మార్దంగికుడవ్వాలంటే సాధన మాత్రమే సరిపోతుందా? (ఒకటవ భాగం)
నా మాట : ఇందులో రాసినవన్నీ పూర్తిగా నా స్వంత అభిప్రాయాలు. నా 34 సంవత్సరాల విద్యార్థి జీవితంలో, 31 సంవత్సరాల కచేరీ అనుభవంతో, 20 సంవత్సరాల ఉద్యోగపర్వంలో తెలుసుకున్న కొన్ని విషయాలను, ఎదుర్శొన్నఅవరోధాలను, వాటినధిగమించడానికి చేసిన ప్రయత్నాలను మీతో పంచుకునే ప్రయత్నం చేయదలిచాను. నాకంటే వయస్సులో, అనుభవంలో, జ్ఞానంలో ఎంతో పెద్దవారుండగా నేను వ్యాసం రాయడమేంటని చాలాకాలం సంకోచించాను. కానీ “చిన్న వారైనా, పెద్దవారైనా తన అలోచనలను, అభిప్రాయాలను, అనుభవసారాన్ని కాగితం మీద పెట్టాల్సిందే. ఇది చెయ్యక పోవడం వలననే చాలామంది ఆంధ్రప్రదేశ మహావిద్వాంసుల ప్రతిభ తర్వాతి తరాలకు చేరాల్సినంతగా చేరలేదు. తమిళదేశస్థులు తమ సంస్వృతీ సాంప్రదాయాలను తర్వాతి తరానికి అందిస్తున్నట్లుగా మనం చెయ్యలేకపోవడానికి కారణం ఇదే” అని 'నంగీత కళానిధి’, 'పద్మభూషణ్’ కీ.శే డాll శ్రీపాద పినాకపాణిగారు నాతో అన్నమాటలు గుర్తుకు వచ్చి తిరిగి రాయడం మొదలుపెట్టాను.
“నాలుగు తాళాలూ, వాటిల్లో నాలుగేసి నడకలూ, పాఠాలు, మొహరా, ముక్తాయి వస్తే చాలు, కచేరీ చేసెయ్యొచ్చు. పెద్దగా సాధన లేకపోయినా సర్వలఘువు వాయించి కచేరీ అయ్యిందనిపించవచ్చు.
ఏది ఏమైనా మృదంగం వాయించడం చాలా సుళువు” అని చిన్నతనంలో నా గాత్రమిత్రులు సరదాగా అంటూ ఉండేవారు.
మార్దంగికుని కష్టం ఇంతేనా? ఖచ్చితంగా కాదు. మార్దంగికుడనిపించుకోవాలంటే ఇంటి దగ్గర సాధన చేసి, వేదికపై వాయించడం మాత్రమే కాదు. సాధన, ప్రదర్శన కాకుండా ఇంకా వేరే కష్టాలు, అవరోధాలు ఏమిటి? మొదలైన విషయాలను నాకు తెలిసినంతలో వివరించే ప్రయత్నం చేస్తాను.
మృదంగంపై “త,ధి, తోం, నం” వాయించడం కన్నా ముందు కాలిపై దాని బరువును మొయ్యడం విద్యార్థికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాళ్ళు తిమ్మిర్లెక్కుతాయి. అయితే సాధనతో ఈనొప్పి అలవాటై తగ్గిపోతుంది. వాదనలో మునిగిపోతే అసలు నొప్పి గుర్తుకురాదు.
గాత్ర విద్యార్థులు నాలుగేసి వర్జాలు, కృతులు, అన్నమయ్య, రామదాసు, కృతులు నేర్చుకోగానే చిన్న చిన్న కచేరీలు చేసినట్లే నాలుగు తాళాల్లో నాలుగేసి నడకలు, ముక్తాయిలు, మొహరాలు రాగానే మృదంగ విద్యార్థులు కూడా వారితో పాటే వేదికనెక్కుతారు. ఈ స్థాయి వరకు చాలామంది విద్యార్థులు నేర్చుకుంటారు. మృదంగం వాయించడానికి బుద్ధిబలం, సాధనతో పాటు కండబలం కూడా కావాలి. చాలా కొద్దిమంది ఆడవారు మాత్రమే మృదంగ విద్యనభ్యసించేరు. మగపిల్లలు స్కూల్ ఫైనల్‌కి వచ్చేటప్పటికి కార్పొరేట్ కాలేజీల మాయలోపడి ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో చేరుతున్నారు. రోజుకు పన్నెండు గంటలకు తక్కువ కాకుండా పిల్లల్ని రుద్దే ఈ కళాశాలల్లో జ్ఞానం కంటే మార్ములకే ఎక్కువ ప్రాధానిత్యనిస్తున్నారు. అయినా ఈ విషయాలపై పిల్లల్ని తప్పుబట్టడం కూడా తప్పు. ఆంధ్రప్రదేశ్‌లో సంగీతంతో జీవనభృతి సంపాదించుకోవడం చాలా కష్టమవడం కూడా దీనికొక కారణం. కష్టపడి చెప్పిన గురువుల శ్రమంతా వ్యర్ధమవుతుంది. ఎలాగో ఒకలా ఇంటర్మీడియెట్ అయ్యేంతవరకు మృదంగాన్ని వదలకుండా ఉంటారు కొంతమంది. అయితే జీవితానికి సరియైన దిశానిర్దేశం చేసుకుని. ఖచ్చితమైన లక్ష్యాన్ని గమ్యాన్ని ఏర్పర్చుకోవాల్సిన ఈ తరుణంలో మూడొంతులు మంది మృదంగాన్ని వదిలేస్తారు. ఈ సంధి అవస్థలో కూడా విద్యను నమ్ముకుని ఉండడానికి చాలా మనోధైర్యం కావాలి. అయితే ఈ క్రమంలో మరొక ప్రమాదం పొంచి ఉంటుంది. అప్పటికే కచేరీలు చేస్తూ ఎంతో కొంత సంపాదిస్తూ ఉన్న కొంతమంది డబ్బు అవసరం చేతనో లేదా దానిపై వ్యామోహంతోనో సులభంగా, త్వరితంగా ఆదాయాన్నిచ్చే అవకాశాలను వెదుక్కుంటారు. క్రమంగా జ్జానసముపార్దనపై దృష్టి తగ్గుతుంది. ఈ సమయంలో కూడా విద్య, జ్ఞానం కోసమై పరితపించేవాడే చివరకు మంచి విద్వాంసునిగా తయారవుతాడు. ఉద్యోగం పురుష లక్షణం. ఉద్యోగం లేకపోయినా వేలకువేలు సంపాదించే విద్వాంసుని కన్నా, పెన్షన్ సదుపాయం ఉండి, నెల తిరిగేటప్పటికి నికరంగా ఎంతో కొంత ఆదాయం వచ్చే చిరుప్రభుత్వోద్యోగికే పిల్లనివ్వడానికి సిద్ధపడతాడు ఆడపిల్ల తండ్రి. ఆడపిల్లకు చక్కగా సంగీతం వచ్చి, ఉద్యోగం లేకపోయినా ఎవరో ఒకరు ముచ్చటవడి పెళ్ళి చేసుకుంటారు. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే ఒక విద్యార్ధి మంచి మార్దంగికునిగా తయారవడానికి దైవం కూడాకలసిరావాలి. ఈ మొత్తం పరిణామానికి తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, భరోసా చాలా అవసరం.
ఇక సాంకేతిక పరమైన అంశాలకొద్దాం.
సాధారణంగా ఏవైనా ఉపకరణాలు కానీ, వాద్యాలు కానీ పాడైపోతే బాగుచేయించు కుంటాం. కానీ మృదంగాలు అలా కావు. ఏదైనా మృదంగంతో సంవత్సరం మొత్తం ఒక్క కచేరీ కూడా వాయించకపోయినా కనీసం సంవత్సరానికి రెండుసారైైనా కుడి,ఎడమ మూతల్ని గుల్ల నుంచి ఊడదీసి, మళ్ళీ ఎక్కించాలి. మేక, ఆవు, గేదె చర్మాలతో కుడి, ఎడమ మూతలను, వాటిని గుల్లకు రెండువైపులా గట్టిగా పట్టి ఉంచే వారుని తయారుచేస్తారు. సాధారణంగా వర్షాకాలంలో తేమను పీల్చుకుని చెక్కతో చేసే మృదంగం గుల్లలు కంటికి కనిపించని పరిమాణంలో ఉబ్బుతాయి. అప్పుడు మూతలు బిగుసుకుపోయి పగిలిపోతాయి. అందుకని వర్షాకాలం రాగానే ముందు జాగ్రత్తగా మూతలను, వారును గుల్లనుంచి వేరు చేసి గుల్లకి రెండు వైపులా ఆముదం రాసి మళ్ళీ ఎక్కించాలి. అంతే కాకుండా మధ్యలో మళ్ళీ తుఫాన్లు వచ్చి నాలుగైదు రోజులు మునురువడితే మళ్ళీ మూతలను ఊడదీయాల్సిందే. మూతలు పగిలే ముందు లేదా వారు తెగే ముందు మనకు సూచన ప్రాయంగా గుర్తులు కూడా తెలీవు. ఒకసారి మంచి వర్షాకాలంలో తిరువనంతపురంలో “నంగీత కళానిధి” శ్రీ ఆర్.కె. శ్రీకంఠన్ గారితో కచేరీ వాయిస్తూ ఉండగా కృతిమధ్యలో టప్‌మని శబ్దంతో వారు తెగింది. కుడి మూతయొక్క 16కళ్ళల్లో రెండు మాత్రమే శృతి కలిసాయి. చాటు వేస్తే అపన్వరం వినబడుతుంది. మిగిలిన కచేరీ అంతాకేవలం మీటు, నాదంతోనే వాయించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక, కచేరీలు వాయించగా, వాయించగా కొన్నాళ్ళకు మృదంగాల మూతల్లో, వార్లలో సహజంగానే పటుత్వం తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ మూతలు కుట్టించాల్సిందే, కొత్తవారు వెయ్యాల్సిందే. కుడి మూతకు మధ్య భాగంలో ఉండే, చక్కటి నాదం రావడానికి ప్రధానమైన నల్లటి కరిణ కూడా కొన్నాళ్ళకి ఊడిపోతుంది.. కరిణలో చాలా చిన్న భాగం కదిలినా మొత్తం కరిణ వేయించాల్సిందే. కరిణవేసి, అది ఆరి, సరిచేసుకుని వాయించడానికి 4రోజులైనా పడుతుంది.
అయితే. ఇక్కడ రెండు ముఖ్యమైన అవరోధాలున్నాయి. మొదటిది మృదంగాన్ని తయారు చేయడానికి చాలా నేర్పు, ఓర్పు, సంవత్సరాల తరబడి అనుభవం, మంచి భుజబలం కావాలి. ఈ పని చేసేవారి చేతులు క్రమంగా రాటుదేలుతాయి. అందుకని మృదంగం వాయించేవారు తమ పనిని తాము చేసుకోలేరు. మృదంగం వాయించేవారు, పనిచేసేవారు ఎప్పుడూ వేరుగానే ఉంటారు. మృదంగం వాయించేవారికి దక్కే గౌరవంలో కొంత భాగం తెరవెనుక నుండే పనివారి వలననే దక్కుతుంది. కానీ వేదికపై వారిని తలచుకోవడం సాధారణంగా జరగదు. మృదంగం పని చేసేవారిని కూడా కళాకారునిగానే గౌరవించాలి. ప్రముఖ మృదంగ విద్వాంసులు క్రీ.శే. ‘సంగీత కళానిధి’ పాల్‌ఘాట్ శ్రీ టి.యస్ మణి అయ్యర్ గారు తాను ఎక్కడ కచేరీకి వెళ్లినా తనతో పాటు పనివాడిని కూడా తీసుకెళ్లేవారు. ఫెర్నాండెజ్ అనే ఆ పనివానినెంతో ఆదరించి, మద్రానులో ఒక ఇల్లు కూడా సమకూర్చారు. పనివారికే పనినేర్చిన, సొంతంగా మృదంగం తయారు చేయగల శ్రీ కోలంక వెంకట్రాజు, శ్రీ దండమూడి రామ్మోహనరావు గార్లవంటి మహావిద్వాంసులు చాలా అరుదుగా ఉంటారు. తెలుగు రాష్ట్రాలలో కచేరీల స్థాయిలో మృదంగాలు చేయగల పనివారు విజయనగరం, విజయవాడ, హైదరాబాద్ నగరాలలో మాత్రమే. ఉన్నారు. వర్షాలు పడినన్నాళ్లూ వారికి పనిచెయ్యడానికి కుదరదు. యువత తక్కువ శ్రమతో ఎక్కువ సంపాదించగలిగే అవకాశాలను వెదుక్కుంటున్న నేటి తరుణంలో రానురాను మృదంగం పనివారు కూడా తగ్గిపోతున్నారు.
రెండవది చర్మాల లభ్యత, వాటి నాణ్యత. అన్ని మేకల, ఆవుల, గేదెల చర్మాలూ మూతలకు, వార్లకు పనికిరావు. కొవ్వులేని, అవసరమైన, సమానమైన మందంగల చర్మాల నెంచుకోవడానికి చాలా నేర్పు, అనుభవం కావాలి. ఒక్కో మూతను కుట్టి, ఎండబెట్టి, తిరిగి గుల్లకు ఎక్కించి, కరిణవేసి లేదా జోడింపు చర్మాన్ని కుట్టి బిగించడానికి కనీసం వారంరోజులు పడుతుంది. ఎంత నేర్పుగా చర్మాన్ని ఎంచి, ఎంత [శ్రమకోర్చి మూత కుట్టినా, మొత్తం పని అయ్యాకా కానీ ఆ మూతలోంచి మంచినాదం వస్తుందో, రాదో తెలియదు. ఎంత కష్టపడినా అదృష్టం కలసిరాకపోతే మారుమాటాడకుండా ఆ మూతను తీసెయ్యాల్సిందే. పని పూర్తయ్యాక దాన్ని శృతిశుద్ధంగా ఉండేటట్టు, చాటు మీటు సరిపోయేటట్టు, నిండైన నాదం వచ్చేటట్టు చేసుకోవడానికి మార్దంగికునికి చాలా నేర్పు, అనుభవం కావాలి. ఎవరి చేతికి వీలుగా ఉండేటట్టు వారే సరిచేసుకోవాలి. పనివారు తగ్గిపోవడం వలన, వారికి పని ఒత్తిడి ఎక్కువవడం, సరియైన చర్మాలు దొరక్కపోవడం వంటి కారణాల వలన చాలా సార్లు నెలల తరబడి మృదంగాలు పనివారివద్దే ఉండిపోతాయి. అందుకని తరచుగా అవసరమయ్యే శృతులకు 2,3 మృదంగాలనుంచుకోవాలి. చక్కగా ఆరిన, చేవగల పనసకర్ర గుల్లలు, వాటికి మంచి నాదం వచ్చే మూతలమరడానికి అదృష్టం కూడా కలసిరావాలి. మార్దంగికుడు సాధనకెంత కష్టపడతాడో, అంతే కష్టం వాద్యాన్ని చక్కగా తయారు చేయించుకోవడానికి కూడా పడాల్సి ఉంటుంది.
ఒక్కోసారి ఆఖరి నిమిషంలో గాత్ర విద్వాంసునికి గొంతు పట్టడం వంటి అనివార్యమైన ఇబ్బందులు వచ్చి అమాంతం ఓ అరశృతి తగ్గిద్దామంటారు. కచేరీ రక్తికి సంబంధించిన విషయం కాబట్టి బలవంతంగా శృతి తగ్గిస్తాం. ఒక శృతికి పక్కాగా సిద్ధం చేసుకున్న మృదంగాన్ని అమాంతం అరశ్చతి తగ్గిస్తే చాటు, మీటు కలవక చిన్న అపస్వరం వినిపిస్తుంది. వాయించడానికి ఇబ్బందిగా ఉంటుంది. కచేరీలో అస్తమానం రాయితో కొట్టి శృతి చేస్తూ ఉంటే కచేరీ వాతావరణం, రక్తి దెబ్బ, తింటాయి. ఒక సాధారణ శ్రోతకీ కష్టాలన్నీ అనవసరం. అతనికి తెలిసినవి రెండే. బాగుంటే చప్పట్లు కొట్టడం లేదా నిర్మొహమాటంగా లేచివెళ్ళిపోవడం.
సాధారణంగా గాత్రం, వయోలిన్, వీణ, వేణువు వంటివి సాధన చేసేటప్పటికన్నా మృదంగం, డోలు వంటి లయవాద్యాలు సాధన చేసేటప్పుడు వచ్చే ధ్వని చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు స్వరాలు, సాహిత్యం వంటివి వినబడకపోవడం వలన నంగీతం రానివారికి, ఇవ్టం లేనివారికి చాలా చికాకుగా అనిపిస్తుంది. ఒకోసారి అభ్యంతరం తెలియజేస్తూ ఉంటారు. కీlశేl దండమూడి రామ్మోహనరావు గారిపై చుట్టు పక్కల ఇళ్లవాళ్లు న్యూసెన్స్ కేస్‌లు పెట్టడం కూడా జరిగింది. నేను విజయవాడ ఆకాశవాణిలో చేరిన కొత్తలో మా ఇంటి యజమానికి గుండె జబ్బని, రోజుకు అన్నేసి గంటలు సాధన చేస్తే కుదరదని వారం తిరక్కుండా ఇల్లు ఖాళ్లీ చేయించారు. సాధనకు సహకరించి, ప్రోత్సహించి, ఆనందించే ఇల్లాలు దొరకడానికి కూడా అదృష్టం కలసిరావాలి. కచేరీలకెళ్లేటప్పుడు మృదంగాలను, పెట్టెను బస్ స్టాండ్లలో మోసుకెళ్ళడం, ఇరుకు బస్సుల్లోకి ఎక్కించడం, రైల్వేస్టేషన్లలో వంతెనలెక్కి దిగడం మొదలైన వాటికి కచేరీ వాయించడానికయ్యేదాని కంటే ఎక్కువ శ్రమ పడాలి. రెండు వేర్వేరు శృతులు గల కచేరీలు వాయించాలంటే రెండు వేర్వేరు మృదంగాలు మోసుకెళ్ళాలి. రెండు మృదంగాలంటే దాదాపు 20కేజీల బరువుంటాయి. రెండు మృదంగాలు, పెట్టె పట్టుకుని రైల్వేస్టేషన్‌లో, బయట నడుచుకుని వెళ్తే ఆ శ్రమ యొక్క ప్రభావం ఆ రోజు కచేరీలో ఖచ్చితంగా తెలుస్తుంది లేదా ఒక కూలీకి ఇచ్చి మోయిస్తే వాడు మోస్తున్నంతసేపూ దేనికి గుద్దిస్తాడో అని ప్రాణాలరచేత పట్టుకుని ఉండాలి. దీపావళికి టపాకాయలు కాల్చి పాతిక సంవత్సరాలకు పైనే అయ్యింటుంది. ఎందుకంటే చేతులకేమైనా గాయాలైతే మొదటకే మోసం వస్తుంది. అయితే “ఇన్ని కష్టాలుంటాయని తెలిసినప్పుడు గాత్రమో లేదా మరొక వాద్యమో నేర్చుకోవచ్చు కదా” అని అడగొచ్చు. మృదంగం వాయించాలనే తీవ్రమైన కోరిక, కచేరీ వాయించాక కలిగే తృప్తి ఈ శ్రమను మర్చిపోయేటట్లు చేస్తాయి. వచ్చే ధనంకన్నా శ్రోతల చప్పట్లే కళాకారునికి ఇంధనం. శ్రోతల మెప్పు, చప్పట్లనేవి కళాకారునికొక వ్యసనం. కళాకారుని బలం, బలహీనతా రెండూ శ్రోతల కరతాళధథ్వనులే. అయితే వీటికన్నా సంగీతం, సాధన వ్యసనమైన వాడే నిజమైన కళాకారుడు. “ఒక్కరోజు తాగకపోతే ఒక తాగుబోతు ఎలా విలవిలలాడిపోతాడో అలాగే ఒక్కరోజు సాధన చేయకపోయినా ఏదో పోగొట్టుకున్నట్లుండేవాడే మంచి విద్వాంసుడు కాగలడని ప్రసిద్ధ వయోలిన్ విద్వాంసులు, సద్గురువు శ్రీ అన్నవరపు రామస్వామిగారు అంటూ ఉంటారు. కొన్ని నెలలపాటు కచేరీలు లేకపోయినా ఉదయాన్నే లేచి త్రిస్థాయి సాధన చేసేవారు కీ॥శే॥ శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు గారు. అనారోగ్య కారణాలతో ఇంట్లోంచి బయటకు రావడమే మానేసినా కూడా రోజూ సాయంత్రం రెండు గంటల పాటు సాధన చేసేవారాయన.
“మృదంగ కళాకారునికి ఇతర సహకారవాద్య కళాకారులకన్నా ఇతర ఖర్చులు చాలా ఎక్కువ అందుకని మిగిలిన వారికన్నా వారికి కచేరీకొక్క వందరూపాయలైనా ఎక్కువ ఇవ్వాలి.” అని ప్రముఖ గాత విద్వాంనులు, సభానిర్వావాకులు శ్రీతాడేపల్లి లోకనాధ శర్మగారు, ప్రముఖ మృదంగ విద్వాంసులు కీ॥శే॥ దండమూడి రామ్మోహనరావుగారు నాతో చాలాసార్లు అన్నారు. రాయడానికి వీలైన అవరోధాల్లో ఇవి కొన్ని మాత్రమే. నిజంగా మృదంగాన్ని శృతిపక్వంగా ఉండేటట్టు సరిచేసుకోవడంలో ఎదురయ్యే సూక్ష్మమైన సాంకేతిక అవరోధాలను కాగితంపై పెట్టలేం. వాటి వరిష్కారాలను గురుముఖతః, అనుభవంతో తెలుసుకోవాల్సిందే. - (సశేషం)
Comments
Post a Comment