రామవరం కచేరీ ముచ్చట
కళాకారులు కచేరీలు చెయ్యడానికి చాలా ఉళ్ళు తిరుగుతూ ఉంటారు. చాలా వరకు ప్రయాణాల్లో పెద్దగా విశేషాలేమీ ఉండవు. కొన్నిసార్లు మాత్రం రిజర్వేషన్లు కన్ఫామ్ అవకపోవడం, రైళ్లు లేటు/క్యాన్సిల్ కావడం వగైరా కారణాలవల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇవి కూడా రొటీన్గా జరిగేవే. కానీ, కొన్ని ప్రయాణాల్లో మాత్రం ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ క్షణానికి చాలా టెన్షన్, చిరాకు, కోపం, భయం కలిగినా ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి వచ్చాక మాత్రం చాలా తమాషాగా, సిల్లీగా అనిపిస్తాయి. తలచుకున్నప్పుడల్లా నవ్వొస్తుంది. అలాటి తమాషా సంఘటననొకదాన్ని తెలియజేస్తాను. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే. ఎవరినీ కించపరచడానికి కాదు. అందుకే ఒక్క 'తణుకు' పట్టణం పేరు తప్ప మిగిలినవన్నీ మారుపేర్లతో రాశాను. ఈ సంఘటన మాత్రం నూటికి నూరుపాళ్లు యధార్థమైనదే సుమండీ.
*రామవరం కచేరీ ముచ్చట*
ఇప్పుడు చెప్పబోయే సంఘటన 1992లో, అంటే ముప్ఫై సంవత్సరాల క్రితం జరిగింది. అప్పటికి నేనింకా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ చదువుతున్నాను.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారికి పక్కనే రామవరం అనే చిన్న ఊరు ఉంది. ఒకసారి అక్కడ రామాలయంలో ప్రముఖ విదుషీమణి శ్రీమతి అరుణా దేవి గారి గాత్ర కచేరీ ఏర్పాటు చేశారు. అరుణా దేవి గారు, వయొలిన్ విద్వాంసులు శ్రీ ప్రసాదరావు గారు, నేనూ ఉదయాన్నే సింహాద్రి ఎక్స్ప్రెస్లో విశాఖపట్నంలో బయలుదేరి మధ్యాహ్నానికి తణుకు చేరుకున్నాం. కాసేపు అక్కడే ఎవరింట్లోనో ఉండి సాయంత్రం రామవరం వెళ్ళాం.
కచేరీ బాగానే జరిగింది. మంగళం అయ్యింది. అరుణా దేవి గారు రేడెల్ ఎలక్ట్రానిక్ తంబురా, ప్రసాదరావు గారు వయొలిన్, కమాను సర్దుకున్నారు. నేను మృదంగం బోనం తీసేసి, సంచిలో సర్దుకున్నాను. మైకుల వాళ్లు జెట్ స్పీడ్లో కేబుల్స్ పీకేసి మైకులు, స్టాండ్లు సర్దుకుని వెళ్ళిపోయారు. వేదిక మీద తప్ప కింద పెద్దగా లైట్లు లేవు. అందరం స్టేజీ దిగి కిందకి వచ్చాం. నలుగురు ప్రేక్షకులు చుట్టుముట్టి తమ అభినందనలను తెలియజేస్తారని ఆశగా చూశాం. ఒక్క శ్రోత కాదు కదా దివిటీ పెట్టి వెతికినా ఒక్క నిర్వాహకుడు కూడా కనిపించలేదు. అప్పటికీ రాత్రి తొమ్మిదిన్నరైంది. పదిన్నరకి తిరుపతి-హౌరా ఎక్స్ప్రెస్లో ముగ్గురికీ తణుకు నుండి విశాఖపట్నానికి రిజర్వేషన్ అయ్యింది. 'అభినందనల సంగతి దేవుడెరుగు, అసలిక్కడ్నుంచి బయటపడి తణుకు చేరడమెలారా బాబోయ్' అని బెంగ పట్టుకుంది. సామాన్లు, వాద్యాలు మోసుకుంటూ ఈసురోమని రోడ్డు మీదకి వచ్చాం. అక్కడక్కడ కిళ్ళీ బడ్డీల్లో మిణుకు మిణుకుమని గుడ్డి దీపాలు, పెట్రోమాక్స్ లైట్లు తప్ప వీధి దీపాలు కూడా లేవు. కళ్ళు పొడుచుకుని చూసినా ఒక్క ఆటో కాదు కదా, కనీసం రిక్షా కూడా కనబడలేదు. అంత చలిలోనూ ముగ్గురికీ చెమటలు పట్టాయి. 'దేవుడా' అని కాళ్ళీడ్చుకుంటూ హైవే వైపు నడవడం మొదలుపెట్టాం. కొంతసేపటికి చిమ్మచీకట్లో కాంతిరేఖలాగ ఒక ముసలాయన రిక్షా తొక్కుకుంటూ వస్తూ కనిపించాడు. ముగ్గురి మొహాలు థౌజండ్ క్యాండిల్ బల్బుల్లాగా వెలిగాయి. పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని ఆపాను. తణుకు వెళ్లాలని చెప్పాను. 'నేనసలే ముసలాణ్ణి, అంత దూరం తొక్కలేన'ని మొరాయించాడు. అతని గెడ్డం, కాళ్లు పట్టుకొని బతిమిలాడి, కొంచెం డబ్బులు ఎక్కువిస్తామని ఆశ పెట్టి ఎలాగైతేనేం ఒప్పించాం. అరుణా దేవి గారు, ప్రసాదరావు గారు సామాన్లతో సహా ఎక్కేటప్పటికి ఆ రిక్షాలో అంగుళం జాగా కూడా మిగల్లేదు. వయస్సులో ఉన్నవాడిని కదా, వెంటనే నా మృదంగం ఆవిడ ఒళ్ళో పడేసి 'నేను ఎలాగోలాగా తణుకు రైల్వే స్టేషన్కి వస్తాన'ని చెప్పి వాళ్ళని పంపించేశాను.
ఇక అసలు కథ అప్పుడే మొదలైంది.
అడ్డదారిలో పరిగెత్తుకుంటూ ఎత్తుగా ఉన్న హైవే దగ్గరికి వెళ్లాను. ఊరికి పదడుగుల ఎత్తులో ఉంది హైవే. మెల్లిగా మట్టిదిబ్బల మీద నుంచి పాక్కుంటూ హైవే ఎక్కాను. అప్పటికింకా హైవే రెండు లైన్లు మాత్రమే. రయ్యిరయ్యిమంటూ వెళ్తున్నాయి లారీలు. ఎంత చేతులూపినా ఒక్కరు కూడా ఆపట్లేదు. అసలు ఆ చీకట్లో నేను ఎవరికీ కనపడట్లేదేమో. ఒక్క షేర్ ఆటో కూడా కనిపించలేదు. బాగా చలి వేస్తోంది. వణుకుతూ బిక్కుబిక్కుమని చూస్తున్నాను. ఇంతలో చీకటిని చీల్చుకుంటూ ఒక బక్కపలచని ఆసామీ తూలుతూ ఓ డొక్కుసైకిల్ మీద వస్తూ కనిపించాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ సైకిల్కి అడ్డం పడ్డాను. 'రైలు టైం అయిపోతోంది. అర్జెంటుగా తణుకు వెళ్లాల'ని బతిమిలాడాను. ససేమిరా అన్నాడతను. చివరికి కాళ్ళావేళ్ళా పడి ఒప్పించి, ఎగిరి, వెనక క్యారేజ్ మీద కూర్చున్నాను. ఈసురోమని వంకరటింకరగా తొక్కుతున్నాడతను. ఒక్క అర కిలోమీటరు తొక్కనే లేదు. అంతే, ఇక నా వల్ల కాదని ఆ బ.ప.ఆసామీ సైకిల్ పక్కకి తీసి ఆపేశాడు. చిమ్మచీకటి, పక్కనే పదడుగుల లోతులో పొలాలు, వాటిలోంచి కీచురాళ్ళ అరుపులు, కప్పల బెకబెకలూ.
అంతలోనే తళుక్కుమని ఒక అద్భుతమైన ఆలోచన నా బుర్రలో మెరిసింది. "మహాశయా, నేను డబుల్స్ తొక్కుతాను. తమరు వెనుక ఆసీనులుకండి" అని బతిమిలాడాను. ఏ కళన ఉన్నాడో 'సరే' అన్నాడు. నాకేమో స్పోర్ట్స్ సైకిల్ అలవాటు. ఇదేమో గుర్రం లాంటి పెద్ద సైకిల్. కాళ్లు సరిగ్గా అందవు. ధైర్యం చేసి తొక్కుతాననేసాను కానీ నాకు పీచుపీచుమంటూనే ఉంది. ఇలాంటి గత్యంతరం లేని పరిస్థితుల్లోనే మనలో నిద్రాణంగా ఉన్న శక్తి బయటకు తన్నుకొస్తుంది.
అసలు సర్కస్ అప్పుడే మొదలైంది. సైకిల్ సీట్ వై-ఏక్సిస్ మీద 20 డిగ్రీలు, జెడ్-ఏక్సిస్ మీద 30 డిగ్రీలు వంగి ఒక పక్కకి ఒరిగిపోయి - మేళం సరిగ్గా లేని వీణలా, నాటు మీటు కలవని మృదంగంలా ఉంది. నేను కూడా అంతే కోణంలో వంగి తొక్కాల్సి వస్తోంది. హ్యాండిల్ కొద్దిగా వంకరగా ఉంది. రిమ్ములు బెండ్ ఉన్నట్టున్నాయి. ఇద్దరం ఎక్కేటప్పటికి టైర్లలో గాలి సరిపోలేదు. వెరసి సైకిల్ రోడ్డుమీద వంకరటింకరగా సైన్ వేవ్ ఆకారంలో నడుస్తోంది. నేను పెద్ద సైకిలిస్ట్ననే అహంకారం,ఆత్మవిశ్వాసం నన్ను ఒక రెండు కిలోమీటర్లు తొక్కించాయి. మెల్లిగా ఓపిక అయిపోవచ్చింది. కాళ్లు తూలడం మొదలుపెట్టాయి. సైకిల్ తొక్కడంలో నాది అందెవేసిన కాలు అనే అహంకారం మెల్లిగా దిగిపోతోంది.
'లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె.....తనువున్ డస్సెన్....'
అని పోతనామాత్యులవారు వర్ణించిన గజేంద్రునిలాగ ఉంది నా పరిస్థితి. అయినా తెగించి విజయమో, వీరస్వర్గమో అని తొక్కడం మొదలు పెట్టాను. ఓ అరకిలోమీటరు దూరంలో మినుకుమినుకుమంటూ తణుకు రైల్వే గేటు సిగ్నల్ కనిపించింది. ఒక్కసారి ప్రాణం లేచొచ్చింది. ఆ సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించేలోగానే వెనుకనుంచి ఒక పెద్ద లారీ విపరీతమైన వేగంతో ఝామ్మని ఇంచుమించు రాసుకుంటూ వెళ్ళింది. అంతే ఆ అదురుకి, గాలికి ఒక్కసారి సైకిల్ పూర్తిగా అదుపు తప్పిపోయింది. వెనుక బ.ప. ఆసామీ తిట్లందుకున్నాడు. సైకిల్ని దారిలోకి తీసుకురావడం నావల్ల కాలేదు. ఒక్కసారిగా హ్యాండిల్ నా చెయ్యి జారడం, సైకిల్ రోడ్డుమీద నుండి పక్కన మట్టిలోకి దిగడం, తర్వాత పక్కనే నాలుగడుగుల లోతు గోతిలో ఇద్దరం పడడం, ఆ వెనుకే సైకిల్ మా మీద పడడం వెంటవెంటనే జరిగిపోయాయి. దెబ్బలేమీ తగల్లేదు. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇద్దరం బట్టలు దులుపుకుంటూ లేచాం. అంతే, బ.ప.ఆసామీ తిట్లు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక చచ్చినా సైకిల్ ఇవ్వనన్నాడు. అంతే, ఇక కాలికి పని చెప్పి రైల్వే గేట్ వైపుకి పరుగు మొదలెట్టాను.
ఆ క్రాసింగ్కి రైల్వే స్టేషన్ దాదాపు ఒక పావు కిలోమీటరు దూరంలో ఉంటుంది. టైం అయిపోతోంది. స్టేషన్ రోడ్డు మీదకి వెళ్లేంత సమయం లేదు. చేసేదిలేక ఆ చీకట్లోనే సినిమా క్లైమాక్స్లో హీరోలాగా రైలు వచ్చేవైపు వెనక్కి చూసుకుంటూ పట్టాల మధ్య చెక్కలపై నుంచి, కంకర రాళ్ళపై నుంచి పరిగెట్టాను. ఎలాగైతేనేం మొత్తానికి రైలుకన్నా ముందే వచ్చేనన్న విజయగర్వంతో ఒగర్చుకుంటూ ప్లాట్ఫామ్ ఎక్కాను. నా కోసం ఆతృతగా దిక్కులు చూస్తున్న అరుణా దేవి గారు, ప్రసాదరావు గారు దూరం నుంచి నన్ను చూసి ఊపిరి పీల్చుకున్నారు. దగ్గరకొచ్చాకా నవ్వుతూ నా వైపు చూసి "కంగారు పడకు. బండి గంట లేటు" అని చావుకబురు చల్లగా చెప్పారు. అంతే, ఒక్కసారిగా ఉసూరుమనిపించింది. ఒళ్లంతా నిస్సత్తువగా అనిపించింది. ఈ విషయం ముందు తెలిస్తే చక్కగా ఈల వేసుకుంటూ నడుచుకుంటూ వచ్చేవాణ్ణి కదా అనిపించింది. ఆ రోజుల్లో స్మార్ట్ఫోన్లా? యాప్లా?. రైలు ఎంత లేటు? అన్నది స్టేషన్కి వచ్చాకనే తెలిసేది. ఇంతకీ ఈ కథ సుఖాంతమా? కాదా? అనేది పాఠకులే తేల్చాలి. ఎవరి కర్మకి ఎవరుబాధ్యులు?
కథ ఇక్కడితో అయిపోలేదు సుమండీ! సీన్ కట్చేసి ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తే కచేరీ మొదలవడానికి ముందే నిర్వాహకులు వచ్చి 'సమయానికి డబ్బులు ఏర్పాటు కాలేదు, తర్వాత పంపిస్తామ'ని ప్రాధేయపడ్డారు. సహకార వాద్యాలకి బాకీ పెట్టడం ఎందుకని పాపం అరుణా దేవి గారు తన చేతిడబ్బులు నుంచి కొంత మొత్తాన్ని తణుకు ప్లాట్ఫామ్ మీదనే మా ఇద్దరికీ ఇచ్చారు. అయితే ఇప్పటికింకా ఆ మొత్తం ఆవిడకి అందనే లేదు.
ఉపసంహారం: సినిమాల్లోలాగా ఈ కథ చదివి ఓ యాభైయ్యేళ్ళ తర్వాతనైనా కచేరీ పెట్టించినాయన మనుమడో, మునిమనవడో అరుణా దేవి గారినో, ఆవిడ వారసుణ్ణో వెతుక్కుంటూ వచ్చి ఆ డబ్బులు వడ్డీతో సహా ఇస్తాడేమో!!!
Comments
Post a Comment