శాస్త్రీయ సంగీత వ్యాప్తికి అవరోధాలు - ప్రజల బాధ్యతలు
June 21 2021
అందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు.
తెలుగు రాష్ట్రాలలో శాస్త్రీయ సంగీతం యొక్క పరిస్థితిని వివరిస్తూ నేను గతంలో రాసిన వ్యాసం 'శాస్త్రీయ సంగీత వ్యాప్తికి అవరోధాలు - ప్రజల బాధ్యతలు' అనే వ్యాసాన్ని ఇంకొక్కసారి మీ ముందుంచుతున్నాను. ఈ వ్యాసం 2015 మే నెలలో 'గానకళ'లో ప్రచురితమైంది.
అప్పట్లో ఈ వ్యాసం మంచి ప్రజాదరణ పొందింది. రెండు పత్రికలలో తిరిగి ముద్రితమైంది. వ్యాసం కొంచెం సుదీర్ఘమైనది. మన్నించగలరు.
'శాస్త్రీయ సంగీత వ్యాప్తికి అవరోధాలు - ప్రజల బాధ్యతలు'
రచన: కె. సద్గురుచరణ్,
నిలయ మృదంగ విద్వాంసులు,
ఆకాశవాణి, విజయవాడ.
ఫోన్: 9110363418, 9440709994 (వాట్సప్)
ఒకసారి కేరళలోని పాల్‌ఘాట్‌లో ఒక పెద్ద ప్రభుత్వాధికారి తన కుమారుని వెంట బెట్టుకుని జగద్విఖ్యాత మృదంగ విద్వాంసులు పాల్‌ఘాట్ శ్రీ టి.యస్. మణి అయ్యర్ గారి వద్దకు వెళ్ళి ఇలా అన్నారట “మావాడికి చదువు సరిగా అబ్బట్లేదు. ఈ మధ్య కొన్ని పరీక్షల్లో తప్పాడు, అందుకని---” - మాట పూర్తవక ముందే మణిగారు కలగజేసుకుని “అయ్యో పాపం అలాగా! అయితే మీ వాడికి మృదంగం కూడా సరిగా రాదే” అన్నారట. మణిగారి ఆంతర్యం అర్ధం చేసుకున్న ఆ ఆధికారి మిన్నకుండిపోయాడట. ప్రస్తుతకాలంలో ఎవరైనా 'మా అబ్బాయికి సంగీతంలో గట్టి శిక్షణను ఇప్పిస్తున్నాం” అంటే “పాపం చదువబ్బలేదు కాబోలు” అని అనుకునేవారికి ఈ సంఘటనను తప్పనిసరిగా తెలియజేయాలి. సంగీతాన్ని చదువుతో, ఇతర ఉపాధి అవకాశాలతో సరిపోల్చి, ఆర్ధిక ప్రయోజనాలను లెక్కగట్టే వారంటే నాకున్న అసహనంతో ఓ నాలుగు మాటలు రాయాలని సంకల్పించాను. నా వాదనను సమర్దించుకునే ప్రయత్నంలో ఎంతవరకు సఫలీకృతుడనయ్యానో పాఠకులే నిర్ణయించాలి. ప్రతివిమర్శకు సిద్ధపడే నేనీ మాటలు రాస్తున్నాను. శాస్త్రీయ సంగీతం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడం కోసమై రాస్తున్నాను కానీ మిగిలినవాటిని కించపరచడం కోసం కాదు.
“ఈ టీవీలూ, ఛానల్సూ వచ్చిన తర్వాత ఇంకా ఈ సంగీత కచేరీలూ, కధా కాలక్షేపాలు ఎవడిక్కావాలండీ?” ఇది దేశం అంతటా - ముఖ్యంగా ఆంధ్ర దేశంలో సంగీత కళాకారులూ, సభానిర్వాహకులు ఎదుర్కొంటున్న జవాబు తోచని, తోచినా ఎలా చెప్పాలో తెలియని చిక్కు ప్రశ్న. వేరే జీవనాధారం లేకుండా సంగీతాన్నే వృత్తిగా చేసుకోవాలంటే కేవలం సంగీతంపట్ల అంకితభావం మాత్రమే కాకుండా చాలా మనోధైర్యం కూడా అవసరం. గుమాస్తాగిరీ అయినా సంపాదించి పెట్టలేని, సుఖజీవనానికి కావలసినంత డబ్బు సంపాదించి పెట్టలేని విద్యగా ఈ రోజు నూటికి తొంభై శాతం మంది సంగీతాన్ని పరిగణిస్తున్నారు. తరతరాలుగా సంగీతం నరనరానా జీర్ణించుకు పోయిన వంశాలలో సైతం “మేంపడ్డ కష్టాలు చాలు. మా పిల్లల్ని ఇంజసీర్లనో, డాక్టర్లనో చేసి, ఏ అమెరికాకో, కెనడాకో పంపిస్తే సుఖపడతార”ని అనుకునే స్థితి వచ్చింది. దీనికి కారణాలను విశ్లేషించుకుని, సరిదిద్దుకోవాల్సిన ప్రయత్నం తక్షణమే చెయ్యాలి. ఈ ప్రయత్నాన్ని కళాకారులే మొదలుపెట్టాలి. విద్యార్థుల తల్గిదండ్రులు వారిని అనుసరించాలి. అప్పుడు అభిమానుల సహకారం దానంతటదే వస్తుంది. అందరి సంఘటిత కృషితో మాత్రమే శాస్త్రీయ సంగీతం యొక్క ఔన్నత్యాన్ని సామాన్య ప్రజానీకానికి, ప్రభుత్వానికి నిరూపించగలుగుతాం. (ఈ కళాకారుల, తల్లిదండ్రుల చిట్టాలో నేనూ ఉన్నానని గుర్తుంది)
ఇక తల్లిదండ్రుల విషయానికొద్దాం. 'మీ అమ్మాయి సంగీతం బాగా నేర్చుకుంటోందా” అంటే “అవునండీ, అన్నమయ్య కీర్తనలు, రామదాసు కీర్తనలు బాగా పాడుతుందండీ” అనే స్ధాయి నుండి తల్లిదండ్రుల ఆలోచన, లక్ష్యం పెరగాలి. అన్నమయ్య, రామదాసు వంటి వాగ్లేయకారుల కృతులను తక్కువ చేసి చూపించడం నా ఉద్దేశ్యం కాదు. వారు చేసిన స్వరలిపి (Notation) అందుబాటులో లేకపోవడం వలన ఎవరికి అనువుగా ఉండే బాణీలలో వారు పాడుకుంటున్నారు. బాణీలలో భావం, భక్తి ప్రధానంగా ఉండి, సంగీతం తక్కువగా ఉంది. నేదునూరి గారు, పినాకపాణి గారు మొదలైన కొద్దిమంది విద్వాంసులు స్వరపరిచిన కొద్ది కీర్తనలు మినహాయిస్తే మిగిలినవన్నీ లలితమైన బాణీలలో పాడుకునేవే. అసలైన శాస్త్రీయ సంగీతం వీటి కంటే చాలా ఎత్తులో ఉంది. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి భజన్‌లు, బాలమురళీ గారి తత్వాలు వినిపించే ముందు వారు పాడిన అద్భుతమైన శాస్త్రీయ సంగీత కచేరీలను పిల్లలకి వినిపించాలి, తామూ వినాలి. ఎల్లాగారి నవమృదంగ సమ్మేళనం, శివతాండవంతో పాటు వారు చక్కటి కుడి ఎడమల సంధానంతో కృతులకు చేసిన అనుసరణను కూడా వినిపించాలి. కర్ణాటక సంగీతం యొక్క పరమావధి పిల్లలను ‘పాడుతా తీయగా’, 'పాడాలని ఉంది’, ‘సూపర్ సింగర్’ వంటి పోటీలకు సన్నద్ధం చేయడం కాదు. బాలమురళీకృష్ణ, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, యేసుదాసు వంటివారు శాస్త్రీయ సంగీత విద్వాంసులుగా ప్రఖ్యాతిగాంచిన తర్వాతే లలిత, సినీ గీతాలను ఆలపించేరు. ఘంటసాలగారి సినీగీతాలు చరిత్రలో చిరస్థాయిగా నిల్చిపోయాయంటే దానికి కారణం వారు కచేరీల స్థాయి వరకు సంగీతం నేర్చుకోవడమే. అయితే శాస్త్రబద్దంగా సంగీతం నేర్చుకోకపోయినా నేపధ్యగాయకులుగా ప్రసిద్ధి చెందినవారు లేరా? అని సందేహం రావచ్చు. నిజమే, కానీ అటువంటి వారెవరూ శాస్త్రీయ సంగీత కచేరీలు చెయ్యలేదు, చెయ్యలేరు. ప్రస్తుత తరంలో ఉన్నికృష్ణన్, నిత్యశ్రీ మహదేవన్ వంటివారు శాస్త్రీయ సంగీత విద్వాంసులుగా నిలదొక్కుకున్న తర్వాతే నేపధ్యగానం కూడా చేశారు.
ఆమధ్య ఒక ప్రముఖ సినీ నేపధ్యగాయకుడు ఒక టివి ఛానెల్ వారు నిర్వహించిన సినీ గీతాల పోటీలో బాగా పాడిన ఒక అభ్యర్థిని చూపించి 'ఇంత మార్ధవంతో, శృతి శుద్ధతతో శాస్త్రీయ సంగీత విద్వాంసులెవరైనా పాడగలరా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను” అనే దుస్సాహసం చేశారు. మన తెలుగు జాతి దౌర్భాగ్యం కొద్దీ అక్కడున్న ప్రేక్షకులంతా గట్టిగా హర్షధ్వానాలు చేశారు. ఈ సందర్భంలో నేనూ కొన్ని ఛాలెంజ్‌లు చేస్తాను. ఈ మాటలన్న సదరు మహాగాయకుడెప్పుడైనా ఓ రెండుగంటలు కచేరీ చేశారా ? శాస్త్రీయ సంగీతం యొక్క లోతు, అందులోని కష్టం తెలిసిన వారెవ్వరూ శాస్రీయ, సినీగీతాలను పోల్చే ప్రయత్నం చెయ్యరు. ఈ సినీగీతాల పోటీలలో గెలుపొందుతున్న వారిలో తొంభై శాతం మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకుని వచ్చినవారే. ఆ మిగిలిన వారిలో ఎవరైనా ఒక రెండు గంటలు కచెరీ చేసి శ్రోతలను మెప్పించగలరా? పాడబోయే ఐదు నిమిషాల పాటను పది రోజుల పాటు వాద్యాలతో పాటు సాధన చేసి అప్పజెప్పే అభ్యర్థులు రిహార్సల్ లేకుండా, పరిచయం లేని సహకార వాద్యాలతో, వేదికపై అప్పటికప్పుడు తన మనోధర్మంతో శ్రోతలను కట్టిపడేయగలరా ? ఈ పోటీలలో అద్భుతంగా గానం చేసి బహుమతులు పొందిన వర్ధిష్ణు కళాకారులలో కొందరి శాస్త్రీయ సంగీత కచేరీలను నేను స్వయంగా విని అడుగుతున్న ప్రశ్నలివి. స్పల్ప వ్యవధిలో విపరీతమైన పేరు ప్రఖ్యాతులు, లక్షల కొద్దీ ధనం ఆర్జించిపెట్టే ఈ పోటీల వల్ల జరుగుతున్న మరొక ముఖ్యమైన అనర్ధం ఏంటంటే అవి పిల్లల, వారి తల్లిదండ్రుల మనస్సుల్లో అహంకారాన్ని అమాంతం పెంచేస్తున్నాయి. ఇదంతా నేనా పిల్లలపై, వారి తల్లిదండ్రులపై అసూయతో చెప్పట్లేదు. ఈ సందర్భంలో గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఉఛ్ఛారణకు, భావ ప్రకటనకు, గాత్ర ధర్మానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చే లలిత, సినీ సంగీత ప్రపంచం నుండి పోటీని, విమర్శలను తట్టుకుని శాస్త్రీయ సంగీతాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళడానికి విద్యార్థులు ఎంతో కృషి చెయ్యాలి. శాస్త్రీయ సంగీతం అన్నింటికన్నా ఉత్కృష్ఠమైనదని ఉత్తి మాటలు చెప్తే చాలదు.
అసలు ఆంధ్రదేశంలోని టి.వి. ఛానెళ్ళలో కర్ణాటక సంగీత రియాల్టీ షోలెందుకు లేవు? ఎందుకంటే అన్ని ఛానెళ్ళకు వాణిజ్యమే ప్రధానం. ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్నిచ్చి కోట్లు సంపాదిస్తున్నారు కానీ ప్రజలకేది మంచిదో దాన్ని ప్రసారం చేసే ప్రయత్నం చెయ్యట్లేదు. సంపాదిస్తున్న దాంట్లో వందోవంతు కూడా సంప్రదాయకళలు, సంస్కృతి యొక్క ప్రచారం, అభివృద్ధి కోసం ఖర్చు పెట్టట్లేదు. ప్రజలకక్కరలెని, తమకు లాభాలనార్జించి పెట్టలేని కార్యక్రమాలను తామెందుకు ప్రసారం చెయ్యాలని వారడగవచ్చు. ప్రజలేం కోరుకుంటున్నారో దాన్ని ఇవ్వడంతో పాటు వారికేది మంచిదో దాన్ని కూడా వారికలవాటు చెయ్యడం ప్రసారమాధ్యమాల బాధ్యత. పుట్టిన పిల్లవాడికి చాక్లెట్లు అలవాటు చేస్తే అదే కావాలని మారాం చేసాడు. పళ్ళు, పచ్చి కూరగాయలు అలవాటు చేస్తే వాటినే తింటాడు. చాక్లెట్లు రోజూ తింటే ఏమౌతుందో మనకి తెలుసు. జిల్లాస్థాయి క్రీడలకు కూడా ఎంతో ప్రచారం ఇచ్చే ఛానెల్స్ జాతీయ, అంతర్జాతీయ స్థాయి కళాకారులతో ప్రముఖ సంగీత సభలు వార్షికోత్సవాలు జరిపినా ఒక్క అరగంట వాటిపై నివేదికలు ఇవ్వలేక పోతున్నాయి. నేరాలు, కుంభకోణాలకు సంబంధించిన వార్తలను వెలికి తీసి ప్రచారం చేసిన కొద్దీ అవి పెరుగుతూనే ఉన్నాయి. లలిత కళలకు సంస్కృతీ సాంప్రదాయాలకు సంబంధించిన వార్తలు, కార్యక్రమాలు ప్రసారం చేస్తే క్రమంగా ప్రజలలో సత్వగుణం పెరుగుతుంది. నిజానికి ప్రజలందరూ ఈ రియాలిటీ షోలను కోరుకోవట్లేదు. అవి వారిపై రుద్ధబడుతున్నాయి. ఆకాశవాణి, దూరదర్శన్‌ల ద్వారా ప్రభుత్వం లలిత కళల ప్రచారాన్ని బాధ్యతగా స్వీకరించినట్లే ప్రైవేట్ ఛానెల్స్ కూడా రోజుకు కనీసం అరగంటైనా కళలకోసం ఖర్చు చేసేలా నిబంధన విధించాలి. తమిళనాడులోని కొన్ని ప్రైవేట్ ఛానెల్స్ నిర్వహిస్తున్న కర్ణాటక సంగీత పోటీలకు అమితమైన ప్రజాదరణ లభిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ వారు నిర్వహించిన సంగీత పోటీలకు విద్యార్థుల, విద్వాంసుల, ప్రేక్షకుల నుండి ఎంతో ఆదరణ లభించింది. దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ నిర్వహించిన 'స్వరసమరం' శాస్త్రీయ సంగీత పోటీలకోసం విద్యార్థులెంతో కష్టపడి సాధన చేసి చక్కటి ప్రదర్శనలనిచ్చారు. దూరదర్శన్, స్పిక్ మేకే సంయుక్తంగా జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘నాద్ భేద్' కర్ణాటక, హిందుస్తానీ సంగీత పోటీల రియాల్టీ షోలను దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా తిలకించింది. ముఖ్యంగా గమనించాల్సిన విషయమేంటంటే కర్ణాటక సంగీత విభాగంలో గాత్ర, లయవాద్య బహుమతులు రెండూ తెలుగు వారికే లభించాయి. మొదటి బహుమతికి మూడు లక్షలు, విశిష్ఠ బహుమతికి 10లక్షలు అందజేసిన స్పిక్ మేకే సంస్థని ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది. ప్రతీ ఛానెల్‌వారు స్వఛ్ఛందంగా రోజుకొక గంట లలిత కళలకు కేటాయిస్తే ఎంతో బాగుంటుంది. “సినీ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీతాలకు శాస్త్రీయ సంగీతం కంటే ఆదరగౌరవాలు లభిస్తున్నాయంటే దీనిలో లేని గొప్పదనమేదో వాటిల్లో ఉండి ఉండాలి కదా, దాని గురించి ఆలోచించకుండా శాస్త్రీయసంగీతాన్ని ఆదరించట్లేదని ప్రజలనాడిపోసుకోవడమెందుకు?” అని కొందరి ప్రశ్న దీనికి సమాధానాన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను.
'విమానాన్నెవరు కనిపెట్టారని అడిగితే మూడవ తరగతి పిల్లవాడు కూడా రైట్ బ్రదర్స్ అని టక్కున సమాధానం చెప్తాడు. అయితే విమానం ఎగరడానికి ఆధారభూతమైన బెర్నౌలీ సూత్రం గురించి మనలో కూడా చాలామందికి తెలీదు. బెర్నౌలీ సూత్రాన్ని శాస్త్రీయసంగీతంతో, దాని నుండి పుట్టిన శాస్త్రీయేతర బాణీలను విమానంతో పోల్చి, కింది విషయాలను గమనించండి.
1. సాధారణ మానవునికి విమానం కనిపించినంత అందంగా, ఆకర్షణీయంగా బెర్నౌలీ సూత్రం కనిపించదు. కానీ ఈ సూత్రం కనుగొనబడకపోయుంటే విమానం యొక్క ఆవిష్కరణ సాధ్యపడేది కాదు. అదే విధంగా శాస్త్రీయేతర బాణీలు ఆకర్షణీయంగా కనిపించినా, కొంచం క్లిష్టంగా అనిపించే శాస్త్రీయ సంగీతం నుంచే అవి పుట్టాయి.
2. విమానం యొక్క ఉపయోగం గాలిలో ఎగరడం మాత్రమే. కాని బెర్నాల్ సూత్రం యొక్క పరమావధి విమానం తయారు చెయ్యడం ఒక్కటే కాదు. విజ్ఞాన శాస్త్రం యొక్క అనంతమైన ప్రయోజనాలలో పెక్కువోట్ల బెర్నౌలీ సూత్రం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అదే విధంగా శాస్త్రీయేతర బాణీలు సామాన్య మానవులనెంతో రంజింపజేస్తాయి. వాటి వినియోగం అంతవరకే. కానీ, శాస్త్రీయ సంగీతం సామాన్య మానవులతో పాటు విద్వా౦సులను, మేధావులను కూడా రంజింపజేయగలదు.
3. విమానంలో ప్రయాణంలో చెసేవారికి బెర్నౌలీ సూత్రం తెలియాల్సిన అవసరం లేదు, తెలుసుకోవడం అంత సులభమూ కాదు. కానీ ఈ సూత్రం గురించి తెలిసినవారికి విమానం గురించి తెలిసే ఉంటుంది. అలాగే సినీ, లలిత సంగీతాలు వినే ఒక సాధారణ (శోతకి శాస్త్రీయ సంగీతం గురించి తెలియాల్సిన అవసరం లేదు. తెలుసుకోవడం అంతసులభమూ కాదు. కానీ శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతులైన వారు ఇతర బాణీలను ప్రత్యేకించి నేర్చుకోనక్కర లేదు. వారు ఏ బాణీనైనా అలవోకగా పాడగలరు. విమానం నిజంగా చాలా గొప్ప ఆవిష్కరణ. కానీ దీనికి మూలమైన బెర్నౌలీసూత్రం ఇంకెంత గొప్పదో ఆలోచించాలి. అనేక కోట్ల మందిని రంజింపజేస్తున్న సినీ, లలిత, పాశ్చాత్య బాణీలు నిజంగా చాలా గొప్పవే. కానీ వీటికి మూలాధారమైన శాస్త్రీయ సంగీతం ఇంకెంత ఉన్నతమైనదో గ్రహించాలి. మొక్కలకు పూసే అందమైన పువ్వులకు జీవం మొక్క కిందనుండే వేళ్ళేనని గమనించాలి.
‘“టి.వి రియాల్టీ షోలలో గెలిస్తే వచ్చే డబ్బు, పేరు ఎన్నివందల కచేరీలు చేస్తే వస్తాయి? ఎన్ని పాఠాలు చెప్తే వస్తాయి? సినిమా పాటలు పాడడం అంత సులభమా ?” అని పాఠకులడగొచ్చు. లక్ష్యం బహుమతి మీద, డబ్బు మీద ఉంటే అవి మాత్రమే వస్తాయి. విద్య, జ్ఞానం లక్ష్యంగా పెట్టుకున్న వారిని కొంచెం ఆలస్యంగానైనా చిరస్థాయిగా నిలిచే పేరు, డబ్బు, గౌరవాలు వెతుక్కుంటూ వసాయి. సంగీత విద్వాంసులలో కోట్లు సంపాదించినవారు, ప్రపంచమంతా చుట్టి అభిమానులను సంపాదించినవారు లేరా ? కచేరీ అవకాశాలు ఎక్కువ లేకపోయినా రోజంతా క్షణం తీరికలేకుండా పాఠాలు చెప్తూ, మంచి శిష్యులను తయారుచేస్తూ చక్కగా సంపాదిస్తున్నవారెంతో మంది ఉన్నారు. జ్ఞానసముపార్జనే లక్ష్యంగా, అంకితభావంతో సాధన చేసి, పూర్తి నమ్మకం ఉంచితే ఏ విద్యా ఎవరినీ అన్యాయం చెయ్యదు. సంగీతం అంటే తెలియని కుటుంబంలో పుట్టిన హరిప్రసాద్ చౌరాసియాగారు ప్రపంచప్రఖ్యాత వేణువిద్వాంసునిగా ఎదిగారు. స్వఛ్చమైన అమెరికా దేశీయుడైన జాన్ హిగ్గిన్స్ గొప్ప కర్ణాటక సంగీత విద్వాంసునిగా, హిగ్గిన్స్ భాగవతార్ అని కొనియాడబడే స్థాయికి ఎదిగారు. విజయనగరంలో వంటవానిగా జీవితం మొదలుపెట్టిన సత్యనారాయణ భక్షి ఎయిర్ ఇండియా ‘chief chef’ స్థాయికి ఎదగడమే కాకుండా, ఎంతొమంది దేశాధ్యక్షులకు, ప్రధానమంత్రులకు వంట చేసి, వారి మెప్పును పొందారు. మనస్ఫూర్తిగా నమ్మితే ఏ విద్యా ఎవరినీ అన్యాయం చెయ్యదని చెప్పడమే నా ఉద్దేశ్యం.
ఎంతో మధురమైన, సుస్వరమైన గాత్రం కలిగి, విపరీతమైన పోటీని తట్టుకుని, లలిత, సినిమా గాయకులుగా నిలదొక్కుకోవడం నిజంగా చాలా కష్టం. అయితే స్వల్పంగానైనా గాత్ర సౌలభ్యం దెబ్బతింటే సినిమాలోకం నిర్దాక్షిణ్యంగా పక్కన పెడుతుంది. కానీ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో అలా కాదు. ఇక్కడ విద్వత్తుకి, జ్ఞానానికి కూడా ఎంతో ప్రాధ్యానత ఉంది. శస్రచికిత్స జరిగి, గాత్ర ధర్మమే మారిపోయిన సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ గారిని పూర్వపు స్థాయిలోనే ఆదరించి, ‘సంగీత కళానిధి’ బిరుదునిచ్చి తమను తాము గౌరవించుకుంది కర్ణాటక సంగీత ప్రపంచం. ఒక ఊపిరితిత్తిని పూర్తిగా కోల్పోయి, సగం ఊపిరితో, తన మేధస్సునుపయోగించి, చిన్న చిన్న సంగతులతో తనకంటూ ఒక శైలిని సృజించుకున్న పండిట్ కుమారగంధర్వ గారిని అభిమానించి, గౌరవించి, వారి పేరిట ప్రతిష్ఠాత్మకంగా ప్రతియేటా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు హిందుస్థానీ సంగీతాభిమానులూ, విద్వాంసులూ. ఇదంతా చదువుతుంటే సినిమాసంగీతం పట్ల నాకున్న ఈర్ష్య, అక్కసును వెళ్ళగక్కుతున్నానని పాఠకులనుకోవచ్చు. ఇది కేవలం శాస్త్రీయ సంగీతాన్ని తక్కువగా చూడొద్దనే నా ఆవేదన మాత్రమె.
రేడియోలోనో, సంగీత కళాశాలల్లోనో లేదా విశ్వవిద్యాలయాల్లోనో ఉద్యోగం వస్తే తప్ప మంచి జీతం, సమాజంలో గుర్తింపు రాని నేటి తరుణంలో “మా అబ్బాయిని ‘పాడుతా తీయగా’కి ఎన్నాళ్ళల్లో పంపిస్తా”రంటే అంటే సంగీతమే జీవనోపాధిగా బ్రతుకుతున్న విద్వాంసుడు “ఇలా అయితే నీకు జ్ఞానం, మనోధర్మం అభివృద్ధి చెందవు. నీకు పాఠం చెప్పన”ని అనలేడు. “మా అబ్బాయి సాయంత్రం ఐదింటికి స్కూల్‌నుంచి ఇంటికొస్తాడు. ఆరింటికి ట్యూషన్‌కెళ్ళాలి. ఈ మధ్యలో వారానికొక మూడు రోజులు మావాడికి సంగీతం చెప్పండి” అంటే “వారానికొక మూడు గంటలు మాత్రమే నేర్చుకుంటే సంగీతం రాద”ని వచ్ఛే నాలుగు డబ్బుల్ని విద్వాంసుడు వదులుకోలేడు. ఎన్నాళ్ళు నేర్చుకున్నా మావాడికి సంగీతం సరిగా రాలేదంటే అది గురువుగారి తప్పుకాదు. శాస్త్రీయసంగీతం పట్ల సమాజం యొక్క దృక్పథం మారాలి. 20 ఎళ్ళ పాటు రోజుకి పది నుంచి పన్నెండు గంటలు కష్టపడి చదివితే తప్ప ఒక గౌరవప్రదమైన ఉద్యోగం రానప్పుడు సంగీతం మాత్రం ఎలా వస్తుంది? ఈమాటలు నేను విద్వాంసుల కోసం, విద్యపై చక్కటి అవగాహన ఉన్నవారి కోసం రాయట్లేదు. అప్పుడే పిల్లలకి సంగీతం మొదలుపెట్టి, విద్యపై పెద్దగా అవగాహన లేక, సులభంగా పేరు, డబ్బు వచ్చే అవకాశాలపై మక్కువ చూపే తల్లిదండ్రుల కోసమె రాస్తున్నాను.
కళాకారుడు కచేరీకొక్క వందరూపాయలు ఎక్కువ అడిగితే “సంగీతం ఆముష్మిక విద్య, భగవంతుని వద్దకు చేర్చే యోగం, ‘నిధి చాలసుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా’, కళాకారుడు ధనాన్ని ప్రధానంగా తీసుకోకూడ”దని హితబోధ చేసేవారు భావిభారత పౌరులను తీర్చిదిద్దడం ఒక సామాజిక బాధ్యతగాగల విద్యాలయాల, కొర్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు లక్షలకొద్దీ రూపాయలడిగితే మారుమాటాడకుండా ఇస్తున్నారు. ప్రాణాన్ని కాపాడే వృత్తిలో ఉన్న వైద్యులు లక్షలడిగితే ఎదురు చెప్పకుండా ఇస్తున్నారు. “ప్రాణానికి, సంగీతానికి సాపత్యమేంట”ని కొందరడగొచ్చు. మానవుని మనుగడకు, అస్థిత్వానికి, పురోగమనానికి కళలే ప్రాణం. ప్రపంచ దేశాల మధ్య బారతదేశానికొక గుర్తింపు, ప్రత్యేకత ఉన్నాయంటే అది మనకున్న శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం వల్లనో, లేక మనకున్న ఆయుధసంపత్తి వలననో కాదు. శతాబ్దాలపాటు దురాక్రమణలకు గురైనా చెక్కుచెదరని మన ఆధ్యాత్మికసంస్కృతి, కళలే దీనికి కారణం. కళాకారుడు దేశ సంస్కృతికి ప్రపంచవ్యాప్త రాయబారి (Global Cultural Ambassador). దేశ సరిహద్దుకు సైనికుడు రక్షకుడైతే, దేశ సంస్కృతికి కళాకారుడే రక్షకుడు. దేశ సంస్కృతిని పరిరక్షించడం కూడా దేశసేవే అవుతుంది. దేశ సంస్కృతి పరిరక్షణపైనే జాతి యొక్క ఐక్యత ఆధారపడి ఉంటుంది.దేశ సంస్కృతికి దెబ్బ తగిల్తే దేశం ఎలా బలహీనపడుదుందో తెలియజేసే ఒక చేదు చారిత్రక నిజాన్ని మీకు తెలియజేస్తాను.
1835 ఫిబ్రవరి రెండున లార్డ్ మెకాలే బ్రిటిష్ పార్లమెంటుకిచ్చిన నివేదిక యొక్క తెలుగు అనువాదాన్ని ఒక్కసారి పరికించండి. “నెను భారతదేశం నలుమూలలా పర్యటించేను. కానీ ఒక్క ముష్టివాడు కానీ, దొంగ కానీ కనిపించలేదు. భారతదేశంలో ఎంత సంపద, భారతజాతికి ఎంత నైతిక విలువలు, శక్తి సామర్ధ్యాలు ఉన్నాయంటే మన శక్తినుపయోగించి ఎప్పటికీ ఆ దేశాన్ని గెలవలేము. ఆ దేశ ఐక్యతకు వెన్నెముకవంటి ఆధ్యాత్మిక సంస్కతిని, వారసత్వాన్ని నాశనం చేయడమొక్కటే ఆ దేశాన్ని గెలవడానికున్న ఏకైక మార్గం. విదేశాల నుండి దిగుమతైన సమస్తం, వారి ఇంగ్లీషు భాష తమ వాటికంటే గొప్పవనుకునే వారి బలహీనతను మనం ఉపయోగించుకోవాలి. విలువలతో కూడిన వారి పురాతన విద్యా విధానంలోకి ఇంగ్లీషును చొప్పిస్తే వారు తమ ఆత్మగౌరవాన్ని, అస్థిత్వాన్ని కోల్పోయి మనకు దాసోహమౌతారు.”
భారతదేశం గురించి, భారతీయుల గురించి మెకాలే చెప్పిన మాటలు అక్షరసత్యాలని స్వాతంత్య్రం వచ్చిన 67 సంవత్సరాల తర్వాత కూడా మనం నిరూపిస్తూనే ఉన్నాం. భావదాస్యం వలన వచ్చిన దరిద్రం నుండి మనం బయట పడలేకపోతున్నాం. బాల్యంలోనే వ్యక్తిత్వాన్ని వికసింపజేసి, సంస్కారాన్ని అందివ్వగల వేమన, సుమతి, భాస్కర, భర్తృహరి నీతి శతకాలను పక్కనబెట్టి, గిరిపుత్రుల నుండి లక్ష్మీపుత్రుల వరకూ అందరూ తమ పిల్లలకు “ట్వింకిల్ ట్వింకిల్‌తోనే అక్షరాభ్యాసం చేస్తున్నారు. దుర్బిణి వేసి వెదికినా ఏమూలా కూడా నీతి వాక్యం కనిపించని ఈ పద్యాలను చదవడమే నాగరికత అనుకుంటున్నారు. మన జాతీయ క్రీడ అయిన 'హాకీ’ని వదిలిపెట్టి బ్రిటిష్‌వారి నుండి అరువు తెచ్చుకున్న క్రికెట్ కోసం వందలకోట్లు ఖర్చు చేస్తున్నాం. మన సంప్రదాయ కళలను మర్చిపోయి పాప్, రాక్‌ఎన్‌రోల్ సంగీతాలను, డిస్కో, బ్రేక్ డాన్స్‌లను నెత్తిన పెట్లుకుంటున్నాం. భావదాస్యం తెచ్చిన అనర్థాలను రాస్తూ పోతే అది ఒక పెద్ద గ్రంధమే అవుతుంది. అలాగని పాశ్వాత్య సంగీతం, సంస్కృతి మొత్తాన్ని చెడ్డదని వదిలెయ్యకూడదు. నేడు కర్ణాటక సంగీత కచేరీలలో అత్యంత విరివిగా వాడబడుతున్న వయోలిన్ వాద్యం మనకు బ్రిటిష్ వారిద్వారానే లభించింది. తమోగుణ ప్రేరకాలైన పాప్, రాక్ ఎన్ రోల్ సంగీతాల మోజులో పడి, సత్వగుణ ప్రేరకమైన భారతీయ శాస్త్రీయ సంగీతానికి దూరం అవడం వలన కలిగే అనర్థాలను యువత అర్ధం చేసుకోవాలి.
“అవిభక్త భారతదేశంలో ప్రతి కుటుంబ౦ నుండి కనీసం ఒక్కరైనా శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఉండుంటే దేశ విభజన జరిగుండేది కాదు” అని ప్రముఖ హిందుస్థానీ గాత్ర విద్వాంసులు బడేఘులామ్ ఆలీఖాన్‌గారు ఆవేదనతో అన్నమాటలు అక్షరసత్యాలు. ఇదే పొరపాటు ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలలో కూడా జరిగింది. రెండు ప్రాంతాల మధ్య సరియైన సాంస్కృతిక బంధం, సంస్కృతీ ప్రవాహం లేకపోవడం వలన రెండు ప్రాంతాలు మానసికంగా వేరై, చివరకు భౌగోళికంగా కూడా విడిపోయాయి. వరంగల్, ఖమ్మం జిల్లాలను మినహాయిస్తే ఇతర తెలంగాణా జిల్లాలలో నేనెప్పుడూ కచేరీలు చేయలేదు. ఆ జిల్లాల్లోని కళాకారులెవరూ ఆంధ్ర ప్రాంతంలో కచేరీలు చెయ్యడం నేను చూడలేదు. ఒక జాతి యొక్క సంస్కృతీ సాంప్రదాయాలు ఆ జాతి యొక్క ఐక్యతను ఎంత ప్రభావితం చేస్తాయో తెలియజెప్పడమె నా ఉద్దేశ్యం. మనదేశంలో ఉన్నంత కాలం సంగీతంతో ఏ మాత్రం పరిచయం లేని ఎంతో మంది విదేశాలకు వెళ్ళాక తమ అస్థిత్వం భారతీయ ఆధ్యాత్మిక, సంస్కతీ సంవదలపైనే ఆధారపడి ఉందని తెలుసుకుంటున్నారు. అమెరికాలో చిన్న చిన్న సంగీత పాఠశాలలను నడుపుతున్న వారు కూడా గణనీయంగా సంపాదిస్తూ ఉండడమే దీనికి నిదర్శనం. ప్రపంచ భాషలలో తెలుగుకొక ప్రత్యేకత, గుర్తింపు లభించాయంటే దానికి కారణం త్యాగరాజాది వాగ్గేయకారుల కృతులు, ఛందోబద్ధమైన, అలంకారయుతమైన పద్య, గద్య సాహిత్యం, అవధాన ప్రక్రియలే అని మరొక్కసారి గుర్తు చేసుకోవాలి. సంగీతానికి రాజభాష తెలుగే అని తమిళులు కూడా కొనియాడారు.
“కర్ణాటక సంగీతమంతా తమిళనాడులోనే ఉంది. మనవాళ్ళలో సంగీతమెవడిక్కావాలి? అని చాలామంది, కొంతమంది విద్వాంసులు కూడా అంటూ ఉంటారు. ఇలా అనడం మనల్ని మనం కించపరుచుకోవడమే అవుతుంది. మనవాళ్ళ౦టే అందులో మనమూ ఉన్నామని గుర్తుంచుకోవాలి. మన వర్ధిష్ణు కళాకారులు తమిళనాడుకు వలస వెళ్ళాల్సిన అవసరం రాకుండా జాగత్తపడాలి. ప్రతి బిడ్డకు కొంతవరకైనా సంగీతం నేర్పించి, వారి వ్యక్తిత్వ, మానసిక వికాసానికి తోడ్పడాలి. సంగీతం నేర్చుకుంటే గణితంపై చక్కటి పట్టు వస్తుందని శాస్త్రవేతలు ప్రయోగాత్మకంగా నిరూపించారు. అల్బర్ట్ ఐన్‌స్టయిన్‌కి వైలెన్‌లో, అబ్దుల్ కలామ్‌గారికి వీణలో, ఇ(సో ఛైర్మన్ రాధాకృష్ణన్ గారికి గాత్రంలో మంచి అభినివేశం ఉండడం మొదలెన ఎన్నో ఉదాహరణలను మనం చెప్పుకోవచ్చు.
చదువుకి సంగీతం ప్రతిబంధకం అని చాలామంది అంటూ ఉంటారు. తొంభై శాతం మంది విషయంలో ఇది తప్పు. ఫేస్‌బుక్ ఛాటింగ్‌లు, సెల్‌ఫోన్ గేమ్స్, టివి ఎంటర్‌టైన్‌మెంట్ షోలవంటి వ్యర్ధకాలక్షేపాలను పక్కన పెడితే సంగీతానికి చాలా సమయం మిగులుతుంది. ఏ మాత్రం శాస్త్రీయత, హేతుబద్ధత లేకుండా అడ్డగోలుగా విభజించబడి, అయోమయంలోకి నెట్టబడిన తెలుగు ప్రజలు ఈ క్షణాన్నైనా పౌరుషాన్ని తెచ్చుకొని, గత సంస్కృతీ వైభవాన్ని సంపాదించుకునే ప్రయత్నం చెయ్యాలి. కళలు, సంస్కృతి పటిష్టంగా లేని జాతికి ఐక్యత, అస్థిత్వం ఉండవని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం కదా !
Comments
Post a Comment