సద్గురువులతో నా అనుభవాలు
నామాట: సద్గురువులు ఎలా ఉండాలో రాసే దుస్సాహసం నేను చెయ్యను. ఎందుకంటే నేను శిష్యులనెవరినీ తయారు చేయలేదు కాబట్టి. నాకు విద్య నేర్పిన సద్గురువుల నుండి ప్రత్యక్షంగా నేర్చుకున్నదీ, సమకాలీన సద్గురువులను చూసి నేర్చుకున్నవీ, గత తరం సద్గురువుల గురించి విని తెలుసుకున్నదీ క్రోడీకరించి మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించి చూస్తే ప్రాంతాలు వేరైనా, బాణీలు వేరైనా, గురు పరంపరలు వేరైనా సద్గురువుల బోధనాపద్ధతి, వారి ప్రవర్తన, ఆశయాలు, క్రమశిక్షణ ఒకేలా ఉంటాయి. అలాగే విజయవంతమైన శిష్యుల ఆలోచనా విధానం, ఆచరణ, నడవడిక ఒకేలా ఉంటాయి. శిష్యునిగా నేను, ననుగన్న నా తల్లిదండ్రులు కొంతలో కొంతైనా సఫలీకృతులమయ్యామని భావిస్తూ, విద్యార్థుల కోసమై, వారి తల్లిదండ్రుల కోసమై నాకనుభవంలోకి వచ్చిన కొన్ని విషయాలను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. తప్పలుంటే మన్నించి, ఒప్పలను తెలియజేయవలసిందిగా ప్రార్దిస్తున్నాను.
గురువులు చాలా మంది ఉండొచ్చు కానీ సద్గురువులు కొంతమందే ఉంటారు. ఎవరినైనా సద్గురువు అనే ముందు సద్గురువులు ఎలా ఉంటారు? అనే విషయం పై కొద్దిగా ఆలోచన చెయ్యడం అవసరం. సద్దురువుల వద్ద నేను గమనించిన విషయాలను ఒక్కొక్కటిగా తెలియజేస్తాను.
1. బోలెడుమంది శిష్యులను తయారుచేయడం అనేది సద్దురువుగా కీర్తించబడడానికి ఒక కొలమానం కానీ, నిబంధన కానీ ఎప్పటికీ కానేరదు. లోకం మెచ్చే, లోకానికుపయోగపడే, తర్వాతి తరం ఆదర్శంగా తీసుకునే శిష్యులను కొద్దిమందినైనా తయారు చేసిన వారే సద్గురువు అని పిలవబడడానికి అర్హులు. “గంగి గోవు పాలు గరిటిదైనను చాలు అని మనందరికీ తెలుసు కదా. పరుసవేది ఇనుమును బంగారంగా మారిస్తే సద్దురువు ఇనుమును పరుసవేదిగా మార్చే సమర్ధత గలవారు. అంటే గురువులు తమ శిష్యులను విద్వాంసులుగా తయారు చేస్తే, సద్గురువులు తమ శిష్యులను విద్వాంసునిగానే కాక, మంచి గురువుగా కూడా తీర్చిదిద్దగలరు. ద్వారం నరసింగరావుగారు, పారువల్లి రామకృష్ణయ్య వంతులుగారు, ముళ్ళవూడి లక్ష్మణరావుగారు మొదలైన వారిని, వారి శిష్య పరంపరలను దీనికి మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
2. ఫలితం ఆశించకుండా విద్య నేర్పడం: అంటే డబ్బు తీసుకోకుండా విద్య నేర్పేవాళ్ళే సద్దురువులా? అనే సందేహం రావచ్చు. శ్రీ ద్వారం నరసింగరావు గారు తమ ముఖ్య శిష్యులలో ఒకరైన శ్రీ ఇవటూరి విజయేశ్వరరావుగారికిచ్చిన సలహాని ఇక్కడ ఉదహరిస్తాను.
“నిష్కల్మషంగా, మనస్ఫూర్తిగా, శక్తి వంచనలేకుండా నీకొచ్చినదంతా శిష్యునికి బోధించు. సంగీతం నీ బ్రతుకుతెరువు కాబట్టి, బ్రతకడానికి డబ్బు అవసరం కాబట్టి ఎంతోకొంత తీసుకో. కానీ డబ్బు తీసుకుంటున్నాను కాబట్టి పాఠం చెప్పాలని మాత్రంఎప్పుడూ అనుకోకు”
- నిజంగా సువర్జాక్షరాలతో లిఖించవలసిన సలహాలాంటి హెచ్చరిక. ఈ సలహాని మనసా, వాచా, కర్మణా, నమ్మి ఆచరించిన విజయేశ్వరరావుగారి వద్ద ఎలాంటి శిష్యులు తయారయ్యేరో మనందరికీ తెలిసినదే. వారికి 5 సంవత్సరాల కాంట్రాక్ట్ పద్దతిలో ఆకాశవాణిలో ఉద్యోగం వచ్చిన దగర నుండి ఆజన్మాంతం శిష్యులకు ఉచితంగానే పాఠాలు చెప్పారు.
3. క్రమశిక్షణ: క్రమశిక్షణలేని వ్యక్తి సద్గురువు దగ్గర నిలదొక్కుకోలేడు. ఏదో ఒక రకంగా ప్రవేశం సంపాదించినా ఎక్కువ కాలం నిలబడలేదు. క్రమశిక్షణతో విద్య నేర్పే గురువు అంతే క్రమశిక్షణను శిష్యునివద్ద నుండి ఆశిస్తాడు. వారు తమ విలువైన సమయాన్ని ఆషామాషీగా, కాలక్షేపంగా నేర్చుకునే విద్యార్థుల కోసం వృధా చేయలేరు. ఎందుకంటే డబ్బు, పేరు సంపాదించడమే వారి పరమార్ధం కాదు కాబట్టి. గురువుగారు రమ్మని చెప్పిన సమయానికి వెళ్ళడమే తప్ప తిరిగి ఇంటికి వెళ్ళే సమయాన్ని శిష్యుడు నిర్ణయించకూడదు. మాటిమాటికీ గడియారం వైపు చూసే శిష్యునికి గురువుగారు సరిగా పాఠం చెప్పలేరు. మంచి శిష్యుడు తాను శ్రద్ధగా నేర్చుకోవడమేకాకుండా, పాఠం చెప్పాలనే ఆసక్తిని,ఆత్భతను గురువులో కలిగించగలుగుతాడు. తోడినకొద్దీ నూతిలో నీరు ఎలా ఊరుతుందో అలాగే నేర్చుకున్న కొద్దీ ఇంకా నేర్చుకోవాల్సింది మిగిలే ఉంటుంది. ఇటువంటి వరిస్థితి గురుకులాలలో ఎక్కువగా సాధ్యవడుతుంది. పైన రాసిన విషయాలన్నీ నేను ప్రత్యక్షంగా చూసి, అనుభవించి తెలుకున్నవే. ఇకపైన కూడా నేను ప్రత్యక్షంగా పాల్గొన్న సంఘటనలను ఉదహరిస్తూ తెలియజేస్తాను.
4 గురుకుల పద్ధతి: 20వ శతాబ్దపు ప్రధమార్ధంలో విజయవాడలో పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు నడిపిన గురుకులంలో ఎందరో మహా విద్వాంసులు, సద్గురువులు తయారయ్యారు. ఆ రోజుల్లో నెలకు 600 రూపాయలు అద్దె వచ్చే గాంధీనగరంలోని తన ఇంటిని శిష్యుల వసతి కోసం ఉచితంగా ఇచ్చేరు. అనేకమంది శిష్యులకు ఊళ్ళో వారాలనేర్పాటు చేశారు. అదే విధంగా విజయనగరంలో స్వర్గీయ ద్వారం నరసింగరావుగారు తాను మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలకు ప్రధానోపాధ్యాయునిగా ఉన్న కాలంలో ఎంతో మంది శిష్యులకు మహారాజా వారి సత్రంలో భోజన, కాలేజీలో వసతి సదుపాయాల నేర్పాటుచేయించి, మరికొంత మందికి వారాలనేర్పాటు చేసి, క్రమశిక్షణతో వారికి బోధించి, గొప్ప విద్వాంసులుగా, మంచి గురువులుగా తయారు చేశారు. ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి సంగీత కాలేజీకి వెళ్ళి, విద్యార్థులు సాధన చేస్తున్నారో లేదో పర్యవేక్షించేవారు.
ఆధునిక గురుకులాలు: అయితే నేటి పరిస్థితి వేరు. తరాలు మారిన కొద్దీ పిల్లల్లో తెలివితేటల స్థాయి పెరుగుతూ వస్తోంది. వారు సంగీతంలో పాటు చదువులో, క్రీడల్లో కూడా రాణిస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో గురుకులాలెలా సాధ్యమౌతాయి? గురుకులాల వలన కలిగే ప్రయోజనాలను కోల్పోవలసిందేనా? ఆధునిక కాలంలో కూడా గురుకులాలు సాధ్యమేనని మన ఆంధ్రప్రదేశ్‌లోని ఎంతోమంది మహావిద్వాంసులు నిరూపించారు. నాకు గాత్రం నేర్పిన కీ॥శే॥ ఇవటూరి విజయేశ్వరరావు గారు, మృదంగం నేర్పిన శ్రీ వంకాయల నరసింహంగారు గురుకుల వాతావరణాన్ని
ఎలా సృష్టించేరో క్లుప్తంగా తెలియజేస్తాను.
శ్రీ విజయేశ్వరరావుగారు సంగీత పాఠాల కోసం తన ఇంటిని ఆనుకొని, ఒక పెద్ద హాల్‌ని కట్టించారు. ఈ హాల్‌లో, పై డాబాలో, ఇంటిపైన డాబాలో సాయంత్రం 4 గం॥ల నుండి పొద్దు పోయేవరకు కనీసం 20 మందికి పైగా విద్యార్థులుండేవారు. సీనియర్ శిష్యులకు సంగీతం గదిలో మేష్టారు పాఠం చెప్పేవారు. సీనియర్ శిష్యులు జూనియర్ శిష్యులకు పాఠం చెప్పేవారు. జూనియర్ శిష్యులు అప్పుడే సంగీతం మొదలు పెట్టిన వారిచే సాధన చేయించేవారు. కానీ అన్ని పాఠాలు ఆయన పర్యవేక్షణలోనే సాగేవి. అప్పుడప్పుడు జూనియర్లకు చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉండేవారు. వారి వారి స్థాయిలననుసరించి శిష్యులు చిన్న చిన్న సమూహాలుగా కూర్చుని సాధన చేసేవారు. దీంతో శిష్యుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. సాయంత్రం 6 గం॥ల నుండి మేష్టారు 2 గంటలకి తక్కువ కాకుండా సాధన చేసేవారు. ఈ సాధనలో తనతో పాటు వయోలిన్ శిష్యులను, వీణ శిష్యులను కూడా కూర్చోబెట్టి సాధన చేయించేవారు. గాత్రం శిష్యులు పాడేవారు. ఎవరో ఒక శిష్యుడు తంబుర, తాళం వేసేవారు. సాధనతో బాటు తంబుర శృతి చేయడం, శృతి వేస్తూ తాళం వేస్తూ పాడడం శిష్యులకు అలవాటయ్యేవి. మృదంగం నేర్చుకునే విద్యార్థులను తనతో పాటు వాయింపించి, అవసరమైన చోట అనుసరణలో మెళకువలు చెప్పేవారు. ఈ సాధన మొత్తం కచేరీ పద్ధతిలో సాగేది. కొంతమంది అభిమానులు ఈ సమయంలో వచ్చి కూర్చుని, ఆనందించి వెళ్తూ ఉండేవారు. కీ॥శే॥ ద్వారం వెంకటస్వామి నాయుడుగారు కూడా విజయనగరంలో ఇలాగే రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు శిష్యుల వయోలిన్ సహకారంతో, కోలంక వెంకట్రాజు గారి మృదంగ సహకారంతో కచేరీ పద్ధతిలో సాధనచేసేవారని విన్నాం. విజయేశ్వరరావు గారింట్లో ఆ వాతావరణాన్ని అనుభవించి కృతార్ధులయ్యేరు శిష్యులు. తెల్లవారు రూమున 4గంటలకు లేచి త్రిస్థాయి, బౌ టెక్సిక్స్ వంటివి సాధన చేసేవారు మేష్టారు. వారు 7 గంటలకు రేడియో స్టేషన్‌కి వెళ్ళాక కొంతమంది శిష్యులు సంగీతం గదిలో సాధన చేసుకునేవారు. ఇంకొంతమంది వారి శిష్యులకు పాఠాలు చెప్పేవారు.
ప్రతినెలా మొదటి ఆదివారం సంగీతం గదిలో సాయంత్రం 5 గంటల నుండి అరగంట పాటు జూనియర్ కచేరీ, తర్వాత 2గంటల పాటు సీనియర్ కచేరీ జరిగేవి. శిష్యులకు కచేరీ అనుభవం రావడానికి ఈ కచేరీలెంతో ఉపయోగపడేవి. నావంటి మృదంగ విద్యార్ధులెంతమందో ఈ కచేరీల ద్వారా ఎంతో అనుభవం గడించేరు. విజయేశ్వరరావు గారి ఆహ్వానం మేరకు ఊళ్ళో ఉండే అనేకమంది విద్వాంసులు, అప్పుడప్పుడు పై ఊళ్ళ నుంచి వచ్చిన విద్వాంసులు కూడా ఈ వేదికపై కచేరీలు చేసేవారు. ఇక్కడి శ్రోతల్లో సంగీతాభిమానులు, సరళీ వరుసల స్థాయి నుండి రాగం తానం పల్లవుల స్థాయి వరకు ఉన్న విద్యార్థులు, ఊళ్ళోని అనేకమంది విద్వాంసులు ఉండేవారు. ఇటువంటి శ్రోతల మధ్య పాడడం కళాకారులకు విషమ పరీక్షగానే ఉండేది. పెద్ద పెద్ద సభలలో టిక్కెట్ల పై మాత్రమే ప్రవేశం లభించే కచేరీల స్థాయికి ఏ మాత్రం తీసిపోకుండా ఉండేవి ఈ సంగీతం గది కచేరీల స్థాయి. ఇంచుమించు ప్రతి కచేరీలో రాగం తానం పల్లవి ప్రధానాంశంగా ఉందేది. సంగీత సభా నిర్వహణ కూడా శిష్యులకు అక్కడే అలవాటయ్యింది. చాపలు వెయ్యడం, కచేరీ మధ్యలో కాఫీ అందివ్వడం నుండి వందన సమర్పణ, కచేరీని విశ్లేషంచడం వరకు, కచేరీ అవగానే ఆటోలు మాట్లాడి కళాకారులను సాగనంపడం శిష్యులకు సులభంగా అలవడ్డాయి. ఈ కచేరీలలో ఆటో ఖర్చులు, కచేరీ మధ్యలో కప్పు కాఫీ తప్ప ఏ కళాకారునికీ పారితోషకం ఇవ్వలేదు. అయినా ఈ నెలవారీ కచేరీలు 25 ఏళ్ళకు పైగా నిర్విఘ్నంగా సాగేయి. మేష్టారి దగ్గర వందల కొద్దీ టేపులతో ఒక పెద్ద లైబ్రరీ ఉండేది.
శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, శ్రీమతి సూర్యకాంతం గార్లు
శిష్యులందరం ఇంట్లో పిల్లల్లాగ తిరిగేవాళ్ళం. కేవలం గురుశిష్యుల మధ్యే కాక, వారివారి కుటుంబాల మధ్య కూడా సాన్నిహిత్యం ఉండేది. ఎప్పుడైనా శిష్యుల పాట కానీ, వాయిద్యం కానీ ఆయనకు అమితంగా సంతోషం కలిగిస్తే చేతిలో ఏదుంటే అది బహుమతిగా ఇచ్చేసేవారు - దాని ఖరీదుతో నిమిత్తం లేకుండా!
శ్రీమతి మండా సుధారాణి గారు మొదటి సారి షట్మాల పల్లవి పాడి వినిపించినపుడు ఆయన కళ్ళు చెమర్చడం నేను కళ్ళారా చూసాను. వెంటనే తాను ఎంతో ముచ్చటపడి చేయించుకున్న బొబ్బిలి తంబురాని ఆవిడకి బహుమతిగా ఇచ్చేశారు. కొద్ది రోజుల తర్వాత నేను కూడా ఆ పల్లవి యొక్క సాహిత్యాన్ని 6 కాలాలు పాడి వినిపించేను. ఆరోజు సాయంత్రం సుధారాణి గారిని మళ్ళీ ఆ పల్లవిని పాడమని, నన్ను సహకారం వాయించమని చెప్పి, పల్లవి పూర్తవగానే నేను వాయించిన మృదంగాన్ని తన బహుమతిగా ఉంచుకోమని చెప్పి, దాని ఖరీదును నాకిచ్చేరు. మరోకసారి మా అమ్మగారు శ్రీమతి కె. ఉదయలక్ష్మిగారు ఒకరోజు వీణపై రాగాలాపన బాగా చేశారని తన పిచ్‌పైప్‌ని బహుమతిగా ఇచ్చేరు. ఈ బహుమతులను తన సంతోషం కొద్దీ ఇచ్చేను తప్ప ప్రచారం కోసం కాదనీ, వీటిని బయటవారెవ్వరికీ చెప్పాద్దనీ హెచ్చరించేరు. అదీ వారి వ్యక్తిత్వం. వారు కీర్తిశేషులయ్యేంత వరకు ఈ విషయాలనెక్కడా చెప్పలేకపోయాం. వారి వ్యక్తిత్వ విశేషం ఇప్పటి తరానికి తెలియజేయకపోతే అది పెద్ద తప్పే అవుతుంది. వారు విశాఖపట్నానికొచ్చిన దగ్గర నుండీ 35 సంవత్సరాలకు పైగా ఆ ఊళ్ళో ఒక చక్కటి నంగీత వాతావరణాన్ని నెలకొల్పి, విజయవంతంగా నడిపారు.
ఒక సద్దురువు యొక్క సహధర్మచారిణి ఎలా ఉండాలో శ్రీమతి ఇవటూరి సూర్యకాంతం గారిని చూస్తే తెలుస్తుంది. పెద్దవారు ఆవిడని ఒదినగారనీ, మేం అత్తయ్యగారనీ విలుస్తాం. విజయేశ్వరరావుగారి విజయాల వెనుక ఆవిడ సహాయసహకారాలు, శ్రమ, ఓర్పు చాలా ఉన్నాయి. మేష్టారి దృష్టి లోపం, చిన్నప్పట్నుంచీ ఉన్న తీవ్ర మధుమేహం, తర్వాతి రోజుల్లో ఆయనను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన అనారోగ్యం ఆవిడ గుండె ధైర్యం ముందు ఓడిపోయాయి. శిష్యులకేవైనా పోటీలలో బహుమతులొస్తే తన స్వంత పిల్లలకొచ్చినటే సంబరపడిపోయి, గారం చేసేవారు. ఇల్లు, స్కూలు తర్వాత ఆటల కన్నా మేష్టారింటికి వెళ్ళడానికే ఎక్కువ ఇష్టపడేవాడిని.
మేష్టారంటే గౌరవంతో కూడిన భయం ఉండేది. మేష్టారు పాఠాలు చెప్పడానికి కూర్చునే కుర్చీలో కూర్చునే సాహసం నేనీ రోజుకీ చెయ్యలేకపోయాను. ఇక నేను వారితో రేడియో స్టేషన్‌కి వెళ్ళి నేర్చుకున్న విశేషాలు, వారితో కచేరీలు వాయించి నేర్చుకున్న పాఠాలు మొత్తం రాయాలంటే అది ఒక పెద్ద (గ్రంధమే అవుతుంది.
ఇక నా మృదంగ విద్యాభ్యాసం నా ఎనిమిదవ ఏట శ్రీ నేమాని సోమయాజులు గారి వద్ద మొదలైంది. మృదంగంపై ఎంతో ఇష్టం ఉన్నా చిన్నతనంలో ఉండే బద్ధకం వలన, ఆటల మీద ధ్యాస వలన పాఠానికి వెళ్ళినప్పుడు తప్ప ప్రతిరోజూ సాధన చేసేవాడిని కాను. పైగా గాత్రానికి కూడా రోజుకి గంటన్నరకి తక్కువ కాకుండా సమయం పట్టేది. మేష్టారు కచేరీకి వేరే ఊరెప్పుడు వెళ్తారా? అని ఎదురుచూసే వాడిని. అయితే చిన్న వయస్సనేమో ఆయన నన్నెక్కువ దండించలేదు. మూడు సంవత్సరాల తర్వాత మొదటి కచేరీ చేశాను. క్రమంగా శ్రోతల చప్పట్ల రుచి మరిగాక రోజూ సాధన చెయ్యాలనే ఆసక్తి కలిగింది. ఆయన సుశిక్షణలో కేంద్రప్రభుత్వ ఉపకారవేతనం లభించింది. క్రమంగా బాధ్యత పెరిగింది. నేను పదవతరగతికి వచ్చేటప్పటికి ఇంచుమించు రెండు గంటల కచేరీలు వాయిస్తూ ఉండేవాడిని. అదే సమయంలో సోమయాజులు గారికి ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో నిలయ విద్వాంసునిగా ఉద్యోగం రావడం జరిగింది. నా మీద ఎంతో ప్రేమతో ఆయనే స్వయంగా మా అమ్మ, నాన్నగారిని వెంట పెట్టుకుని శ్రీ వంకాయల నరసింహం గారింటికి వెళ్ళి నన్ను అప్పజెప్పి వచ్చారు. మొదటి గురువుగారి అనుమతితో మరొక గురువు గారి వద్దకు వెళ్ళడమనేది చక్కటి సంప్రదాయం.
క్రమశిక్షణకు మారుపేరు వంకాయల నరసింహంగారు. వారి పద్ధతిలో ఏ ఇద్దరు శిష్యులకు కలిపి పాఠం చెప్పేవారు కారు. ఇక నా విషయానికొస్తే సాధారణంగా ఇంజనీరింగ్ కాలేజీ సమయం అయిపోయాక సాయంత్రం 5 గంటలకు పాఠానికి రమ్మనేవారు. ఆ సమయానికి నా కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. నేను 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్తే చాపేసుకుని వాయించుకుంటూ ఉందేవారు.. ఆయన నన్ను తిట్టకపోయినా తిట్టినట్టే ఉండేది. ఆ రోజు చెప్పాలనుకున్న పాఠాన్ని ముందుగానే సిద్ధం చేసుకునే వారు. ప్రతి సారీ ఏదో ఒక క్లిష్టమైన తాళంలోనో, గతిలోనో, జాగాకో కొన్ని పాఠాలు చెప్పేవారు. తర్వాత ఆ పాఠాలను మనోధర్మసహితంగా ఆయన వాయించి, నా చేత వాయింపించేవారు. అందులోనే తగ్గింపులు, మొహరా, ముక్తాయి వాయింపించి, ఆరోజు పాఠాన్ని నేరుగా కచేరీలో వాయించేటట్టుగా తయారు చేసేవారు. కచేరీలో అప్పటికప్పుడు ఏదైనా కొత్త తాళంలో తని వాయించాల్సి వస్తే ప్రస్తారాలు, ముక్తాయిలు ఎలా లెక్కగట్టాలో గణిత సూత్రాల ద్వారా వివరించేవారు. ఉదయం ఆకాశవాణిలో రికార్జింగ్‌లో ఎవరైనా పల్లవి పాడితే, సాయంత్రం దాన్ని చెప్పి, అప్పటికప్పుడు త్రికాలం, తిశ్రం చేయించి, మనోధర్మ సహితంగా లయవిన్యాసం వాయింపించేవారు.. ఈ రకమైన శిక్షణ నాకు ఆకాశవాణిలో ఇంటర్‌వ్యూలో, తర్వాత ఉద్యోగంలో, నేటికీ ఎంతో ఉపయోగపడుతూ వస్తోంది. చెప్పిన పాఠం, ఆరోజు వాయించిన లయ విన్యాసం మళ్ళీ పాఠానికి వచ్చేటప్పటికి రాసుకుని రమ్మనేవారు. అప్పడు వారు చేసిన అలవాటు నాకు నేటికీ ఎంతో
ఉపయోగపడుతోంది. 5 గంటలకి పాఠం మొదలుపెడితే ఏ రోజూ ఆయన గానీ, నేను గానీ, ఎప్పుడూ' గడియారం వైపు చూడలేదు. సాధారణంగా నాలుగు గంటలకి తక్కువ ఎప్పుడూ పాఠం చెప్పలేదు. ఒక్కోసారి రాత్రి పది కూడా అయ్యేది. ఊళ్ళో పెద్ద కచేరీలు, విశాఖ మ్యూజిక అకాడెమీ వార్షికోత్సవాల వంటివి అయితే, పాఠానికి సెలవులిచ్చి, ప్రతిరోజూ కచేరీకి వెళ్ళి, కచేరీలో తనిలో వాయించిన ముక్తాయిలన్నింటినీ జ్ఞాపకం పెట్టుకుని పుస్తకంలో రాసి తెమ్మనేవారు. అయితే ఆయన ఎప్పుడూ ఆ రాసిన ముక్తాయిలను చూపించమని అడగలేదు, నేను రాయడం మానలేదు. సద్గురువుల వ్యక్తిత్వం, క్రమశిక్షణ వలన శిష్యులకు వారియెడ భయభక్తులు, గౌరవం సహజంగానే కలుగుతాయి.
ప్రతి శనివారం సాయంత్రం వారింట్లో నేటికీ భజన జరుగుతుంది. ముక్కోటి ఏకాదశికి రాత్రంతా భజన జరిగేది. ప్రతి కృష్ణాష్టమికి ఏకాహం జరిగేది. ఈ ఏకాహానికి ఊళ్ళో ఉన్న పిన్న, పెద్ద విద్వాంసులందరూ వచ్చి తలా కొంతసేపు పాదేవారు. శిష్యలందరం వంతుల వారీగా వారికి సహకారం అందించేవాళ్ళం. రాత్రయ్యాక భజన కీర్తనలు గానం చెయ్యడంలో ఆరితేరినవారు తెల్లవారేదాక భజన, నామ సంకీర్తన చేసేవారు. ఈ భజనలు శిష్యుల సాధనకు విషమ పరీక్షల్లాగ ఉండేవి. అయితే తమ తమ సాధనను ప్రదర్శించడం కోసం వీటికి కూడా వంతులు వేసుకునేవాళ్ళం. ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీ శిష్యుల మధ్య ఉండేది. పై ఊళ్ళనించి పాఠానికి వచ్చిన శిష్యులు వారింటనే ఉండి, భోజనం చేసి వెళ్ళేవారు. అమ్మగారు ఆప్యాయంగా పుత్రవాత్సల్యంతో వండి వడ్డించేవారు. విద్యతో పాటు బయట ప్రపంచంలో వేలకు వేలు ఫీజులు కట్టినా లభించని క్రమశిక్షణ, విద్య పట్ల అభిరుచి, గౌరవం, తాను నేర్చుకున్నట్లే తర్వాతి తరానికి కూడా విద్యనందించాలనే తపన సద్దురువుల వల్ల శిష్యులకు అలవడతాయి.
చక్కటి విలువలతో కూడిన జీవితం వారిది. వారు కార్యదర్శిగా ఉండే సంగీత కళాసమితి నిర్వహించే పోటీలకు శిష్యులెవరైనా వస్తే కనీసం మృదంగం శృతి చేసివ్వడానికి కూడా ఆ చుట్టుపక్కల ఉండేవారు కారు.. ఆయన ఆకాశవాణిలో నిలయవిద్వాంసులుగా పనిచేస్తున్నా శిష్యులెవరైనా ఆడిషన్‌కో లేదా పోటీకో వస్తే స్టూడియోలోకే వచ్చేవారు కారు. ఒక సారి ఏదైనా కచేరీ ఒప్పుకుంటే, ఆ తర్వాత ఎంత గొప్ప కళాకారునితో, ఎంత గొప్ప వేదికపై, ఎంత పారితోషికం వచ్చే కచేరీ వచ్చినా ఒప్పుకునేవారు కారు. అంత నిక్కచ్చిగా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడం చాలా కష్టం.
ఎంతటి నియమ నిష్ఠలున్నవారికైనా ఇంట్లో ఆడవారి సహకారం లేకపోతే ఏమీ చెయ్యలేరు. ఎన్ని భజనలు, ఏకాహాలు వచ్చినా, ఎంతమందికి కాఫీ, టిఫిన్‌లు, భోజనాలు వండి వడ్డించినా అమ్మగారు విసుక్కోవడం నేనెప్పుడూ చూడలేదు. ఏ శిష్యుడికి ఏ వంటకం ఇష్టమో కూడా ఆవిడకి గుర్తుందేది. గురువుగారు ఇంట్లో ఏ మూలనుంచి 'రత్నం' అని పిలిచినా మొదటి పిలుపుకే ప్రత్యుత్తరం వచ్చేది. ఎలాగో తెలీదు కానీ ఇప్పటికీ అలాగే పలుకుతారు అమ్మగారు. నిజంగా గురువుగారికి లభించిన రత్నం మా అమ్మగారు.
శ్రీ వంకాయల నరసింహం, శ్రీమతి సీతారత్నం గార్లు
వారు ఆకాశవాణిలో పదవీ విరమణ చేశాక విశాఖపట్నానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో గుడిలోవలోని ‘విజ్ఞాన విహార’ ఆశ్రమపాఠశాల యాజమాన్యం ఆహ్వానం మేరకు అక్కడ నూతనంగా నెలకొల్పబడిన సంగీత విభాగం 'భారతీ కళా విహార’కు ప్రధానోపాధ్యాయునిగా బాధ్యతలు స్వీకరించి 21 సంవత్సరాల సుదీర్ధకాలం తన సేవలనందించారు. వారు గుడిలోవలో ఉన్న కాలంలో వారినికొక్కరోజు వారింటికి వెళ్ళి పాఠం నేర్చుకునే వాడిని. 2018లో పదవీ విరమణ తర్వాత విజయనగంరలో స్థిరపడ్డారు.
వారు బహుముఖ ప్రజ్ఞాశాలి. పాడతారు, హార్మోనియం, కీబోర్డు వాయిస్తారు. దాససాంప్రదాయ కృతులనెన్నింటినో స్వరపరిచి గానం చేశారు. వారింటికి వెళ్తే 84 సంవత్సరాల వయస్సులో ఇప్పటికీ పాడుకుంటూనో, వాయించుకుంటూనో కనిపిస్తారు. లక్ష్య విభాగంలోనే కాక లక్షణ విభాగంలో కూడా వారికి మంచి జ్ఞానం, ఆసక్తి ఉన్నాయి. 5 జాతుల ఏక తాళాలకు సరిపోయే విధంగా 1260 క్రియలకు మొహరా, ముక్తాయిలసహితంగా ఒక లయ విన్యాసాన్ని తయారుచేసి, నాతో సాధన
చేయించి, విశాఖపట్నంలోని ప్రేమ సమాజం హాల్‌లో ఐదుగురు విద్వాంసులు ఏకకాలంలో 5 జాతుల ఏకతాళం వేస్తుండగా నాచేత వాయింపించేరు (పుస్తకం ఎదురుగా లేకుండా).
నాకు పంచముఖి, షణ్ముఖి తాళావధానాలకు సంబంధించిన విలువైన సమాచారాన్ని, 'షట్మాల భరతాచార్య' బ్రహ్మశ్రీ ముట్నూరు సూర్యనారాయణశాస్రిగారు స్వహస్తాలతో రాసుకున్న పుస్తకాన్ని ప్రస్తుతం పుస్తకాల దుకాణాలలో గాని, గంధ్రాలయాలలో కానీ లభించని, 'పంచముఖి పరమేశ్వర’, శ్రీ మదజ్ఞ్జాడాదిభట్ల నారాయణదాసవిరచిత ‘దశవిధరాగ నవతి కుసుమ మంజరి’, ముట్నూరు సూర్యనారాయణ శాస్త్రిగారు రచించిన ‘నందీశ్వర భరతం’ గ్రంధాలను నాకిచ్చేరు. నేను పంచముఖి, షణ్ముఖి తాళావధానాల సిద్ధాంతాన్ని అవగావాన చేనుకోవడానికి ఇవి ఎంతో ఉపయోగపడ్డాయి.
గురువుగారు మొదట విజయనగరంలోని బొడ్డువారి హైస్కూల్‌లో 21 సం॥లు విజ్ఞాన శాస్రోపాధ్యాయునిగా, అనంతరం ఆకాశవాణిలో 16 సం॥॥లు, చివరగా 'భారతీ కళావిహారలో 21 సం॥లు మొత్తం 58 సం॥లు ఉద్యోగం చేసి, నేటికీ ఆరోగ్యంగా, మరొకరిపై ఆధారపడకుండా జీవనం సాగిస్తున్నారు. సంగీతం, నియమబద్ధ జీవితం, మెదడునెప్పుడూ ఖాళీగా ఉంచకపోవడం, అనుకూలవతియైన సహధర్మచారిణి మా అమ్మగారు, అన్నింటిని మించి దైవానుగ్రహం వారి విజయానికి ముఖ్యమైన కారణాలు.
నేను ప్రత్యక్షంగా నేర్చుకున్న గురుకులాలే కాకుండా విశాఖపట్నంలో శ్రీ ఐ.వి.ఎల్. శాస్త్రిగారు, శ్రీమతి రామవరపు విజయలక్ష్మి గారు నడిపిన గురుకులాల ద్వారా కూడా ఎంతో మంది శిష్యులు విద్వాంసులుగా రూపుదిద్దుకున్నారు. శ్రీ ఐ.వి. ఎల్. శాస్త్రి గారు స్థాపించిన ‘సంగీత జనకులం' ద్వారా ప్రతి నెలా రెండవ శనివారం ఒక కచేరీ నిర్వహించేవారు. దసరానాడు ఏకాహం జరిపేవారు. కొన్ని వందల మందికి (వేలల్లో ఉండి. ఉండవచ్చు) ఉచితంగా పాఠాలు నేర్పారు. అక్కడ విద్వాంసులతో పాటు (విద్యార్థుల తల్లిదండ్రులను కూడా కలిపితే) కొన్ని వేల మంది శ్రోతలు కూడా తయారయ్యేరు.
ఇక రామవరపు, విజయలక్ష్మి గారింట్లో నిత్యం రోజంతా శిష్యులు నేర్చుకుంటోనో, సాధన చేస్తూనో కనిపించేవారు. వారింట్లో కనీసం ముప్పై వీణలైనా ఉండి ఉంటాయని నా అంచనా. ఐదు, ఏడు లేదా తొమ్మిది మంది శిష్యులను, శిష్యురాళ్ళను బృందాలుగా ఏర్పర్చి కచేరీలు చేయిస్తూ ఉండేవారు. 'కళావని' సంస్థ ద్వారా ఎన్నో కచేరీలను, ఉత్సవాలను నిర్వహిస్తూ ఉండేవారు. నేనీ శీర్షిక రాస్తున్నప్పుడే శ్రీమతి రామవరపు విజయలక్ష్మిగారు పరమపదించేరని తెలిసింది. కొద్ది నెలల తేడాలో శ్రీ ముళ్ళపూడి శ్రీరామ్మూర్తి, శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గార్ల అస్తమయంతో ఎంతో నష్టపోయిన విశాఖ విద్యార్థులకు, అభిమానులకు ఇదిమరొక తీరని నష్టం.
మొదటి ఆదివారం విజయేశ్వరరావు గారింట్లో కచేరీ, 2వ శనివారం సంగీత జనకులంలో కచేరీ, 3వ ఆదివారం సంగీత కళాసమితిలో, తర్వాతి వారంలో విశాఖ మ్యూజిక్ అకాడెమీ, ఇవికాక ఐదేసి రోజుల
పాటు విశాఖ ఎకాడెమీ, విజయత్యాగరాజ సంగీత నభ వార్షికోత్సవాలు, సంగీత కళాసమితి, విశాఖ మ్యూజిక్ ఎకాడెమీ వారి పోటీలు, ఏకాహాలు ... ఇలా నా చిన్న తనంలో విశాఖపట్నం సంగీత వాతావరణం ఎంతో సందడిగా, నిండుగా ఉండేది. చాలా పెళ్ళిళ్ళలో సంగీత కచేరీలుండేవి. సద్గురువుల, విద్యార్థుల, వారి తల్లిదండ్రుల, సంగీతాభిమానుల సంఘటిత కృషి వలననే ఇది సాధ్యపడింది. ఎక్కడ కచేరీ అయినా అన్ని గురుకులాలలోని విద్యార్థులు, విద్వాంసులు హాజరయ్యేవారు.
ఇక నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నిలయవిద్వాంసునిగా వచ్చాక, పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి గురుకులం గురించి కధలు కథలుగా విన్నాను. అంత చక్కటి గురుకులాన్ని చూసే అదృష్టం లేకపోయినందుకు చాలా బాధ కలిగింది. కానీ వారి శిష్య ప్రముఖులైన శ్రీ అన్నవరపు రామస్వామి గారి, శ్రీమాన్ ఎన్.సిహెచ్. కృష్ణమాచార్యుల గారి ఇళ్ళల్లో ఆ వాతావరణం యొక్క ప్రతిబింబాలను చూడగలిగేను. క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించలేకపోవడం, పాఠం చెప్పడం మొదలుపెడితే సమయం మర్చిపోవడం వంటి లక్షణాలను వారిలో కూడా చూశాను. మా అమ్మాయికి శ్రీ అన్నవరపు రామస్వామి గారి వద్ద పాఠం చెప్పించడం మొదలుపెట్టాక వారి శిక్షణను ప్రత్యక్షంగా చూసే అదృష్టం కలిగింది. తాను అనుకున్నట్టు విద్యార్ధి వాయిస్తే తప్ప తర్వాతి సంగతికి కూడా వెళ్ళకపోవడం, 89 ఏళ్ళ వయస్సుని కూడా లెక్క చేయకుండా విసుగు అనేదే లేకుండా పాఠం చెప్పడం, తాను ఎంత ఉన్నత శిఖరాలకు ఎదిగినా తాను వారాలు చేసుకుని, కష్టపడి విద్య నేర్చుకున్న తన బాల్య, యౌవన దశలను నేటికీ గుర్తుంచుకోవడం వంటి సద్దుణాలు ఆయనకు గొప్ప విద్వాంసునిగా, సద్దురువుగా కీర్తిని, గౌరవాన్ని తెచ్చిపెట్టాయి.
ఇక మృదంగ విభాగంలో శ్రీ మహాదేవు రాధాకృష్ణరాజుగారు, శ్రీ దండమూడి రామ్మోహనరావుగారు ఎంతో మంది శిష్యులను తయారుచేశారు. రాధాకృష్ణరాజుగారు నేను విజయవాడ వచ్చేటప్పటికే పరమపదించేరు. దండమూడి గారి బోధనా పద్ధతులను గురించి నాకు తెలిసినది చాలా తక్కువ. కానీ వారిరువురు శిష్యులకెంతో క్రమశిక్షణతో పాఠం చెప్పి, కఠోరమైన సాధన చేయించేవారని మాత్రం నేను విన్నాను. ద్వారం, పారుపల్లి, ముళ్ళపూడి, దండమూడి, రాధాకృష్ణరాజుగార్ల శిష్య పరంపరలకు చెందిన వారెందరో నేడు ఆంధ్రదేశం నలుమూలలా, ఇతర రాష్ట్రాలలోని ఆకాశవాణి కేంద్రాలలో నిలయ విద్వాంసులుగా, సంగీత కళాశాలల్లో అధ్యాపకులుగా, జాతీయ అంతర్జాతీయ స్థాయి విద్వాంసులుగా ఖ్యాతిగాంచి, ఎంతో మంది శిష్యులను కూడా తయారుచేస్తున్నారు. వీరేకాక ఎంతోమంది సద్దురువులు ఆంధ్రదేశంలోని సంగీత వాతావరణాన్ని సుసంపన్నం చేశారు. వారందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.
ఇక ప్రస్తుతకాలానికి వస్తే - నగరాల విస్తీర్ణం పెరిగింది. దూరాలు పెరిగాయి. వ్యాపకాలు పెరిగాయి. పోటీతత్వం పెరిగింది. వీటన్నింటినీ కారణాలుగా చెప్పి నంగీతానికి సమయం నరిపోవట్లేదంటే నంగీతానికేమీ నష్టం లేదు. సాధనకు ప్రత్యమ్నాయం లేదు. తరం మారడంతో సవాళ్ళు, అవరోధాలు పెరిగాయి. “మీ రోజుల్లో ఇంత పోటీలేదు. నంగీతానికి కావలసినంత సమయం ఉండేదని ప్రస్తుతం పిల్లలు అంటూ ఉంటారు. ముందుతరం పిల్లలు కూడా వారి పెద్దల్ని ఇదేమాట అనేవారు. రాబోయే తరం పిల్లలు నేటి తరాన్ని ఉద్ధేశించి ఇదేమాట అంటారు. ప్రతీ తరానికి అందుబాటులో ఉన్న వనరుల కన్నా సవాళ్ళు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. వాటినధిగమించడానికి ఉపాయాలను వెదుకుతూ ఉ౦డాలి. నేటి తరానికి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చిన అద్భుతమైన సాధనం అంతర్జాలం (ఇంటర్‌నెట్). దీని ద్వారా లెక్కలేనంత, ఎంత విన్నా తరగనంత సంగీతం అందుబాటులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో గొప్ప విద్వాంసుల దగ్గర మనం ఇంట్లో కూర్చునే సంగీతం నేర్చుకునే అవకాశం లభించింది. కాన్‌ఫరెన్స్
కాల్స్ ద్వారా వేర్వేరు ఊళ్ళల్లో ఉన్న శిష్యులు ఒకేసారి గురువుగారి దగ్గర విద్య నేర్చుకుంటూ ఎలక్రానిక్ గురుకులాలను సృష్టిస్తున్నారు. పాఠాన్ని వీడియో రికార్డింగ్ చేసుకుని మళ్ళీ మళ్ళీ వినే అవకాశం కలిగింది. అయితే వీటికున్న పరిమితులను గురించి కూడా చర్చించుకోవాలి.
ఆన్‌లైన్ పాఠాలలో రెండువైపులా ఉండేవారికి మధ్య స్వల్ప విరామం ఉంటుంది. అందువల్ల గురుశిష్యులిద్దరూ కలిపి ఒకేసారి పాడడం లేదా వాయించడం కుదరదు. దీని వల్ల గురువుగారు చెప్పింది విని పాడి, వాయించగల స్థాయికి వస్తే తప్ప సరళీల, పాలవరుసల స్థాయి విద్యార్థులకిది అంతగా ఉపకరించదు. మరీ ముఖ్యంగా వాద్యాలలో ఒకోసారి గురువుగారు శిష్యుని చేతిని పట్టుకుని వేళ్ళు ఎక్కడ వెయ్యాలో చెప్పాల్సిన అవసరం వస్తుంది. కొత్తవారైనా, పాతవారైనా తరచుగా గురువుగారి వద్దకు వెళ్తూ ఉండాలి. గురుశిష్యులు ఎదురెదురుగా ఉంటె కలిగి మానసిక ప్రకంపనలు ఆన్‌లైన్ పాఠాలలో అంతగా లభించవు. అయితే పరిమితులనధిగమించడంలోనే మనిషి యొక్క మేధస్సు ఇమిడి ఉంటుంది. ఒకప్పుడు కచేరీలు. వినడానికి నడుచుకుని లేదా సైకిల్‌పై లేదా సిటీ బస్సులలోనో వెళ్ళేవాళ్ళం. ప్రస్తుతం మధ్యతరగతికి కూడా మోటార్ సైకిళ్ళు, కార్లు అందుబాట్లోకి వచ్చాయి. దీంతో సమయం ఎంతో ఆదా అవుతోంది. అంతర్జాలంలో సంగీతం ఎంత అందుబాటులో ఉన్నా ప్రత్యక్షంగా కచేరీలో కూర్చుని వింటే ఉండే ఆనందం, లాభం అందులో ఉండదు. లైవ్ కాన్సర్ట్‌కి రివైండ్, పాజ్ బటన్స్ ఉండవు. అందువల్ల ప్రత్యక్షంగా కచేరీలు వినడం వలన ఏకాగ్రత పెరుగుతుంది. విన్న సంగతులనో, ముక్తాయిలనో జ్ఞాపకం పెట్టుకుని తర్వాత సాధన చేయడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. సంగీతం కేవలం భౌతికమైన విద్య మాత్రమే కాదు.
మానసిక, ఆధ్యాత్మిక విద్య కూడా. మనస్సు స్వచ్చంగా, నిర్మలంగా ఉన్నప్పుడే చక్కటి మనోధర్మం అలవడుతుంది. చక్కటి గురుశిష్య సంబంధం దీనికి మరింత తోడ్పడుతుంది. అంతర్జాలం, కంప్యూటర్స్, వాయిస్ రికార్డర్స్, వీడియో కెమేరాల వంటి సాధనాలను వినియోగించుకుంటూనే సద్గురువు సమక్షంలోనే నేర్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలి. సద్గురువులు అన్ని కాలాల్లోనూ ఉంటారు. వారి నుండి విద్యను రాబట్టడమనేది శిష్యుని క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావం, మేధస్సుపై ఆధారపడి ఉంటుంది.
Comments
Post a Comment