనే వ్యాసంలో శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు గారి గురుత్వ లక్షణాల గురించి, అసంఖ్యకంగా శిష్యులను తయారు చెయ్యడానికి వారెంత శ్రమించిందీ, వారి వ్యక్తిత్వ విశేషాలను, విశాఖపట్నంలో సంగీత వాతావరణాన్ని ఇనుమడింపజేయడానికి వారెంత కష్టపడిందీ సంక్షిప్తంగా తెలియజేశాను. అయితే ఈ విషయాలను మరింత లోతుగా పరిశీలిస్తే తప్ప సద్గురువుగా వారి విజయాలకు కారణాలను పూర్తిగా అవగాహన చేసుకోవడం కష్టం. ఒక అద్భుతమైన గురుకుల వాతావరణాన్ని నెలకొల్పడానికి అహర్నిశలూ వారెంత శ్రమించారో, వ్యక్తిగత సుఖాలనెన్నిటిని త్యాగంచేశారో నేటి తరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. నాకు ఊహ తెలిసిన దగ్గర్నించి 15 సంవత్సరాలకు పైనే వారితో ప్రత్యక్ష అనుభవం, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నిలయవిద్వాంసునిగా స్థిరపడిన తర్వాత కూడా 20 సంవత్సరాలకు పైనే వారితో అనుబంధం కొనసాగింది. నేను వారినుంచి ప్రత్యక్షంగా నేర్చుకున్న విషయాలను ప్రస్తుత తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారితో నా అనుభవాలను, వారి వద్ద నుండి నేర్చుకున్న విషయాలను సంగ్రహంగా వ్రాయాలంటే అది ఒక పెద్ద గ్రంధమౌతుంది. గతంలో చెప్పిన విషయాలను కొన్నింటిని మళ్ళీ చెప్పాల్సి రావచ్చు. పునరుక్తి దోషాన్ని మన్నించగలరు.


విజయేశ్వరరావు గారనగానే సంగీత ప్రపంచంలో ‘చాలా గొప్ప సద్దురువులండీ’ అని స్థిరపడి పోయింది. అయితే ఇది అర్ధసత్యం మాత్రమే. వారు అగ్రశ్రేణి వయోలిన్‌ విద్వాంసులు, గాయకులు కూడా. వారు ఆకాశవాణిలో “బిహై'గ్రేడు గాత్ర విద్వాంసులని చాలామందికి తేలీదు. వారు స్వయంగా గాత్రజ్ఞులు కాబట్టే అనేకమంది గాత్ర విద్వాంసులను తయారు చెయ్యగలిగారు. ఈ క్రమంలో విద్వాంసునిగా తన జీవితాన్ని చాలా వరకు పక్కన పెట్టారు. వారి విధ్వత్తును విశ్లేషించే దుస్సాహసం, అపరాధం చెయ్యదల్పుకోలేదు. అయితే వారి విద్వత్తును గురించి పెద్దలు చెప్పినవి, నా జ్ఞానానికి అర్ధమైన విశేషాలను కొన్నింటిని తెలియజేసే ప్రయత్నం చేస్తాను.


శిష్యులందరం వారిని “మేష్టారు” అనే, అమ్మగారిని: “అత్తయ్యగారు” అనే పిలుస్తాం. ఇకపైన అలానే సంబోధిస్తాను.మేష్టారు ఆకాశవాణి కాలికట్‌ కేంద్రంలో నిలయవిద్వాంసులుగా పనిచేసే రోజుల్లో ఒకసారి ప్రముఖ గాత్ర విద్వాంసులు శ్రీ చెంబై వైద్యనాధ భాగవతార్‌ గారికి వయోలిన్‌ సహకారం వాయించే అవకాశం వచ్చింది. చెంబైగారి గానంలోని ప్రత్యేకతలలో ఒకటైన 4వ కాల స్వరకల్పన చేసి, మేష్టారికి కూడా అవకాశం ఇచ్చారు. తాను ఎంతో సాధన చేసి వశపరుచుకున్న కమాను విన్యాసాలతో. అద్భుతంగా 4వ కాల స్వరకల్పన చేశారు మేష్టారు. కచేరీ అయ్యాక కార్యదర్శి వందన సమర్పణ చేస్తూ చెంబై గారినెంతో ప్రశంసించి, వయోలిన్‌ గురించి చెప్పబోతూ ఉండగా చెంబైగారు కలుగజేసుకుని ఈ అబ్బాయి గురించి నేను చెప్తాను, నువ్వాగు అని, ఇలా అన్నారట.


“వయోలిన్‌పై ఎంతో కష్టసాధ్యమైన 4వ కాల స్వరకల్పనను ఎంతో అవలీలగా, అద్భుతంగా వాయించాడితడు. నాతో ఎప్పుడూ వయోలిన్‌ వాయించే విద్వాంసుడు అనారోగ్యం కారణంగా ఈరోజు

రాలేక పోయాడు. అతను వచ్చి ఉంటే ఇలా వాయించగలిగేవాడూ కాదు, కచేరీ ఇంత అద్భుతంగా జరిగి ఉండేదీ కాదు. ఇతని పరమగురువులైన ద్వారం వెంకటస్వామినాయుడుగారు, గురువుగారైన ద్వారం నరసింగరావునాయుడు గారు నాకు సహకారం అందించారు. ఇప్పుడు మూడవ తరంవాడు ఇతను కూడా సహకారం అందించాడు. ఇతని శిష్యులు కూడా ఎవరైనా నాకు సహకారం అందిస్తారేమో”


ఒక యువకళాకారునికి ఇంతకంటే గొప్ప గుర్తింపు, ఆశీర్వచనం ఇంకా ఏముంటాయి? ఎన్ని అవార్డులు, రివార్డులు, సన్మానాలు, బిరుదులూ దీనికి సాటివస్తాయి.? కచేరీ అయిపోయాక మేష్టారు చెంబైగారితో “మా గురువుగారు బతికుంటే ఈ క్షణం ఎంత సంతోషించేవారో” ఇంకా మాట పూర్తవకముందే చెంబైగారు కోపంగా “మీగురువుగారు. లేరని ఎవరన్నారు? వారు అంతా చూస్తూనే ఉన్నారు. ఏరోజైతే నువ్వు ఆయనను మర్పిపోతావో ఆరోజు నిజంగా ఆయన చనిపోయినట్టు” అన్నారట. గురుభక్తి అంటే ఎలా ఉండాలో చెంబై గారెంత చక్కగా చెప్పారో? చెంబైగారే మరో సందర్భంలో ఎవరో గాత్రజ్ఞునికి మేష్టారు అందించిన సహకారం విని “నువ్వు వయోలిన్‌ సహకారం అందిస్తే ఎంత శృతికలవని వాడైనా శృతిలో కలసిపోతాడు” అన్నారట. వారి ప్రశంసకు ఏ డిగ్రీలు, గ్రేడింగులూ సరితూగుతాయి? నరసింగరావు గారి శైలి ఇంచుమించుగా విజయేశ్వరరావుగారి వద్దనే కనబడుతుందని చాలామంది విద్వాంసులు అభిప్రాయపడుతుంటారు. 


ఇక, మేష్టారి సాధన గురించి కొన్ని విశేషాలను తెలియజేస్తాను. వారు చిన్నతనంనుంచే, పెద్దయ్యాక

కూడా చాలా సంవత్సరాల పాటు ఉదయాన్నే 4 గంటలకు లేచి 1000 సార్లు త్రిస్థాయి, స్ప్రింగ్ బౌవంటి అనేక రకాల కమాను విన్యాసాలను సాధన చేసేవారు. నాదం చాలా తక్కువ వచ్చే మ్యూట్‌

(mute) వైలెన్‌పై ఈ రకమైన సాధనంతా చేసేవారు. సాయంత్రం 4గంటల నుండి రెండు-రెండున్నర గంటల పాటు విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. తర్వాత 2 గంటలకు తక్కువ కాకుండా కచేరీ పద్ధతిలో సాధన చేసేవారు. సీనియర్‌ వయోలిన్‌, వీణ విద్యార్థులు వారికి సహకారం అందించేవారు. ఎవరో ఒకరు తంబురా, తాళం వేసేవారు. విశేషం ఏమిటంటే ఎంతోమంది మృదంగ విద్యార్థులు కూడా వారితో పాటు సాధన చేసేవారు - రచయితతో పాటు సర్వశ్రీ వంకాయల వెంకటరమణ మూర్తి, జి. వెంకట్రావు, మంగళగిరి శ్రీధర్‌ వంటివారు వారి విద్యార్ధి దశలో కొన్ని సంవత్సరాల పాటు వీలున్నప్పుడల్లా వారితో సాధన చేసేవారు.



సంగీతం గదిలో మేష్టారి నిత్యసాధన దృశ్యం 


(ఎడమ నుండి) మృదంగం : శ్రీ నేమాని సోమయాజులు,

వీణ: శ్రీమతి కె.ఉదయలక్ష్మి (రచయిత తల్లిగారు),


వయోలిన్‌ : శ్రీ విజయేశ్వరరావు గారు,

తంబూరా : కె. సద్గురు చరణ్‌,


వయోలిన్‌ : శ్రీమతి మంగళంపల్లి అన్నహర్హ, శ్రీమతి వేదవతీ గణేష్‌,

తాళం : శ్రీమతి కె.సరస్వతీ విద్యార్థి (ఒడిలో బాల మేధాని కె.లహరి),


వయోలిన్‌ వెనుక శ్రీమతి ఇవటూరి సూర్యకాంతం(అత్తయ్యగారు)


నా విషయాని కొస్తే వారు నాతో పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. శృతి చేసుకోవడం సరిగా వచ్చేది కాదు, ఎడమ ఎప్పుడూ హెచ్చిపోతూనే ఉండేది. అయినా ఎప్పుడూ విసుక్కోలేదు. ఒకసారి ఆయనే శృతిచేసిచ్చారు కూడా. ఎప్పుడైనా కృతి మధ్యలో ఆపి ఈ నడక బాగులేదు. 1960లో రేడియోలో శమ్మంగుడి గారు ఈ కృతి పాడితే మణి అయ్యర్‌గారు ఇలా వాయించేరనో లేదా ఫలానా కచేరీలో జి ఎన్‌.బి.గారు ఈ కృతి పాడతే పళనిగారు ఇలా వాయించేరనో ఫలానా సందర్భంలో నాయుడు గారీకృతి వాయిస్తే కోలంక వెంకట్రాజు గారెలా వాయించారో లేదా ఫలానా అప్పుడు దండమూడిగారో, రామభద్రన్‌గారో ఇలా వాయించేరని చెప్పి నాచేత వాయింపించేవారు. నాకర్థం కాకపోతే వాయించి చూపించేవారు. గాత్ర విద్యార్థులచేత పాడించి, పాటకెలా వాయించాలో, వాద్యానికెలా వాయించాలో తాను విన్న కచేరీలను, వాటిల్లో మృదంగ విద్వాంసుల వాయిద్యాలను గుర్తు తెచ్చుకుని మరీ చెప్పేవారు. ప్రతీరోజూ ఏదో ఒక కృతిలో తని వాయింపించేవారు. ఇప్పుడు ఆలోచిస్తే నాకనిపిస్తూ ఉంటుంది - అసలు మృదంగ విద్యార్దులను చేరదీయాల్సిన అవసరం వారికేంటి? శృతిలోలేని కుడిని, హెచ్చిపోయే ఎడమను, వచ్చీరాని నడకలను, ముక్తాయిలను భరించాల్సిన అగత్యం వారికేమిటి? వారికేమైనా జీతమిచ్చానా? ఎక్కడ కచేరీ వాయించినా నా గురువులు శ్రీ నేమాని సోమయాజులు గారు, శ్రీ వంకాయల నరసింహంగారు అనే తప్ప సహకరంలోని మెళకువలు కొన్ని విజయేశ్వర రావుగారు చెప్పేరని నేనెక్కడా చెప్పుకోవట్లేదని కూడా వారికి తెలుసు. మా అమ్మగారి తరం నుంచి, మా అమ్మాయి వరకు 3 తరాల వారికి పైసా పుచ్చుకోకుండా పాఠం చెప్పినందుకు 'వారికొరిగిందేవిటి? 


శ్రీ నేదునూరి కృష్ణమూర్తిగారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గౌరవ ఆచార్యునిగా నియమితులైన తర్వాత శిష్యులందరినీ పిలిచి “మన ఊరికొక మహావిద్వాంసుడొచ్చారు. ఎవరైనా వారి వద్ద శిక్షణ పొందుదామనుకుంటే నిస్సంకోచంగా వెళ్ళొచ్చు, నేనేమీ అనుకోను” అని చెప్పిన విశాల హృదయం వారిది. వారి ఉద్దేశ్యం పదిమంది సంగీతం నేర్చుకోవాలి, వృద్ధిలోకి రావాలి, వారు తన శిష్యుడా,కాదా అన్నది ముఖ్యం కాదు.


శిష్యులనెంత ముద్దుగా చూసేవారో అది అనుభవించిన వారికే తెలుస్తుంది. కానీ నాణేనికి మరోవైపు కూడా తెలుసుకోవాలి. పొరపాటును క్షమించేవారు కానీ, తప్పులను, నిర్లక్ష్యాన్ని క్రమశిక్షణారాహిత్యాన్ని ఎంత మాత్రం సహించేవారు కారు. తాను చెప్పినట్టు సాధన చెయ్యకపోయినా, తన మాటను తేలికగా తీసుకున్నా ఎంత సీనియర్‌ శిష్యులనైనా ఉపేక్షించేవారు కారు. ముందుగా హెచ్చరించినా ఒకసారి శృతిలోలేని మృదంగాన్ని తీసుకుని, మరొకసారి ఆలస్యంగానూ వెళ్ళాను. రెండుసార్లు నిర్దాక్షణ్యంగా బయటకు గెంటేశారు. అప్పుడు బాగా ఏడవడం నాతో పాటుచాలామందికి గుర్తుంది. నాన్నకి కోపం వస్తే అమ్మ ముద్దు చేసినట్టుగా అలాటప్పుడు అత్తయ్యగారు చేరదీసి ఓదార్చేవారు. బుద్ది చెప్పువాడు గుద్దిననేమయా' అని వేమన చెప్పినట్టు వారేం చేసినా శిష్యులకు వారియెడల భక్తి గౌరవాలు ఎప్పుడూ తగ్గలేదు. మేష్టారి దగ్గర శిష్యునిగా నిలదొక్కుకోవడం చాలా కష్టం. నిలదొక్కుకున్నవాడు విద్వాంసుడవక పోవడం అంతకన్నా కష్టం.


ఇక సంగీతం గది గురించి “ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాన్ని “'సంగీతాలయం' అంటే సార్ధకంగా ఉంటుంది. కేవలం సాధన కోసం, పాఠాల కోసం, చిన్నచిన్న కచేరీల కోసం సొంత ఖర్చుతో తన ఇంటిని అనుకుని ఒక పెద్ద హాలుని కట్టించారు మేష్టారు. దీన్ని సంగీతం గది అని పిలిచేవాళ్ళం. అక్కడ ప్రతీనెలా మొదటి ఆదివారం సంగీత కచేరీలు జరిగేవి. అరగంట లేదా యాభై నిమిషాల చిన్న కచెరీ, 2 గంటల పెద్ద కచేరీ జరిగేవి. చిన్న విద్యార్థులకు ప్రదర్శనా భీతి పోవడానికి, పెద్ద విద్వాంసుల కచేరీలను విని నేర్చుకోవడానికి ఈ వేదిక ఎంతగానో దోహదపడింది. 25 సంవత్సరాలకు పైనే నిర్విఘ్నంగా జరిగిన ఈ కచేరీలలో ఎవరూ పారితోషికం పుచ్చుకోలేదు. రేడియోకో లేదా ఏదైనా స్వంత పనిమీదో ఊళ్ళోకెవరైనా పెద్ద విద్వాంసులొస్తే తమ ఇంట్లో కాసేపు పాడమని అడిగేవారు మేష్టారు. ఎందరో లబ్ధప్రతిష్టులైన విద్వాంసులు మేష్టారిమీద గౌరవంతో వచ్చి పాడేవారు. ఉదయం కచేరీ ఏర్పాటైతే ఎవ్వరికీ ఫోన్‌లు లేకపోయినా,నోటి మాట ద్వారా ఊరంతా తెలిసేది. సాయంత్రం కల్లా 70-100 మంది శోతలు వచ్చి చేరేవారు. విద్యాంనుని స్థాయికి తగినట్టు అప్పటి కప్పుడు సహకారాలు ఏర్పాటైపోయేవి. సర్వశ్రీ ఓలేటి వెరికటేశ్వర్లు, మారెళ్ళ కేశవరావు, ఎమ్‌.ఎస్‌. బాలసుబ్రహ్మణ్యశర్మ, కోటిపల్లి ప్రకాశరావు, ద్వారం ధుర్గాప్రసాదరావు, వాసా పద్మనాభం, మంచాల జగన్నాధరావు, ఎన్‌.సి. హెచ్‌. కృష్ణమాచార్యులు, ఎన్‌.సి.వి.జగన్నాధాచార్యులు, వి.కమలాకరరావు వంటి ఎందరో మహా విద్వాంసులు అక్కడ కచేరీలు చేశారు. ఆ చిన్న హాల్‌లో శ్రీ అమ్ముల విశ్వనాధ భాగవతార్‌ గారు హరికథ చెప్పడం ఒక మరపురాని ఘట్టం. టిక్కెట్లు కొనుక్కుని వెళ్ళే కచేరీల స్థాయికి ఏ మాత్రం తీసిపోయేవి కావు అక్కడి కచేరీలు. ప్రతీ కచేరీలో రాగం-తానం-పల్లవి ప్రధానాంశంగా ఉండేది. శ్రీ కోటిపల్లి ప్రకాశరావుగారు గానం చేసిన షట్కాల పల్లవి విద్యార్థులనెంతగానో ఉత్తేజ పరిచింది. మధ్యమకాలాన్ని ప్రధానంగా తీసుకుని దానికి దిగువ, పైన కలిపి ఆరుకాలాలు గానం చేశారు. తర్వాత కాలంలో మేష్టారు ఎత్తుకున్న కాలం నుంచి 6 కాలాలు పాడేటట్లుగా మిశ్రజాతి త్రిపుట తాళంలో 'పదములెనమ్మితి నీ’ అనే షట్కాల పల్లవిని తయారుచేసి తన శిష్యురాళ్షైన శ్రీమతి మండాసుధారాణి, శ్రీమతి పంతుల రమ గార్లచే పాడించారు. ఎంతోమంది మహా విద్వాంసుల పరిచయ భాగ్యం నాకక్కడ కలిగింది. ఒకసారి మార్దంగికాగ్రేసరులైన శ్రీ కోలంక వేంకట రాజు గారిని తమ ఇంటికి ఆహ్వానించి క్రమంగా కనుమరుగౌతున్న బుగత గోపన్న గారి తోధిమి శబ్దాలను పాడించి రికార్డు చేశారు.


మేష్టారి దగ్గర కొన్ని వందల టేపులతో పెద్ద లైబ్రరీ ఉంది. వాటన్నటినీ పద్ధతిగా అమర్చి ఒక కేటలాగ్‌ (catalogue)ను తయారు చేశారు. శిష్యులకేదైనా కృతి చెప్పగానే, ఎవరైనా మహావిద్వాంసులు పాడిన ఆకృతి రికార్డింగ్‌ ఇచ్చి, అందులో మనోధర్మం ఎలా చేశారో మొదలైన విషయాలను గమనించమనేవారు. గాత్రం, వయోలిన్‌ మొదలైన వాటినెలా వినేవారో మృదంగాన్ని కూడా అంతే శ్రద్ధగా వినేవారు. ఎన్నో సంగీత గ్రంధాలను కూడా సేకరించారాయన.


మేష్టారికి రికార్డింగ్‌, ఎడిటింగ్‌, డబ్బింగ్‌ అంటే చాలా ఆసక్తి త్యాగరాజ విరచిత 'నౌకాచరిత్రం’, ‘ప్రహ్లాదభక్త విజయం” గేయనాటకాలను సంగీతం గదిలో శిష్యుల చేత పాడించి, ఎఫెక్ట్స్ కూడా రికార్డ్‌ చేసి, రెండింటినీ డబ్బింగ్‌ చేసి అద్భుతంగా రూపొందించారు. త్యాగరాజ విరచిత ఉత్సవ సాంప్రదాయ, దివ్యనామకీర్తనలను, ముత్తుస్వామి దీక్షితర్‌ విరచిత నవావర్డ, నవగ్రహ కృతులను శిష్యుల చేత పాడించి, సహకార వాద్యాలతో పాటుగా రికార్డు చేసి భద్రపరిచారు. పుస్తకం చూసి పాడడానికి ఒప్పుకునే వారు కారు. తాను చూడలేక పోయినా శిష్యులు చూసి పాడుతుంటే ఇట్టే పట్టేసేవారు.


అన్నింటికంటే ముఖ్యంగా మేష్టారి ఆత్మస్థైర్యం, గుండెనిబ్బరం గురించి చెప్పుకోవాలి. 14 ఏళ్ళ పిన్న వయస్సులో తండ్రిగారు పరమపదించడంతో పెద్దకొడుకుగా కుటుంబ బాధ్యతలను తానే మొయ్యాల్సి వచ్చింది. తాను ఇంటింటికీ వెళ్ళి, పాఠాలు చెప్పి వచ్చిన డబ్బుతోనే ఇద్దరు తమ్ముళ్ళు, చెల్లి యొక్క చదువు, వివాహం మొదలైన బాధ్యతలన్నింటినీ నెరవేర్చారు. తన గురువుగారి పేరిట విజయనగరంలోని కొత్త ఆగ్రహారంలో ద్వారం నరసింగరావు మెమోరియల్‌ పాఠశాలను స్థాపించి ఎందరికో విద్యాదానం చేశారు.


ఆరోజుల్లోనే ప్రసిద్ధ సినీ నేపధ్యగాయని పి.సుళీలగారి తండ్రిగారు మేష్టారిని మద్రాసు వచ్చి సినీరంగంలో స్థిరపడి చేతినిండా డబ్బు సంపాదించుకోమని, కేవలం శాప్రీయ సంగీతాన్ని నమ్ముకుంటే పొట్ట గడవదనీ బలవంతపెట్టారు. అంత కష్టకాలంలో కూడా మేష్టారు వారి ఆహ్వానాన్ని తిరస్కరించి శాస్త్రీయ సంగీతాన్నే నమ్ముకుని ఉండిపోయారు. మేష్టారికి 25 సంవత్సరాల చిన్న వయస్సులోనే మధుమేహం వచ్చింది. ఆరోగ్యం పట్ల ఎంతో (శ్రద్ధ తీసుకుని 50

నంవత్సరాల పాటు దానిని అదువులో ఉంచుకున్నారు. నడివయస్సులో కొన్ని సంవత్సరాల పాటు ఆయాసంతో బాధపడ్డారు. అమాంతం మనిషిని కుదిపేసేంత ఆయాసం, ఎటువంటి సంకేతం లేకుండా వచ్చేది. వైద్యులెవ్వరూ కారణం చెప్పలేకపోయారు. దీనితో ఎన్నో కచేరీలను వదులు కోవలసి వచ్చింది. తర్వాత కొన్నాళ్ళకి గుండె పోటు వచ్చింది. అయితే దేన్నీ లెక్క చెయ్యలేదు. అంగవైకల్యాన్ని, అనారోగ్యాన్ని సాకులుగా చూపించి తన బాధ్యతల నుంచి, లక్ష్యాల నుంచి ఎప్పుడూ దూరంగా తప్పుకోలేదు. ఎవరైనా తనను సద్ద్గురువుగా గుర్తించి సత్కరిస్తానంటే ససేమిరా అనేవారు. బుద్ధికుశలత, కష్టపడే తత్వం, యోగం ఉన్నవాళ్ళు ఎక్కడైనా విద్వాంసులౌతారని, వారికి తానే చెప్పక్మర్లేదని, నిజంగా తాను సద్గురువే అయ్యుంటే తాను పాఠం చెప్పిన కొన్ని వందల మంది విద్యార్థులందరూ విద్వాంసులయ్యుండాలి కదా అనేవారు. ఒకసారి తీవ్ర అనారోగ్యంతో మూడు రోజులు అత్యవసర చికిత్స విభాగంలో ఉండి ఇంటికి తిరిగి రాగానే వారికి వయోలిన్‌ వాయించగలనా? లేదా? అని సంశయం వచ్చి వయోలిన్‌ తీసి వాయించుకుని చూసుకున్నారు. పూర్తిగా మంచాన పడేంతవరకు ప్రతీరోజు సాధన, బోధన మానలేదు. కళ యొక్క పరమార్ధం కళమాత్రమే అన్న ఆర్యోక్తికి మేష్టారి జీవితం అద్భుతమైన ఉదాహరణ. తన అభిప్రాయాలను కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పడం, అవతలి వ్యక్తిని సంతోష పెట్టడానికి మనసులో ఒకలా, పైకి మరొకలా మాట్లాడే అలవాటు లేకపోవడం వారినైజం. అందువలన ప్రధమ పరిచయంలో మేష్టారిని చూసి కొంతమంది భయపడేవారు. కానీ, శ్రోతల్లో మేష్టారు కూర్చుంటే వేదికపై ఉండేవారికి ఎంతో ఉత్సాహంగా ఉందేది.


అసలు నేను మృదంగం నేర్చుకోవడానికి కారణం మేష్టారే. నేను వారి దగ్గర 5వ ఏట గాత్రం మొదలు పెట్టిన కొన్నాళ్ళకి నాకు మృదంగంపై అభిరుచి ఎక్కువ ఉండడం గమనించి నాకు మృదంగం నేర్చించమన్నారు. అయితే గాత్రం ఎట్టి పరిస్థితులలోనూ మానవద్దనీ, మృదంగం బాగా వాయించాలంటే గాత్ర జ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందనీ చెప్పారు. నేను ఇంజనీరింగ్‌లో చేరిన తర్వాత గాత్రానికి సమయాన్ని కేటాయించలేక పోతున్నానని చెప్తే 'సాధన చెయ్యకపోయినా పర్వాలేదు కనీసం కృతులు నేర్చుకో’ అని చెప్పారు. ఉత్సవ సాంప్రదాయ కృతులు, దివ్యనామ కృతులు నాచేత కూడా సాధన, కంఠస్థం చేయించి వారు చేసిన రికార్డింగ్‌ లో కంచుతాళం వేస్తూ పాడే అవకాశం ఇచ్చారు. మేష్టారి స్ఫూర్తితోనే నేను ఇంజనీరింగ్‌ వదిలేసి సంగీతాన్నే వృత్తిగా ఎంచుకున్నాను. మేష్టారు శిష్యుల దగ్గర నుంచి సంగీతాన్నే తప్ప దేనినీ ప్రతిఫలంగా ఆశించలేదు. వారి బుణం ఎలాగో ఒకలాగ తీర్చుకోవాలని వండగలకీ, పబ్బాలకి బట్టలు తీనుకొస్తే నిర్దాక్షిణ్యంగా తిరస్కరించేవారు. పెళ్ళి లేదా ఏదైనా గొప్ప అవార్డు రావడమో వంటి బలమైన కారణాలుంటే తప్ప ఏమీ తీసుకునేవారు కారు. సంవత్సరాదినాడు శిష్యులందరూ ఏవో పళ్ళు తీసుకుని వచ్చేవారు. అత్తయ్యగారు అక్కడే ముక్కలు చేసి శిష్యులందరికీ పంచేవారు. ఎప్పుడైనా శిష్యుల ప్రదర్శన వారినమితంగా ఆనందపరిస్తే తానే బహుమానాలు ఇచ్చేవారు. శ్రీమతి మండా సుధారాణిగారు మొదటిసారి షట్మాల పల్లవిని అద్భుతంగా గానం చేసినపుడు తాను ఎంతో ముచ్చటపడి చేయించుకున్న బొబ్బిలి తంబురాను ఆవిడకు బహుమానంగా ఇచ్చేశారు. ఒకవారం తర్వాత నేను కూడా ఆ పల్లవి ఆశు (స్వరబద్ధంగా కాక పొడి సాహిత్యాక్షరాలు) ఆరుకాలాలు అని చూపించేను. సాయంత్రం సుధారాణిగారి చేత ఆపల్లవి పాడించి, నా చేత మృదంగం వాయింపించి, ఆ మృదంగాన్ని తన బహుమతిగా ఉంచుకోమని దాని ఖరీదును నాకిచ్చేరు. ఒకసారి మా అమ్మగారైన శ్రీమతి కె. ఉదయలక్ష్మి గారికి తన పిచ్‌పైప్‌ను, మరొకసారి శ్రీమతి పంతులరమగారికి తన వయోలిన్‌ను బహుమానంగా ఇచ్చేరు. అయితే ఈ అన్ని సందర్భాలలోనూ తాను ఈ బహుమతులను తన సంతోషం కోసం ఇచ్చేను తప్ప దీన్ని నలుగురిలో చెప్పుకోవద్దనీ, బయోడేటాలలో రాసుకోవద్దనీ ఖచ్చితంగా చెప్పారు. అదీ వారి వ్యక్తిత్వం. వారు జీవించి ఉన్నంతకాలం వారి మాటకు కట్టుబడి ఈ విషయాలను ఎక్కడా చెప్పుకోలేకపోయాం. ఇంతటి ఉదాత్త హృదయం కల మహాను భావుడు మన మధ్య జీవించేరని ప్రస్తుత తరం తెలుసుకుని తీరాలని ఇప్పుడు చెప్తున్నాను. వారు శిష్యులకు కేవలం విద్య మాత్రమే కాక, విలువలను కూడా సోదాహరణంగా నేర్పారు. వారు ఒక వ్యక్తికాదు, ఒక వ్యవస్థ. వారి శిష్యరిక భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతం.


ఎవరైనా మహాత్ముని వారు జీవించి ఉన్నప్పుడు కన్నావారు పరమపదించిన తర్వాత వారి గుణగణాలను, వ్యక్తిత్వ విశేషాలను, వారు సమాజానికెంత సేవ చేసిందీ, సభలు, సమావేశాలు చేసి, వ్యాసాలు రాసి తలుచుకోవడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. విజయేశ్వరరావుగారి వంటి మహానుభావులు నేడు కూడా మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. వారిని గుర్తించి, వారి జీవిత కాలంలోనే వారిని సేవించి, వారి నుండి విద్యను సంగ్రహించాలి. గురువుగారిని తన వినయవిధేయతలతో, క్రమశిక్షణతో, నిబద్ధతతో, సాధనతో మెప్పించి, వారి మనసు గెలుచుకుని, శిష్యునికి బోధించాలనే ఉత్సాహాన్ని వారిలో కలిగించడం ఒక గొప్ప కళ. అది శిష్యుని బాధ్యత కూడా.


2013లో శిష్యప్రశిష్యులు, అభిమానులు కలసి విశాఖపట్నంలో వారినెంతో ఘనంగా సన్మానించారు. ఆ సందర్భంలో విజయేశ్వరరావుగారి భౌతిక, సంగీత జీవితాల ఆధారంగా వారి శిష్యులు, అభిమానులు కలసి ఒక అద్భుతమైన డాక్యుమెంటరీని తయారుచేసి ప్రదర్శించారు. దీనిని యూట్యూబ్‌లో 'నాదవిజయం’ అని టైప్‌ చేసి వీక్షించగలరు. వారు రికార్డు చేసిన గేయనాటకాలు, ఉత్సవ సాంప్రదాయ, నవావర్ణ,  నవగ్రహ కృతులన్నింటినీ వారి శిష్యులు సిడిల రూపంలో భద్రపరిచారు.


కె. నద్గురు చరణ్‌, 

నిలయ మృదంగ విద్వాంనులు, 

ఆకాశవాణి విజయవాడ. 

సెల్‌ : 9440709994



Comments