మార్దంగికుడవ్వాలంటే సాధన మాత్రమే సరిపోతుందా? (రెండవ భాగం)

గత సంచికలో ఒక మార్దంగికుడు కచేరీ చెయ్యడానికి సాధన మాత్రమే కాక, ఇంకా ఎన్ని విషయాలపై శ్రద్ధ పెట్టాలో, మృదంగాన్ని శృతిపక్వంగా, సునాదంతో పలికేటట్లు చెయ్యడానికి వేదికనెక్కక ముందు ఎన్ని సమస్యలనెదుర్కోవాలో, వాటినధిగమించే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను నంక్షిప్తంగా వివరించడం జరిగింది. ఇక, వేదికపై మార్టంగికునకు ఎదురయ్యే . నవాళ్ళను, అతనికుండే అవకాశాలను, బాధ్యతలను, పరిమితులను తెలిసినంతలో వివరించే ప్రయత్నం చేస్తాను.


బుతువులు, వాతావరణం మొదలైన అంశాలు మృదంగం యొక్క ప్రవర్తనను వేదికనెక్కక ముందు ఎంత ప్రభావితం చేస్తాయో, ఇంచుమించు అంతే మోతాదులో వేదికపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక్కడ ‘ప్రవర్తన’ అనే మాటని ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ఒక్కోసారి అవి పెట్టే అవస్థలననుభవిస్తే వీటికి కూడా ప్రాణం, కళాకళలు ఉన్నాయేమో అనిపిస్తుంది.


ఎండవేడికి మృదంగాల శృతి పెరిగి సాయంత్రం కచేరీ సమయానికి చల్లగాలి తిరిగేటవ్పటికి తగ్గిపోతుంది. వాతావరణం సమశీతోష్టంగా ఉన్నా సాయంత్రం కచేరీ వేదికపై ప్లద్‌లైట్లు వేస్తే ఆ వేడికి మృదంగం శృతి హెచ్చిపోతుంది. చాలా సార్లు మృదంగ కళాకారులు ఫ్లడ్ లైట్లను ఆపేయమనో లేదా తగ్గించమనో చెప్పడానికి కారణం ఇదే. ఇక సమశీతోష్ణ (ఎ.సి) సభాప్రాంగణాల విషయానికొద్దాం. చల్లటి వాతావరణంలోకి మృదంగాన్ని తీనుకురాగానే దాని శృతి తగ్గడం మొదలుపెడుతుంది. కానీ విచిత్రంగా ఒక అరగంట తర్వాత తిరిగి శృతి పెరగడం మొదలు పెడుతుంది. ఎడమవైపు చర్మాలు సాధారణంగా తడిపితే తగ్గుతాయి. కానీ అరుదుగా 'హెచ్చుతాయి కూడా.


కచేరీ ఆసాంతం మృదంగం యొక్క శృతి సాధ్యమైనంతవరకు మారకుండా ఉంచడంలోనే విద్వాంసుని జ్ఞానం, నేర్చు, అనుభవం ఇమిడి ఉంటాయి. కుడిమూత శృతిని సరిచేసుకునే ప్రయత్నంలో ఎడమయొక్క నాదం కూడా కొద్దిపాటి మార్పులకు లోనవుతుంది.. అనుభవజ్ఞులైన విద్వాంసులు ఎడమను కూడా శృతి చేసుకుంటారు, అందులో స్వరాలను పలికిస్తారు. కుడి యొక్క శృతికి అనుగుణంగా ఎడమను కూడా శృతి చేస్తే కలిగే అనునాదం యొక్క మధురమైన అనుభూతిని మాటల్లో వివరించలేం. కుడి, ఎడమ మూతలు ఒకే గుల్లకు ఇరువైపులా అమర్చబడడమే దీనికి కారణం. తబ్లా నాదం కంటే మృదంగం నాదం మరింత నిండైనది, ఉత్కష్టమైనదనీ చెప్పగలగదడానికి కారణం ఇదే. ఎడమవైపు వాయించే అనేక గమకాలు కుడి యొక్క నాదాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.


ఇక మృదంగాన్ని వదిలిపెట్టి చేతుల దగ్గరికొద్దాం. మార్ధింగికులకు చలికాలం ఎంత ఆహ్లాదకరమైనదో, వారి చేతులకు చలి అంత ప్రమాదరకమైనది. చలికాలంలో ఊళ్ళు తిరగడానికి ఎంతో హాయిగా ఉంటుంది. చెమట ఎక్కువ పట్టదు. కానీ వాయించేటప్పుడు చేతి వేళ్ళపై కలిగే ఒత్తిడి వల్ల ఈ కాలంలో వేళ్ళు చాలా తొందరగా పగిలిపోతాయి. కళాకారులు సంవత్సరం మొత్తంలో చేసే కచేరీలలో అత్యధిక శాతం చలికాలం 3,4 నెలల్లోనే చేస్తారు. అనేక ప్రదేశాలలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు, అనేక సభల వార్షికోత్సవాలు, చెన్నైలో డిసెంబరు నంగీతోత్సవాలు ఈ కాలంలోనే జరుగుతాయి. ఈ నమయంలో వేళ్ళు పగలకుండా కాపాడుకోవడం చాలా అవసరం, కష్టం కూడా. ఈ కాలంలో చాలా మంది మార్దంగికుల వేళ్ళకు పట్టీలను చూడొచ్చు. మొండిగా వాయిస్తే పగిలిన వేళ్ళ నుండి రక్తం కూడా రావచ్చు. ఎన్ని మందులు పూసినా పగిలినంత సులభంగా గాయాలు మానవు. ఎందుకంటే వాటికి మానేందుకు అవకాశం ఇవ్వకుండా వెంటవెంటనే కచేరీలు వాయిస్తూనే ఉండాలి. కుడిచేతి చూపుడు వేలుకు పట్టీ చుట్టుకుని వాయిస్తే వాద్యంలో బరువు (డెప్త్‌) తగ్గిపోతుంది. మెల్లగా వాయించి, మైక్‌ వాల్యూమ్‌ పెంచితే శబ్దం పెరుగుతుంది కానీ బరువు పెరగదు. వేదికపై పాటకు, మృదంగానికి మధ్య తూకం (బ్యాలన్స్) దెబ్బతింటుంది. ఇలాంటి ఇబ్బందులలో కొన్ని మాత్రమే శ్రోతలకు తెలుస్తాయి. మిగిలినవి కళాకారులకు మాత్రమే అనుభవంలోకి వస్తాయి.


ఇక వాదన విషయానికోద్దాం. కష్టాలు, ఇబ్బందులను ఏకరువు పెట్టినపుడు బాధ్యతలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. “గాత్రజ్ఞుడు ‘'గరిననిద’ అన్నా ‘నరిగవద’ అన్నా “సగరిగమ’, 'సనిదమగ’, 'గమపదని' - ఇలా ఏది అన్నాా ఏ రాగంలో అన్నా మృదంగం పై 'తదిగిణత’ వాయిస్తే సరిపోతుందని కొంతమంది తమ అవగాహనా రాహిత్యాన్ని తెలియజేసుకుంటూ ఉంటారు. 'తదిగిణత’ని నేనూ వాయిస్తాను. మణి అయ్యర్‌ గారూ వాయించేవారు. అయితే వారి వాద్యానికంత విలువా, వారికంత పేరు ప్రఖ్యాతులూ, గౌరవం ఎలా లభించాయి? 'తదిగిణత’ అనేది 5 అక్షరాల శబ్దాన్ని నోటితో అనడానికి వీలుగా ఉండే ఒక జతి మాత్రమే. మృదంగం కుడి, ఎడమలలో పలికే పదికి పైచిలుకు నాదాల, వాటి సంధానం, గమకాల నుండి 5 అక్షరాల జతులను కొన్ని వందల రకాలు సృష్టించవచ్చు. నాలుగు నడకలూ,  ముగింపులూ, పాఠాలు, మొహరాా, ముక్తాయిలు నేర్చుకుని వేదికనెక్కే విద్యార్థికి, ఆ నాలుగింటితోనే 'శెభాష్‌ అనిపించుకునే విద్వాంసునికి తేడా ఎక్కడుంటుందో వివరించే ప్రయత్నం చేస్తాను.


1. ఒక నడకని అవ్వుడే వేదికనెక్కిన విద్యార్థి యాంత్రికంగా గురువుగారు చెప్పినది తు.చ. తప్పకుండా వాయిస్తాడు. కానీ విద్వా౦సుడు అదే నడకని గురువుగారు చెప్పినదానికి తాను విని నేర్చుకున్నది, నిరంతర సాధన ద్వారా తాను శోధించి, అనుభవించి, సాధించిన మార్దవాన్ని, సొగసులను అద్ది వాయిస్తాడు.


2. విద్యార్ధికి గట్టిగా వాయించడం, మెల్లిగా వాయించడం మాత్రమే తెలుస్తాయి. ఒక నడకలోని అక్షరాలలో దేన్ని బరువుగా, దేన్ని తేలికగా వాయించాలో తెలిసి వాయిస్తాడు విద్వాంసుడు.


3. గాత్రానికి, తాళానికి చక్కగా అతికేటట్లు విద్యార్థి వాయిస్తే, గాత్ర ధర్మం బట్టి, కృతియొక్క సాహిత్యాన్ని బట్టి, అర్ధాన్ని బట్టి కూడా వాయిస్తాడు విద్వాంసుడు.


4. విద్యార్థి తాళాన్ని బట్టి వాయిస్తాడు. విద్వాంసుడు వాయించినది సహజంగానే తాళంలో ఇమిడిపోతుంది.


5. కృతికి సహకరించేటప్పుడు గురువుగారు నేర్పిన నడకలలో అవసరం, సందర్భం బట్టి ఏదో ఒక నడకని ఎంపిక చేసుకుని వాయిస్తాడు విద్యార్థి. కచేరీ యొక్క రక్తిని ఇనుమడింపజేయడానికి మనోధర్మంగా నడకలను సృష్టించగలడు విద్వాంసుడు.


6. విద్యార్ధి వాయిస్తే ఫలానా గురువుగారి శిష్యుడని గుర్తించవచ్చు. గురువుగారి బాణీ అంతర్లీనంగా ఉంటూనే తనకంటూ ఒక ప్రత్యేకమైన, విలక్షణమైన శైలిని సృజించుకుంటాడు విద్వాంసుడు.


7. విద్యార్థి వాయించే తని ఆవర్తనంలోని పాఠాలు, ముక్తాయిలు ముందుగా నేర్చుకుని, సాధన చేయబడి, చక్కగా ప్రదర్శింపబడతాయి. కానీ విద్వాంసుని లయవిన్యాసం కృతియొక్క సాహిత్యానికి, ప్రధాన కళాకారుని మనోధర్మానికి పొడిగింపుగా ఒక ప్రవాహంలా సాగిపోతుంది. గురువుగారు నేర్పిన పాఠాలు, ముక్తాయిల చుట్టూ ప్రస్తారం అల్లుకుపోతుంది. తని ఆవర్తనం అనేది మార్ధంగికుని రాగాలాపనగా వర్ణించారు ప్రముఖ మార్దంగికులు 'సంగీత కళానిధి పాల్దాట్‌ శ్రీ టి.ఎస్‌. మణి అయ్యర్‌గారు.


విద్యార్థికి, విద్వాంసునికి ప్రధానమైన తేడా కృతికి చేసే అనుసరణ దగ్గరే వస్తుంది. నాలుగు తాళాలొచ్చిన వాళ్ళందరూ విద్వాంసులవరు. పాటకు వాయించడం మొదలుపెట్టిన కొత్తలో కొన్నాళ్ళు తాళానికి మాత్రం వాయిస్తాం. క్రమంగా సాహిత్యపు విరుపులు అర్ధం చేసుకుని, వాటికి అనుగుణంగా మనోధర్మసహితంగా వాయిస్తాం. ఇంకొంచెం అనుభవం పెరిగాక సాహిత్యపు విరుపులతో పాటు కృతి యొక్క అర్జాన్ని, భావాన్ని, గాయకుని శైలిని కూడా దృష్టిలో పెట్టుకుని వాయిస్తాం. మార్దంగికునికి గాత్రం కూడా ఎంతో కొంత వచ్చి ఉంటే ప్రధాన కళాకారుడు మార్దంగికుని నుండి ఏ సమయంలో ఏ విధమైన సహకారం ఆశిస్తాడో బాగా తెలుస్తుంది. ఒకే స్థాయిలో, నైపుణ్యంతో వాయించే మార్దంగికులలో పాట తెలిసినవారి అనుసరణలో మరింత సహజత్వం గోచరిస్తుంది. మృదంగ జతులను, ముక్తాయిలను నోటితో అంటూ తాళం వేయగల గాత్రజ్ఞులు లయలో దిట్టగా ఉంటారు. ప్రస్తుతం కొన్ని కళాశాలల్లో గాత్ర విద్యార్థులు మృదంగాన్ని మృదంగ విద్యార్థులు గాత్రాన్ని కొంతవరకైనా నెర్చుకోవాలని నిబంధన పెట్టడం చాలా సంతోషించదగ్గ పరిణామం.


ఒక్కొక్క గాయకునికి ఒక్కోరకవ్లైన అనునరణ నచ్చుతుంది. కొందరికి పాటను వెన్నంటి నీడలా, హాయిగా సర్వలఘువు వాయిస్తే ఇష్టం. కొందరు పాటకు దీటుగా ఉధృతంగా వాయిస్తే మరింత ఉత్సాహంగా పాడతారు. కొందరు గాయకులకు లెక్కలు, ముక్తాయిలు, పల్లవులు అంటే ఇష్టం. వారికి చక్కటి అనుసరణతో పాటు వారి లెక్కలకు వేదికపై అప్పటికప్పుడు దీటుగా స్పందించాలి. గాత్రానికొకలా, వాద్యానికి మరొకలా వాయించాలి. అంతకుముందు పరిచయం లేని గాయకులతో మొదటి సారి వాయించేటప్పుడు మొదటి అంశం పూర్తయ్యేలోగా వారి శైలిని, మనోధర్మాన్ని, ఇష్టాలను గ్రహించాలి. లయకు సంబంధించిన లోటుపాట్లేవైనా ఉంటే శ్రోతలకు తెలియనివ్వకుండా కప్పి పుచ్చి కచేరీ రక్తికి తోడ్చడాలి. ఎవరెవరికి ఎన్నెన్ని రకాలుగా వాయించినా ప్రతి విద్వాంసునికి అతనికంటూ ఒక ప్రత్యేకమైన బాణీ ఉంటుంది. ఎంతమంది మార్దంగికులు సంగీతరంగంలో ఉన్నా ఈ బాణీ వలననే ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా గుర్తించబడతారు. కళాకారుని మనస్తత్వం కూడా అతని బాణినెంతో ప్రభావితం చేస్తుంది.


సాధారణంగా గాత్ర విద్వాంసులు చాలా రోజులు ముందుగానే సాధన చేసి ఉంచుకున్న ముక్తాయిలనో, పల్లవులనో కచేరీలలో పాడతారు. వాటిని వయోలిన్‌, మృదంగ కళాకారులు అప్పటికప్పుడు వాయించాల్సి ఉంటుంది. అయితే వయోలిన్‌ కళాకారులు ముక్తాయిలకన్నా రాగాలు, స్వరాల పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అందుకని ఒక్కొక్కసారి ముక్తాయిలపై శ్రద్ధ పెట్టడం కష్టమవ్వచ్చు. అలాంటి సమయంలో మార్టంగికుడు ముక్తాయిని వెంటనే (గ్రహించి, తాళంలో ఎక్కడనుంచి వాయించాలో గుర్హు పెట్టుకుని, వయోలిన్‌పై స్వరకల్పన పూర్తయ్యేటప్పటికి అందించాలి. వేదికపై వయోలిన్‌, మృదంగ కళాకారుల మధ్య ఏర్పడే అవగాహన కచేరీ రక్తికి ఎంతగానో దోహదపడుతుంది.


ఇక, తని ఆవర్తనం ఎంతసేవు వాయించాలి? అనే విషయానికొద్దాం. తని ఆవర్తనం యొక్క వ్యవధిని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. కొందరు గాత్ర విద్వాంసులు మృదంగ లయవిన్యాసాన్ని ఆస్వాదిస్తూ, తాళం వేస్తూ, ఎంతసేపైనా ఆనందిస్తారు. కొందరికి తని ఎక్కువసేపు వాయిస్తే నచ్చదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చిన్న చిన్న గ్రామాలలో కూడా లయవిన్యాసాలనెంతో ఆనందిస్తారు. ప్రాంతాన్ని బట్టి, శోతలలో ఎంతమంది విద్వాంసులు, ఎంతమంది సాధారణ శ్రోతలున్నారనే దాని బట్టి, అందులో ప్రధాన కళాకారుడు చూపిన మనోధర్మాన్ని బట్టి, కొంతవరకు ప్రధాన కళాకారుని ఇష్టాన్ని బట్టి కూడా లయ విన్యాసం యొక్క వ్యవధిని, స్వరూపాన్ని నిర్ణయించుకోవాలి. తక్కువ వ్యవధిలో తన నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని ప్రదర్శించడం చాలా కష్టం. ఇంటి దగ్గర సాధన చేసినదంతా, అవే ప్రస్తారాలు, ముక్తాయిలు వాయించడానికి వీలుపడకపోవచ్చు. అప్పటికప్పుడు పల్లవి పాడి తని వాయించమన్నా సిద్ధంగా ఉండేటట్టుగా అన్ని తాళాలలో ముక్తాయిలను, మొహరాలను సాధన చేసి ఉంచుకోవాలి. కృతికో, పల్లవికో అనుసరణ చేస్తూనే తని ఆవర్తనానికి ఒక నమూనాని, మొహరా, ముక్తాయిలను ఆలోచించి సిద్ధంగా ఉంచుకోవాలి. తెలియని పల్లవులనప్పటికప్పుడు త్రికాలం, తిశ్రం చెయ్యగలిగే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆకాశవాణిలో ఈ అనుభవం నాకెంతగానో లభించింది.


సహకార వాద్య కళాకారులందరూ మధనపడేదే అయినా నలుగురిలో చర్చించని విషయాన్నొక దానిని నిశ్చితంగా చెప్పదలచుకున్నాను. వారందరి తరపున రాయట్లేదని కూడా తెలియజేసుకుంటున్నాను. ఫలానా కచేరీలో —- అద్భుతంగా గానం చేశారు. వర్ణం చక్కగా పాడారు. కృతిని రమ్యంగా గానం చేశారు. రాగాలాపన ఆకట్టుకుంది. ఫలానా కృతిలో స్వరకల్పన అద్భుతంగా సాగింది. …వయోలిన్‌పై, ... మృదంగంపై, ... ఘటంపై సహకరించారు. సంగీత కచెరీలపై వచ్చే పత్రికా నివేదికలు మూడొంతులు ఇలానే సాగుతాయి. ప్రధాన కళాకారునితో సమానంగా సాధన చేసి, వాయించినా సహకారవాదకుని ప్రజ్ఞ పాఠకునికి చేరదు. మిగిలిన నివేదికలలో ‘అనుసరణ బాగుంది,

తని ఆవర్తనం ఆకట్టుకుంది’ వంటి పడికట్టు పదాలు వాడబడతాయి. చాలా అరుదుగా కొంతమంది విమర్శకులు మాత్రమే లయవిన్యాసాన్ని కూడా విశ్లేషించి రాస్తారు. తాళవాద్య కచేరీలపై నివేదికలిచ్చినపుడు లేదా ఒక మృదంగ కళాకారుని గూర్చి ఒక ప్రత్యేక కథనాన్ని వెలువరించినపుడు. మాత్రమే కొంచెం వివరంగా రాయడం జరుగుతోంది. కచేరీ మొదలవడానికి ముందే అంశాలను తెలుసుకుని నివేదికలు తయారు చెయ్యడం కూడా దీనికొక కారణం. ఫలానా అంశంలో స్వరకల్పన బాగుంది అన్నట్లుగానే తని ఆవర్తనంలో ఖండనడ ప్రస్తారం బాగుంది. మృదంగం, ఘటం కలిపి వాయించిన తగ్గింపులు. రక్తిగా సాగాయి వంటి విమర్శలు కూడా వస్తే లయవాద్య కళాకారులకు కూడా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది. అయితే, ఎప్పుడూ పొగడ్తలే రాయాలని కూడా నేను కోరుకోవట్లేదు. ఒక చక్కటి విమర్శకుని అభిప్రాయం కళాకారునిలో బాధ్యతను పెంచుతుంది. పత్రికలలో ఫోటోలు వేసేటప్పుడు చాలా సార్లు సహకారవాద్యాలను వదిలేయడం జరుగుతుంది. కొన్ని సభల ఆహ్వానపత్రికల్లో ‘ఫలానావారు & బృందం - గాత్రం’ అని వేస్తూ ఉంటారు. సహకారాలు కూడా ఏర్పాటయ్యాక మొత్తం వివరాలతో వేస్తే బాగుంటుంది. కచేరీ చేసే కళాకారులందరూ ఎవరి పరిధిలో వారు శక్తి వంచన లేకుండా సాధన చేస్తి కచేరీని రక్తి కట్టించాలనే ఏకైక ఆశయంతో, శ్రోతలను ఆనందపరచాలనే సమిష్టి బాధ్యతతో వస్తారు.


మరొక నిరుత్సాహకరమైన విషయం: మృదంగ కళాకారుడు తని ఆవర్తనం మొదలుపెట్టగానే శ్రోతల్లో

కొంతమంది లేచి వెళ్ళిపోతుంటారు. క్యాంటీన్‌ సదుపాయం కల పెద్ద సభలలో ఇది తరచుగా జరుగుతుంటుంది. తని ఆవర్తనాన్ని విరామ సమయంగా భావించి, తర్వాత పాడబోయే లలితశాస్త్రీయ అంశాల కోనం తిరిగి రావడం సభామర్యాద కాదు. శ్రోతల్లో కొంతమంది లేచి వెళ్లిపోయేటప్పటికి మార్టంగికునిలో ఉత్సాహం కొంత చచ్చిపోతుంది. అయితే ఈ సందర్భంలో మృదంగ విద్యార్థులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. తమ తని ఆవర్తనానికి శ్రోతలు కూర్చోవట్లేదనే వారు ప్రధాన కళాకారులు రాగాలాపన చేసేటప్పుడు బయటకు వెళ్ళకూడదు, తని ఆవర్తనం అయిపోగానే ఇంటికెళ్ళిపోకూడదు. కచెరీలకు వెళ్ళడమే కాదు, వాటినెలా వినాలో కూడా తెలుసుకోవాలి. పాట, వయోలిన్‌, మృదంగం - వీటిల్లో తమ వాద్యాన్నొకలా, మిగిలిన వాటిని మరొకలా వినకుండా, మొత్తంగా సంగీతాన్ని ఆనందించగలిగిననాడే విద్యార్థి పరిపూర్ణమైన విద్వాంసునిగా తయారౌతాడు. 





Comments