ప్రాయోజిత సంగీత కార్యక్రమం - కధానిక

 'ప్రాయోజిత సంగీత కార్యక్రమం' - కథానిక


తెల్లవారింది. ఒళ్ళు విరుచుకుంటూ బద్ధకంగా పక్కమీద నుంచి లేచాడు వీర్రాజు. పక్కలో పదిలంగా పెట్టుకున్న రేడియోను ఆన్ చేశాడు. "ఆకాశవాణి - వార్తలు చదువుతున్నది ప్రయాగ సుబ్బారావు". అబ్బా, అప్పుడే ప్రాంతీయవార్తలు వచ్చేస్తున్నాయి అని గొణుక్కుంటూ మంచం దిగాడు. అర్ధరాత్రి దాకా సెల్లో మెసేజ్‌లు, వీడియోలు చూసుకుంటూ నిద్రలోకి జారుకుని, తెల్లవారగానే సెల్ ఆన్ చేశాకానే కళ్ళు తెరిచే నేటి కాలంలో రేడియో వింటూ నిద్రపోయి, లేస్తూనే రేడియో పెట్టే వీర్రాజులాంటి వీరాభిమానులు ఉన్నంత కాలం ఆకాశవాణి భవిష్యత్తుకి ఢోకా ఏమీలేదు. నిద్ర లేచిన దగ్గర్నుంచి తొమ్మిదిన్నరకి కర్ణాటకసంగీత కచేరీ అయ్యేదాకా రేడియో వింటూనే దినచర్య కానిచ్చుకుని అప్పుడు వీధినబడడం వీర్రాజుకి ఆనవాయితీ. రేడియోలో వార్తలు గంగా ప్రవాహంలా సాగుతున్నాయి. కాశ్మీర్లో అల్లర్లు - పాకిస్తాన్ మీద ఆరోపణలు; బెంగాల్లో వరదలు - బీహార్లో కరువు; అంతరిక్షంలోకి దూసుకుపోయిన ఇస్రో రాకెట్ - నెల్లూరులో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు; ప్రతిపక్షాల విసుర్లు - అధికారపక్షం కసుర్లు; ఇలా రొటీన్‌గా సాగుతున్నాయి వార్తలు.  

ఒక్క క్షణం గుక్క తిప్పుకుని మళ్లీ చదవడం మొదలెట్టాడు న్యూస్ రీడర్. "నిన్న కొత్తఢిల్లీలో సమాచారప్రసారశాఖా మంత్రి మాట్లాడుతూ భారతీయ శాస్త్రీయ కళలను, సంస్క్రతిని కాపాడుకోవడం ప్రసార మాధ్యమాల సామాజిక బాధ్యతనీ, ఈ బాధ్యతను ప్రసారమాధ్యమాలు మర్చిపోవడం చాలా బాధాకరమని తన ఆవేదనను వ్యక్తం చేశారనీ, దేశంలోని ప్రైవేట్ రేడియో, టివి ఛానెళ్ళన్నింటికీ గతంలో ఎన్నోసార్లు మార్గదర్శకాలు జారీచేసినా వారు ఖాతరు చెయ్యనందున ఈ మార్గదర్శకాలను నిర్బంధంగా అమలుచెయ్యబోతున్నామనీ తెలియజేశారు. నేటి నుండి అన్ని ప్రైవేట్ రేడియో ఛానెల్స్ రోజుకు కనీసం అరగంటసేపైనా శాస్త్రీయసంగీతాన్ని, అన్ని టీవీ ఛానెల్స్ రోజుకు కనీసం అరగంటపాటు శాస్త్రీయనృత్యాన్ని ప్రసారం చేయాలనీ, ఈ ఆదేశాలనతిక్రమించిన ఛానెల్స్ యొక్క లైసెన్సులు రద్దు చేయబడతాయనీ, ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని కూడా తెలియజేశారు". 

వీర్రాజుకి ఎగిరి గంతేద్దామనిపించింది కానీ స్థూలకాయం ఒప్పుకోలేదు. ఒకసారి గిల్లి చూసుకొని ఇది కలకాదని నిర్ధారణ చేసుకున్నాడు. అప్రయత్నంగా ఆనందభాష్పాలు రాలేయి. "ఇవాళ్టినుంచి అన్ని రేడియో ఛానల్స్‌లోనూ శాస్త్రీయసంగీతం వస్తుందోచ్" అని ఇంట్లో అందరికీ వినబడేలా పెద్ద పొలికేక పెట్టాడు. అన్ని ప్రైవేట్ ఛానల్స్‌లో కెల్లా 'రేడియో బజ్జీ' చాలా ప్రజాదరణ పొందింది. 'టుడేస్ ప్రోగ్రామ్స్ ఇన్ రేడియో బజ్జి' అని గూగుల్‌లో టైప్ చేశాడు. ఉదయం ఎనిమిది గంటలకు క్లాసికల్ మ్యూజిక్ అని కనిపించింది. వీర్రాజు ఆనందానికి అవధుల్లేవు. ఇంకా గంట మాత్రమే ఉందని అనుకుంటూ హడావిడిగా దినచర్యకుపక్రమించేడు. 

ఎనిమిదికింకా ఒక నిమిషం ఉందనగానే ఒకచేత్తో రేడియో మరొకచేత్తో వేడి కాఫీకప్పును పట్టుకొని టేబుల్ దగ్గరకొచ్చాడు వీర్రాజు. కాఫీకప్పును టేబుల్‌మీద పెట్టి, ఎఫ్ ఎం రేడియోలో 'రేడియో బజ్జీ' ట్యూన్‌చేసి, కులాసాగా కుర్చీలో కూర్చుని, కాఫీ సిప్‌ చేయడం మొదలుపెట్టాడు.  

"హాయ్ ఫ్రెండ్స్, మీరింతవరకు 'ప్యూర్‌డెంట్ పాట కావాలా' కార్యక్రమం విన్నారు. ప్రాయోజకులు - ప్యూర్‌డెంట్. చక్కటి మెరిసేపళ్ళకి ప్యూర్‌డెంట్ టూత్‌పేస్ట్‌నే వాడండి. మీరు వింటున్నారు 'రేడియో బజ్జి 103.1'. 

తర్వాత 'గెలూసిల్ కర్ణాటక సంగీతం' - ప్రాయోజిత కార్యక్రమం. ప్రాయోజకులు: గెలూసిల్. 

ట్రింగ్ ట్రింగ్ - ఒక్క చెంచా గెలూసిల్ తాగండి - కడుపుమంటకి గుడ్‌బై చెప్పండి".

వీర్రాజు తుళ్ళిపడ్డాడు. కడుపులో మంటగా, కాఫీ చేదుగా అనిపించింది.

"సహప్రాయోజకులు: పెయిన్‌కట్ - తలనొప్పి నివారిణి. 'ఒకేఒక్క బిళ్ళ - తల నొప్పి రాదు మళ్ళా',

'వస్త్రక్రాంతి - డిటర్జెంట్ పౌడర్'. ఒకేఒక్క ఉతుకు - బట్టలకు మెరుపు" - ట్రింగ్ ట్రింగ్. 

వీర్రాజు నిశ్చేష్టుడైపోయాడు. 'ఇది ప్రాయోజిత కార్యక్రమమా? నా ప్రారబ్ధకర్మమా? కర్ణాటక సంగీతానికి ఈ కడుపుమంట మందు పేరేమిటి?, తలనొప్పి మందు, బట్టల సబ్బు ప్రకటనలేమిటి? దేవుడా అనుకుంటూ తల పట్టుకున్నాడు.

"గెలూసిల్ కర్ణాటక సంగీతంలో పీకే చిన్నమ్మాళ్ గానం వింటారు. ముందుగా - ఎందుకు దయరాదురా, తోడి రాగంలో త్యాగరాజకృతి - మిశ్రచాపు తాళం". ముందు 'శ్రీమతి' అనో, వెనక 'గారు' అనో లేకుండా అలా ఏకవచనంతో చెప్తుందేంటి? అని సణుక్కుంటూ మళ్లీ కాఫీ తాగుతూ పాటలో లీనమైపోయాడు. కీర్తన చివరికొచ్చేటప్పటికి కాఫీ కప్పులో ముప్పాతిక వంతు ఖాళీచేశాడు. ఇలా ముగింపు అయ్యిందో లేదో అంతే 

'ట్రింగ్ ట్రింగ్ - తలనొప్పని చింతెందుకు? పెయిన్‌కట్ చెంతనే ఉండగా భయమెందుకు? పెయిన్‌కట్‌తో తలనొప్పి ఫట్. ట్రింగ్ ట్రింగ్' "తర్వాతి అంశం - ఏమి నేరము - శంకరాభరణం రాగంలో త్యాగరాజ కృతి  - ఆదితాళం". 

వీర్రాజుకి నిజంగానే తలనొప్పి మొదలైంది. కృతులు కూడా సింబాలిక్‌గా వస్తున్నాయేంట్రా నాయనా, కాస్త ఉత్సాహంగా ఓ పైకాలం కృతి పాడొచ్చుగదా అనుకుంటూ కాఫీ కప్పుని అటూ ఇటూ తిప్పడం మొదలెట్టాడు. కాఫీ మీద కోరిక చచ్చిపోయింది. ఈ కృతి తర్వాత ఏ ప్రకటన వస్తుందో బాబోయ్ అని ఆలోచిస్తూ కచేరి వింటున్నాడు. కృతి పూర్తయింది. వీర్రాజు అసంకల్పితంగా ఊపిరి బిగపట్టాడు.  

"గెలూసిల్ కర్ణాటక సంగీతంలో చిన్న బ్రేక్" ఉన్నట్టుండి పైకాలంలో మృదంగ లయవిన్యాసం మొదలైంది. కర్ణాటక సంగీతం మధ్యలో ఈ బ్రేక్ ఏమిట్రా? అందులోనూ ఈ లయవిన్యాసం ఏమిటి? ఎడిటింగ్ తప్పు చేశారా? అని అనుకుంటూ ఉండగానే మృదంగం ఆగిపోయింది. 

'ట్రింగ్ ట్రింగ్' "చిక్కటి వాద్యానికీ, చక్కని అనుసరణకీ ఆకాశవాణి టాప్‌గ్రేడ్ కళాకారులు ప్రచండ మార్తాండరావుగారి మృదంగ వాద్యాన్నే వినండి. సరసమైన ధరలకు ఆన్లైన్లో కచేరీలు బుక్ చేసుకోండి. బుకింగ్‌లు, రాయితీలుఇతర వివరాల కోసం www.chandaprachanda.com వెబ్సైట్‌ని సందర్శించండి. ఫోన్: 9444665544". మొత్తం పదిహేను సెకండ్లు దాటకుండా గడగడా చదివేసింది అనౌన్సర్. వీర్రాజు షాక్‌లో ఉన్నాడు. 

"చివరగా ఇంతకంటే కావలెనా ఈ కష్టము చాలదా - కన్నడ రాగంలో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన, రూపక తాళం". 

కాఫీ కప్పు పక్కకు తోసేశాడు వీర్రాజు. నుదుటి మీద చేతులు పెట్టుకుని, తల దించుకుని కూర్చున్నాడు. ఇదే ప్రధానాంశం కాబోలుననుకున్నాడు. రాగాలాపన, కృతి, నెరవల్, స్వరకల్పన పూర్తయి తని ఆవర్తనం మొదలవుతూ ఉండగా వాల్యూమ్ తగ్గింది. తలెత్తి చూసాడు వీర్రాజు. 'తని ఆవర్తనం ప్రాయోజకులు - ఒకే ఒక్క ఉతుకు - బట్టలకు మెరుపు - వస్త్రకాంతి డిటర్జెంట్ పౌడర్'. మళ్లీ వాల్యూమ్ పెరిగింది. రేడియోని విసిరికొడదామా అన్నంత కోపం వచ్చింది వీర్రాజుకి కానీ తమాయించుకున్నాడు. 'కచేరీని ఇలా ముక్కలు కింద కొట్టి ఉతికి ఆరేస్తున్నారేంట్రా దేవుడా' అని నిట్టూరుస్తూ మళ్లీ తలపట్టుకున్నాడు వీర్రాజు. కచేరీ పూర్తయింది. మొదట చెప్పిన ప్రాయోజకుల వివరాలు, ప్రకటనలు మళ్ళీ వచ్చాయి. 

"రేపు ఉదయం కర్ణాటక సంగీత కార్యక్రమంలో 'అమృతాంజనం రాగం-తానం-పల్లవి' వినండి". రేడియో కట్టేసి, భారంగా అడుగులేస్తూ పడకగదిలోకి వచ్చి మంచంమీద కూలబడ్డాడు వీర్రాజు. 

'శాస్త్రీయ సంగీతానికొక పవిత్రత ఉందని, అది మోక్షసాధనకొక మార్గమని, దాన్నిలా అగౌరవపరచకూడదనీ వీళ్ళకెందుకు తెలియలేదు?'

'అక్కడ పని చేసేవాళ్ళకి శాస్త్రీయసంగీతం రావాలన్న నిబంధనేమీ లేదుకదా, వాళ్ళనెలా తప్పుపడతాం' అని సమాధానం చెప్పుకున్నాడు. ప్రభుత్వం రోజూ సంగీతం ప్రసారం చెయ్యమంది. వీళ్ళు చేసేశారు. అంతే. మిగిలిన విషయాలనెవరూ పట్టించుకోలేదు. 'Dog booked - Dog delivered'  అన్నట్లుంది వీరి వ్యవహారం. మధ్యలో అది బతికుందా చచ్చిందా అన్నది వీళ్ళకి అనవసరం.

'సినిమా ఆధారిత రియాల్టీ షోలు, క్రీడావార్తలవంటి కార్యక్రమాలు నిర్వహించే యాంకర్లు సినిమాల గురించి, క్రీడల గురించి కనీస పరిజ్ఞానం సంపాదిస్తున్నారు కదా, అవి లేనివాళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఇవ్వరుకదా, మరి సంగీత కార్యక్రమాలు నిర్వహించే యాంకర్లకు సంగీతంలో కనీస పరిజ్ఞానం ఉండాలన్న నియమమెందుకు లేదు? అసలు ప్రస్తుతకాలంలో సినిమాపాటలు, ఆటలగురించి తెలియని వారెవ్వరు? చిన్నపిల్లలు కూడా వాటిగురించి అనర్గళంగా మాట్లాడుతున్నారే, మరి శాస్త్రీయసంగీతం గురించి కనీసపరిజ్ఞానం, ఆసక్తి ఎవరికీ ఎందుకు లేవు?'

ప్రశ్నలు, సమాధానాలు రెండూ తనే చెప్పుకుంటున్నాడు. 'సినిమాలు సులభంగా అర్థమవుతాయి. ఎంతో వినోదాన్ని కూడా అందిస్తాయి. శాస్త్రీయ సంగీతాన్ని అర్థం చేసుకుని, ఆనందించడం అంత సులభం కాదు కదా. అర్థంకానిదాని గురించి అంత సమయం ఎందుకు వృధా చేసుకోవాలి?'

'మరి లెక్కలు, సైన్సు కూడా అంత సులభంగా అర్థమయ్యే విషయాలు కావు కదా. పిల్లలకి వాటిలో వినోదం కూడా ఏమీ కనబడదు కదా. అయినా అప్పులు చేసి మరీ బోల్డంత ఫీజులు కట్టి, ట్యూషన్లు పెట్టి, కాన్సంట్రేషన్ క్యాంపుల్లాంటి హాస్టళ్లలో పడేసి, పిల్లల్ని రాచి రంపాన పెట్టి మరీ చదివిస్తున్నారు. ఎందుకని?

'అవి చదువుకుంటే మంచి ఉద్యోగాలొస్తాయి. బోల్డంత డబ్బు సంపాదించుకుని సుఖసంతోషాలతో ఆనందంగా జీవించవచ్చు. సంగీతం నేర్చుకుంటే మంచి ఉద్యోగాలు, జీతం వస్తాయన్న భరోసా ఏమిటి?' వీర్రాజుకి వెంటనే సమాధానం తట్టలేదు. కానీ మెల్లమెల్లగా సమస్య అర్థమవడం మొదలుపెట్టింది.

'పిల్లలకు జ్ఞానం వచ్చిన దగ్గర్నించీ సుఖంగా బతకాలంటే బోల్డంత డబ్బు కావాలని, అది సంపాదించుకోవాలంటే మంచి ఉద్యోగం కావాలనీ, ఆ ఉద్యోగం రావాలంటే బాగా చదువుకోవాలని మాత్రమే చెప్తున్నాం. చదువు ధనసంపాదన కోసం మాత్రమే కాదనీ, దాని ప్రధానోద్దేశ్యం జ్ఞానసముపార్జన, బుద్ధివికాసం అనీ చెప్పట్లేదు. సుఖసంతోషాల నిర్వచనం కూడా సరిగ్గా చెయ్యట్లేదు. ధనం భౌతిక, ప్రాపంచిక ఆనందాలను మాత్రమే ఇవ్వగలదనీ, వీటిని మించిన మానసిక, ఆధ్యాత్మిక ఆనందాలను సంపాదించి పెట్టలేదనీ, మానవజీవితానికి  ప్రాపంచిక సౌఖ్యాలనానందించడానికి మించిన పరమార్థం మరొకటి ఉందని చెప్పట్లేదు. ఒక వ్యక్తికి లేదా జాతికి గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిపెట్టేవి ధనం, అధికారం కావనీ, కళలు, సంస్కృతీసాంప్రదాయాలు మాత్రమేననీ, మనం పిల్లలకి బోధించటంలేదు. పాశ్చాత్యదేశాలను చూసి మనమెన్నో వాతలు పెట్టుకున్నాం. మన విద్యావిధానాన్ని ఆమూలాగ్రం మార్చేశాం. పాశ్చాత్యదేశాలలోని పాఠశాలల్లో సంగీతం తప్పనిసరి పాఠ్యాంశం. దానికి కూడా పరీక్షలు, మార్కులు ఉంటాయి. భారతీయ సంగీత ఔన్నత్యాన్ని పాశ్చాత్యులే ఒప్పుకున్నారే. మరి మనమెందుకు పాఠశాలల్లో సంగీతాన్ని  తప్పనిసరి చెయ్యట్లేదు? ఇలా జరిగిననాడు పిల్లలందరూ అంతో ఇంతో సంగీతం నేర్చుకుంటారు. కొన్నాళ్ళు చదువుకున్నాకా చదువుయొక్క విలువ, అవసరం అర్థం అయినట్లే కొన్ని సంవత్సరాలు నేర్చుకున్నాకా సంగీతంయొక్క గొప్పదనం, ఉపయోగాలు కూడా అర్థం అవుతాయి. నేర్చుకున్న వారందరూ విద్వాంసులవలేరు. కానీ క్రమంగా ఆ విద్యమీద, కళాకారులమీద గౌరవం పెరుగుతుంది. సంగీతంవలన వినోదంతో పాటు మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కూడా కలుగుతాయని, అలౌకికమైన ఆధ్యాత్మికానందం కూడా కలుగుతుందని అనుభవంలోకి వస్తుంది. స్వచ్ఛమైన శాస్త్రీయసంగీతం మనిషికి అవసరమని తెలిసినప్పుడు దానికోసం ధనం, సమయం, శ్రమ వెచ్చించడానికి వెనకాడరు. ఎప్పుడైతే ప్రజలలో ఈ చైతన్యం వస్తుందో అప్పుడు ప్రసారమాధ్యమాలు కూడా సంగీతానికి కొంత సమయం కేటాయించడం తమ బాధ్యతని తెలుసుకుంటాయి. సంగీతకచేరీలలోకి ఇష్టానుసారంగా ప్రకటనలు గుప్పించి, అగౌరవ పరచకుండా రోజులో మిగిలిన సమయమంతా తాము సంపాదించినదాంట్లో కొంతభాగం సంగీతంకోసం ఖర్చుపెట్టాలన్న జ్ఞానం కలుగుతుంది. దీన్నే వాణిజ్య పరిభాషలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) అంటారు. అంటే ఏ పరిశ్రమైనా తన సంపాదనలో కొంతభాగం సమాజహితం కోసం ఖర్చు పెట్టాలి. ఈ మొత్తంపై పన్నుమినహాయింపు కూడా ఉంటుంది. సంగీతానికి డబ్బు వెచ్చించడం కూడా CSR కిందకే వస్తుంది'. 

'సంస్కృతి, కళల పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమే. అయితే ఆచరణలో ఇలా ఎందుకు జరిగింది? అధికారులకు సంగీతంలో పరిచయం, దానిపై అవగాహన లేకపోవడం వలన. ప్రముఖ ఒలింపిక్ షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌ను కేంద్రప్రభుత్వ క్రీడాశాఖామంత్రిగా నియమించినట్లే ఒక కళాకారుని సాంస్కృతికశాఖామంత్రిగా నియమించాలి. కేంద్ర, రాష్ట్ర సంగీతనాటక అకాడమీలు, ICCR, CCRT, IGNCA, జోనల్ కల్చరల్ సెంటర్లవంటి జాతీయస్థాయి సంస్థలలోని అత్యున్నత పదవుల్లో కళాకారులను నియమించాలి. అప్పుడే కళలనభివృద్ధి చెయ్యడానికి, కళాకారులను ప్రోత్సహించడానికి అవసరమైన నిర్ణయాలను సరిగ్గా తీసుకోవడం, వాటిని సరిగ్గా అమలుచెయ్యటం సాధ్యపడతాయి. శాస్త్రీయసంగీతం సత్వగుణాన్ని ప్రేరేపిస్తుంది. ఎప్పుడైతే దేశంలోని ప్రజలందరికీ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం, అభిరుచి కలుగుతాయో అప్పుడు వారిలో సత్ప్రవర్తన కలుగుతుంది. దైవభక్తి, పాపభీతి పెరుగుతాయి. నేరాలు, ఘోరాలు తగ్గుతాయి'. 

'అవిభక్త భారతదేశంలో ఒక్కో కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా శాస్త్రీయసంగీతం నేర్చుకుని ఉండుంటే దేశ విభజన జరిగుండేది కాద'న్న ఉస్తాద్ బడేగులాం అలీఖాన్ గారి మాటలు గుర్తొచ్చాయి వీర్రాజుకి. 

ఇంతలో గడియారం తొమ్మిది కొట్టింది. వీర్రాజు ఆలోచనలకి బ్రేక్ పడింది. 'అమ్మో, ఈ ఆలోచనల్లో పడి మర్చిపోయాను. ఈపూట రేడియోలో, అదే ఆకాశవాణిలో నాయుడుగారి వయోలిన్ సోలో' అనుకుంటూ రేడియో దగ్గరికి పరిగెట్టాడు వీర్రాజు.

 

Comments