ఆలోచించండి (కథానిక)
*ఆలోచించండి* (కథానిక)
(A modern perspective towards some of the prevailing traditions to achieve national economy)
పెళ్లి మండపం అంతా హడావిడిగా ఉంది. పురోహితుని మంత్రాల జోరు, బాజాభజంత్రీల హోరు, అమ్మలక్కల కబుర్లు, హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఓరకంట ఒకరినొకరు గమనిస్తున్న పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు, ఇద్దర్నీ గమనిస్తున్న పెళ్లిళ్ల పేరయ్యలూ, బామ్మ గార్లు, అటు ఇటు పరిగెడుతున్న చిన్నపిల్లలు, వాళ్లని వెతుకుతూ అదిలిస్తున్న తల్లులు, గుంపులుగా చేరి లోకాభిరామాయణం చెప్పుకుంటున్న నడివయస్కులు, గుమ్మం దగ్గర అతిథులపై పన్నీరు జల్లుతున్న అమ్మాయిలు, వారిని ఆహ్వానిస్తూ యోగక్షేమాలను కనుక్కుంటున్నపెద్దలు, అతిధులకు పళ్ళరసాలను, శీతల పానీయాలను అందిస్తున్న క్యాటరింగ్ పనివాళ్ళు, ఇలా పెళ్ళి మండపం అంతా కోలాహలంగా, కన్నులపండువగా ఉంది.
"అమ్మా సుముహూర్తానికి ఇంకా పది నిమిషాలే ఉంది. బుట్టలో అమ్మాయిని తీసుకురండి" అంటూ గట్టిగా అరిచాడు పురోహితుడు.
"పిలిచి ఇరవై నిమిషాలైంది, దుర్ముహూర్తం వచ్చేస్తోంది, పౌడర్లు-అత్తర్లు, నగలు-మేకప్‌లూ తర్వాత. ముందు అమ్మాయిని తీసుకురండి" అంటూ పక్కనే ఉన్న ఓ పెద్దావిడను అదిలించాడు పురోహితుడు.
కళ్యాణ వేదికకు ఓవైపు దూరంగా ఉన్న పెళ్లికూతురు గదిలోకి పరుగెత్తింది పద్మ. డబుల్ XL సైజు బుట్టలో XL సైజు పెళ్లి కూతురు నిండా ముస్తాబై బిక్కుబిక్కుమని చూస్తోంది.
"బావగారూ, ఈ సమయంలో పట్టుబట్టకండి. దయచేసి బుట్టమీద చెయ్యి వెయ్యండి. అమ్మాయి మేనమామగా ఈ ఒక్క సహాయం చెయ్యండి" అంటూ బతిమిలాడుతున్నాడు పెళ్లి కూతురు తండ్రి రామారావు.
"బుట్ట ఎత్తమని కొంచెం అన్నయ్యకి చెప్పమ్మా" అని వదినగారి చెయ్యి పట్టుకుని వేడుకుంటోంది పెళ్లి కూతురు తల్లి సీత.
రెండడుగులు అటుగా వేసి చూసింది పద్మ. ముఖం ఎర్రగా చేసుకుని, గోడకి అభిముఖంగా మంచం మీద కూర్చుంది సుశీల.
"అమ్మాయి పెళ్ళికి పదివేలు పెట్టి కంచిపట్టు చీర కొంటామన్నారు. మూడువేలు పెట్టి ముష్టి కాటన్ చీర నా మొహాన పడేశారు. అందులోనూ ఎరుపు రంగు నాకు నచ్చదని తెలీదా? అసలు ఆ చీరకి జరీ ఏమైనా ఉందా?” ఉక్రోషంగా అంటోంది సుశీల.
"మా ఆవిడ అలా బాధ పడుతుంటే నేనెలా బుట్టెత్తుకోను" అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు సుశీల భర్త. 'అన్నయ్య ఓ చెయ్యి వెయ్యకపోతే దీన్ని మొత్తం నా నెత్తిన పెడతారేమో దేవుడా' అనుకుంటూ భయంగా చూస్తున్నాడు సీత తమ్ముడు. అతనసలే చాలా అర్భకంగా ఉంటాడు.
"పెళ్ళయ్యాక నీకు నచ్చిన అంచు, రంగు, జరీ ఉన్న ఖరీదైన పట్టుచీర కొంటాను. కొంచెం అన్నయ్యని బుట్టెత్తమని చెప్పొదినా, పురోహితుడు కంగారు పెడుతున్నాడు. మేనమామలు బుట్ట తీసుకురాకపోతే నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు" అంటూ ప్రాధేయ పడుతోంది సీత.
"అంటే నావల్ల మీ పరువు పోతుందంటావ్, అంతే కదా" విసురుగా అంది సుశీల.
"నా కడుపులో ఉద్దేశ్యం అది కాదొదినా. ఏదో పొరపాటున అన్నాను. క్షమించు" సుశీల గడ్డం పట్టుకుని వేడుకుంటోంది సీత, ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ.
"హూఁ, మర్యాదలేం ఉండవు కానీ ఈ బ్లాక్‌మెయిలింగ్‌కి లోటేం ఉండదు" అంటూ అయిష్టంగానే ఇటు తిరిగి 'ఇక చాలు, బుట్టెత్తండ'న్నట్లు మొగుడి వైపు తిరిగి కళ్ళతోనే సైగ చేసింది సుశీల.
అన్ని పాయింట్లు జాగ్రత్తగా నోట్ చేసుకుంది పద్మ. కడుపు పొంగిపోతోంది. ఎప్పుడెప్పుడు బయటకెళ్ళి నలుగురికి విషయం చెప్పేదామా అని తెగ ఆత్రుత పడిపోతోంది. సరిగ్గా పరీక్షల ముందు టీచర్లు, ఎలక్షన్ల ముందు గవర్నమెంట్ ఉద్యోగులు, దీపావళి ముందు పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలు చేసినట్లే ఈ ఆడపడుచులు, ఒదినలు కూడా అదను చూసి శుభకార్యాలలో అలకలు వహిస్తారు. ఏదైనా పెళ్లి నాలుక్కాలాల పాటు గుర్తుండి పోవాలంటే ఈ అలకలే ఆధారం. అన్నీ సవ్యంగా జరిగిపోతే నాలుగు రోజుల్లో మర్చిపోతారంతా.
"నాకు మాత్రం మేనగోడల్ని బుట్టలో ఎత్తుకుని తీసుకెళ్లడం ముచ్చట కాదూ? నా చేతుల మీద పెంచాను చిన్ని తల్లిని" అంటూ ఓ వెర్రి నవ్వు నవ్వి బుట్టను ఎత్తాడు పెళ్ళికూతురు మేనమామ. బతుకు జీవుడా అనుకుంటూ అతని తమ్ముడు కూడా మరో చెయ్యి వేశాడు. రామారావు మొహం ఎర్రగా అయింది. 'పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని చవట. పెళ్లవనీ, నలుగురిలో పెట్టి కడిగేయనూ. మరో సంవత్సరంలో కూతురి పెళ్లి చేస్తాడు కదా, అప్పుడు చూపిస్తాను నా తడాఖా' అనుకుంటూ పళ్ళు నూరుకున్నాడు.
మెల్లిగా సీన్ పెళ్లి వేదికకు మారింది. ఇక మిగిలిన తంతు సవ్యంగానే నడిచింది. జీలకర్ర బెల్లం, మాంగల్య సూత్ర ధారణ పూర్తయ్యాయి. గుండెల మీద నుంచి బండరాయిని దించినట్లయ్యింది రామారావుకి, సీతకి.
పద్మ తన అసామాన్య ప్రతిభాపాటవాలతో విషయాన్ని మొత్తం మంటపం అంతా పాకించింది. అంతా చెవులు కొరుక్కుంటున్నారు. 'మేనగోడలు పెళ్లి కదా ఆపాటి పెళ్ళానికి సర్ది చెప్పుకోలేడా' అని ఒకరు, 'అన్న మాట నిలబెట్టుకోకుండా ఇప్పుడు బతిమిలాడడం ఎందుకు? మేనమామని చెడ్డ చేయడం ఎందుకు?' అని ఎవరికి నచ్చినట్టు వారు ప్రస్తారం చేస్తున్నారు. మెల్లిగా భోజనాలయ్యాయి. అతిథులంతా ఎక్కడివారక్కడ సర్దుకుంటున్నారు. బాగా కావలసిన చుట్టాలు, మిత్రులు ఓ పాతికమంది కుర్చీలు దగ్గరగా లాక్కుని వలయాకారంగా కూర్చున్నారు. మెల్లిగా పిచ్చాపాటీ మొదలెట్టారు. క్రికెట్, సినిమాలు, రాజకీయాలు, అమరావతి - మూడు రాజధానుల గోల, కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ, చైనాతో ఘర్షణలు, ట్రంప్ ఓడిపోవడం మొదలైన విషయాలు చర్చిస్తూ ఎవరి అభిప్రాయాలు వాళ్లు వెలిబుచ్చుతున్నారు.
"ఏదేమైనా శుభకార్యాలప్పుడు అలకలు, మొండితనాలు చెయ్యకూడదండీ" అని సణిగారెవరో - అక్కడే ఉన్న సుశీల తమ్ముడు సుజ్ఞాన్‌ని గమనించనట్లు నటిస్తూ. గిరుక్కున తిరిగి చురుక్కున చూశాడు సుజ్ఞాన్. జరిగిన ఆలస్యానికి అల్లరికి అందరూ తమనే ఎత్తి చూపిస్తున్నారనే అపరాధ భావంతో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో ఉన్నాడు. అంతే సర్రున లేచాడు.
"ఇచ్చిన మాటను తప్పడం, సొంత వాళ్ళనే చులకనగా చూడడం బాగుంటాయి కాబోలు"
"సమయానికి డబ్బులు ఏర్పాటు కాలేదేమో, రెండ్రోజులు ఆగితే తానే కొనిచ్చేవాడేమో, లేకపోతే అప్పుడే నిలదీయొచ్చుగా" అంటూ సాగదీశారు మరొకరు.
"ఏరు దాటగానే తెప్ప తగలేసే రకాలు. బుట్ట దించగానే మాట మరిచిపోయే ప్రబుద్ధులు. వీళ్ళనెవడు నమ్మమన్నాడు?"
వాతావరణం కొంచెం వేడెక్కింది.
"మీ నాన్నగారు కూతురు పెళ్ళికి లక్ష రూపాయలు కట్నం బాకీ పడితే సంవత్సరం పాటు ఆగలా? ఏడు వేల కోసం ముహూర్తం ముందు అంత హంగామా చెయ్యాలా?"
"ఉష్, ఆగండాగండి. పెళ్లయి గంట కాలేదు, ఇంకా అతిథులంతా వెళ్ళనే లేదు, అప్పుడే ఈ రచ్చేంటి? దెప్పిపొడుపులేంటి? దేనికైనా వేళాపాళా ఉండక్కర్లేదా?" అని గద్దించాడు ఓ సీనియర్ సిటిజన్.
"మీ బోడి ఉచిత సలహాలు మాకేం అక్కర్లేదు. మీ మర్యాద మీరు నిలబెట్టుకోండి" అన్నాడు సుజ్ఞాన్.
"వీళ్ళక్క పేరు సుశీల. వీడి పేరు సుజ్ఞాన్. ఏం పేర్లు పెట్టారండీ? సార్థక నామధేయులు" వెటకారంగా నవ్వేడు మరొకాయన. అంతే, గొడవ తారాస్థాయికి చేరింది. వ్యక్తిగత దూషణలు మొదలయ్యాయి.
ఇలాంటి గొడవలు జరిగినప్పుడే మనుష్యుల అసలు తత్వాలు బయటకొస్తాయి. కొంతమంది అవకాశవాదులు తమకు ఎవరివల్ల ప్రయోజనం ఉంటుందో వారిని సమర్ధిస్తారు. వీరికి న్యాయాన్యాయాలతో సంబంధం ఉండదు. కొంతమంది లౌక్యులూ, గోడమీద పిల్లివాటం మనుష్యులూ రెండు వైపులా మాట్లాడుతూ, ఎవరి దగ్గరా చెడ్డవకుండా చర్చలో తమవంతు పాత్ర పోషిస్తూ ఉంటారు. కొంతమంది రెండు వైపుల వారికీ మధ్యవర్తిత్వం వహించి, గొడవ తీర్చి పేరు కొట్టేయాలని ఉబలాటపడిపోతూ ఉంటారు. కొంతమంది తెలివైన వాళ్ళు, డిగ్నిటీ ఒలకబోసే వాళ్ళూ పేపరో, సెల్లో చూసుకుంటున్నట్లు నటిస్తూ ఓ చెవి, ఓ కన్ను ఇటు పడేస్తారు. మరికొంతమంది గొడవపడుతున్న వాళ్ళని అనాగరికుల్లా చూస్తూ, గట్టిగా కసురుకుని, విసుక్కుంటూ లేచి వెళ్ళిపోయి కొంచెం దూరంగా కూర్చుని గొడవని గమనిస్తూ ఉంటారు. వీళ్లు హిపొక్రాట్స్. వీళ్లు రియల్‌టైంలో అప్‌డేట్స్‌ని బయటకు పంపించి మరికొంతమంది అక్కడ పోగయ్యేటట్లు చూస్తూ ఉంటారు.
మొత్తం మీద పాళ్లు వేరైనా ప్రతివాడిలో ఒక శాడిస్ట్ దాగి ఉంటాడు. గొడవ పెరిగితే పైశాచికానందం పొందే తత్వం ప్రతి వాడిలో ఏదో ఒక మూల దాగి ఉంటుంది. గొడవ ఎంత పెద్దదైతే దాని గురించి అంతకాలం చెప్పుకుని ఆనందించవచ్చు. వేలల్లో అరుదుగా ఒక స్థితప్రజ్ఞుడు ఉంటాడు. అతన్ని చేతకాని వాడిగా, నిష్క్రియాపరుడిగా ముద్రవేసి పక్కన పెట్టేస్తుంది లోకం. 'స్థితప్రజ్ఞత' అనేది భగవద్గీతలో చదువుకున్నంత అందంగా, ఉపయుక్తంగా నిజ జీవితంలో ఉండడం కష్టసాధ్యం.
ఇంతలో దూరం నుంచి ఈ గొడవ మొత్తం గమనిస్తున్న ఓ నడివయస్కుడు కుర్చీ ముందుకు లాక్కుని 'ఆగండి' అని గట్టిగా అరిచాడు. అందరూ గొడవ ఆపి అటు చూశారు.
"కరోనా వచ్చి మన తలరాతల్ని మార్చగలిగింది కానీ మన బుద్ధుల్ని మాత్రం మార్చలేకపోయింది. సంవత్సరంగా ఆదాయం సరిగా లేక ఎలాగోలా కష్టపడి వ్యాపారంలో నాలుగు డబ్బులు కూడేసి పిల్ల పెళ్లి చేస్తున్నాడా పెద్దమనిషి. అంతలో వీలైతే కాస్త సాయం చేయాలి లేదా మాట్లాడకుండా కూర్చోవాలి. ఎప్పుడో కరోనా ముందు ఆయన ఇచ్చిన మాట ఈ కరువు కాలంలో కూడా తీర్చమని మొండికేస్తే ఎలా? అసలీ గొడవ చేసే అధికారం మీకెవరిచ్చారు? ఇదే పరిస్థితి రేపు మీకు కూడా రావచ్చునన్న జ్ఞానం ఉండక్కర్లేదా? ఒక మనిషి కష్టపడి సంపాదించిన డబ్బుతో మీకు బట్టలు కొనివ్వమని అడిగే హక్కు మీకెక్కడిది?"
"నువ్వెవడివోయ్? మధ్యలో సత్రకాయలాగా, మా రామారావేమైనా పురమాయించడా యేఁవిటి?"
"లేదు. నేను పెళ్లి కొడుకు స్నేహితుణ్ణి. నా పేరు కిరణ్"
"ఇదిగో, ఇలాంటి విషయాలు పెద్దవాళ్ళం తేల్చుకోవాల్సినవి. నీకు వయస్సు చాలదు. ఇంకా పెళ్లి కూడా అయినట్లు లేదు. ఇందులో అనవసరంగా దూరకు" అని అరిచాడు సుజ్ఞాన్.
"చూడండి ఇది నా ప్రాణమిత్రుడి పెళ్లి. ఇక్కడ గొడవ జరిగితే దాన్ని ఆపే హక్కు, ఆపాల్సిన బాధ్యత నాకూ ఉన్నాయి. ఒక దురాచారాన్ని ఎదిరించే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఇక్కడ వయోభేదాల ప్రస్తావన తీసుకొచ్చి విషయాన్ని పక్కదారి పట్టించకండి"
"పెద్ద సంఘసంస్కర్త బయలుదేరేడండీ. నువ్వేమైనా వీరేశలింగం, రాజా రామ్మోహన్ రాయ్ అనుకుంటున్నావా?" ఉక్రోషంగా అన్నాడు సుజ్ఞాన్.
"సార్, ఎవరూ పుట్టుకతో సంఘసంస్కర్తలు కారు. చుట్టూ పరిస్థితులు వారిని అలా ప్రేరేపిస్తాయి. ఈరోజు వీరేశలింగం గారిని సంఘసంస్కర్త అంటున్నారు కానీ అప్పటి ఛాందసులంతా ఆయన్ని తిట్టినవారే"
"చూడు నాయనా, ఇవన్నీ పురాతనకాలం నుంచి వస్తున్న సంప్రదాయాలు. మన పూర్వీకులకు నీకున్న పాటి జ్ఞానం లేదంటావా యేవిఁటి?" అంటూ దబాయించాడు పురోహితుడు తన సామగ్రిని, తనకిచ్చిన నూతన వస్త్రాలను సర్దుకుంటూ.
"అంటే మన పూర్వీకులు ఒకళ్ళతో ఒకరు గొడవలు పడమని చెప్పారా?"
"అంటే నూతనవస్త్ర బహుకరణ, ఈ పెట్టిపోతలు తప్పంటావా? నాకు కొత్తబట్టలు ఇవ్వమని అడిగే హక్కు కూడా నాకు లేదా?" అంటూ రెట్టించాడు పురోహితుడు.
"అయ్యా అది మీరు మీ సేవలకు ప్రతిఫలంగా అడుగుతున్న పారితోషికం. మీరు అడిగే పారితోషికం, బట్టలు ఇవ్వలేకపోతే వేరే పురోహితుణ్ణి పెట్టుకుంటారు. కానీ ఇక్కడి విషయం పారితోషికం కాదు. ఒకరు కష్టపడి సంపాదించిన డబ్బుతో కేవలం చుట్టరికాన్ని అడ్డం పెట్టుకుని తనకు నచ్చిన ఖరీదులో బట్టలు కొనమని అడిగే అధికారం ఎవరిచ్చారు? ఇచ్చేవాడు తన సంతోషం కొద్దీ ఏదిస్తే అది పుచ్చుకోవాలి లేదా మాట్లాడకుండా కూర్చోవాలి. వాళ్ళ బాధ పడలేక ఏదో ఒక చీర కొనిస్తే దానికంటే ఖరీదైనదీ, సోకైనదీ కావాలని గొడవ. కాటన్ చీర కొంటే పోచంపల్లి చీర కావాలి, అదిస్తే కంచిపట్టు చీర కావాలి, అది కొనిస్తే దానికి బంగారం జరీ కావాలి, అంచు పెద్దది ఉండాలి. అసలే ఆడపిల్ల తండ్రి బోలెడు ఖర్చులో ఉంటాడు. తన చెల్లి కూతురు పెళ్ళికి ఓ మంచిచీర కొని తన పెళ్ళానికివ్వలేడా పెళ్ళికూతురు మేనమామ? తన భర్త బుట్ట మొయ్యాలి కాబట్టి అదే అదనుగా ఈవిడ గొంతెమ్మ కోరికలు కోరుతోంది. అదే వేరే వాళ్ళెవరైనా ఇస్తే నచ్చితే వాడతారు లేదా బీరువాలో దాచి పెడతారు. మరొక సందర్భంలో మరొకరికి పెడతారు. ఆ పుచ్చుకున్నావిడికీ నచ్చకపోతే మరొకరికి పెడుతుంది. చీర చూడగానే మన కోసం కొనిచ్చారా, లేదా రొటేషన్లో తోసేశారా అన్నది ఆడవాళ్ళకి ఇట్టే అర్థమైపోతుంది. లోపల్లోపల సణుక్కుంటారు. చాటుగా కామెంట్లు చేస్తారు. ఇలా తిరిగి తిరిగి వాట్సాప్ మెసేజ్‌లా ఏదో ఒక రోజు ఆ చీర పుట్టింటికి చేరుతుంది. ఇక రవికెల గుడ్డల సంగతైతే చెప్పనే అక్కర్లేదు. పెట్టుబడి ముక్కలని మార్కెట్లో విడిగా అమ్ముతారు. ఈ మొక్కుబడి గుడ్డలు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం తప్ప కుట్టించుకోడానికి పనికిరావు. సగటున చూస్తే ప్రతి మధ్యతరగతి ఇంట్లో నచ్చని, వాడని చీరలు, ప్యాంటు షర్ట్ గుడ్డలు ఓ పది జతలైనా ఉంటాయి". బ్రేక్ లేకుండా చెప్పుకుపోతున్నాడు కిరణ్. ఒక్క క్షణం గుక్క తిప్పుకుని మళ్లీ చెప్పడం మొదలు పెట్టాడు.
"నిశ్చితార్థానికి బట్టలు, పెళ్లికి బట్టలు, మొదటి పండక్కి బట్టలు, శ్రీమంతానికి బట్టలు, అల్లుడు ఇంటికొస్తే బట్టలు, పండగొస్తే బట్టలు, పుట్టినరోజులకీ పెళ్లిరోజులకీ బట్టలు, చుట్టాలెవరైనా మొదటిసారొస్తే బట్టలు, బట్టలు-బట్టలు-బట్టలు. అప్పు చేసి ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తే వచ్చిన వాళ్లందరికీ బట్టలు, వాళ్ళు వీళ్ళకి బట్టలు, వాటిల్లో తేడాలొస్తే అలకలు, అసలీ బట్టలకి అంతం ఉందా? ఇవి కాక నెల నెలా షాపింగ్‌లు మామూలే. మార్కెట్లో ఫ్యాషన్ మారితే పాతవన్నీ మ్యూజియంలోకే. మధ్యతరగతి, దిగువతరగతి కుటుంబాలలో ఈ నిరర్ధకమైన ఖర్చులకి అంతం లేకుండా పోయింది. ఈ నిర్బంధ సాంప్రదాయాలు మారనంత వరకు మన సమాజం బాగుపడదు" ఊపిరి పీల్చుకున్నాడు కిరణ్.
కాసేపు అంతా నిశ్శబ్దం. కొంత సేపయ్యాకా ఇందాక దబాయించిన పెద్దాయన అడిగాడు. "అంటే ఏ సందర్భంలోనూ సరదాలూ సంతోషాలూ ఉండక్కర్లేదా? పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ సినిమా చూసినట్లు చూసి, హోటల్లో తిన్నట్లు తిని వెళ్లిపోవాలా? నా చెల్లెలికో, తమ్ముడికో బట్టలు ఇవ్వడం తప్పా? పెళ్లి కొడుక్కీ, పెళ్లి కూతురుకీ, పెళ్లిపెద్దలకీ మంచి బట్టలు కొనివ్వకూడదా? నా సంతోషాన్ని వ్యక్తపరచుకోవాలనుకోవడం తప్పా,? అందరూ గొడవలు చేసే వాళ్ళు, అలిగే వాళ్ళు, సతాయించే వాళ్లే ఉండరు".
"మంచి ప్రశ్న వేశారు. మీ సంతోషాన్ని వ్యక్తపరచడానికి బట్టలు పెట్టడం తప్ప వేరే మంచి మార్గమే లేదా? మీరు చేస్తున్న పని మీకు సంతోషం కలిగిస్తుంది సరే, అది అవతలి వారికి ఉపయోగపడుతుందో లేదో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు చేస్తున్న పని నచ్చని వాళ్లందరూ మీ మొహం మీదే చెప్పరు. పెళ్లి పెద్దలు - ముఖ్యంగా పెళ్లి కూతురు తండ్రి పుట్టెడు ఖర్చులో ఉంటాడు. అప్పులు చేస్తాడు. సగటున ఒక జంటకి ఓ మాదిరి మంచి బట్టలు కొనాలంటే ఇంచుమించు రెండు వేలు ఖర్చవుతుంది. వియ్యాల వారు, సొంత వారు, మిత్రులు, మొహమాటస్థులు కలిపి దాదాపు ఓ పాతిక జంటలైనా ఉంటారు. ఇవి కాక, చిన్న పిల్లలకీ, పెళ్లి కాని పెద్ద పిల్లలకీ కూడా పెట్టాలి. చిన్న పిల్లల బట్టలు పెద్దవాళ్ల బట్టల కంటే ఎక్కువ ఖరీదు ఉంటాయి. ఈ పుచ్చుకున్న వాళ్ళలో చాలా మంది ఎదురు బట్టలు పెడతారు లేదా ఎప్పుడో ఎవరో ఇచ్చి వాడకుండా పడేసిన ఫోటో ఫ్రేమ్‌లు, ఫ్లవర్ వేజ్‌లు ఇచ్చేస్తారు. ఈ లెక్కన చూస్తే పెళ్లిపెద్దకి దాదాపు లక్ష రూపాయలు బట్టలకే ఖర్చవుతుంది. పెళ్లికి వచ్చిన దగ్గర బంధువులందరికీ తలా రెండువేలు ఖర్చవుతాయి. ఈ లెక్కంతా పెళ్లికి మాత్రమే. పెళ్లికి ముందు నిశ్చితార్థానికి మళ్లీ వేరే. ఆ పెళ్ళిపెద్దకి పుచ్చుకున్న బట్టలన్నీ నచ్చుతాయా? కుట్టించుకుంటాడా? ఒకవేళ కుట్టించుకుంటే పాతిక ముప్పైవేలు ఖర్చవుతుంది. రెడీమేడ్ బట్టలు పెడితే సైజులు తేడా వస్తాయి. అందుకని ఆ బట్టలన్నింటినీ రొటేషన్‌లోకి తీసుకొస్తారు. ఈ బట్టలు పెట్టిన వాళ్ళలో కొంతమంది తామిచ్చిన బట్టలు తొడుక్కున్నాడా? లేదా? అని గమనిస్తూ వుంటారు. ఇచ్చేవాళ్ళు ఒక్కొక్కసారి గొప్పకి పోయి తమ స్థోమతకు మించి కొంటారు. పుచ్చుకునేవాళ్లు తమ స్థోమతకు మించి ఆశిస్తారు. ఈరోజు పదివేల రూపాయల చీర కోసం అలిగినావిడకి పదివేల రూపాయల చీర కొనుక్కునే స్థోమత ఉందా? తన కూతురు పెళ్లి చేస్తే పదివేల రూపాయల చీర కొనగలదా? ఇప్పుడు ఈవిడ సతాయింపులు భరించిన వాళ్లు అప్పుడు ఊరుకుంటారా?"
దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న రామారావుకి ఎవడో టెంకిజెల్ల పీకినట్లయింది. ఈరోజు సుశీల చేసిన అల్లరికి వచ్చే సంవత్సరం దాని కూతురి పెళ్లిలో ఎలా బదులు తీర్చుకోవాలో అప్పుడే పథక రచన కూడా చేసేస్తున్నాడు అతను.
"తన సొమ్ము కాదు కాబట్టి, తన మొగుడి అవసరం ఉంది కాబట్టి ఈవిడ తన స్థాయిని మించిన కోరికలు కోరుతోంది" సూటిగా అన్నాడు కిరణ్.
అందరూ సుజ్ఞాన్ కేసి చూశారు. అతని మొహం కందగడ్డలా తయారైంది. కానీ నోరిప్పలేకపోయాడు.
"మన దేశంలో వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే బట్టలు కట్టుకోవడానికి కాకుండా పోగెయ్యడానికి, దాచిపెట్టడానికి ఖర్చవుతున్నాయి. లేని వాళ్ళు ఎండకీ, వానకీ, చలికీ బాధపడుతూనే ఉన్నారు. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే మీ సంతోషంతో పాటు అవతలి వారి అవసరాలను కూడా గమనించండి. పెళ్లిపెద్దకి రెండువేల రూపాయలు పెట్టి బట్టలు కొనిచ్చే బదులు రెండు వేల రూపాయలు డబ్బులు ఇవ్వండి. ఆయన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండి. అథమం ఆయనకొక లక్ష రూపాయలు అప్పు, వడ్డీ, వాయిదాలు తప్పుతాయి. పుట్టినరోజులకీ, పెళ్లిరోజులకీ, పండగలకీ, పబ్బాలకీ మీరు ఎంతపెట్టి బట్టలు కొనాలనుకుంటున్నారో అంతా డబ్బు రూపంలో ఇవ్వండి. ఆ క్షణానికి అతనికి బట్టల కంటే ముఖ్యమైన అవసరం మరొకటి ఉండొచ్చు. దానికి వాడుకుంటాడు. రెండువేల రూపాయల బట్టలు అతనికి నచ్చవనుకోండి. పైన ఎంత కావాలంటే అంత వేసుకుని తనకి నచ్చిన బట్టలు కొనుక్కుని కట్టుకుంటాడు.ఏదీ కాకపోతే బ్యాంకులో వేసుకుని మరో ఖర్చుకి వాడుకుంటాడు".
"అంటే మేమందరం చందాలు వేసుకొని పెళ్లి జరిపించాలంటావ్, అంతేనా?" వెటకారంగా అడిగాడు ఆ పెద్దమనిషి. అందరూ గొల్లున నవ్వారు.
"జోకులేసి, నవ్వి విషయాన్ని పక్కదారి పట్టించకండి. చందా - సహాయం - పొదుపు వీటిగురించి, వీటి మధ్య ఉండే సున్నితమైన సంబంధాన్ని తెలుసుకోండి. మీ ఆలోచనలను బట్టి, ఉద్దేశ్యం బట్టి పేరు మారుతుంది. చందా అన్న పేరు తీసేసి దాన్ని మీరు చేసే సహాయంగా భావించండి. దానివల్ల అవతలి వాడికి జరిగే ఆదా, పొదుపు గురించి ఆలోచించండి. నిజమైన సంతోషం అంటే ఏమిటో మీకే అర్థం అవుతుంది ". అందరూ శ్రద్ధగా వింటున్నారు.
"చర్చ ఇంతదాకా వచ్చింది కాబట్టి మరొక్క విషయం కూడా చెప్తాను. పేర్లు చెప్పను కానీ మన దేశంలో కొన్ని జాతులు, కులాలు, సంఘాలు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందాయి. మరి కొన్ని శతాబ్దాలుగా మధ్య, దిగువతరగతి జీవితాలే గడుపుతున్నాయి. మనలో చాలామందికి సంతోషం - తృప్తి, పొదుపు - కక్కుర్తి, వీటిపై సరైన అవగాహన లేదు. తన డబ్బైనా, పక్కవాడిదైనా, ప్రభుత్వానిదైనా అవసరానికి మించకుండా ఖర్చు చేస్తే దాన్ని పొదుపు అంటారు. తన డబ్బైతే లెక్కగా, జాగ్రత్తగా ఖర్చు పెట్టి, పక్కవాడిదో, ప్రభుత్వానిదో అయితే విచ్చలవిడిగా ఖర్చు చేస్తే ఆ మనస్తత్వాన్ని కక్కుర్తి అంటారు. సంతోషంగా ఉండటం అంటే విలాసవంతమైన జీవితం, బోల్డంత బ్యాంక్ బ్యాలెన్స్, ఆస్తులు కలిగి ఉండటం కాదు. ఉన్నదాంట్లో తృప్తిగా ఉండడమే సంతోషం. బోల్డంత డబ్బున్నా వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు పడుతున్న వారిని చూస్తూనే ఉంటాం".
"ఇదిగో అబ్బాయ్. ఉపన్యాసాలు ఆపు. ఏదో వింటున్నాం కదా అని సూక్తులు, ప్రవచనాలు చెప్పకు. ఇవన్నీ వ్యాసరచనల్లో, వక్తృత్వ పోటీల్లో బహుమతులు, పరీక్షల్లో మార్కులు సంపాదించుకోవడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్‌గా సాధ్యం కావు. తృప్తి అనేది సాపేక్షం అంటే రిలెటివ్. నాకు తృప్తి కలిగించేది నీకు లగ్జరీ కావచ్చు. నీ తృప్తి మరొకరికి విలాసం. ఇందులో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు?"
"చాలా చక్కటి ప్రశ్న లేవనెత్తారు మాస్టారూ. మీకో చిన్న ఉదాహరణ చెప్తాను. ఢిల్లీ నుండి చండీగఢ్‌కి ట్రైన్‌లో వెళ్ళినా, టాక్సీలో వెళ్లినా, ఫ్లైట్‌లో వెళ్లినా, లోకల్ ట్రావెల్ కలుపుకొని గంటా రెండు గంటలు తేడాలో ఇంచుమించు ఒకే సమయంలో వెళ్లిపోతాం. నలుగురున్న ఒక కుటుంబానికి ట్రైన్‌లో ఏసీ చైర్ కార్లో వెళ్తే 3000, ఒన్‌వే టాక్సీలో వెళ్తే 5000, ఫ్లైట్ లో వెళ్తే 15000 ఖర్చు అవుతాయి. తనకంటే ఎక్కువ సంపాదన ఉండేవాడితో పోల్చుకొని ఈసుకీ, గొప్పకి పోతే మూడువేలతో పోయేదానికి పదిహేనువేలు ఖర్చవుతాయి. హాయిగా ట్రెయిన్లో వెళ్లి మిగిలిన 12 వేలల్లో పదివేలు పెళ్లి కూతురికి క్యాష్ గిఫ్ట్ ఇవ్వండి. 2000 మిగుల్చుకోండి ఆ పెళ్లిపెద్ద ఎంత సంతోష పడతాడు? ఇప్పుడు అసలే చలి కాలం. ఏసీ కూడా అనవసరం. హాయిగా స్లీపర్‌లో వెళ్ళండి. పదిహేను వందల్లో అయిపోతుంది. స్లీపర్ లో వెళ్ళిన వాడు కక్కుర్తి పడినట్టు కాదు. ఎందులో వెళ్ళినా సంతోషంగా ఉండటం అనేది మన దృక్కోణం అంటే పర్స్‌పెక్టివ్ బట్టి ఉంటుంది. పదివేల రూపాయల చీరతోనూ హుందాగా ఉండొచ్చు. మూడువేల రూపాయల చీరతోనూ ఉండొచ్చు. ఒక్కసారి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధినేత సుధామూర్తి గారిని చూడండి. ఆవిడ ఎంత సాదాసీదాగా ఉంటారు? ఆవిడ హుందాతనానికి, ప్రజలు ఆవిడకిచ్చే గౌరవానికి కారణం ఆవిడ వ్యక్తిత్వం. ఖరీదైన చీరలు కొనుక్కోవడానికి ఆవిడకి డబ్బులు లేకనా? నేను చెప్పే విషయాలు ప్రసంగాలలో మాత్రమే కాదు. నిజ జీవితంలో కూడా సాధ్యమే".
"ఇలా అయితే ఎయిర్ లైన్స్, లగ్జరీ సూట్‌లు తయారు చేసే కంపెనీలు దివాలా తియ్యవూ?"
"చూడండి ఫ్లైట్‌లో వెళ్ళడం తప్పని నేననలేదు. అవసరం బట్టి వెళ్లాలి. పదినిమిషాల సమయాన్ని కూడా ఎంతో విలువగా వాడుకునే పెద్ద పెద్ద వ్యాపారస్తులు, అధికారులు, ప్రజా సేవకులు విమానాల్లోనే వెళ్ళాలి. బాగా డబ్బులున్న సంపన్నవర్గాల వారు విమానాల్లో వెళ్లకపోతే, ఖరీదైన బట్టలు కొనుక్కోకపోతే డబ్బులు చెలామణీలోకి రావు. ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. సంపన్నులను చూసి స్థోమత లేనివాళ్ళు వాతలు పెట్టుకోకూడదు. పదివేల రూపాయల చీర కట్టుకోకపోతే, ఫ్లైట్‌లో రాకపోతే పక్కవాడు చులకనగా చూస్తాడేమో అనే ఆలోచన నుంచి బయట పడాలి. అన్ని అనర్థాలకు ఈ ఫాల్స్ ప్రెస్టేజీయే కారణం. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసుకో, షాపుకో కార్లో వెళ్లి రోజూ ఇంటిదగ్గర అరగంట సేపు ఎక్సర్సైజ్ సైకిల్ తొక్కడంలో అర్థం లేదు. దగ్గర దూరానికి సైకిల్ మీద వెళ్తే పెట్రోల్, సమయం కూడా మిగులుతాయి. స్టేషనరీ సైకిల్ కొనాల్సిన అవసరం ఉండదు. పైగా కాలుష్యం ఉండదు, ఆరోగ్యం కూడా. బయటికి వచ్చి ఎక్సర్‌సైజ్ చేయలేని, నడవలేని పెద్దలు, రోగులు అయితే తప్పకుండా ఇంట్లో ఎక్సర్సైజ్ సైకిల్ కొనాలి. సిటీ ట్రాఫిక్‌లో చిన్న చిన్న దూరాలకి సైకిలైనా, కారైనా ఒకటే సమయం పడుతుంది. మనం చేసే పనులు, ఖర్చులు అన్ని వ్యక్తిగత సంతోషానికన్నా పక్కవాడు ఏమనుకుంటాడో అని చేసేవే ఎక్కువ”.
“నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎకానమీ అనే అద్భుతమైన కాన్సెప్ట్‌ని అందరూ అర్థం చేసుకోవాలి. అందరూ తమ సొంత ఖర్చుతో పాటు పక్కవాడి ఖర్చును కూడా తగ్గించే ప్రయత్నం చెయ్యాలి. అంటే ఇందాక చర్చ మొదలైన బట్టల వంటి విషయాల దగ్గర. శుభకార్యాలలో ఇలాంటి పెట్టిపోతలు తగ్గించి, డబ్బులు ఇస్తే అవతలివాడు కూడా ఆర్థికంగా బలపడతాడు. ఇలా అందరూ మిగుల్చుకున్న డబ్బుతో తలా కొంచెం సహాయం చేసి, అదే - ఇందాక మీరన్న చందా వేసి, తమ కుటుంబంలో ఒక పేదవాడిని మంచి చదువు చదివించవచ్చు లేదా ఒక సొంతిల్లు కొనుక్కోవడానికి సహాయపడవచ్చు. దీన్నే ఫ్యామిలీ ఎకానమీ అంటారు. ఇలానే ఒక సంఘంలోని అన్ని కుటుంబాలు ఒకరికొకరు సహాయపడితే ఒక సంఘం లేదా జాతి ఆర్థికంగా బలపడుతుంది. దీన్నే కమ్యూనిటీ ఎకానమీ అంటారు. తమకు ఫ్లైట్ ఎలిజిబిలిటీ ఉంది కదా అని వారం వారం దగ్గర ఊళ్ళకి మీటింగులకు వెళ్లే ప్రభుత్వాధికారులు విమానాల్లో కాకుండా ట్రైన్లలో వెళ్తే ప్రభుత్వానికి డబ్బులు ఆదా అవుతాయి. ఈ కరోనా పుణ్యమా అని ఆన్‌లైన్ మీటింగులు పెరిగి చాలా ఖర్చు, సమయం మిగిలాయి. తాము సీట్లో లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆపడం వంటివి నేర్చుకోవాలి. ఇంట్లో అలా వదలరు కదా. ఇలా అనేక సంఘాలు, వ్యక్తులు పొదుపుగా ఉంటే అది నేషనల్ ఎకానమీకి దారి తీస్తుంది. డబ్బు మనదవ్వచ్చు కానీ వనరులు మనవి కావు. నాచురల్ రిసోర్సెస్‌ని వృధా చేసే హక్కు ఎవరికీ లేదు. 'నేనొక్కడిని పొదుపుగా ఉంటే ఏం జరుగుతుందిలే' అని ప్రతివాడు అనుకోవడం వలననే మన దేశ ఆర్ధిక స్థితి ఎప్పటికీ బాగుపడట్లేదు. నా నుంచే మొదలుపెడదాం అనుకోవాలి. ఆటంబాంబు ఎటాక్ తర్వాత నేలమట్టమైన జపాన్ అతిశీఘ్రంగా అభివృద్ధి చెందిందంటే దానికి కారణం నేషనల్ ఎకానమీయే. దేశ ప్రజలకి బట్టల అవసరం తగ్గిందనుకోండి. అప్పుడు బట్టలను తయారుచేసే కంపెనీలు మిగిలిన బట్టలను ఎగుమతి చేయగలవు. ఎగుమతి చేసే క్రమంలో నాణ్యతను పెంచుకుంటాయి లేదా తమ పెట్టుబడిని బట్టల కంటే దేశానికివసరమైన, లాభదాయకమైన వేరే ప్రాజెక్టులలో పెడతాయి. ఎవ్వరూ నష్టపోరు. ఎప్పుడైతే ప్రజలు విలాసాల నుంచి అవసరాల వైపు ఆలోచిస్తారో అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. 140 కోట్లమంది ప్రజల్లో కనీసం పది కోట్లమంది సంవత్సరం మొత్తంలో ఒక్క జత బట్టలు కొనుక్కోవడం మానుకుని - ఎలాగో పెళ్ళిళ్ళు లేవు కదా, ఒక వెయ్యి రూపాయలు పి.ఎమ్. కేర్స్ ఫండ్‌కి విరాళం ఇస్తే ప్రభుత్వానికి ఈ కష్టకాలంలో 10 వేల కోట్లు సమకూర్చినట్లు అవుతుంది. ప్రపంచంలో ఎవరు ఏ పని చేసినా అది సంతోషం కోసమే కదా, కాకపోతే దానికి మనమిచ్చుకునే నిర్వచనం సరిగ్గా ఉండాలంతే".
ఒక్క క్షణం గుక్క తిప్పుకుని అన్నాడు "క్షమించండి, ఏదో ఆవేశం తట్టుకోలేక ఎక్కువ మాట్లాడేను".
తలతిప్పి పక్కకి చూస్తే వెనక ఓ పాతిక మంది ఆసక్తిగా వింటూ కనిపించేరు. వాళ్ళలో పెళ్లిపెద్దలు కూడా ఉన్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు.
మెల్లిగా ఓ పెద్దావిడ అడిగింది. "నీకు పెళ్లయ్యిందా? ఏం ఉద్యోగం?" ఆవిడ అప్పుడే సంబంధాలు వెతుకుతోంది. అందరూ గట్టిగా నవ్వేరు. వాతావరణం తేలికయింది.
"నాకింకా పెళ్లి కాలేదండీ, నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని".
“మరి, ఇన్ని సూక్తులు వర్లించేవు కదా, నువ్వేమైనా వెనకేశావా?" ఆవిడ అప్పుడే అతని ఆస్తిపాస్తుల గురించి వాకబు చేసేస్తోంది.
"నేను పాటించకుండా ఒకరికి సూక్తులు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నాకు నెలకి యాభైవేలు జీతం. ఉద్యోగం వచ్చి నాలుగేళ్లయింది. పుట్టినరోజులకీ, పండగలకీ అమ్మానాన్నా ఇచ్చిన డబ్బులతో, నేను దాచుకున్న దాంతో కలిపి ఈ మధ్యనే ఇరవై లక్షలు లోన్ తీసుకుని ముప్పై లక్షలతో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కొన్నాను. పెళ్లైతే ఖర్చులు పెరుగుతాయి కదా. అందుకే ముందుగానే కొన్నాను. మా ఆఫీసు ఇంటికి దగ్గరే. అందుకని ఆఫీసుకి సైకిల్ మీదే వెళ్తాను. ఎండాకాలం కాకపోతే స్లీపర్‌లోనే ప్రయాణం చేస్తాను. నాకు పదిజతల బట్టలు మాత్రమే ఉన్నాయి. కానీ నేను చాలా సంతోషంగా, తృప్తిగా ఉన్నాను. నేనో పెద్ద ఆదర్శవాదినని చెప్పట్లేదు. ఏదో మీరు అడిగారని చెప్తున్నాను అంతే. మీరేవో సంబంధాలు వెతుకుతున్నట్లున్నారు. భయపడకండి. పెళ్లయితే పెళ్ళాన్ని సైకిల్ మీద డబుల్స్ తొక్కను. జనరల్ బోగీ ఎక్కించను. పది చీరలతో బతకమనను". అందరూ మళ్లీ గట్టిగా నవ్వుతూ లేచారు.
"ఏమైనా అసాధ్యుడవోయ్" అంటూ భుజం తట్టాడు పెద్దాయన.
మెల్లిగా పెళ్లికొడుకు దగ్గరికి వెళ్లి 'బై' చెప్పి, పార్కింగ్‌లోకి వెళ్లి సైకిలెక్కి, ట్రింగ్ ట్రింగ్ అంటూ బెల్ కొట్టుకుంటూ బయల్దేరాడు కిరణ్.
Comments
Post a Comment