డి.కె.పట్టమ్మాళ్

డి.కె. పట్టమ్మాళ్
రచన: కె. సద్గురుచరణ్,
నిలయ విద్వాంసులు, ఆకాశవాణి, విజయవాడ.
ఫోన్: 9440709994.

పురాతన హిందూ సమాజంలో పురుషాధిక్యత ప్రబలంగా ఉండేది. అంతేకాక అనేక తరాలపాటు ఆడవారి హక్కులను హరించి, తెలివితేటలను తొక్కిపట్టి, మేధస్సును వికసించనీయకపోవడం వలన కొన్ని శతాబ్దాల పాటు వారు బలహీనులుగా ఉండిపోయారు. 'ఆడదానికి ఇంటిపని, వంటపని వచ్చి, చాకలి పద్దు రాసుకునేంత చదువు వస్తే చాలు' అనే స్థితిలో ఉండేది నాటి సమాజపు ఆలోచనా విధానం.

అయితే నేటి పరిస్థితి వేరు. పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాలలో ముందున్నారు. అనేక వృత్తులలో, ఉద్యోగాలలో తమ ఉనికిని, ఉన్నతిని కూడా చాటుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతున్నారు. 20వ శతాబ్దపు ప్రథమార్థం వరకు మనదేశంలో ఉండిన పరిస్థితులు నేటి తరానికి హాస్యాస్పదంగా, ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అందుకే నాటి ఛాందసవాదం నుండి నేటి అభ్యుదయ వాదానికి పరిణామం ఎలా జరిగిందో ప్రస్తుత తరం తెలుసుకోవడం చాలా అవసరం. సంగీత రంగాన్ని తీసుకుంటే ఆడవారిని చిన్నచిన్న శుభకార్యాలలో కుటుంబ సభ్యుల, స్నేహితుల మధ్య కూడా పాడడానికి ఒప్పుకోని ఛాందస బ్రాహ్మణ కుటుంబాల్లోని స్త్రీలు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో దేశానికి వన్నెతెచ్చిన విద్వాంసురాళ్ళగా ఎలా ఎదిగారో తెలుసుకోవాలంటే డి.కె. పట్టమ్మాళ్ గారి జీవితగాధను తెలుసుకుని తీరాలి. ఛాందసవాదుల కట్టుబాట్లను తెంచుకుని, సభావేదికలపై కచేరీలు చేసిన మొదటి విద్వాంసురాలిగా ఆవిడ చరిత్రలో నిలిచిపోయారు.

తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాంచీపురంలో 1919 మార్చి 28న జన్మించారు దామల్ కృష్ణస్వామి (డి.కె) పట్టమ్మాళ్ గారు. తండ్రి దామల్ కృష్ణస్వామి దీక్షితర్ గారు మంచి సంగీతాభిమాని. తల్లి కాంతిమతి (రాజమ్మాళ్ అని పిలిచేవారు) గారికి సంగీతంలో మంచి ప్రవేశం ఉండేది. పట్టమ్మాళ్ గారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు అలమేలు. కానీ ముద్దుగా పట్టా అని పిలిచేవారు. చివరకు అదే పట్టమ్మాళ్‌గా స్థిరపడింది.

ఆవిడ చిన్నతనం నుంచి సంగీతంలో ఎంతో ప్రావీణ్యం కనబర్చారు. ఆవిడ ఒక క్రమపద్ధతిలో గురుముఖతః సంగీతం నేర్చుకోలేదు. అప్పట్లో కాంచీపురంలో ప్రసిద్ధ గాత్ర విద్వాంసులు కాంచీపురం నయనా పిళ్ళై గారి ఆధ్వర్యంలో అనేక సంగీతోత్సవాలు జరుగుతూ ఉండేవి. అక్కడ జరిగే కచేరీలలో విద్వాంసులు ఎలా పాడుతున్నారో గమనించి, ఇంటికి వచ్చి వాళ్లని అనుకరిస్తూ పాడుతుండేవారు. తన తండ్రి నేర్పిన కొన్ని భక్తిగీతాలను కూడా పాడుతూ ఉండేవారు. ఒకసారి ఏదో ఒక పెళ్ళిలో ఆవిడ ఈ పాటలను పాడుతూ ఉండగా ఒక తెలుగు విద్వాంసుడు ఆమె యొక్క ప్రతిభను గుర్తించి, ఆమెకు కొన్ని కృతులు నేర్పారట. ఆమె యొక్క గ్రహణశక్తిని గమనించి అభ్యాస వరుసలు చెప్పకుండా నేరుగా పెద్దపెద్ద కృతులను నేర్పారట. ఆయన పేరు తనకు తెలియదని, తెలుగులో మాట్లాడేవారు కాబట్టి 'తెలుగు టీచర్' అని పిలిచేవాళ్ళమనీ పట్టమ్మాళ్‌గారు చెప్తూ ఉండేవారు. తర్వాతి కాలంలో ఆవిడ ఎందరో విద్వాంసుల వద్ద శిక్షణ పొంది, కేవలం త్రిమూర్తులైన త్యాగరాజస్వామి, దీక్షితర్, శ్యామశాస్త్రుల వారి కృతులను మాత్రమే కాకుండా, ముత్తు తాండవర్, అరుణాచల కవి, గోపాలకృష్ణ భారతి, సుబ్రహ్మణ్య భారతి మొదలైన వాగ్గేయకారులు రచించిన తమిళ కృతులనెన్నింటినో కూడా పాఠం చేశారు. తిరుప్పుగళ్, తేవారం వంటి తమిళ సాంప్రదాయ రచనలను కూడా నేర్చుకున్నారు. ముఖ్యంగా ఆవిడను దీక్షితర్ కృతుల భాండాగారంగా చెప్పుకుంటారు. ముత్తుస్వామి దీక్షితర్ మునిమనుమడైన అంబి దీక్షితర్‌ గారి వద్ద, జస్టిస్ టి.ఎల్. వెంకట్రామయ్యర్ గారి వద్ద దీక్షితర్ కృతులననేకం పాఠం చేశారు. ప్రసిద్ధ తమిళ వాగ్గేయకారులు పాపనాశం శివన్ గారి కృతులనెన్నింటినో ఆవిడ ప్రచారంలోకి తీసుకువచ్చారు.

10 సంవత్సరాల పిన్న వయస్సులో 'పట్టా' గానం మద్రాసు కార్పొరేషన్ రేడియోలో (నేటి ఆలిండియా రేడియో) ప్రసారమైంది. పట్టమ్మాళ్‌ గారు చదువుకునే పాఠశాల ప్రధానోపాధ్యాయిని అయిన 'అమ్మకుట్టి అమ్మ' గారు పట్టా ప్రతిభను గుర్తించి, సంఘదూషణకు భయపడి కుమార్తెను కచేరీలు చేయించడానికి సంశయిస్తున్న కృష్ణస్వామి గారితో వాదించి, స్త్రీలకు కూడా తమకు ప్రతిభ, ఇష్టం ఉన్న వృత్తిని ఎంచుకుని పురుషులతో సమానంగా జీవించే అవకాశాలు కల్పించాలని ఒప్పించారు. ఒకసారి పాఠశాలలో 'సత్యవాన్ సావిత్రి' అనే నాటకంలో సావిత్రి వేషం వేసే అవకాశం రావడం ఆవిడ జీవితాన్నే మలుపు తిప్పింది. ఆవిడ ఆరోజు అద్భుతంగా గానం చేసి నటించారు. అది చాలదన్నట్లు మర్నాడు పత్రికలలో పట్టా ఫోటో, నాటిక గురించిన వార్తలు ప్రచురితమయ్యాయి. ప్రళయం వచ్చినట్లు అదిరిపడ్డారు కృష్ణస్వామి గారు. కుమార్తెకు సంప్రదాయమైన కుటుంబంలో పెళ్లి కూడా చెయ్యలేనేమోనని నిస్పృహకు లోనయ్యారు. కొద్దిరోజుల్లోనే కొలంబియా రికార్డింగ్ కంపెనీ వారు పట్టా గానాన్ని రికార్డు చేస్తామని రావడం కృష్ణ స్వామి గారిని మరింత కలవరపెట్టింది. అప్పటికి ఆవిడ వయస్సు పన్నెండేళ్ళు మాత్రమే. అప్పుడు కూడా అమ్మకుట్టి అమ్మగారే ఆయనను ఒప్పించారు. ఈనాడు ఇలాంటి సంఘటనలు చాలా హాస్యాస్పదంగా అనిపించవచ్చు కానీ అప్పటి సాంఘిక నేపథ్యంలో అది చాలా సాహసోపేతమైన నిర్ణయం.

1932లో మద్రాసులోని రసికరంజని సభలో ఆవిడ మొదటి కచేరీ చేశారు. సంగీతానికే పూర్తి సమయం కేటాయించాలని 1933లో ఆవిడ మద్రాసులో స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు. మద్రాసు వెళ్ళాక తన పధ్నాల్గవయేట ఎగ్మోర్ లేడీస్ క్లబ్‌లో మొదటి కచేరీ చేస్తే, వచ్చిన ప్రేక్షకులంతా ఒక బ్రాహ్మణ బాలిక స్టేజి మీద కచేరి చేస్తోందనే వింత చూడడానికి వచ్చారట. ఆ రోజుల్లో చాలామంది మృదంగ విద్వాంసులకు ఆడవారికి సహకారం అందించకూడదనే నియమం ఉండేది. చాలా కొద్దిమంది మృదంగ విద్వాంసులు మాత్రమే ఆడవారికి సహకారం అందించేవారు. అది కూడా వేదికపై మార్దంగికునికి గాయకురాలు కనిపించకుండా ఒక తెర కట్టి అప్పుడు కచేరీ మొదలుపెట్టేవారు. క్రమంగా పరిస్థితులు మారాయి. అనేక చోట్ల కచేరీ అవకాశాలు రావడం మొదలైంది. అలా మొదలైన ఆవిడ సంగీతయాత్ర అరవై ఐదు సంవత్సరాలు నిర్విఘ్నంగా కొనసాగింది.

ఇంచుమించు అదే సమయంలో మరో ఇద్దరు మహిళామణులు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, ఎమ్మెల్ వసంతకుమారి గార్లు కూడా సంగీత రంగంలోకి ప్రవేశించి, పురుషులతో సమానంగా నిలదొక్కుకుని ప్రసిద్ధి చెందారు. వీరు ముగ్గురు 'కర్ణాటక సంగీత మహిళా త్రిమూర్తులు'గా ప్రసిద్ధి చెందారు. స్త్రీలు కచేరీలు చేయడానికి అప్పుడప్పుడే పురుషులు అలవాటు పడుతున్న సమయంలో పురుషులు మాత్రమే పాడగలరనుకున్న 'రాగం తానం పల్లవి'ని కచేరీలలో పాడడం మొదలుపెట్టారు పట్టమ్మాళ్‌ గారు. మనోధర్మ సంగీతంలో అత్యంత క్లిష్టమైన భాగం పల్లవి. దీన్ని పాడడానికి ఎంతో జ్ఞానం, సాధన, ఏకాగ్రత అవసరం. క్లిష్టతరమైన తాళాలలో, గతులలో, విషమ జాగాలకు పల్లవులు పాడడం చాలా కష్టసాధ్యం. సమకాలీన పురుష విద్వాంసులకు ఏ మాత్రం తీసిపోకుండా పల్లవులు పాడి తర్వాతి తరాలకు మార్గదర్శకులు, ఆదర్శప్రాయులయ్యారు పట్టమ్మాళ్‌ గారు. పల్లవులు పాడడంలో మేటిగా పేరొందిన నయనా పిళ్ళైగారి ప్రభావం చిన్నతనం నుంచి ఉండడం కూడా ఆవిడను పల్లవులు పాడడానికి ప్రేరేపించింది. నయనా పిళ్ళైగారి వద్ద, విద్యల నరసింహులు నాయుడు గారివద్ద వారు అనేక పల్లవులను నేర్చుకున్నారు. క్రమంగా పల్లవి పట్టమ్మాళ్‌గా ఆవిడ ప్రసిద్ధి చెందారు.

ఆవిడ గానశైలి చాలా స్వచ్ఛంగా, సాంప్రదాయబద్ధంగా ఉండేది. తమిళం మాతృభాష అయినప్పటికీ తెలుగు, సంస్కృత కృతుల ఉఛ్ఛారణ చాలా స్వచ్ఛంగా, స్పష్టంగా ఉండేది. రాగభావం, సాహిత్యభావం వారి గానంలో చాలా ప్రస్ఫుటంగా కనిపించేది. ఎంత క్లిష్టమైన తాళాలలో గానం చేసినా, శ్లోకాలు, విరుట్టమ్‌లు గానం చేసినా సాహిత్య భావంలో, సంప్రదాయం విషయంలో ఎక్కడా రాజీ పడేవారు కారు. ఆవిడ చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. విద్యార్థిదశ నుండే సూర్యోదయానికి ముందే నిద్రలేచి గంటల తరబడి సాధన చేసేవారు.

ఆవిడకి ముఫ్ఫైయ్యేళ్ళ వయస్సులో ఒకసారి ఎక్కడో కచేరీ చేస్తున్నారట. కొన్ని అంశాలు పాడిన తర్వాత దేవగాంధారి రాగంలో 'సీతావర సంగీతజ్ఞానము ధాత వ్రాయవలెరా' అనే కృతిని గానం చేస్తున్నారట. ఉన్నట్టుండి హాల్లో ఏదో కలకలం. ప్రేక్షకులంతా భయంతో బయటకు పరుగులు తీశారు. సహకారవాద్య కళాకారులు కూడా బయటకు పరుగెత్తేవారే కానీ కళ్ళు మూసుకుని, ప్రపంచాన్ని మరచి, తాదాత్మ్యంతో గానం చేస్తున్న పట్టమ్మాళ్ గారిని చూసి అలాగే వాయిస్తూ ఉన్నారట. కాసేపైన తర్వాత ప్రేక్షకులు మెల్లగా హాల్లోకి వచ్చారట. ఆవిడకివేం తెలియవు. కృతి పూర్తయ్యాక కళ్ళు తెరచి చూస్తే ప్రేక్షకులంతా లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. అప్పుడు సహకారవాద్య కళాకారుడు అసలు విషయం చెప్పాడట. 'మీరు కృతి పాడుతుంటే మధ్యలో భూకంపం వచ్చిందనీ, అందరూ బయటకు పరుగెత్తి కాసేపటి తర్వాత తిరిగి వచ్చార'నీ. దానికి వారు "నాకు పోవాలని రాసిపెట్టుంటే ఎలాగైనా పోతాను. సంగీతమే నా ఊపిరి. ప్రాణం మీద ఆశతో పాడడం ఎలా ఆపగలను?" అన్నారట. తాను నమ్మిన విద్యపట్ల ఆవిడకున్న నిబద్ధత, అంకితభావం అలాంటిది. ఆనాటి కచేరీకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రావలసి ఉన్నా అనివార్య కారణాల వల్ల రాలేకపోయారట. ఈ మొత్తం విషయం తెలుసుకున్న రాధాకృష్ణన్ గారు మర్నాడు తన ఇంటికి పిలిపించి పాడించుకున్నారట.

పాపనాశం శివన్‌ గారు పట్టమ్మాళ్ గారిని సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆవిడకి అనేక అవకాశాలు వచ్చినా ప్రేమ గీతాలనెన్నడూ పాడలేదు. కేవలం భక్తి గీతాలను, దేశభక్తి గీతాలను మాత్రమే గానం చేశారు. 'త్యాగభూమి' అనే చిత్రంలో ఆవిడ మొదటగా గానం చేశారు. అనంతరం 'నామ్ ఇరువార్' వంటి చిత్రాలలో కూడా గానం చేశారు. సుబ్రహ్మణ్య భారతి రచించిన అనేక దేశభక్తి గీతాలను ప్రచారంలోకి తీసుకువచ్చారు.

వారు దేశంలోని అనేక ప్రముఖ నగరాలలోనే కాకుండా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, శ్రీలంక, స్విట్జర్లాండ్ వంటి దేశాలలో కూడా పర్యటించి తమ గానాన్ని వినిపించారు. అనేక సన్మానాలు, బిరుదులు వారిని వెతుక్కుంటూ వచ్చి వరించాయి. 'సంగీత సాగరరత్న', 'సంగీతకళా శిఖామణి', 'సంగీత సరస్వతి', ప్రసిద్ధ సంగీతజ్ఞులు టైగర్ వరదాచారియర్ గారిచ్చిన 'గాన సరస్వతి' వీటిల్లో ముఖ్యమైనవి. 1961లో సంగీత నాటక అకాడమీ అవార్డు వీరికి ప్రధానం చేయబడింది. కర్ణాటక సంగీత ప్రపంచంలో భారతరత్నతో సరితూగే మద్రాసు మ్యూజిక్ అకాడమీ వారి 'సంగీత కళానిధి' బిరుదు 1970లో వారికి ప్రదానం చేయబడింది. భారత ప్రభుత్వంచే 1971లో పద్మభూషణ్, 1998లో పద్మవిభూషణ్ వారికి ప్రధానం చెయ్యబడ్డాయి. 1992లో వారికి సంగీత నాటక అకాడమీ సభ్యత్వం (ఫెలోషిప్) లభించింది.

పట్టమ్మాళ్ గారి శిష్యులలో ప్రముఖులు వారి తమ్ముడైన శ్రీ డి.కె.జయరామన్ గారు. అనేక కచేరీలలో జయరామన్ గారు ఆవిడకు గాత్ర సహకారం అందించారు. వయసు పైబడ్డాక ఆవిడ రెండున్నర శృతిలో గానం చేసేవారు. అందువల్ల జయరామన్ గారి సహకార గానానికి శృతి అడ్డు రాలేదు. 1990లో జయరామన్ గారికి కూడా సంగీత కళానిధి బిరుదు లభించడం మరొక విశేషం. ఇంకా వారి శిష్యులనేకమందిలో కోడలు లలితా శివకుమార్, మనుమరాలు నిత్యశ్రీ మహదేవన్, గీతా రాజశేఖర్, అరుంధతి సర్కార్ మొదలైనవారు ప్రముఖులు.

ఇక పట్టమ్మాళ్ గారి వైవాహిక జీవితానికొస్తే 20 ఏళ్ల వయస్సులో ఆర్.ఈశ్వరన్ గారితో ఆవిడకి వివాహమైంది. కచేరీలతో, సాధనతో క్షణం తీరిక లేకపోయినా ఆవిడ భార్యగా, తల్లిగా తన బాధ్యతనెప్పుడూ విస్మరించలేదు. తన వృత్తిని సాకుగా చూపించి బాధ్యతల నుండి ఎప్పుడూ తప్పించుకోలేదు. తన కుమారుని ప్రసిద్ధ మృదంగ విద్వాంసులు పాల్ఘాట్ శ్రీ టి.ఎస్. మణి అయ్యర్ గారి కుమార్తెతో వివాహం చేశారు. ఆడవారికి మృదంగ సహకారం అందించకూడదనే స్థిరమైన నియమం కల మణి అయ్యర్ గారు పట్టమ్మాళ్ గారితో వియ్యమందాకా ఆవిడతో కొన్ని కచేరీలు వాయించారు. పట్టమ్మాళ్ గారి కచేరీల రికార్డింగ్‌లు వివిధ రూపాలలో సంగీతాభిమానుల వద్ద భద్రంగా ఉన్నాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆహూతుల సమక్షంలో ఏర్పాటు చేసిన కచేరీలో వారు గానం చేసిన భైరవి ఏకరాగ సభ 90 నిమిషాల రికార్డింగ్ ఆకాశవాణి శబ్ద గ్రంథాలయంలో భద్రంగా ఉంది. భైరవి వర్ణంతో మొదలుపెట్టి వారు గానం చేసిన కృతి, స్వరజతి, రాగం తానం పల్లవి, ఇతర లలిత శాస్త్రీయ అంశాలు విద్యార్థులకు, విద్వాంసులకు కూడా ఎంతో విజ్ఞానదాయకమైనవి.

జీవిత చరమాంకంలో అనారోగ్యంతో కుర్చీనే అంటిపెట్టుకుని ఉన్నా ఆ కుర్చీతోనే ఆవిడను మోసుకెళ్ళి, ఓపికున్నంత సేపు పాడించుకుని, సన్మానాలు చేసి తమకున్న గౌరవాన్ని, సంగీతాభిమానాన్ని, సంస్కారాన్ని చాటుకున్నారు తమిళ సోదరులు. 

90 సంవత్సరాల వయస్సులో స్వల్ప అనారోగ్యంతో 2009 జూలై 16 మధ్యాహ్నం ఒంటిగంటా ముప్పై నిమిషాలకు ఇహలోక సంగీత యాత్ర ముగించారు పట్టమ్మాళ్ గారు. కేవలం శిష్యప్రశిష్యుల ద్వారానే కాకుండా, అనేకమంది ఏకలవ్య శిష్యుల ద్వారా కూడా ఆవిడ గానం సంగీత ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోయింది.

Comments