మధురై మణి అయ్యర్ - జీవిత చరిత్ర
మధురై మణి అయ్యర్
20వేల మంది ప్రజలు ఒకచోట గుమిగూడారంటే అది ఒక రాజకీయ నాయకుని బహిరంగ సభ అయినా అయ్యుండాలి లేదా ఒక క్రికెట్ మ్యాచ్ అయినా అయ్యిండాలి లేదా ఏదైనా సినీ సంగీత విభావరి లాంటిదైనా అయ్యుండాలి. కానీ ఒక కర్ణాటక శాస్త్రీయసంగీత విద్వాంసుని సన్మానానికి, అనంతరం జరగబోయే వారి కచేరీకి అంత భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారంటే నమ్మగలరా! కానీ నమ్మి తీరాలి. అంతటి ఘనమైన, అరుదైన గౌరవం పొందిన విద్వాంసులు 'సంగీత కళానిధి' మధురై మణి అయ్యర్ గారు. ఆయనకు ముప్పైయ్యొక్క సంవత్సరాల వయస్సులో తంజావూరు పురప్రజలు ఈ సన్మానాన్ని చేసి, 'గాన కళాధర' అనే బిరుదు ప్రదానం చేసి తమ సంగీతాభిమానాన్ని, సంస్కారాన్ని చాటుకున్నారు. ఆనాటి కచేరీలో ఆయన గానం చేసిన 'వినాయకుని వలెను' అనే త్యాగరాజస్వామి వారి కృతిలో 'అనాధరక్షకి శ్రీ కామాక్షి' అనే సాహిత్యానికి చేసిన నెరవల్ శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
మణి అయ్యర్గారి అసలు పేరు సుబ్రహ్మణ్యం. 1912 అక్టోబర్ 25న వీరు ఎంఎస్.రామస్వామి అయ్యర్, సుబ్బులక్ష్మి పుణ్యదంపతులకు మదురైలో జన్మించారు. మణిగారి తొమ్మిదవ యేట వారి ఇంటి దగ్గర్లో ఉండే రాజమ్ భాగవతార్ అనే మహావిద్వాంసుని వద్ద సంగీతాభ్యాసం మొదలుపెట్టారు. అదే సమయంలో పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తూ రెండు సంవత్సరాల పాటు వేదాధ్యయనం కూడా చేశారు. స్వరకల్పనలో దిట్టగా ప్రసిద్ధిగాంచిన రాజమ్ భాగవతార్గారు సరళీ, జంట, దాటు మొదలైన అభ్యాస వరుసలను సంప్రదాయసిద్ధమైన మాయామాళవగౌళలోనే కాకుండా శంకరాభరణం, కళ్యాణి, హరికాంభోజి, పంతువరాళి మొదలైన ప్రసిద్ధ రాగాలలో కూడా సాధన చేయించి, స్వర స్థానాలపై, ప్రయోగాలపై దృఢమైన పట్టును అలవర్చారు.
మణిఅయ్యర్ గారు ఆరవ తరగతి చదివే రోజుల్లో ప్రసిద్ధ విద్వాంసులు, ప్రముఖ వాగ్గేయకారులు శ్రీ హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతార్గారు 'త్యాగరాజ విద్యాలయం' అనే సంగీత పాఠశాలను నెలకొల్పి, రాజమ్ భాగవతార్ గారిని అధ్యాపకునిగా నియమించారు. అప్పట్నుంచి త్యాగరాజ విద్యాలయం మొదటి బ్యాచ్ విద్యార్థులలో ఒకరిగా రాజమ్ భాగవతార్, ముత్తయ్య భాగవతార్ గార్ల శిక్షణలో సాధన కొనసాగిస్తూ వచ్చారు. స్వయంగా తాను మార్దంగికుడు కూడా అవ్వడంతో ముత్తయ్య భాగవతార్ గారు మణి గారితో పాటు శిష్యులందరికీ కూడా లయలోని మెళకువలనెన్నింటినో నేర్పారు. సంగీతం పట్ల కుమారుని ఆసక్తినీ, పట్టుదలతో చేసే సాధనని గమనించిన రామస్వామి అయ్యర్గారు పాఠశాల విద్యను ఆపించి పూర్తి సమయాన్ని సంగీత సాధనకే వినియోగింపజేశారు.
1924లో తన 12వ యేట రామనాథపురం జిల్లాలోని అలవ కొట్టైలో ప్రధమ ప్రదర్శననిచ్చారు మణి గారు. 1927లో అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో జరిగిన మొట్టమొదటి మ్యూజిక్ కాన్ఫరెన్స్లో కచేరీ చేసి పతకాన్ని పొందారు. ఆ రోజుల్లో అంటే 1920వ దశకంలో మహా విద్వాంసులుగా కీర్తిని పొందిన నాదస్వర విద్వాంసులు మదురై పొన్నుస్వామి పిళ్ళై, రాజరత్నం పిళ్ళై, వీణ విద్వాంసులు ధనమ్మాళ్, కారైకుడి సోదరులు, గాత్ర విద్వాంసులు మహారాజపురం విశ్వనాధయ్యర్, కాంచీపురం నాయనా పిళ్ళై, మృదంగ విద్వాంసులు దక్షిణామూర్తి పిళ్ళై వంటి వారి సంగీతం నుండి ఎంతో జ్ఞానాన్ని, స్ఫూర్తిని పొందారు మణి గారు. త్యాగరాజస్వామి వారి శిష్యులైన నాగస్వామి భాగవతార్ (వాలాజపేట వెంకటరమణ భాగవతార్గారి శిష్యులు) గారివద్ద నుండి అయ్యవారి కృతులననేకం పాఠం చేశారు. ఆధునిక కచేరీ పద్ధతికి మూలకారకుడైన శ్రీ అరియకుడి రామానుజయ్యంగార్ గారి పంథానే తాను కూడా స్వీకరించి కచేరీలు చేశారు మణి గారు.
దురదృష్టవశాత్తూ 1944వ సంవత్సరంలో తీవ్రమైన అనారోగ్యం పాలయ్యారు మణి గారు. అనేకచోట్ల చికిత్స చేయించుకుని అతి కష్టం మీద అనారోగ్యాన్ని తట్టుకుని నిలబడగలిగినా కచేరీలు చెయ్యడం ఆపేయాల్సి వచ్చింది. ఇది ఆయన అభిమానులను తీవ్ర నిరాశకు లోనుజేసింది. ఆయన జీవితంలో మళ్లీ పాడలేరనే వదంతులు దేశమంతటా వ్యాపించాయి. ఆయన తండ్రిగారి సహోదరుడైన ప్రఖ్యాత గాత్ర విద్వాంసులు మదురై పుష్పవనం అయ్యర్ గారిలాగే 32వ యేటనే మణి గారి జీవితం కూడా అంతమవుతుందనే పుకార్లు సైతం వ్యాపించాయి. కానీ భగవంతుడు మణి గారి అభిమానుల పక్షానే నిలిచాడు. కర్ణాటక సంగీత ప్రపంచం ఒక అమూల్య రత్నాన్ని కోల్పోకుండా కాపాడాడు.
అయితే మణిగారు చాలాకాలం పాటు కచేరీలు చెయ్యలేకపోయారు. గాత్రం కూడా దెబ్బతిని, పై స్థాయిలోకి వెళ్లలేక ఆయన తన శృతిని ఒకటిన్నరకి తగ్గించుకోవాల్సి వచ్చింది. గాత్రానికి ఎన్నో పరిమితులు ఏర్పడినప్పటికీ తన జ్ఞానానికి, అనుభవానికి కఠోరమైన సాధనను జతచేసి మరింత రక్తియైన బాణీని సృష్టించుకుని సమకాలీన, వరిష్ట విద్వాంసులకు తీసిపోకుండా రెట్టించిన ఉద్ధృతితో 1945లో తిరిగి రంగప్రవేశం చేశారు. మారిన తన గాత్రధర్మానికి అనుగుణంగా అకారం పాడేటప్పుడు ఒక్కోసారి ఈ, ఊ, లలలా వంటి శబ్దాలను ఉపయోగించేవారు. ఇవి ఆయన బాణీలో ఎంతగా ఇమిడిపోయాయంటే తర్వాతి తరాలలో ఆయన బాణీని అనుకరించేవారు ఆ శబ్దాలను కూడా అనుకరించడం మొదలుపెట్టారు. నేటి విద్వాంసులలో మణి గారి మేనల్లుడు, శిష్యుడు అయిన 'సంగీత కళానిధి' శ్రీ టి.వి.శంకరనారాయణన్ గారి గానంలో ఆయన బాణీ మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
కుంభకోణం రాజమాణిక్యం పిళ్ళై, మైసూర్ టి.చౌడయ్య వంటి గొప్ప వయోలిన్ విద్వాంసులు, పాల్ఘాట్ టి.ఎస్.మణి అయ్యర్, పళని సుబ్రమణ్య పిళ్ళైవంటి ప్రముఖ మార్దంగికులు ఆయనకు సహకారం అందిస్తూ వచ్చారు. మద్రాసులో స్థిరపడిన తర్వాత అక్కడ అనేక దేవాలయాలలో ఆయన చేసిన కచేరీలను సామాన్య ప్రజానీకం చుట్టుపక్కల ఇళ్లపై, గోడలపై, చెట్లపై సైతం ఎక్కి కూర్చుని వినేవారట. వారిని తృప్తిపరచడానికి కచేరీ చివర ఎన్నో లలితశాస్త్రీయ అంశాలను, రాగమాలికలను, ఇంగ్లీష్ నోట్ను పాడేవారు.
మణి అయ్యర్ గారు ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు. పరిశుద్ధమైన ఆయన వ్యక్తిత్వం. నడవడిక, వాటిని ప్రతిబింబించే తెల్లటి ఖాదీ వస్త్రధారణ, నిష్కల్మషమైన చిరునవ్వుతో కూడిన హుందాతనం ఆయనకు సంఘంలో ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. ధనార్జనకై సంగీత కచేరీలు చేస్తున్న కారణంగా త్యాగరాజ విరచిత 'నిధి చాల సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా' అనే కృతిని పాడడం ఆత్మవంచనగా భావించి పాడడం మానేశారు. కచేరీలలో పాడిన ప్రతి త్యాగరాజకృతికీ ఒక్క అణా అయినా పక్కన పెట్టి (అది ఎంత చిన్న మొత్తమైనా) తిరువయ్యారులోని త్యాగరాజస్వామివారి సమాధి నిర్వహణకై వెచ్చించాలని ఆయన కోరిక. ఆయన కోరిక ఎంతవరకు నెరవేరిందన్న విషయం పక్కనబెడితే పైన చెప్పిన విషయాలను బట్టి సంగీతం పట్ల, త్యాగరాజస్వామి వారిపట్ల ఆయనకున్న భక్తి విశ్వాసాలను, నిబద్ధతను మనం అర్థం చేసుకోవచ్చు.
కర్ణాటకసంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మద్రాసు మ్యూజిక్ అకాడమీవారి 'సంగీత కళానిధి' బిరుదు మణి అయ్యర్‌గారికి 1960 జనవరి మూడున అప్పటి కేంద్రమంత్రి శ్రీ హుమాయూన్ కబీర్ గారి ద్వారా, శ్రీ అరియకుడి రామానుజయ్యంగార్, జస్టిస్ రాజమన్నార్ గార్ల సమక్షంలో ప్రదానం చేయబడింది. తన అధ్యక్షోపన్యాసంలో ఆయన విద్యార్థులకెన్నో ఉపయోగకరమైన సూచనలను చేశారు. కర్ణాటక సంగీతంయొక్క స్థాయి దిగజారకూడదంటే సరళీలను, జంటలను నాలుగు కాలాలలో, అలంకారాలను, గీతాలను మూడు కాలాలలో, వర్ణాలను కనీసం రెండు కాలాలలోనైనా సాధన చేయనిదే కృతులను అభ్యసించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. 1960 మార్చి నెలలో ఆయనకు కేంద్ర సంగీతనాటక అకాడమీ అవార్డు అప్పటి భారత రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్గారి చేతుల మీదుగా ప్రదానం చేయబడింది. 1963లో తమిళ్ ఇసై సంగం వారు 'ఇసై పెరారిగ్నార్' బిరుదుతో సత్కరించారు.
ఇక, నిత్యజీవితంలో సంగీతం తర్వాత ఆయనకు ఇంగ్లీష్ భాషంటే అమితమైన ఆసక్తి ఉండేదట. ఆరవ క్లాసులోనే పాఠశాల విద్యను ఆపేసినా ఇంగ్లీషు భాషలో చక్కటి ప్రావీణ్యాన్ని సంపాదించారు. జార్జ్ బెర్నార్డ్ షా, చార్లీ చాప్లిన్ ఆయన అభిమాన కళాకారులు.
తన అవసానదశలో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు మణి గారు. 1964 ప్రాంతంలో ఆయన కంటిచూపు పూర్తిగా మందగించింది. రోజుల తరబడి మంచంపైనే ఉండాల్సి వచ్చింది. ఆయన బావగారు, శిష్యుడు అయిన వేంబు అయ్యర్ గారు ఆయనను కంటికి రెప్పలా కనిపెట్టుకుని సపర్యలు చేశారు. ఆ పుణ్యమేనేమో వారి కుమారుడు, మణి అయ్యర్గారి మేనల్లుడు, శిష్యుడు అయిన శ్రీ టి.వి.శంకరనారాయణన్ గారు గొప్ప విద్వాంసునిగా ఖ్యాతినార్జించడమే కాకుండా మణిగారి బాణీని నేటికీ సజీవంగా ఉంచి, మద్రాసు మ్యూజిక్ అకాడమీ వారి 'సంగీత కళానిధి' బిరుదును పొందారు. ఆయన శిష్యులలో ప్రముఖులు సర్వశ్రీ ఎస్.రాజం, టి.ఎస్.వేంబు అయ్యర్, తిరువెంగాడు జయరామన్, శ్రీమతి సావిత్రి గణేషన్ మొదలైనవారు.
1968 మార్చి 31న మైలాపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ కోసం మ్యూజిక్ అకాడమీ హాల్లో మాయవరం గోవిందరాజ పిళ్ళై, వెల్లూర్ రామభద్రన్గార్ల సహకారంతో చేసిన కచేరీతో సుదీర్ఘమైన ఆయన సంగీత జీవితానికి తెరపడింది. ఆరోగ్యం మరింత క్షీణించడంతో 1968 జూన్ 8న ఆయన ఇహలోక జీవితానికి కూడా తెరపడింది. సంగీత ప్రపంచం ఒక మధురమైన మణిని కోల్పోయింది. రేడియోలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. వార్తాపత్రికలు ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. జాతియావత్తూ ఘనమైన నివాళి అర్పించింది. భౌతికంగా మనమధ్య లేనప్పటికీ లెక్కకు మించిన గ్రామఫోన్ రికార్డులు, క్యాసెట్లు, సిడిల ద్వారా సంగీత ప్రపంచంలో వారు చిరంజీవిగా ఉండిపోయారు. ఆయన గళం, గానం, బాణీ తర్వాతి తరాలకు తరగని వారసత్వ సంపదగా నిలిచే ఉంది.
Comments
Post a Comment