విశాఖ మ్యూజిక్ అకాడమీ చేసిన సంగీత సేవ

 విశాఖ మ్యూజిక్ అకాడమీ చేసిన సంగీత సేవ


నాకు దాదాపు ఏడెనిమిదేళ్ల వయస్సునుండి కచేరీలు విన్న గుర్తుంది. విశాఖపట్నంలో చిన్న, పెద్ద కచేరీలేం జరిగినా ఊళ్లోని గురుకులాల్లోని విద్యార్థులందరం కలసి సమూహంగా  కూర్చుని వినేవాళ్ళం. కచేరీ అయ్యాక అర్థమైన విషయాలను గురించి చర్చించుకునే వాళ్ళం. అర్థంకాని వాటిని మర్నాడు గురువులను అడిగి తెలుసుకునేవాళ్లం. సంగీత విద్యలో సగం వినికిడి ద్వారానే అబ్బుతుందనేది నిర్వివాదాంశం. చిన్నతనంలో విశాఖపట్నంలో విద్యార్థులకు కచేరీలు విని, నేర్చుకునే అవకాశాలను కల్పించిన సభలనేకం ఉన్నా వాటిలో విశాఖ మ్యూజిక్ అకాడమీకొక ప్రత్యేకత ఉంది. దక్షిణాదిలోని స్టార్‌వేల్యూ, కమర్షియల్ పాపులారిటీ ఉన్న మహావిద్వాంసుల కచేరీలను ఒక్క విశాఖ మ్యూజిక్ అకాడమి మాత్రమే ఏర్పాటు చేయగలిగేది. అంకితభావంతో, నిస్వార్ధంగా సేవచేసిన కార్యవర్గం, వారి ప్రణాళికాబద్ధమైన కృషివలన సంప్రాప్తించిన అర్ధబలం దీనికి ప్రధానమైన కారణాలు. రోజువారి టిక్కెట్లు, సీజన్ టిక్కెట్లు, వార్షిక సభ్యత్వాలు, విద్యార్థులకు పాసులు - ఇలా ఎంతో పకడ్బందీగా సంగీతానికి వాణిజ్య స్థాయిని తీసుకురాగలిగింది అకాడమీ.


ఎల్ ఎస్ ఆర్ కె గా సుపరిచితులైన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగాధిపతి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్‌ వి సుబ్రహ్మణ్యంగారి తండ్రి కీllశేll డాll లంక శివ రామకృష్ణశాస్త్రిగారు, ఎన్ ఏ ఆర్ శాస్త్రిగా పిలవబడే పేనోరమా ట్రావెల్స్ అధినేత కీllశేll నిరాఘాటం అచ్యుతరామశాస్త్రిగారు, నాటి నుండి నేటి వరకు వయోభారాన్ని కూడా లెక్కచేయకుండా సేవచేస్తున్న శ్రీ ఎమ్మెస్ శ్రీనివాస్‌గారు, కోశాధికారి కీllశేll శ్రీ కాళీశంకర్‌(సి ఏ) గారు, ఆంధ్ర విశ్వవిద్యాలయ కెమికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి కీllశేll ఎ.రామలింగ శాస్త్రిగారు, రత్నా పవర్‌ప్రెస్ అధినేత శ్రీ రత్నారావుగారు, హిందీ టీచరుగారు శ్రీ కె.ఎస్.ఎన్.ప్రసాద్ గారు, శ్రీ శ్రీపాద వెంకన్న గారు ఇంకా పేర్లు తెలియని, గుర్తులేని ఎంతోమంది పెద్దలు అకాడమీకి కొన్ని దశాబ్దాలపాటు నిస్వార్ధమైన సేవలందించారు. ఎల్లెస్సార్కే గారు డెక్కన్ క్రానికల్లో, రామలింగ శాస్త్రిగారు హిందూలో కచేరీలయొక్క నివేదికలను, వాటిపై సునిశితమైన విమర్శనాత్మక వ్యాసాలను రాసేవారు. కచేరీ అయ్యాక ఎల్లెస్సార్కే గారి వందన సమర్పణ వారి భాషాజ్ఞానాన్ని, వాక్పటిమను ప్రతిబింబిస్తూ బహువినసొంపుగా ఉండేది. నూకరాజుగారు కచేరీలనన్నింటిని ఓపికగా క్యాసెట్ రికార్డర్లో రికార్డ్ చేసేవారు. ఆశీలుమెట్టలోని సెంట్రల్/దయాల్ స్టూడియోవారు ఫోటోలు తీసేవారు /తీస్తున్నారు. 


కచేరీలు వినాలనే ఆసక్తిని నాలో, నావంటి ఎంతోమంది విద్యార్థుల హృదయాలలో కలిగించడంలో, తద్వారా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుని ఒక మృదంగ కళాకారునిగా స్థిరపడడంలో అకాడమ పాత్రను నేనెన్నటికీ మరువలేను. నెలవారీ, వార్షికోత్సవ కచేరీలు కలుపుకుంటే 1994లో నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి ఉద్యోగార్థమై వెళ్లేలోగా దాదాపు 150 కచేరీలైనా వినుంటాను. నవంబరు చివరిలో జరిగే వార్షికోత్సవ కచేరీల వివరాలకోసం అక్టోబర్ నుండే ఎదురుచూపులు మొదలయ్యేవి. "సంగీత కళాసాగర" బిరుదు ఎవరికిస్తారో అని ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళం. ఆహ్వానపత్రికలు వచ్చిన దగ్గర్నుంచి రోజులు లెక్కపెడుతూ ఉండేవాళ్ళం. ఓ సినిమాకో, బీచ్‌కో వెళ్లడానికి ఎలా ఎత్తబడేవాడినో ఆ కచేరీలు వినడానికి కూడా అలాగే ఎత్తబడేవాడిని. చిన్నప్పటినుంచి కూడా అమ్మా,నాన్న గుర్తు చేయడం, దగ్గరుండి కచేరీకి తీసుకెళ్లడం ఎప్పుడూ లేదు. ఎవరో ఒకరితో, ఎలాగోలా వెళ్లిపోవడమే. మరో విశేషమేమిటంటే 1994లో అకాడమీ రజతోత్సవ కచేరీలు విని, డిసెంబర్ 12న ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నిలయవిద్వాంసునిగా విధుల్లో చేరాను. 2019 నా ఉద్యోగానికి రజతోత్సవ, అకాడమీకి స్వర్ణోత్సవ సంవత్సరాలు.


కలెక్టర్ ఆఫీస్ వెనుకవైపు ఉండే వివేకానంద హాల్లో జరిగిన అప్పటి కచేరీల మధురానుభూతులు నాకు ఇప్పటికీ కళ్ల ముందు కనబడుతూనే ఉంటాయి. వివేకానంద హాల్లో కచేరీలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. అక్కడ అన్నీ నేలటికెట్లే. హాల్ చివర స్టేజి ఉండేది కానీ అక్కడ కూర్చుంటే కళాకారుల హావభావాలు, చేతివేళ్ల కదలికలు (ఫింగరింగ్) కనిపించేవి కావు. అందుకని మొదటి వరసలో జాగా కోసం కచేరీ మొదలవడానికి ముందే వచ్చి కూర్చునే వాళ్ళం. కుర్చీలు లేకపోవడం వలన శ్రోతలు ఇరుక్కుని దగ్గరదగ్గరగా కూర్చునేవారు. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా పదిమంది అటు తిరిగి చూసేవారు. అందుకని నిశ్శబ్దంగా, ఏకాగ్రతతో వినేవాళ్ళం. వేదికకి, శ్రోతలకు మధ్య దూరం చాలా తక్కువ ఉండేది. అందుకని మొదటి వరుసలో కూర్చుని శ్రద్ధగా వింటే కళాకారుల గొంతుల్లోంచి, చేతుల్లోంచి వచ్చిన ఒరిజినల్ నాదం వినగలిగే వాళ్ళం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాదాపు పదవతరగతికి వచ్చేంతవరకు విన్న కచేరీలలో చాలాభాగం నాకు అర్థమయ్యేవి కావు కానీ కచేరీ వినడం అనేది ఒక వ్యసనం అయిపోయింది. నేను శ్రీ వంకాయల నరసింహం గారి దగ్గర నేర్చుకున్న ఆరు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం అకాడమీ వార్షికోత్సవాలప్పుడు సెలవలిచ్చి ప్రతీ కచేరీలో లయవిన్యాసంలో వాయించిన ముక్తాయిలన్నింటినీ రాసుకుని రమ్మనేవారు.


ఆ రోజుల్లో విద్యార్థులకుగల ఒక గొప్ప అదృష్టం ఏంటంటే మొబైల్ ఫోన్లు, వాయిస్ రికార్డర్లు లేకపోవడం. టి. కె. మూర్తి, ఉమయాల్‌పురం శివరామన్, కారైకుడి మణి, పాల్ఘాట్ రఘు, గురువాయూర్ దొరై వంటి వారు వాయించిన నడకలు, పాఠాలు, ముక్తాయిలు రెప్పపాటుకాలం ఏమరుపాటుగా ఉన్నా అర్థమయ్యేవి కావు. లైవ్ కాన్స‌ర్ట్స్‌లో    రీవైండ్, పాజ్  బటన్లు ఉండవు. దండమూడిగారి  ఎడమ పట్టూ, కమలాకర రావుగారి చేతిబరువు, వీరభద్రరావుగారి, ముళ్ళపూడిగారి అనుసరణలాలిత్యం - మృదంగ వాద్యంలోని ప్రధానమైన పుదుక్కొట్టై, తంజావూరు, విజయనగరం బాణీల ప్రతిబింబాల్లా ఉండేవి.  ఆయా బాణీల ముక్తాయివిధానం, ఫింగరింగ్, అనుసరణ విధానాలు చాలా ఉత్తేజపరిచేవి, ఆలోచింపజేసేవి. ఎల్లాగారి చేతిలోని వేగం, సుళువు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేవి. వాళ్లు కచేరీలో నాలుగు ముక్తాయిలు వాయిస్తే అతికష్టంమీద ఒకటో రెండో గుర్తుండేవి. తాళం ​వేస్తూ​ వింటే ముక్తాయిలు అర్ధమయ్యేవి కావు. ముక్తాయిలు వింటే తాళం పోయేది. ఒక్కోసారి అనుకోకుండా అప్పటికప్పుడు కచేరీలకు తాళం చెయ్యాల్సి వచ్చేది. తాళం నిలబెట్టుకుని, అన్నింటిని అర్థం చేసుకుని, గుర్తుంచుకునే ప్రయత్నంలో ఏకాగ్రత, ధారణ కొంతవరకు అలవడ్డాయి. వాటినన్నింటిని అర్థమయ్యేటట్లు, తిరిగి ఎన్ని సంవత్సరాల తర్వాత చూసినా వాయించగలిగేటట్లు రాసుకునే ప్రయత్నంలో ఒక ఖచ్చితమైన, శాస్త్రీయమైన నొటేషన్ విధానం, షార్ట్ కట్లు అలవడ్డాయి. ప్రతిరోజు కచేరీకి వెళ్లడం, శ్రద్ధగా వినడం, విన్న ముక్తాయిలన్నీ రాసుకోవడంతో ఒక క్రమశిక్షణ అలవాటయింది. ఈరోజుకీ మంచి పల్లవులను, ముక్తాయిలను రాసుకోవడం నాకలవాటు. అయితే, చాలా ఆలస్యంగా అర్థమైన విషయమేంటంటే రక్తి అనేది కేవలం ముక్తాయిలను రాసుకుని, కంఠస్థం చేసి  వాయించడం వలన మాత్రమే రాదనీ, సాధన, వాద్యంలో బరువు, ఒదుగు వలన మాత్రమే వస్తుందనీ. కచేరీలను ప్రత్యక్షంగా వినడంలోని మజా, ఉపయోగాలు, వినాల్సిన అవసరం నేటితరం అర్థం చేసుకోవాలి.


కొన్ని విభిన్నమైన కచేరీలు ప్రత్యేకంగా గుర్తుండిపోయాయి. ఉస్తాద్ అంజాద్ అలీఖాన్ గారి సరోద్ కచేరీకి హాల్లోని లైట్లన్నీ అర్పించి, వేదికపైకి రంగురంగుల ఫోకస్‌ లైట్లు పెట్టించడం, కచేరి మధ్యలో విరామం ఇచ్చి, బట్టలు మార్చుకుని రావడం చాలాకాలం వింతగా చెప్పుకున్నాం. ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారి కచేరీకి నేల ఈనినట్లు వచ్చారు జనం. హాల్లోపల, బయట వరండాలలో, ఆరుబయట కుర్చీలలో కూడా నిండిపోయి ఇంకా కొంతమంది నిల్చుని ఉన్నారు. అరగంట ఆలస్యంగా వెళ్ళిన నాకు కచేరి అయిపోయిన తర్వాత కూడా, కనీసం దూరం నుంచి కూడా కళాకారులను చూసే అవకాశం కలగలేదు. శాస్త్రీయసంగీత విద్వాంసులకు కూడా సినీతారలు, రాజకీయ నాయకులకు ఉండేంత క్రేజ్, అభిమానులు ఉంటారనీ, ఏ రంగానికి చెందినవారైనా సరే విద్వత్తు ఉంటే ప్రజలు సాష్టాంగ పడతారనీ స్పష్టంగా అర్థమైంది. పేరుప్రఖ్యాతులు, డబ్బు సంపాదించుకోవాలంటే ఇంజనీరో, డాక్టరో లేదా కలెక్టరో మాత్రమే అవ్వక్కర్లేదనీ ఆ రోజుల్లోనే అర్థమైంది. ఆ ధైర్యం, ధీమా వలననే నేను ఇంజనీరింగ్ వృత్తిని వదిలేసి, మనస్ఫూర్తిగా సంగీత రంగంలో స్థిరపడ్డాను. ఎల్లా వెంకటేశ్వరరావుగారి నవ మృదంగ సమ్మేళనం చూడడానికి, వినడానికి జనం విపరీతంగా వచ్చారు. మండా సుధారాణిగారి షట్కాల పల్లవి కచేరీకి విద్యార్థులు, విద్వాంసులు కూడా ఎంతో ఆతృతగా, ఆసక్తిగా వచ్చారు. అమ్ముల విశ్వనాధంగారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదు ఇచ్చిన సమయంలో   అకాడమీలో ఏర్పాటుచేసిన వారి హరికథాగానం ఒక అద్భుతం. హరికథకి​ కచేరీ స్థాయిని తీసుకువచ్చారు అమ్ములవారు .


ఈ సందర్భంలో కొన్ని సరదా సంఘటనలను కూడా చెప్పుకోవాలి. పుదుక్కొట్టై కృష్ణమూర్తిగారి వీణ కచేరీకి మొదటివరుసలో కూర్చుని వచ్చీరాని తాళం చెయ్యబోతే మా గురువుగారు శ్రీ నేమాని సోమయాజులుగారు వేదిక పైనుండి గుడ్లురిమి గద్దించడం, కళాకారులకు ఇవ్వబోయే గోల్డ్ స్పాట్ ​ డ్రింక్ సీసాల పక్కనే కూర్చుని, మూతలు తీయగానే వాటిని చటుక్కున లాగెయ్యబోతే ఎమ్మెస్ శ్రీనివాస్ గారు అదిలించడం తలుచుకుంటే తెలియకుండానే నవ్వొస్తుంది. అప్పట్లో ఆరు గోల్డ్ స్పాట్ మూతలిస్తే ఒక జంగిల్ బుక్ కార్టూన్ పుస్తకం ఇచ్చేవారు ​​ విషయం తెలిసిన మా నాన్నగారు మందలించి, మర్నాడు ఒక జంగిల్ బుక్ పుస్తకం తీసుకొచ్చి ఇచ్చారు. ​కానీ నేను సంపాదించుకోలేక పోయాననే అసంతృప్తి మాత్రం ఉండిపోయింది. కచేరి మధ్యలో చిన్న, పెద్ద విద్యార్థులందరూ జారుకుని, బయట సముద్రపుగాలిని ఆస్వాదిస్తూ, పల్లీలు, బజ్జీలు తింటూ, లోకోద్ధరణ కార్యక్రమాలను, ప్రణాళికలను చర్చించుకుంటూ, పెద్దవాళ్ల కంటబడకుండా హాల్లోకి దూరడం క్రమం తప్పకుండా జరిగేది.


ప్రతి కచేరీకి వెళ్ళినప్పుడు ఎకాడెమీ వేదికమీద నేనూ కూర్చోవాలి అన్న కోరిక బలపడుతూ ఉండేది. మొదటిసారిగా శ్రీ నూకల చినసత్యనారాయణ గారు ఘనరాగ పంచరత్నాలపై చేసిన సోదాహరణ ప్రసంగానికి మృదంగ సహకారం అందించాను. "తాళానికి వాయిస్తావా? పాటకి వాయిస్తావా?" అంటే "పంచరత్నానికే వాయిస్తాన"నడం నాకు బాగా గుర్తు. గురువుల ఆశీర్వచనంతో అదే అకాడమీ వేదికపై 1995లో వార్షికోత్సవాలలో 'పంచముఖి తాళావధానం' గురించి మొదటి సోదాహరణ ప్రసంగం చేయడం నా అదృష్టం. 1985లో అంటే నేను 9వ తరగతిలో ఉండగా ఆ సంవత్సరం సంగీత కళాసాగర బిరుదు గ్రహీత శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లుగారి చేతుల మీదుగా అకాడమీ వార్షిక పోటీలలో ప్రథమ బహుమతి బంగారు పతకం అందుకోవడం ఒక గొప్ప అనుభూతి. ​తరువాత తొమ్మిదేళ్లకి వోలేటిగారు పనిచేసిన ఆకాశవాణి విజయవాడ కేంద్రంలోనే నాకూ పనిచేసే అదృష్టం కలిగింది. 


నా చిన్నాన్నగారైన శ్రీ కె. కృష్ణమూర్తి గారు బహూకరించిన ఆటోగ్రాఫ్ పుస్తకంతో వివేకానంద హాల్లో నా జ్ఞాపకాలనెన్నింటినో భద్రపరచగలిగేను. ప్రతీ కచేరీ అయ్యేదాకా ఉండి, ఎగబడి మరీ ఆటోగ్రాఫ్‌లు తీసుకునేవాడిని. భగవంతుని దయవలన ఆరోజు నేను ఆటోగ్రాఫ్లు తీసుకున్న చాలామంది విద్వాంసులకు నేను మృదంగ సహకారం అందించేను. సర్వశ్రీ డాll బాలమురళీ, ఎమ్మెస్ గోపాలకృష్ణన్, ఎన్. రమణి, టి.వి. శంకరనారాయణన్, శేషగోపాలన్, పుదుక్కొట్టై కృష్ణమూర్తి, మాండొలిన్ శ్రీనివాస్ మొదలైన వారితో మొదటిసారి కచేరీ చేసినప్పుడు నా ఆటోగ్రాఫ్ పుస్తకం గుర్తొచ్చి కొంచెం గర్వంగా అనిపించింది. పుదుక్కొట్టై కృష్ణమూర్తి గారితో స్పెయిన్ పర్యటనకు కూడా వెళ్ళాను. ఈరోజు కళాకారులతో సెల్ఫీలు తీసుకోవడం ఒక ఫ్యాషన్. కానీ ఆటోగ్రాఫ్‌కి ఉన్న పర్సనల్ టచ్ డిజిటల్ కాపీకి రాదు.          

 

1991లో కళాభారతి ఆడిటోరియం కట్టాక వివేకానంద హాల్ ప్రాభవం తగ్గిపోయింది. నేల టిక్కెట్ల స్థానంలో కుర్చీ క్లాస్ వచ్చింది, దానిపైన బాల్కనీ వచ్చింది. ఫ్యాన్ల స్థానంలో ఏ.సి. వచ్చింది. ఈ పురోగమనంతో పాటే టీవీలు, వాటిలో సినిమాలు, సీరియల్స్ కూడా వచ్చాయి. ఆడుతూ పాడుతూ నేర్చుకునే చదువుల స్థానంలో చై-నా చదువులు వచ్చాయి. డిజిటల్ సంగీతం పెరిగింది. యూట్యూబ్ లైవ్‌లూ, ఫేస్‌బుక్ లైవ్‌లూ కచేరీలను ఇళ్లలోపలకు తీసుకెళ్తున్నాయి . క్రమంగా శ్రోతలు, మరీ ముఖ్యంగా యువశ్రోతలు తగ్గారు. కానీ శ్రోతల సంఖ్యతో సంబంధం లేకుండా అకాడమీ నిస్వార్ధంగా, నిరంతరాయంగా, ఉత్సాహంగా సేవచేస్తూనే ఉంది. ఆ రోజుల్లో అకాడమీ వేదికవైపు ఆశగా చూసిన ఎంతోమంది ఔత్సాహికులు నేడు అదే వేదికపై విద్వాంసులుగా మన్ననలందుకుంటున్నారు. నావంటి ఎంతోమంది విద్యార్థులలో స్ఫూర్తిని నింపి, వారి ఎదుగుదలకు దోహదం చేసిన అకాడమీకి నా నమోవాకములు. విశాఖపట్నం పరిసర ప్రాంతాలలోని విద్యార్థులకు విశాఖ మ్యూజిక్ అకాడమీ నిరంతరంగా స్ఫూర్తినందిస్తూనే ఉంటుంది. తరాలు మారినా అకాడమీ శాశ్వతంగా ఉంటుందనేది నా గట్టి నమ్మకం. అకాడమీతో నా అనుబంధాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు కార్యవర్గానికి నా ధన్యవాదాలు.

 ************************************************


Comments