బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ వంకాయల నరసింహం


గురువులు చాలామంది ఉండొచ్చుగానీ సద్గురువులు కొంతమందే ఉంటారు. గురువుగారి దగ్గర విద్య నేర్చుకోవడమే కాకుండా వారి మనస్సును కూడా గెల్బుకుని ఆశ్రయించి ఉండేవాడే తర్వాతి కాలంలో సద్గురువుగా రూపాంతరం చెందుతాడు. లక్ష్యలక్షణ విభాగాలు రెండింటిలోనూ చక్కని ప్రతిభ, జ్ఞానం కలవారే మంచి గురువులు కాగలరు. సాధన, బోధన, ప్రదర్శన - వీటిని ఉపాధి మార్గాలుగా కాక, ప్రవృత్తిగా చేసేవారే సంగీతలోకానికి నిజమైన సేవ చెయ్యగలరు. సంగీతంపై బతకడం కాక, సంగీతంతో, సంగీతంలో, సంగీతం కోసం బ్రతికేవాడే తాను తరిస్తాడు, మిగిలిన వారిని తరింపజేస్తాడు. ఇటువంటి సద్గుణాలు కల బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ వంకాయల నరసింహం గారు. తాను స్వయంగా “టాప్‌ గ్రేడ్‌ మృదంగ విద్వాంసుడవ్వడమే కాక, ఈ రచయితతో పాటు ఇంకా ఎంతోమంది టాప్‌గ్రేడ్‌ విద్వాంసులును తయారుచేశారు. తను గురువు గారైన శ్రీముళ్ళపూడి లక్ష్మణరావుగారి ప్రియశిష్యులలో ఒకరిగా ఎంచబడద్దారు. 5 సంవత్సరాల ఒప్పంద పద్ధతిలో ఆకాశవాణిలో ఉద్యోగం రాగానే 21 సం॥ల నుండి విజ్ఞాన శాస్త్రోపాధ్యాయునిగా చేస్తున్న ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసి, సంగీతంలో బతకడానికై ఆకాశవాణికి వచ్చారు. నాకు విద్యనేర్పి బ్రతుకుదెరువును మాత్రమే కాక, జీవిత పర్యంతం నిలిచి ఉండే మానసికానందాన్ని, తృప్తిని కలగజేసిన మాగురువుగారి గురించి రాసే అదృష్టం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.



నరసింహం గారిది సంగీత వంశం. వారి పితామహుల నుండి మనుమల వరకు 5 తరాల సంగీత వారసత్వం వారిది. నాన్నగారైన లక్ష్మణస్వామి గారు భజన కీర్తనలను చక్కగా గానం చేసేవారు. తల్లిగారైన వెంకటలక్ష్మి గారికి కూడా సంగీతంలో చక్కటి ప్రవేశం ఉండేది. ఇటువంటి విద్వత్కుటుంబంలో 1931 నవంబరు 14న భీమునిపట్నంలో మాతామహుల ఇంట జన్మించారు. వారు పాఠశాల విద్యను విజయనగరంలోని మహారాజా బ్రాంచి కాలేజీలో, మహారాజా కాలేజీ హైస్కూల్‌లో చదివి 1947లో యస్‌.యస్‌. ఎల్‌.సి. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. గణిత, భౌతిక, రసాయన శాస్త్రాలు ప్రధానంగా మహారాజా కాలేజీ నుండి 1949లో ఇంటర్మీడియెట్‌ పరీక్షలో, 1952లో బి.ఎస్‌.సి. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.




ఇక సంగీతాభ్యాసానికొద్దాం.  చిన్నప్పట్నించీ వారింట్లో వారసత్వంగా భజన సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. వారింట్లో భజనలకు ప్రముఖ మార్దంగికులు, మహారాజా సంగీత కళాశాలలో మృదంగ అధ్యాపకులైన శ్రీపాద సన్యాసిరాజు గారు, కోలంకవెంకట్రాజు గారు, తూర్పు భాగవత సాంప్రదాయ మార్దంగికులు కోరుకొండ సత్యం గారు మొదలైన వారెంతో మంది వచ్చేవారు. సర్వశ్రీ పట్రాయని సీతారామశాస్త్రి, పేరి రామ్మూర్తి, ఘంటసాల వేంకటేశ్వరరావు, సంగీతరావు, సాలూరి రాజేశ్వరరావు వంటి గాయక ప్రముఖులెంతో మంది వచ్చి పాల్గొనేవారు. వారు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా రూపుదిద్దుకోవడానికి వారింట ఉన్న భజన సాంప్రదాయం ఎంతగానో తోడ్పడింది. వంద సంవత్సరాలకు పైబడి ఉన్న ఈ సాంప్రదాయాన్నితన జీవిత పర్యంతం కొనసాగించారు. ప్రతి శనివారం విధిగా రెండు గంటలకు తక్కువ కాకుండా భజన కీర్తనలను గానం చెయ్యడం వారి కలవాటు. ముక్కోటి ఏకాదశికి వారింట్లో రాత్రి తెల్లవార్లూ భజన జరుగుతుంది. ప్రతీ కృష్ణాష్టమికి ఏకాహం జరుగుతుంది. చిన్నతనంలో వినికిడి జ్ఞానంతో మృదంగం వాయించేవారు. ఈ కాలంలోనే లక్ష్య లక్షణ విభాగాలలో దిట్ట అయిన శ్రీ శ్రీపాద సన్యాసిరాజు గారి శిష్యరిక భాగ్యం కలిగింది. సన్యాసిరాజుగారికి గాత్రం, వయోలిన్‌, హరికథ, జ్యోతిష్యం, వైద్యంలో కూడా ప్రవేశం ఉండేది. కేవలం మృదంగ బోధన మాత్రమే కాకుండా తాను పాడి, సహకారంలోని మెళకువలు కూడా నేర్పారు. వారి హరికధలకు కూడా నరసింహం గారు సహకారం అందించారు. సన్యాసిరాజు గారి సుశిక్షణలో నరసింహం గారు తన పదవయేటనే మొదటి ప్రదర్శననిచ్చేరు. 1948లో నరసింహంగారింట ఎప్పట్లాగే కృష్ణాష్టమికి ఏకాహం జరుగుతుండగా ఒక గొప్ప విశేషషమైన సంఘటన జరిగింది. ‘పుంభావ సరస్వతి', ‘హరికథా పితామహ’ శ్రీమదజ్ఞాడాదిభట్ల నారాయణదాసు వారింటికి భజనకి వచ్చారు. ఆ సమయానికి మృదంగ విద్వాంనులెవరూ  లేరట. అవ్వుడు దాసుగారు నరసింహంగారిని చూసి “తాతా వాయిస్తావా?” అన్నారట. భయం తెలియని ఆ చిన్నవయసులో “అలాగే” అన్నారట. ఒక చిన్న కీర్తన పాడి, ఆ కుర్రవాడితో మృదంగం వాయింపించి “తాతా పనికొస్తావురా” అని ఆశీర్వదించారట. 85 సంవత్సరాల వయస్సులో వారు కాలంచేసేంతవరకు కూడా వారి వాద్యంలో వయస్సు ఛాయ తెలియలేదంటే దానికి దాసుగారి ఆశీర్వచనం ఒక ముఖ్యమైన కారణం.


తర్వాత కొంతకాలానికి శ్రీపాద సన్యాసిరాజుగారే స్వయంగా శిష్యుని తీసుకెళ్ళి ‘'మృదంగకేసరి’ శ్రీ ముళ్ళపూడి లక్ష్మణరావుగారికి అప్పజెప్పారు. ఎంతో గొప్ప మనసుంటే తప్ప తన శిష్యుని స్వయంగా వేరొక విద్వాంసుని వద్దకు శిష్యునిగా పంపడం జరగదు. లక్ష్మణరావు గారు నిత్యసాధకులు, గణితంలో దిట్ట. ఎప్పుడు పాఠం చెప్పినా సమయాన్ని పట్టించుకునేవారు కాదట. రాత్రి పన్నెండింటికి పాఠం చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయట. నరసింహంగారిని బుచ్చి అని ముద్దుపేరుతో పిలిచేవారట. 



ఇక, వారి ఉద్యోగ పర్వానికొద్దాం. 1952-53లో బి.ఇడి. పాసై, 1953లో విజయనగరంలోని బొడ్డు వారి హైస్కూల్‌లో విజ్ఞాన శాస్తోపాధ్యాయునిగా నియమితులయ్యారు. 1970 ప్రాంతంలో రేడియోలో ఆడిషన్‌కు హాజరై 'సి’, ‘బి’  గ్రేడ్‌లను దాటి నేరుగా ‘బిహై’ గ్రేడు కళాకారునిగా గుర్తించబడ్డారు. 1975లో విశాఖపట్నంలో ఆకాశవాణి కేంద్రం స్థాపించబడ్డాక మొదటితరం నిలయ విద్వాంసులలో ఒకరిగా 5 సంవత్సరాల ఒప్పంద పద్ధతిలో నియమితులయ్యారు. ఆకాశవాణిలో 16 నంవత్సరాల ఉద్యోగానుభవం తన వాద్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడిందని వారంటూ ఉంటారు.


“ఆకాశవాణిలో ఎన్నో సవాళ్ళు ఎదురౌతూ ఉంటాయి. తని ఆవర్తనాన్ని అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు పెంచి లేదా కుదించి వాయించాలి. అంతకుముందు పరిచయంలేని బాణీలకు చెందిన విద్వాంసులకు అప్పటికప్పుడు సహకారం అందించాలి. తెలియని పల్లవులను ముందుగా సాధన చెయ్యకుండా త్రికాలం, తిశ్రం చేసి, వాటిలో తని వాయించాలి” అని వారు చెప్తూ ఉంటారు. ఆకాశవాణిలో వారి అనుభవం వారి శిష్యులకు కూడా ఎంతో ఉపయోగపడింది.


వారు పాఠం. చెప్పే విధానాన్నీ ఈతరం విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది తెలియాలంటే నా స్వీయానుభవాన్ని కొద్దిగా తెలియజేయాలి. ఉదయం ఆకాశవాణిలో వారు వాయించిన పల్లవిని సాయంత్రం మా చేత వాయింపించి, త్రికాలం, తిశ్రం చేయించేవారు. వారు ఆకాశవాణిలో 5 నిమిషాలు తని వాయిస్తే మాతో గంటకి తక్కువ కాకుండా వాయింపించేవారు. ఆ తాళంలో పాఠాలు, ముక్తాయిలు, గతిభేదం, తగ్గింపులు, మొహరా, ముక్తాయిలతో నేరుగా కచేరీలో వాయించడానికి అనువుగా వాయింపించి, మర్నాటికి పాఠాలన్నింటినీ రాసుకురమ్మనేవారు. ఊళ్ళో ఏమైనా కచేరీలు జరిగినా, విశాఖ మ్యూజిక్‌ అకాడమీ వంటి సభల వార్షికోత్సవాలు జరిగినా, వాటిని విని, మృదంగ తని ఆవర్తనంలో విన్న ముక్తాయిలన్నింటినీ రాసుకు రమ్మనేవారు. అయితే ఆ రాసిన ముక్తాయిలను చూపించమని వారెప్పుడూ అడగనూలేదు, నేను రాయడం మాననూలేదు. క్రమశిక్షణతో, అంకితభావంతో పాఠం చెప్పే గురువుల మాటలకు అంతటి శక్తి ఉంటుంది.విన్న, కల్పించిన ముక్తాయిలన్నింటినీ రాసుకోవడం నాకప్పుడే అలవాటయ్యింది. సాయంత్రం ఐదింటికి పాఠం మొదలుపెడితే ఏనాడూ గడియారం వైపు చూళ్ళేదు. 4 గంటలకు తక్కువ కాకుండా ఎప్పుడూ పాఠం చెప్పలేదు. వారి ముక్తాయి లెక్క విధానం hit & trial విధానంలో కాక సూత్రం, గణితం ఆధారంతో ఖచ్చితంగా ఉండేది. పాఠాలు, లెక్కలు, ముక్తాయిలు లెక్కపెట్టడమే కాకుండా ఒక ప్రణాళికా బద్ధమైన ఆలోచనా విధానాన్ని వారు నాకలవాటు చేశారు. ఏ ఇద్దరు శిష్యులకూ కలిపి పాఠం చెప్పేవారు కారు. వారి వారి గ్రహణ శక్తిని బట్టి పాఠం చెప్పే విధానం మారేది. వారానికి 2రోజులే పాఠం చెప్పినా వారం మొత్తానికి సరిపడేంత గ్రంధం అందులో ఉండేది. వీరి శిష్యులలో రచయితతో పాటు నరసింహంగారి కుమారుడు వెంకటరమణ మూర్తి, పత్రి సతీష్‌కుమార్‌, బి.వి.యస్‌.ప్రసాద్‌ ఆకాశవాణి విశాఖపట్నం, వజయవాడ, కేంద్రాలలో టాప్‌ గ్రేడ్‌ నిలయ విద్వాంసులుగా ఎంపికయ్యారు. మండపాక రవి, ధన్వాడ అనంత్‌, జి.వెంకటేష్‌ మొదలైన వారు కూడా వీరి శిష్యులలో ముఖ్యులు. మృదంగ వాదనంలో దక్షిణాదిలో బాగా ప్రచారంలో ఉన్న తంజావూరు, పుదుక్కొట్టై బాణీలు రెండింటికీ తాము చెందమనీ, తమది స్వంత అస్థిత్వంకల విజయనగరం బాణీ అనీ, దీని విలక్షణతకు, గొప్పదనానికీ తన శిష్యుల, తన సహాధ్యాయుల శిష్యుల విజయాలే నిదర్శనం అనీ సగర్వంగా చెప్తూ ఉంటారు.


75 సంవత్సరాల ప్రదర్శనా జీవితంలో సర్వశ్రీ ద్వారం వెంకటస్వామినాయుడు, ద్వారం నరసింగరావు నాయుడు, నేదునూరి కృష్ణమూర్తి, వాసా కృష్ణమూర్తి, టి.ఎన్‌.కృష్ణన్‌, ఓలేటి, చిట్టిబాబు, పట్టమ్మాళ్‌, బృంద, మణి కృష్ణస్వామి, టి.ఆర్‌.సుబ్రమణ్యం వంటిఎందరో మహానుభావులకు మృదంగ సహకారం అందించారు. మృదంగం వాయించేవారికి పాట కూడా తెలిసుండాలని వారి నిశ్చితమైన అభిప్రాయం. చిన్నతనం నుంచీ వారింట్లో ఉన్న భజన సాంప్రదాయం వారికి గాత్రంలో కూడా చక్కటి అభిరుచినీ, ప్రవేశాన్ని కలుగజేసింది. అంతే కాకుండా గురుముఖతః నేర్చుకోకపోయినా హార్మోనియం వాయించడం. కూడా అలవాటయ్యింది.దాస సాంప్రదాయానికి చెందిన రామదాసు, తూము నరసింహదాసు, ఆదిభట్ల నారాయణదాసు,. పురందరదాసు వంటి వారి కీర్తనలను సేకరించి, కొన్నింటిని స్వరపరచి పాడేవారు.

1991లో తన 60వ యేట పదవీవిరమణ చేశారు. అనంతరం విశాఖపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘విజ్ఞానవిహార' గురుకుల పాఠశాల యాజమాన్యం వారి అభ్యర్థన మేరకు అక్కడ కొత్తగా నెలకొల్పబడిన సంగీత విభాగం ‘భారతీ కళావిహార’ ప్రధానోపాధ్యాయ పదవినలంకరించేరు. దట్టమైన తూర్పు కనుమల నడుమ, కాలుపష్యరహిత ప్రశాంత వాతావరణంలో 21 సంవత్సరాల పాటు కొన్ని వందల మంది శిష్యులకు విద్యాదానం చేశారు. మృదంగంలో త్వరిత శిక్షణా పద్ధతుల నేర్పరిచి, పిల్లలకు నేర్పి, మంచి ఫలితాలను సాధించేరు. ప్రముఖ వాగ్గేయకారుల జయంతి, వర్ధంతి ఉత్సవాలను యాజమాన్యం చేత ఏర్పాటు చేయించి, విద్యార్థుల చేత నిర్వహింపజేశారు. విద్యార్దులకు నేర్చుకోవడంతో పాటు సంగీతం వినడం, సభానిర్వహణ కూడా అలవాటు చేశారు.


వారి నిజాయితీ, నియమనిష్టల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. విద్యార్థులు ఆకాశవాణిలో పోటీలకు గానీ, ఆడిషన్‌కు గానీ వెళ్తే కనీసం మృదంగం శృతి చేసివ్వడానికి కూడా చుట్టుపక్మల ఎక్కడా కనిపించేవారు కారు. వారు కార్యదర్శిగా ఉన్న సంగీత కళాసమితి వార్షిక పోటీలకు శిష్యులెవరైనా వస్తే తాను ఆ పరిసరాలకు వచ్చేవారు కారు. ఆ పోటీలలో నిష్పాక్షికంగా న్యాయనిర్ణయం జరగాలని అభ్యర్భులనొక చోట, న్యాయ నిర్దేతలను వేరే గదిలో పెట్టి స్పీకర్‌ ద్వారా వినిపించే పద్ధతిని వారే ప్రవేశపెట్టారు. అభ్యర్థి వరుస సంఖ్య మాత్రమే న్యాయ నిర్జేతలకు చెప్పేవారు. ఒకసారి ఏదైనా కచేరీ ఒప్పుకుంటే ఆ తర్వాత ఎంతమంచి కళాకారునితో, ఎంతగొప్ప వేదికపై, ఎంతడబ్బులొచ్చే కచేరీ వచ్చినా ఒప్పుకొనేవారు కారు. అంత ఖచ్చితంగా మాటకి కట్టుబడి ఉండడం చాలా కష్టం.


సంగీత, శాస్త్ర విషయాలపై సోదాహరణ ప్రసంగాలు చెయ్యడం, పత్రికలకు వ్యాసాలు రాయడం, భజన కీర్తనల కచేరీలు చెయ్యడం మొదలైనవి వారి ఇతర వ్యాసంగాలు. అపురూప గ్రంధాలను సేకరించడం కూడా వారి కలవాటు. పంచముఖి, షణ్ముఖి తాళావధానాలకు సంబంధించిన ఎంతో విలువైన సమాచారాన్నీ, పుస్తకాలను నాకు వారందించారు. 1960లో విజయనగరంలో ఫ్రెండ్స్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అనే సంస్థను స్థాపించి, దానికి వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశారు. అది 56 సంవత్సరాలుగా నేటికీ విజయవంతంగా నడుస్తోంది. ఆకాశవాణిలో చేరాక విశాఖపట్నంలోని సంగీత కళాసమతికి కార్యదర్శిగా పనిచేశారు.


2018లో ‘విజ్ఞాన విహార’లో పదవీవిరమణ చేసి విజయనగరంలోని తమ స్వగృహానికి మకాం మార్చేరు. ఎంతటి నియమనిష్టలున్నా అవి ఆచరణ సాధ్యం కావాలంటే ఇంట్లో ఆడవారి సహకారం తప్పనిసరిగా ఉండాలి. మేనత్త కూతురైన సీతారత్నం గారితో 1948లో నరసింహంగారికి వివాహం జరిగింది. 1958లో అత్తవారింటికి వచ్చినప్పట్నించీ 60 సంవత్సరాలకు పైగా కచేరీలూ, పాఠాలూ, సాధన, భజనలు, ఏకాహాలు నిర్విఘ్నంగా సాగాయంటే తెర వెనుక అమ్మగారి శ్రమ, సహకారం ఎంతున్నాయో మనం ఊహించుకోవచ్చు. కేవలం భర్త వద్ద తప్ప బయట ప్రపంచంలో ఏ గుర్తింపూ రాని పనిని బాధ్యతగా, మనస్ఫూర్తిగా చెయ్యడానికి చాలా మనోబలం కావాలి.



నరసింహంగారికి అసంఖ్యాకంగా సన్నానాలూ, సత్మారాలూ జరిగాయి. ‘మృదంగ తపస్వి’, ‘మృదంగ విద్యాప్రవీణ’, విశాఖ మ్యూజిక్‌ అకాడెమీ వారి “సంగీత కళాసాగర’, ఆంధ్రా మ్యూజిక్‌ అకాడెమీ వారి ‘సంగీత విద్యానిధి’ వంటివి వారిని వరించిన బిరుదులలో కొన్ని మాత్రమే. 2012 నవంబరు14న వారి 81వ జన్మదిన సందర్భంగా శిష్యప్రశిష్య బృందం వారిని వశాఖపట్నంలో ఘనంగా సన్మానించేరు. 2014లో బెంగుళూరులో ప్రదానం చెయ్యబడిన పాలఘాట్ మణి అయ్యర్‌ అవార్డు తనకు చాలా ప్రీతిపాత్రమైనదని వారంటూ ఉండేవారు.


గురువుగారు మొదట బొడ్డువారి హైస్కూల్‌లో 22 సంవత్సరాలు, ఆకాశవాణిలో 16 సంవత్సరాల కాలం ఉద్యోగం చేశారు. ఎప్పుడు వారింటికి వెళ్ళినా మృదంగం వాయించుకోవడమో, పాడుకోవడమో, చదువుకోవడమో లేదా రాసుకోవడమో చేస్తూ కనబడేవారు తప్ప వారినెప్పుడూ ఖాళీగా చూడలేదు. వారు అనారోగ్యంతో రోజుల తరబడి బాధపడడం, హాస్పటల్‌లో చేరడం వారితో పరిచయం ఉన్న 29 సంవత్సరాలలో నేనెప్పుడూ చూడలేదు. 2016 డిసెంబరు 6వ తేదీ ఊపిరితిత్తుల ఇన్ఫెక్సన్‌తో వారు విశాఖపట్నంలోని టి.బి. ఆసుపత్రిలో చేరారు. అదే మొదలు, ఆఖరు అయ్యింది. డిసెంబరు 10 నాటికి వ్యాధి తగ్గుముఖం పట్టిందని, ఇంటికి వెళ్ళొచ్చని వైద్యులు నిర్ధారించారు. శనివారం అవడంతో కొన్ని భజన కీర్తనలు కూడా పాడుకున్నారు. అయితే విధి మరొకలా తలచింది. సాయంత్రం ఐదున్నర ప్రాంతంలో స్వల్ప అస్వస్థతకు గురై గీతా జయంతి పుణ్యదినాన ఆ కృష్ణ పరమాత్మలో ఐక్యమయ్యారు శ్రీ నరసింహంగారు. ఒక విద్యార్థిగా, ఉద్యోగిగా, తండ్రిగా, గురువుగా, కళాకారునిగా తన విద్యుక్త ధర్మాలను పరిపూర్ణంగా నిర్వర్తించిన ధన్యజీవి మాగురువుగారు. వారి శిష్యులమవడం మా పూర్వజన్మ సుకృతం, వారి అడుగు జాడలలో నడవడమే మా ధర్మం, కర్తవ్యం. 


కె.సద్గురుచరణ్‌, 

టాప్‌గ్రేడ్‌ నిలయ విద్వాంసులు, 

ఆకాశవాణి, విజయవాడ. 

సెల్‌ : 94407 09994.



Comments