ఆదరణ కరువైతే.... - రెండవ భాగం (గానకళ - నవంబర్ 2018 )
వీర్రాజు, అప్పల్రాజు ఎప్పట్లాగే సంగీత కళాశాల ఆడిటోరియం బయట స్పీకర్‌లోంచి కచేరీని ఆస్వాదిస్తూ ఓ మూల చెట్టు కింద నిల్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
"ఏరా అప్పల్రాజూ, తెలుగు కళాకారులకు ఏదో ఘోరమైన అన్యాయం జరుగుతోందనీ, తీవ్రమైన అణిచివేతకు గురవుతున్నారనీ, అవకాశాలన్నీ దక్షిణాది వారికే ఇస్తున్నారని నిన్ననే నీ అక్కసంతా వెళ్ళగక్కేవు కదా. దానికి పరిష్కారాలు ఏవైనా చెప్పమంటే మంచి సస్పెన్స్‌లో 'సీరియల్ తరువాయి భాగం రేపు' అన్నట్లు ఆపేసావు. సరే ఇప్పుడు చెప్పు ఏం చేస్తే తెలుగు రాష్ట్రాలలో కళాకారుల పరిస్థితి బాగుపడుతుందో"
"ఒరేయ్ వెటకారాలు ఆపు. లేనిపోనివి కల్పించకు. నా దగ్గర అన్నావు కాబట్టి సరిపోయింది. నేనేమీ ఘోరాలూ, అణిచివేతలూ అని మాట్లాడలేదు. వాస్తవాన్ని నాకు అర్థమైన పద్ధతిలో చెప్పానంతే. ఇంత స్నేహితుడవై నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఇక నా అభిప్రాయాలను ఎవరు ఖాతరు చేస్తారు?" కాస్త కోపంగా అన్నాడు అప్పల్రాజు.
"నాయనా పొరపాటైంది. ఇంతకీ విషయానికి రా. నిన్న రాత్రి నుండి సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను"
"సరే విను. సమస్యకి మూడు ముక్కల్లో పరిష్కారం చెప్పాలంటే కచేరీలు పెరగాలి. కళాకారులకు గౌరవప్రదమైన, నిలకడైన ఆదాయం లభించాలి. మంచి కళాకారులను సెలబ్రిటీలుగా గుర్తించే పరిస్థితి రావాలి. మిగిలినవన్నీ వాటితో పాటు వస్తాయి. కానీ సమస్యను సరిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా తెలుగు రాష్ట్రాలలో సినిమా పాటలకు ఎందుకంత క్రేజ్, అవి పాడేవారికి అంత ఆదాయం ఎందుకొస్తుందో విశ్లేషించుకోవాలి. తమిళనాట కర్ణాటక సంగీతం అంత చక్కగా ఎందుకు ప్రచారం పొందిందో చర్చించుకోవాలి. ముందుగా సినిమా పాటల గురించి ఆలోచించు. సినిమా పాటలు చాలా సులభంగా సామాన్య ప్రజల వద్దకు చేరుతాయి. ఎక్కువమంది వింటారు. కాబట్టి వచ్చే ఆదాయం ఎక్కువ. పారితోషికాలు కూడా ఘనంగానే ఉంటాయి. అందుకని విపరీతమైన పోటీ ఉంటుంది. ఖచ్చితమైన శృతిలయలతో భావయుక్తంగా పాడగలిగే వాళ్లకే అక్కడ చోటుంటుంది. శాస్త్రీయ సంగీతం గురించి సామాన్య ప్రజలకి అవగాహన లేదు. కాబట్టి అది ఎక్కువ ఆదాయాన్ని సంపాదించి పెట్టలేదు. అందువలన ఎక్కువమంది దాని వైపు ఆసక్తి చూపించట్లేదు. విలువలు కాసేపు పక్కన పెట్టు. వాస్తవంలోకి రా. ఈ రంగంలోకి ఎక్కువమంది వచ్చి, పోటీ పెరిగి, నాణ్యతా పరంగా కూడా వృద్ధి చెంది, సామాన్య ప్రజానీకానికి చేరువగా వెళ్లాలంటే ముందుగా ఇందులో ఆదాయవనరులు పెరగాలి. నాణ్యతాపరంగా అని ఎందుకు అంటున్నానంటే కర్ణాటక సంగీత కళాకారులు శృతిని, వాయిస్ కల్చర్‌ని అంతగా పట్టించుకోరని, అందుకే హిందుస్థానీ సంగీతం కర్ణాటక సంగీతం కన్నా విశ్వవ్యాప్త ఆదరణను పొందింది అని ఒక అపవాదు ఉంది. అది పోవాలి. ఇంతకీ కళాకారుల ఆదాయం పెరగాలంటే ఒక మార్గం ఏంటంటే కమర్షియల్ టీవీ చానెళ్ళలో ఖచ్చితమైన శాస్త్రీయ సంగీత రియాల్టీ షోలు రావాలి. శాస్త్రీయ సంగీతాన్ని తగుమాత్రంగా కమర్షియల్ చెయ్యాలి. ఇది నేను కొత్తగా చెప్తున్నది కాదు. త్యాగరాజస్వామి కేవలం భక్తి భావంతో రామాంకితంగా రాసిన కృతులను వారి శిష్య ప్రశిష్యులైన వీణ కుప్పయ్యర్, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ వంటివారు కావేరీ తీరం నుండి చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లి, ఎంతోమంది శిష్యులకు విద్య నేర్పి, అక్కడ భజనలు, ఉత్సవాలు నిర్వహించి, సంగీతాన్ని నాలుగు దిక్కులా ప్రచారం చేశారు. వారు కూడా తమకొచ్చిన సంగీతాన్ని కేవలం భగవంతుని ముందు పాడుకుంటూ ఉండిపోయింటే ఈరోజు సంగీతం ఇంత ప్రచారంలోకి వచ్చుండేదా? క్రమంగా సంగీత సభలు వెలిశాయి. టిక్కెట్లపై కచేరీలు పెట్టే పరిస్థితి వచ్చింది. సంగీతాన్ని అమ్ముకుంటున్నారని ఛాందసవాదులు తీవ్రంగా నిరసించారు. కానీ ప్రజలు ఆదరించారు. అవి నిర్విఘ్నంగా కొనసాగి సంగీతం ప్రచారంలోకి వచ్చింది. దాని శుధ్దతకేమీ భంగం కలగలేదు. కళాకారుల ఆదాయం కూడా పెరిగింది. ఈరోజు పరిస్థితులకు రియాల్టీ షోలు పెడితే తప్పేమీ లేదు. సంగీతం త్వరగా ప్రచారంలోకి వస్తుంది. సినిమా పాటల్లోని సంగీతం, సాహిత్యం చాలా సరళంగా ఉంటాయి. కాబట్టి చాలా సులభంగా ప్రజల్లోకి వెళ్లిపోతాయి. శాస్త్రీయసంగీతం అలా కాదు. ఏదైనా చానల్ వారు శాస్త్రీయసంగీత పోటీలు పెట్టి లక్ష రూపాయలు బహుమతి ఇస్తున్నారని చెప్తే ఈ శాస్త్రీయ సంగీతంలో ఏదో గొప్పతనం ఉండే ఉంటుంది లేకపోతే లక్షరూపాయలు ఎందుకు ఇస్తారని సామాన్య ప్రజలు ఆలోచిస్తారు. క్రమంగా చూసేవాళ్ళు పెరుగుతారు. క్రికెట్, టెన్నిస్, ఫుట్‌బాల్ వంటి క్రీడలను జనం ఎందుకు ఎక్కువ చూస్తారు? ఆయా క్రీడాకారులకు ఇచ్చే పారితోషికాలు చాలా ఎక్కువ. గెలిస్తే వచ్చే ప్రైజ్‌మనీ అంతకంటే ఎక్కువ. చిన్న పిల్లలకి కూడా క్రికెట్‌లోని టెర్మినాలజీ మొత్తం వచ్చేసింది. కబాడీకి, హాకీకి అంత పేరెందుకు రాలేదో తెలుసా? వాటికి పారితోషికాలు, ప్రైజ్ మనీ తక్కువ. ఇవేవో సెకండ్ గ్రేడ్ ఆటలనుకుంటారు. క్రికెట్ పక్కింటి కూర. పుల్లగా ఉన్నా కూడా మన వాళ్లు తెగ సాధన చేసేశారు. హాకీ, కబడ్డీ మన సొంత క్రీడలు. అందుకే వాటిని చులకన చేశారు. హాకీ జాతీయక్రీడ అయినా కూడా దానికి ఎక్కువ ఆదరణ రాలేదు. అందుకే కబడ్డీ క్రీడాకారులు కొంతమంది స్పాన్సర్స్‌ని పట్టుకొని తెలివిగా ప్రోకబడ్డీ లీగ్‌ని సృష్టించి విపరీతమైన ప్రైజ్ మనీ పెట్టారు. అంతే. ఒక్కసారిగా ప్రేక్షకులు పెరిగిపోయారు. టిక్కెట్లు కొనుక్కుని మరీ వస్తున్నారు. అంతకంటే ముఖ్యంగా ప్రజలు కబడ్డీ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దాంట్లోని టెర్మినాలజీని అర్థం చేసుకుంటున్నారు. ఈ లీగ్‌కి ముందు, తర్వాత కూడా కబడ్డీ ఆటలో మార్పేమీ లేదు. ప్రజల ఆలోచన మారిందంతే. సినిమాపాటల రియాల్టీ షోలకి అంత ప్రచారం ఎందుకు వచ్చిందంటావ్? అందులోని ప్రైజ్‌మనీ, గెలిచినవారికి సినిమాల్లో పాడే అవకాశం ఇవ్వడం మొదలైనవి. క్విజ్ ప్రోగ్రాంలు అన్నింటికన్నా 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోకి ఎందుకంత ప్రచారం వచ్చిందంటావ్? బహుమతి చాలా ఎక్కువ కాబట్టి. కన్యాశుల్కంలో చెప్పినట్టు 'మన వాళ్ళొట్టి వెధవాయిలోయ్' అని వదిలేయకూడదు. ఎలా చెప్తే వారికి సంగీతం గురించి ఆసక్తి పెరుగుతుందో అలాగే చెప్పాలి. శంకరాభరణం సినిమాలో చెప్తేనేగానీ మనవాళ్ళకి శాస్త్రీయసంగీతం యొక్క విలువ, సాగరసంగమం సినిమాలో చెప్తేనే కానీ శాస్త్రీయనృత్యం యొక్క విలువా తెలియలేదు. ఒక్క ఛానల్ గనక రియాల్టీ షో పెట్టి, దానికి మంచి ఆదరణ వచ్చిందంటే క్రమంగా అన్ని ఛానల్స్ పెడతాయి. క్రమంగా ప్రజలు రాగాల గురించి, తాళాల గురించి ఆలోచిస్తారు. తమిళనాట జరిగిందదే. అక్కడ జరిగిన 'కర్నాటిక్ మ్యూజిక్ ఐడల్' పోటీకి ప్రజలనుండి ఎంత అద్భుతమైన స్పందన వచ్చిందో చూడు. రెండు మూడు సీజన్లు జరిగేటప్పటికి ప్రజలకి దాని విలువ అర్ధం అవుతుంది. క్రమంగా కచేరీలకి వచ్చేవాళ్ళు పెరుగుతారు. పిల్లలకి సంగీతం చెప్పిస్తారు. కళాకారుల ఆదాయం పెరుగుతుంది. సభలకి సభ్యత్వాలు, ఆదాయం పెరుగుతాయి. మంచి కళాకారులకు గుర్తింపు, డిమాండ్ పెరుగుతాయి. ఎప్పుడైతే ప్రజలకు అవగాహన పెరిగిందో వారు కొత్తదనాన్ని, వైవిధ్యాన్ని ఆశిస్తారు. తమిళనాడులోలాగా పోటీలో నిలదొక్కుకోవడానికి కళాకారులు బాగా సాధన చేస్తారు. క్రమంగా మంచి కళాకారులు తయారవుతారు. మంచి గుర్తింపు, ఆదాయం వస్తే వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు". ఒక్క క్షణం ఊపిరి తీసుకుని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు అప్పలరాజు.
"అసలు మన చుట్టూ ఉన్న పిల్లలు, వారి తల్లిదండ్రులు సంగీతంపై ఆసక్తి చూపించకపోవడానికి కారణం ఏంటంటే మనకి స్కూళ్లలో, ఆఫీసుల్లో సంగీతం గురించి మాట్లాడుకునే వాతావరణమే లేదు. సంగీతం నేర్చుకునే పిల్లలకి తోడెవరూ ఉండరు. ఎప్పుడైతే ఆ పిల్లలు టీవీ షోలలో, వార్తల్లో కనిపిస్తారో, భారీ నగదు బహుమతులు గెల్చుకుంటారో అప్పుడు తోటి పిల్లలు వారిని ప్రత్యేకంగా చూస్తారు. వారికి కూడా సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. పిల్లలు స్కూల్లో పాఠాలు ఎందుకు చదువుతారు? చిన్నతనంలో వారికి దాని విలువ తెలియదు. బాగా చదువుకుంటే పెద్దయ్యాక మంచి ఉద్యోగం వస్తుందని మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. ఇది కూడా అంతే. సినిమాపాటల పోటీలలో బహుమతులు గెలుచుకున్న వారి పేర్లు ఊర్లో మారుమ్రోగి పోతాయి. అదే ఆకాశవాణి జాతీయస్థాయి సంగీత పోటీలలో బహుమతులు గెలుచుకున్న వారి పేర్లు ఎంతమందికి తెలుస్తాయి? నేటి ప్రపంచంలో ప్రతీదీ పారితోషకం, ప్రచారం మీదనే ఆధారపడి ఉంది. మూడులక్షలు ప్రథమ బహుమతి అని ప్రకటించి, ఒక సినిమా నటిిని యాంకర్ గా పెట్టేటప్పటికి 'నాద్ భేద్' కార్యక్రమాన్ని దేశం అంతా ఆసక్తిగా తిలకించడం మొదలుపెట్టింది. ఆ పోటీకి సెలక్షన్స్ స్థాయి నుంచి వందల మంది విద్యార్థులు విపరీతంగా సాధన చేశారు. దూరదర్శన్ సప్తగిరి నిర్వహించిన స్వరసమరం పోటీకి కూడా ఇలాంటి స్పందనే వచ్చింది. ఫైనల్ పోటీ రవీంద్రభారతిలో గవర్నర్ సమక్షంలో అనేటప్పటికి ఆ పోటీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆకాశవాణి జాతీయ స్థాయి పోటీలకి నగదు బహుమతి, ప్రచారం రెండూ తక్కువే. సంగీత ప్రపంచంలో వాటికెంతో గౌరవం ఉన్నా సామాన్య ప్రజలకి వాటి గురించి తెలీదు. 'నాద్ భేద్', 'స్వరసమరం' వంటి పోటీలు ఒక్కసారి మాత్రమే జరిగాయి. సూపర్ సింగర్ లాంటి రియాల్టీ షోలలాగా ఇవి కూడా ప్రతి సంవత్సరం జరగాలి. ప్రభుత్వంలో , మీడియాలో పలుకుబడి బాగా ఉన్న సీనియర్ విద్వాంసులు వారి పలుకుబడితో ఇలాంటి షోలు పెట్టించే ఏర్పాటు చేయాలి. సంగీతం నేర్చుకునే పిల్లల్ని స్కూళ్లలో, చుట్టుపక్కలా ప్రత్యేకంగా చూసే పరిస్థితి క్రమంగా రావాలి. సంగీతానికి రోజుకి రెండుగంటలు టైం వేస్ట్ చెయ్యకుండా ఆ సమయం కూడా చదువుమీద పెట్టుంటే నీకు స్టేట్‌ర్యాంక్ వచ్చుండేదని చిన్నప్పుడు మా టీచర్ అన్నారు. ఆంధ్రదేశంలో స్వతస్సిద్ధంగా సామాన్య ప్రజలకి సంగీతం యొక్క విలువ తెలియనప్పుడు ఏదో ఒక పద్ధతిలో ముందు దాని విలువ తెలియజేయాలి. శంకరాభరణం సినిమా వచ్చిన కొత్తలో సంగీత కళాశాలల్లో ప్రవేశాలు పెరిగాయట. పోటీలు, బహుమతులు, ప్రచారం ఉండాలన్నది ప్రజల దృష్టిని సంగీతం వైపు మళ్లించడానికే"
"ఒరేయ్ నీ విశ్లేషణ బాగానే ఉంది కానీ మరి నిన్నంతా సంగీత సభలు తెలుగు కళాకారులను నిర్లక్ష్యం చేస్తున్నాయన్నావు కదా, వాటి ప్రస్తావనే తేలేదు. మరి వారేం చేయాలో కూడా చెప్పు" అన్నాడు వీర్రాజు.
అప్పలరాజు కొంచెం గొంతు సవరించుకున్నాడు. "ఒరేయ్ అక్కడికే వస్తున్నా. ఇప్పుడు నేను చెప్పినదంతా జరగడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. ఇన్నాళ్లపాటు సంగీతం నేర్చుకున్న వాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళు నిరుత్సాహపడకుండా, సంగీతంలోంచి వేరే వ్యాపకాలలోకి వెళ్ళిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను ముందే చెప్పినట్టుగా అనుభవం లేకుండా కళాకారుడి జ్ఞానం అభివృద్ధి చెందదు. మన ప్రాంతంలో ప్రజలకు సంగీతం పట్ల అభిరుచి పెరిగి, కచేరీలు పెరిగేంతవరకు విద్యార్థులను సభలు ప్రోత్సహించాలి. ఒకట్రెండుసార్లు బాగా పాడలేదని వారి కచేరీలు పెట్టడం మానేయకూడదు. వారికి అనుభవం పెరిగేంతవరకు ఓపిక పట్టాలి. అయితే పూర్తిగా సభలనే తప్పుపట్టకూడదు. లోకల్ టాలెంట్‌ని ప్రోత్సహించాలన్న నెపంతో విద్యార్థులు, యువ కళాకారులు కూడా విద్యను అభివృద్ధి చేసుకోకుండా కచేరీలు పెట్టమని సభలను అడగకూడదు. సభా నిర్వహణ చాలా కష్టం. నిర్వాహకులు ఏ ప్రయోజనం ఆశించకుండా చాలా నిస్వార్ధంగా సంగీతం కోసం కష్టపడుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు తమ ప్రదర్శనలో కొత్తదనాన్ని చూపించకుండా తమ కచేరీలను పెట్టలేదని సభలను నిందించడం చాలా తప్పు. అలాంటి వారి కచేరీలను సభలెందుకు పెట్టాలి? దీనికి నాకు తోచిన ఒక పరిష్కారం చెప్తాను విను. ఎన్నో కష్టాలు పడి కచేరీలు పెడుతున్న సభా నిర్వాహకులకు, తమ విలువైన సమయాన్ని కేటాయించి వినడానికి వస్తున్న శ్రోతలకి నాణ్యతను డిమాండ్ చేసే హక్కు కూడా ఉంటుంది. ఒకసారి సబ్ జూనియర్ కచేరి చేసిన పిల్లలకి వచ్చే సంవత్సరం అదే విభాగంలో కచేరి పెట్టం అని చెప్పేయాలి. విద్యను అభివృద్ధి చేసుకుని జూనియర్ విభాగంలో పాడే అర్హతను సంపాదించుకోమని చెప్పాలి. మళ్లీ సంవత్సరం పాడాలంటే సాధన చేయాల్సిందే అన్న బాధ్యత విద్యార్థులలో కలగాలి. ఈ సంవత్సరం పొడి కీర్తనలు పాడినవారిని తరువాత సంవత్సరం రాగం, స్వరం పాడాల్సిందేనని, ఆ పై సంవత్సరం నెరవల్, క్రమంగా రాగం తానం పల్లవి పాడమని చెప్పాలి. ఇప్పటికే కొన్ని సభలలో సీనియర్ కచేరీలలో తప్పనిసరిగా పల్లవి పాడాలనే నిబంధన ఉండడం చాలా సంతోషించదగ్గ విషయం. శ్రద్ధగా సాధన చేసే విద్యార్థులకు, యువకళాకారులకు వారి అనుభవాన్ని పెంచడానికి విరివిగా అన్ని సభలలో కచేరీలు పెట్టాలి. ఒక ఊళ్లో పది సభలు ఉంటే ఒకరు పెట్టారని మిగిలినవారు మానెయ్యకుండా అన్ని సభలలోను క్రమం తప్పకుండా కచేరీలు పెడితే బాగా అనుభవం వస్తుంది. చెన్నైలో జరిగేదదే. ఒకే ప్రాంతంలో అన్ని చోట్లా అవే అంశాలు, స్వరాలు, ముక్తాయిలు పాడితే కుదరదు కదా. అందుకని విద్యను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. కొన్నాళ్ళకి కళాకారుల సంఖ్య పెరిగి, వారిలో పోటీతత్వం పెరిగి బాగా సాధన చేస్తారు"
"ఒరేయ్ నువ్వు అత్యుత్సాహానికి పోయి మరీ అన్ని నిబంధనలను పెట్టి, అంతగా భయపెడితే పాడే కొద్దిమంది కూడా మానేస్తారు. బాగా పాడే వాళ్ళు సీనియర్ కచేరీలు పాడతారు. ఓ మాదిరిగా పాడే వాళ్ళని జూనియర్ కచేరీలు పాడుకోనివ్వాలి. ఇలాంటి నిబంధనలను పెడితే మొదటికే మోసం వస్తుంది" అంటూ నసిగాడు వీర్రాజు.
"ఒరేయ్ చాలా చక్కటి ప్రశ్న వేశావు. నేషనల్ క్రికెట్ టీమ్‌లో ఎంపికైన క్రీడాకారుడు 'నేను ఎన్నాళ్లయినా ఇలాగే ఆడతాను. నన్ను ఆఖరి వాడిగా ఉంచండి పర్వాలేదు' అంటే ఊరుకుంటారా? ఎప్పటికప్పుడు ఆటను మెరుగుపరుచుకోకపోతే వాడిని టీమ్‌లోంచి తీసేస్తారు కదా. ఇదీ అంతే. ఆకాశవాణిలో ఒక మంచి నిబంధన ఉంది. బి గ్రేడ్ వచ్చిన ఐదు సంవత్సరాలకు రీస్క్రీనింగ్ టెస్ట్‌కి వెళ్ళి తమ ప్రదర్శన బాగానే ఉంది అని నిరూపించుకోవాలి. ఆ క్రమంలో బాగా పాడకపోతే బి గ్రేడ్ తీసేసే ప్రమాదం కూడా ఉంది. అంటే దానర్థం ఏమిటి? ఎల్లకాలం ఒకేలా పాడతాం అంటే కుదరదని. అయితే విద్యార్థులను అలా మానేయకుండా ప్రోత్సహించడానికి ప్రతి సభ వారి వార్షికోత్సవ కచేరీలలో మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో ఇచ్చినట్లుగా ప్రతీ విభాగంలో ఉత్తమ గాయకుడు, వయోలిన్, మృదంగం కళాకారులకు బహుమతులివ్వాలి. తెలుగు రాష్ట్రాలలో కొన్ని సభలలో జూనియర్ విభాగంలో ఇప్పటికే ఆ విధంగా బహుమతులు ఇస్తున్నారు. ఆయా సభలలో కచేరీలను పోటాపోటీగా పాడుతున్నారు పిల్లలు. నా చిన్నప్పుడు మా పరమ గురువులు ఒక మంచి మాట చెప్పారు. 'మేము మంచి ఉద్యోగం వస్తుందనో లేదా కచేరీలు, పాఠాలు చెప్పుకుని బాగా సంపాదించవచ్చన్న ఆశతో విద్య నేర్చుకోలేదు. మా తల్లిదండ్రులు గురువుగారికి అప్పచెప్పారు. అంతే. వారేం చెప్తే అది సాధన చేయడం తప్ప మాకు వేరే ఆలోచన లేదు'. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మార్కులు, సీట్లు, ఉద్యోగాల కోసం మాత్రమే చదువు అన్నట్లు తయారైంది నేటి విద్యా విధానం, పిల్లల, పెద్దల ఆలోచన. కాబట్టి ఈ తరంలో ఏదో ఒక బహుమతిలాంటి ఆశ పెడితే తప్ప విద్యను అభివృద్ధి చేసుకోరు"
"ఒరేయ్, ఇంతవరకు సభలకి, పిల్లలకి సలహాలిచ్చేవ్. పెద్దవారికేం లేవా?"
"నాయనా ఎవరికీ సలహాలిచ్చేంత విషయం, వయస్సు, అనుభవం, కోరిక నాకు లేవు. నేను సలహాలిచ్చినంత మాత్రాన పుచ్చుకునేవారెవరూ లేరు. ఏదో ఊసుపోక నా ఆలోచనలను చెప్పానంతే. అది కూడా నీతో మాత్రమే. అయితే పెద్దవారికి కొన్ని విన్నపాలను చెయ్యాలని మాత్రం నాకనిపిస్తూ ఉంటుంది. బాగా పేరున్న మన విద్వాంసులు తెలుగు వారిలో బాగా వృద్ధిలోకి వస్తున్న కళాకారులని దక్షిణాదిలో పరిచయం చేయాలి. వారుకూడా వారి ముందుతరంవారు పరిచయం చెయ్యబట్టి పేరు తెచ్చుకున్నవారే కదా. ఓ నాలుగు సభలలో నిర్వాహకులను ఒప్పించి వారి కచేరీలు పెట్టించాలి. అక్కడి వారితో సమాన స్థాయికి ఎదగాలంటే అక్కడి వారితో వారి ప్రాంతంలోనే కచేరీలు చెయ్యాల్సిందే. రెండుసార్లు దీటుగా వాయించలేకపోతే తర్వాత చచ్చినట్టు సాధన చేస్తాం. చివరగా మరొక విషయం మర్చిపోయాను. కర్ణాటకలో ఒక చక్కటి పద్ధతి అమలులో ఉంది. దాన్ని మనం కూడా అవలంబిస్తే చాలా బాగుంటుందని నా ఆలోచన. సభా నిర్వాహకులు దక్షిణాది కళాకారుల కచేరీలను ఆంధ్రాలో పెట్టేటప్పుడు సహకారాలు ఇక్కడివారే వాయిస్తారని ఖచ్చితంగా చెప్పి ఒప్పించాలి. అలాగే సహకారాలను అక్కడినుంచి రప్పిస్తే ప్రధాన కళాకారులు మనవారే అయ్యుండాలి. అప్పుడే మన టాలెంట్‌ని నిరూపించుకోవడానికి, దక్షిణాదిలో మన పేరు నలుగురికీ తెలియడానికి ఒక అవకాశంగా భావించి బాధ్యతతో సాధన చేస్తాం. కర్ణాటకలో చాలా దశాబ్దాలుగా ఈ పద్ధతిని అమలు చేస్తూ చక్కటి ఫలితాలను సాధించారు. ఒక కచేరీలో కళాకారులనందరినీ వేరే రాష్ట్రం నుండి తీసుకురాకూడదనే అనధికార నిబంధనని చక్కగా పాటిస్తారక్కడ. అలాగే వేరే రాష్ట్రాల వారిని పిలిచేటప్పుడు బయోడేటా, ప్రెస్‌రివ్యూలు చూసి కాకుండా ప్రదర్శనని విని, బాగుంటేనే పిలవాలి".
"ఒరేయ్ నువ్వు చెప్పినది చాలా కర్ణపేయంగా ఉంది కానీ నాదో సందేహం మనం ఎంత కష్టపడినా చెన్నైలో సంగీతానికి వచ్చిన ఆదరణ మనకు వస్తుందంటావా? ఈ కబుర్లన్నీ కళాకారుల, సభల మీటింగ్‌లలో చర్చించుకోవడానికి, తీర్మానాలు చేసుకోవడానికి బాగుంటాయి. ప్రాక్టికల్ గా ఆలోచించు. నువ్వు చెప్పేవన్నీ జరిగే పనులేనా" అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు వీర్రాజు.
"ఒరేయ్ ముందు నీ నిరాశావాదాన్ని పక్కన పెట్టు. నేను చెప్పిన ప్రతిదీ జరిగే అవకాశం నూటికి నూరుపాళ్లు ఉంది. దీనికి ఒక అద్భుతమైన మార్గం మ్యూజిక్ సీజన్. చెన్నైలో సంగీతం బాగా ప్రచారం పొందడానికి ఒక ముఖ్యమైన కారణం డిసెంబర్ సీజన్. తెలుగు రాష్ట్రాలలో కూడా మ్యూజిక్ సీజన్ ఉండాలి. జనవరిలో త్యాగరాజ ఉత్సవాలు వస్తాయి కాబట్టి నవంబర్లో ఆంధ్రాలో మ్యూజిక్ సీజన్ ఉండాలి. ఇది మాటలు చెప్పినంత సులభం కాదు. కాకపోతే అసాధ్యం కూడా కాదు. విజయవాడలోని స్వరఝరి సంస్థ వారి రజతోత్సవాలకి 25 రోజులు కచేరీలు పెడతామంటే అన్నాళ్ళ పాటు ఎవరొస్తారులే అనుకున్నారు నీలాంటి వాళ్లు. కానీ నువ్వే చూసావు కదా. అన్ని రోజులూ హాల్ నిండింది. మొదటి సంవత్సరం సీజన్లో పది రోజులపాటు రోజంతా కచేరీలు పెట్టాలి. ఉదయం పూట సోదాహరణ ప్రసంగాలు, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కచేరీలు జరగాలి. మొదట్లో జనాలు ఎవ్వరూ రారు. చెన్నైలో కూడా కొన్ని చిన్న సభలలో మధ్యాహ్నం కచేరీలకి సెక్రటరీ, మైకులు పెట్టే వాళ్ళు తప్ప ఎవరూ ఉండరు. కానీ అనుభవం పెంచుకోవడానికి కళాకారులు కచేరీలు చేస్తారు. రాష్ట్రంలోని చిన్నా పెద్దా కళాకారులందరూ ఓక పది రోజులపాటు ఒకే ఊళ్లో బస చేస్తే ఖచ్చితంగా మీడియాలో, ప్రజలలో దీని గురించిన చర్చ వస్తుంది. సీనియర్లకు గంట లేదా గంటన్నర చొప్పున సమయం ఇచ్చి పల్లవి పాడాల్సిందేనని నియమం పెట్టాలి. మిగిలిన సంవత్సరం అంతా ఎలా ఉన్నా ఈ పది రోజులూ కళాకారులు పారితోషికాలు, మర్యాదల గురించి ఆలోచించకూడదు. నిర్వహణా భారం అంతా ఒకరిద్దరి కళాకారుల మీద పడెయ్యకూడదు. అందరూ చిన్న చిన్న బాధ్యతలను తీసుకోవాలి. పాజిటివ్‌గా ఆలోచిస్తే తెలుగువారిలో సంగీతాభిమానం, దాతృత్వం లేక కాదు. అవి నిద్రాణంగా ఉండి పోయాయంతే. చేసేవారికి చిత్తశుద్ధి ఉంటే దాతలు ఖచ్చితంగా ముందుకొస్తారు. విజయవాడలోని 'సంగీత సన్మండలి' దీనికి సరైన ఉదాహరణ. దాదాపు పాతికేళ్ల క్రితం విజయవాడలోని సంగీత విద్వాంసులందరూ కలసి ఏర్పాటుచేసిన సంగీత సన్మండలి త్యాగరాజ ఉత్సవాలు ఎంత ప్రచారం పొందాయో చూడు. వారం రోజులపాటు పండగలా జరుగుతాయి. సంగీతంతో సంబంధం లేనివారు కూడా ఈ ఉత్సవాల గురించి మాట్లాడుకుంటున్నారు. నీలాగే నిరాశావాదంతో ఆనాడు పెద్దలు వీటిని ప్రారంభించకపోయింటే? ప్రభుత్వ పరంగా కూడా ఈమధ్య కార్యక్రమాలు పెరిగాయి. సీనియర్ విద్వాంసులు చెప్తే ప్రభుత్వంలోని పెద్దలు కూడా అర్థం చేసుకుని సహకారం అందిస్తారు. ఒకట్రెండేళ్లు బాలారిష్టాలు తప్పవు. కానీ ఈ రోజు చెప్తున్నాను చూడు. రెండేళ్లు గడిచేసరికి ఈ సీజన్లో పాల్గొనడానికి దక్షిణాది నుంచి కూడా విరివిగా అప్లికేషన్లు వస్తాయి"
"అయిపోయాయా, ఇంకా ఏమైనా మిగిలాయా?" అంటూ సణిగాడు వీర్రాజు.
"ఒరేయ్ నువ్వు దేవాంతకుడువిరా. నువ్వేమో చక్కగా శాస్త్రబధ్ధంగా మాట్లాడుతూ, నన్ను మాత్రం బాగా రెచ్చగొట్టి, మొత్తం అంతా నాచేతే మాట్లాడించేవు. నువ్వు బయట బుద్ధిమంతుడిలా చలామణి అయిపోతావ్. నేనే ఎప్పుడూ ప్రతీవారితో వాదిస్తూ, ఖండిస్తూ చెడ్డవుతూ ఉంటాను. నా వల్ల ఏమైనా ప్రయోజనం కలిగితే దాని ఫలితాన్ని నువ్వు కూడా ఎంజాయ్ చేస్తుంటావు. బయటికెళ్లి ఇవన్నీ చెప్పి నన్ను మరోసారి చెడ్డ చేయకు. మనలాంటి భిన్నధృవాలకి స్నేహం ఎలా కుదిరిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు"
"ఒరేయ్ విషయాన్ని కదిపింది నువ్వే. వాదన పెంచిందీ నువ్వే. సలహాలిచ్చిందీ నువ్వే. ఏడ్చింది చాలుగానీ కచేరీ అయిపోవచ్చింది. మరీ మంగళం సమయానికి లోపలికెళ్తే బావుండదు. పద".
మిత్రులిద్దరూ ఆలస్యంగా వచ్చిన విషయం పెద్దవారికి తెలియకుండా వెనుక ద్వారం నుంచి హాల్లోకి ప్రవేశించారు.
రచన: కొమ్మాజోశ్యుల సద్గురు చరణ్,
నిలయమృదంగవిద్వాంసులు,
ఆకాశవాణి,
విజయవాడ
Comments
Post a Comment